రచయిత(త్రు)లకూ, కళాకారులకూ

నమస్సులు!

ఇవాళ తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో,  ప్రపంచంలో యితరయే భాషలో వస్తున్న సాహిత్యానికీ తీసిపోని విధంగా అద్భుతమైన సాహిత్యం సృష్టింపబడుతోంది.. అన్ని రకాల సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ అద్భుతమైన సాహిత్యం తెలుగులో వస్తున్నది. అయితే వైవిధ్యభరితమైన ప్రజల ఆకాంక్షలని యింత  అద్భుతంగా ప్రతిధ్వనిస్తున్న తెలుగు సాహిత్యం అంతర్జాతీయంగా వినబడడం లేదు. యితర భాషల వాళ్ళ కోసం తెలుగు సాహిత్యాన్ని అనువదించడం వొక ముఖ్యమైన అంశమైతే, యితర ప్రాంతాలలో, యితర దేశాలలో విస్తారంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు నేడు తెలుగులో వస్తున్న యీ ప్రత్యామ్నాయ, సమకాలీన, ప్రజాసాహిత్యాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైనది. చాలా పత్రికలు యివాళ యింటర్నెట్ మీద ఉన్నా వాటిల్లో సాహిత్యానికి కేటాయించబడుతున్న జాగా కొంచెమేనని చెప్పుకోవాలి.

అంతర్జాతీయంగా వున్న తెలుగు సాహిత్యాభిమానులకు, ప్రజాస్వామిక వాదులకు తెలుగు లోని సమకాలీన సాహిత్యంతో పాటు కనుమరుగవుతున్న గత సాహిత్యాన్ని కూడా అందజేయడం వలన యెంతో కొంత మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందువలన తెలుగు సాహిత్యానికి వొక అంతర్జాతీయ వేదిక యేర్పడాలని, ఆ వేదికలో అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే సాహిత్యం వెల్లి విరియాలనీ మేము భావిస్తున్నాం. యీ యెలెక్ట్రానిక్ యుగం లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళకు (ముఖ్యంగా విదేశాలలో వున్న వాళ్ళకు) అతి తేలికగా అందుబాటులోనున్న మాధ్యమము యింటర్నెట్. యివాళ వర్ల్డ్ వైడ్ వెబ్ ఆధారంగా అనేక భాషల్లో సాహిత్యం విస్తారంగా ప్రాచుర్యంలో వుంది. తెలుగు సాహిత్యాన్ని కూడా వెబ్ లో వుంచడం వలన ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి అది అతి తొందరగా చేరే అవకాశం ఉంది. అట్లా సమకాలీన తెలుగు సాహిత్యాన్ని వెంట వెంటనే దేశ దేశాల్లో వున్న తెలుగు ప్రజలు చదవడం వీలవుతుంది. 

అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమ వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము. దీని ద్వారా వున్నత ప్రజాస్వామిక విలువలు గల తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ తెలుగు ప్రజలకు అందిద్దామని మా లక్ష్యం.

కేవలం రాసిన సాహిత్యమే కాదు. వెబ్ అంటే ఆట, పాట, మాట అన్నీ పెట్టవచ్చు కాబట్టి దీన్ని మీ సహాయ సహకారాలతో వొక మల్టి మీడియా వెబ్ సైటుగా తయారు చేద్దామని మా కోర్కె.

అంతే గాక దేశ దేశాల్లో అనేక భాషల్లో విరివిగా వస్తున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలని కూడా మా కోర్కె. అట్ల మీ దృష్టికి వచ్చిన సాహిత్యాన్ని మాకు తెలియచేస్తే మేము మా శాయశక్తులా దాన్ని వెబ్ సైటులో వుంచుతాం.

యీ వెబ్ సైటు ని ప్రారంభించడానికీ, దాన్ని విజయవంతంగా నడపడానికీ, అది బాగా ప్రాచుర్యం లోకి రావడానికీ మీరే మీ రచనల ద్వారా మాకు సాయం చేయాలి. మీ రచనలే మా యీ ప్రయత్నానికి వూపిరి పోయాలి. దీన్ని వొక మాస పత్రికగా తీసుకురావాలని మా ప్రయత్నం. అయితే ప్రతి వారం యెదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనీ మా కోర్కె. మీ సహయ సహకారాలు లేకుండా, మీ నుండి విరివిగా విస్తారంగా రచనలు రాకుండా అది సాధ్యం కాదు. కాబట్టి కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన మీరు, మీ మీ రచనలని యెక్కువ సంఖ్యలో మాకు వీలయినంత త్వరగా అంద జేస్తూ వుంటే మేము యీ సైటు ని ముందు ముందు సజీవంగా ఉంచగలుగుతాము. మన మధ్య మొదలవుతున్న యీ సంబంధం యెల్లప్పుడూ కొనసాగితేనే యీ వెబ్ సైటు కల కాలం నిలుస్తుంది. వృధ్ధి లోకొస్తుంది.

వొక్క మాట. మేము యీ వెబ్ సైటులో తెలుగు నేల మీద నున్న అన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యానికి జాగా కల్పించాలనుకున్నాం. విభిన్న ప్రాంతాల, విభిన్న సమూహాల, విభిన్న అస్తిత్వాల - యేదైనా అసమానతలకు గురవుతున్న ప్రజల కలలని ప్రతిబింబించే సాహిత్యం మాకు కావాలి. అయితే మేము వీలయినంతగా సాహితీ వివాదాలకు దూరంగా ఉండదలుచుకున్నాం. మా వెబ్ సైటు సృజనాత్మక ప్రజా సాహిత్యానికి అంతర్జాతీయ వేదిక కావాలని మా గట్టి కోరిక.

ఇక మీరు మీ రచనల్ని పంపడానికి కొన్ని సూచనలు. ప్రజాకళ వెబ్‌సైట్‌ను యూనికోడ్ లో నిర్మిస్తున్నాం కాబట్టి యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం ఉన్నవాళ్లు మీ రచనల్ని యూనికోడ్ లో టైప్ చేసి editor@prajakala.org కి పంపగలరు. ఐతే అందరికీ యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం ఉండకపోవచ్చు కాబట్టి అది లేనివాళ్లు RTSలో పంపినా మాకు అనుకూలంగా ఉంటుంది. ఇక RTS కూడా పంపలేని వాళ్లు PDF ఫైల్స్ పంపగలరు. PDF లో పంపితే మేము మొత్తం మళ్లీ టైప్ చేసుకోవాల్సి వస్తుందన్న విషయం దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు RTS లేదా యూనికోడ్ లో పంపించగలరని కోరుతున్నాం. Shree-Tel, Telugu Lipi వంటి ఇంకా ఎన్నో ఫాంట్ లను RTS లేదా యూనికోడ్ లోకి మార్చడానికి పద్మ సాఫ్ట్‌వేర్ (http://www.geocities.com/vnagarjuna/padma.html) ని ఉపయోగించవచ్చు. ఇక ఇవేమీ వీలు కాక మామూలు పోస్టులో మీ రచనలను పంపదలుచుకున్న వాళ్లు editor@prajakala.org కి ఈ-మెయిల్ చేస్తే మా పోస్టల్ అడ్రెస్ ను మీకు పంపుతాం.

రచయితలు, రచయిత్రులు తమ రచనల్ని గాని, గాయకులు తమ పాటలు గాని, Audio రూపంలో పంపదలుచుకుంటే MP3 format లోగాని, RealAudio format లో గాని లేదా WAV format లో గాని పైన చెప్పిన ఈ-మెయిల్ అడ్రెస్ కు పంపగలరు.  మీ Audio కాసెట్ మామూలు పోస్టులో పంపదలుచుకున్న వాళ్లు editor@prajakala.org కి ఈ-మెయిల్ చేస్తే మా పోస్టల్ అడ్రెస్ ను మీకు పంపుతాం. ఇక ఇతర కళారూపాలను Video రూపంలో పంపదల్చుకున్న కళాకారులు చిన్న ఫైల్స్ ఐతే ఇంటర్ నెట్ ద్వారా గానీ, మరీ పెద్దవి ఐతే మామూలు పోస్ట్ ద్వారా గానీ పంపవచ్చు. ఇంటర్ నెట్ ద్వారా 1GB వరకు పెద్ద ఫైల్స్ పంపడానికి http://www.transferbigfiles.com/ అనే సైట్ ని మనం ఉపయోగించుకోవచ్చు.

ఇక యూనీకోడ్ లో టైప్ చేయడం గురించి గాని, ఇంకా ఏదైనా విషయం గురించి గాని మీకు సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా మాకు ఈ-మెయిల్ ఇస్తే వీలయినంత త్వరగా మీకు సమాధానం ఇవ్వగలము.

మీరు మీ మీ రచనలని వీలయినంత తొందరగా యెక్కువ సంఖ్యలో మా కంద జేయాలని మా విన్నపం. మన్నిస్తారు కదూ! యీ మీ వెబ్ సైటుని నిలుపుకుంటరు కదూ!!!

-ప్రజాకళ.ఆర్గ్ మిత్రులు

10 అభిప్రాయాలు

  1. jhansi papudesi 23 అక్టోబర్ 2006 , 8:21 am

    friends,

    congratulations…ur doing great job. i wish “prajakala” to spread its web to all telugu people who are eagerly looking to wet their hearts with the sweetness of telugu.

    jhansi papudesi
    bangalore

  2. R. Raghava Reddy 13 డిసంబర్ 2006 , 1:34 pm

    ఇది చాల మంచి ప్రయత్నము. ఆభినందనలు

  3. K.B. Srisailam 07 అక్టోబర్ 2007 , 7:55 pm

    పజా కళ పై హాకింగ్ ను ఖండించండి.

  4. Dr.Peyyeti Murali Mohana Rao 06 నవంబర్ 2007 , 7:28 am

    This is not a comment.So far we are using English numbers in telugu literature psges. The You Tube in “gudugudu gudu guncham gunde ragam”telugu rhymes is showing telugu numbers.Such numbers are needed to get them posted and to tell my friends that in telugu also we are having our own telugu numbers.Kindly help me and send telugu numbers.Try to mention to some articles atleast the telugu numbers so that the future telugu children should not forget.ఇది ఒక సూచన మాత్రమే! ఇది కామెంటు ఏ మాత్రమ కాదని గ్రహించండి.
    భవదీయుడు,
    డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)

  5. Dr.Peyyeti Murali Mohana Rao 06 నవంబర్ 2007 , 7:34 am

    I am very happy to read “Prajakala”,which is a good book giving much more knowledge for all.Te writers presenting articles are famous and writing well. నేను ఈ ప్రజా కళ వెబ్ పుస్తుకం ద్వారా ప్రజాకళ లోని రచయితలకూ,పాఠకులకూ,సంపాదక వర్గానికీ నాదీపావళి శునాకాంక్షలను అంద చేయుచున్నాను.
    ఇట్లు భవదీయుడు,
    డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)

  6. simhadri 19 నవంబర్ 2007 , 1:19 am

    లుడ్డైట్ ఉద్యమం* (Luddite Movement):

    పెట్టుబడిదారీ వ్యవస్థ వృద్ధి చెందుతున్న క్రమంలో, ఉపాధి కోల్పోబోతున్న/కోల్పోయిన సామాజిక పొరలు(అన్నీ కార్మిక వర్గంలోనివే)ఎన్నో తిరుగుబాట్లు చేసేయి. 1811 లో నాటింగ్ హామ్ లో మొదలైన లుడ్డైట్ ఉద్యమం ఇతర ప్రాంతాలకు పాకింది.
    యంత్రపు మగ్గాల వల్ల జీతాలూ, ఉద్యోగాలూ కోల్పోతున్న నేతపని వాళ్ళు ఫాక్టరీల పై రాత్రులు దాడి చేసి వందలాది మర మగ్గాల్ని నాశనం చేసేరు. ఈ ఉద్యమం తరువాత యార్క్ షైర్, లాంకా షైర్, లీసెస్టర్ షైర్, డెర్బీ షైర్ లకు పాకింది.
    ఈ ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన దాడి 1811 లో యార్క్ షైర్ లోని రాఫర్డ్ మిల్స్ పైన జరిగింది. జార్జి మెల్లర్ అనే యువ కార్మికుడి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో ఇద్దరు కార్మికులు చనిపోయారు(పోలీసు కాల్పుల మూలంగా). ఆ రోజు ఈ దాడి సఫలం కానట్టే లెఖ్ఖ. దీని తరువాత వందలాది మంది కార్మికులను అరెస్టు చేసి , పద్నాలుగు మందిని ఉరితీసేరు. తర్వాతి తరాలకి ఈ దాడి ప్రేరణ గొప్పది.
    అనేక ఇతర దాడుల తరువాత, తీవ్రమైన అణచివేత మూలంగా 1817 కల్లా లుడ్డైట్ ఉద్యమం తగ్గింది.

    వర్తమానం: ప్రస్తుతం నందిగ్రాం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకి, లుడ్డైట్ ఉద్యమానికీ పోలికలు, తేడాలు ఏమిటి?

    ముఖ్యమైన పోలిక, రెండూ కూడా కార్మికవర్గ తిరుగుబాట్లు కావటం. ఇక తేడాలకొస్తే, లుడ్డైట్ ఉద్యమ కాలానికి కార్మిక వర్గ వికాసం పూర్తి కాదనుకోవటమే సరైన అవగాహన. ఇది కమ్యునిస్టు ప్రణాలిక(1848) కు ముప్పై ఏళ్ళ ముందు జరిగిన విషయం. కార్మిక వర్గం రాజ్యాధికారం మొదటిగా చేసిన ప్యారిస్ కమ్యూన్ కి (1872)అరవై ఏళ్ళ ముందటి మాట. మార్క్స్, ఎంగెల్స్ ల పై ఈ ఉద్యమాల ప్రభావం కొంత ఉందనటం అనుచితం కాదు.
    అనేక పోరాటాల్లో రాటు తేలుతున్న భారత కార్మిక వర్గానికి, రష్యాలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించిన బోల్షెవిక్ నేపధ్యం, చైనాలో రాజ్యాధికారాన్ని చేజిక్కించికున్న ప్రజాయుద్ధ నేపధ్యం తో పాటు, తిరోగమనం కూడా సాధ్యం అని చెప్పే ప్రపంచ వ్యాప్త రాజకీయ తిరోగమన నేపధ్యం ఉన్నాయి.
    అన్నిటి కంటే ముఖ్యమైన ప్రశ్న. ఈ నేపధ్యం లో, ఈ రోజున నందిగ్రాం ప్రజలు చేయాల్సిందేమిటి? ఫ్యాక్టరీలు పెట్టింతరువాత, ముహూర్తం పెట్టుకొని కార్మికోద్యమం మొదలు పెట్టటమా? లేక అఘాయిత్యాలకు, రాజ్య హింసకూ వ్యతిరేకంగా ఈరోజే ఉద్యమించటమా?
    నందిగ్రాం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలు ప్రపంచ వ్యాప్త మానవ విమోచన లోముఖ్యమైన మెట్టుగా ఆహ్వానిద్దాం.

    * జనరల్ లుడ్ పేర్న ఫ్యాక్టరీ యజమానులకు బెదిరింపు లేఖలు ముందుగా పంపినప్పటికీ, ఈ లుడ్ కల్పిత వ్యక్తి అని ప్రతీతి.

  7. Dr.Peyyeti Murali Mohana Rao 22 నవంబర్ 2007 , 6:56 am

    నేటినించీ తిరుపతిలో తెలుగు భాషా వికాస సాహిత్య సభలు జరుగుతున్నాయి.వివిధ ప్రదేశాలనించీ ఎందరో కవులూ-రచయితలూ వస్తున్నారు. నేటి దళిత సాహిత్యం కత్తి పదునుగా కాక బాంబు బ్లాస్టులా వుంటోంది. దళితరచయితలపై నాకో అనుమానముంది. శ్వేతా దేవిగారు ఓ కథ రాశారు .ఈ మధ్యనెప్పుడో దాన్ని నేను విపులలో చదివాను. ఆ కథ చదివి నేను పూరాగా శ్వేతా దేవి గారితో ఏకీభవించాను.రచయితలు తమకున్న రచనా చతురతతో తిమ్మిని బమ్మినీ-బమ్మిని తిమ్మినీ చేయ గలరు-కోర్టులో లాయర్లు తమ వాదనను బలపరచుకున్నట్లుంటుందిది.
    భారతంలో కుంతీ దేవీ-ఆమె పిల్లలు పాండవులూ లక్క ఇంట్లో తమ ప్రాణాలని కాపాడుకున్నప్పుడు కనీసం గిరిజనులైన కొండ వారిని బయటకు పారిపొమ్మని చెప్పక వదిలేశారు.దాని పాపం కుంతికి చుట్టుకుని ఒక గిరిజన స్త్రీ కుంతితో మాటాడ్డం ఆ కథ.
    పాండవులు తాము చనిపోయినట్టు నిరూపణకోసం ఆ గిరిజనులను ఆరుగురినీ లక్క ఇంట్లో వదిలేశారు.దాని వల్ల కౌరవులు తాము చనిపోయినట్లు భావించి వెనక తగలరని.ఆ తరవాత వారు ఏక ఛత్రపురంలో తేలతారు.ఒక రాజు ప్రాణం కాపాడే టందుకు సేవకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుతారు. రాజ్యాన్నేలే రాజు ఒక్కడే వుంటాడు.వాడ్ని కాపాడేటందుకు ప్రాణత్యాగం చేస్తారు.ఇప్పుడు ప్రజా స్వామ్యంలో మినిస్టర్లు చాలా మందే వున్నారు.వీరి ప్రాణాలను కాపాడేటందుకు నిత్యం ఎందరో బాడీగార్డ్సు కాపలా వుంటున్నారు వీరి ప్రాణాలకి విలువ లేదా?మినిస్టర్లని కాపాడాలంటే చాలా మంది బాడీగార్డుల అవసరముంటుంది. ఈ బాడీ గార్డుల ప్రాణాలు ప్రాణాలు కావా అని దళిత సాహిత్యం ప్రశ్నిస్తుంది.ఇప్పుడు ఒక నక్సలైట్ నాయకుని కాపాడేటందుకు వారి కింది వర్గం తమ ప్రాణాలని తృణ ప్రాయంగా అర్పించుట లేదా?
    నాటి సామాజిక విలువలను తెచ్చి నేటి సమాజానికి ముడివేసి దళిత సాహిత్యమని జనులను నమ్మించుట ఎంతవరకు సబబు?
    ఆలోచించి చెప్పగలరు.
    /Dr.P.M.Rao.

  8. Dr.Peyyeti Murali Mohana Rao 23 నవంబర్ 2007 , 12:15 pm

    శ్వేతా దేవి గారు రాసిన కథని చదివి “అయ్యో పాపం! గిరిజనులు” అని బాధ పడినాను.కాని కొందరు నక్సలై ట్ దళ సభ్యులు తమ నాయకుని కోసం బలై పోతే,అప్పుడు మరల ఆలోచిస్తే . . శ్వేతాదేవి గారి కథలో ఏదో ఏక పక్షం గా సినట్టు
    అనిపించింది. కొంచెం అందరూ ఆలోచించి ఇందులో సమాహానం ఇస్తే బాగుంటుంది.
    Dr.P.M.Rao.ramrali.

  9. Dr.Peyyeti Murali Mohana Rao 23 నవంబర్ 2007 , 12:16 pm

    శ్వేతా దేవి గారు రాసిన కథని చదివి “అయ్యో పాపం! గిరిజనులు” అని బాధ పడినాను.కాని కొందరు నక్సలై ట్ దళ సభ్యులు తమ నాయకుని కోసం బలై పోతే,అప్పుడు మరల ఆలోచిస్తే . . శ్వేతాదేవి గారి కథలో ఏదో ఏక పక్షం గా సినట్టు
    అనిపించింది. కొంచెం అందరూ ఆలోచించి ఇందులో సమాధానం ఇస్తే బాగుంటుంది.
    Dr.P.M.Rao.ramrali.

  10. ramamohan ch 14 సెప్టెంబర్ 2008 , 5:38 am

    మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

    కూలివాని గుండెలొ ఆవేదన ఉందని

    కార్మికుని కడుపులో ఆకలి రగిలందని

    కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

    మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

    దోపిడిదారుల దురంతాలు సాగవని

    పీడకుల పాలన మాకిక వద్దని

    గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

    మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

    దగాపడ్డ తమ్ములార ఏకంకండని

    మోసపోక యికనైనా మేలుకొండని

    మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

    మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)