జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో పిల్లలను, పెద్దలను కూడా విహరింపజేయాలంటే ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా బాల సాహిత్య కథలు మడికట్టుకు కూర్చుంటే కుదరదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యం వాస్తవ ప్రపంచానికి భిన్నమైన అద్భుత విషయాలతో నిండి ఉంటుంది. ప్రతిచోటా పిల్లల కథలు దయ్యాలు, భూతాలు, బ్రహ్మరాక్షసులు, పిశాచులు, మంత్రతంత్రాలు, రకరకాల వీరగాధలతో నిండి ఉంటున్నాయి.
దయ్యాలు, భూతాలు నిజంగా ఉన్నాయా? బ్రహ్మరాక్షసులు లోకంలో ఉండేవాళ్లా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? దేవకన్యలు భూమ్మీదికి విహారానికి వచ్చి తోటరాముడి కంట్లో పడతారా? క్రూర జంతువులు పిల్లలకు సహాయపడతాయా? ఇలాంటి తార్కిక ప్రశ్నలకు బాలసాహిత్యంలో చోటులేదు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒకటే. అవును. ఉన్నాయి. ఉండేవాళ్లు, రాలతాయి. పడతారు. సహాయపడతాయి.
మానవ సమాజం విద్యుత్తును, విద్యుద్దీపకాంతులను చవిచూడని గాఢాంధకారపు రోజుల్లో, సాయంత్రం ఆరు లేదా ఏడు దాటకముందే తిండి ముగించి దీపాలార్పి పడుకునే రోజుల్లో, కనుచూపు మేరలో పరిష్కారం కనిపించని జీవిత విధానంలో ఏదో ఒక శక్తి వచ్చి తమను కాపాడుతుందని యావత్ సమాజం అనివార్యంగా భావించే రోజుల్లో, అలాంటి సమాజంలో దయ్యాల భయమూ ఉంటుంది. ఆ ప్రజల మనస్సుల్లో పిశాచాలు, రాక్షసులూ, మంత్రాలు, తంత్రాలు, దేవతలూ, దేవకన్యలూ కూడా నిత్యం కదలాడుతూనే ఉంటారు.
మరి కథలనేవి ఆకాశంలోంచి ఊడిపడవు కదా. ఒక నిర్దిష్ట సమాజ జీవిత విధానానికి అనుగుణంగానే కథలు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తున్నాయి కూడా. ఈ రోజుకూ మన రాంగోపాల్ వర్మ కార్ఖానా సినిమాలు, దూరంగా హాలీవుడ్ సినిమాలు దయ్యాల కథలకు చీకటిని, రాత్రినే అధారంగా చేసుకుంటున్నాయంటే వాటికి ప్రాతిపదిక చీకటే మరి. మనిషి మస్తిష్కంలో దూరిన, దూరుతున్న అన్ని అజ్ఞానాలకూ చీకటే, అంథకారమే కారణం.
చందమామ కథలు కూడా ఇందుకు భిన్నంగా లేవు. చందమామలో రానురానూ దయ్యాలూ, భూతాల కథలే ఎక్కువయిపోతున్నాయి అనే విమర్శకు అప్పట్లోనే కుటుంబరావు గారు ఇలా జవాబిచ్చారట. ‘నువ్వూ, నేనూ దయ్యాలు, భూతాల గురించి ఎంత వర్ణించి చెప్పినా పదిహేను ఏళ్లు దాటిన పిల్లలు దయ్యాల, భూతాల గురించి పెద్దగా నమ్మరులే’ అన్నారాయన.
1940, 50, 60, 70ల నాటి భారతీయ సమాజం పట్టణాలను మినహాయిస్తే ప్రాథమికంగా విద్యుత్తుకు దూరమైన సమాజమే. విద్యుత్తు లేదంటే మానవ సమాజానికి రోజులో సగ భాగం గాడాంథకారమే. చీకటి అంటే భయం ఉండే సమాజానికి, మనుషులకు ఆటోమేటిక్‌గా దయ్యాల గురించిన స్పృహ ఉంటుంది. గాడాంథకారంలో ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఇంటి ముందు చెట్టుమీద ఆకు కదిలితే కూడా భూతం లాగే కనపడుతుంది. నిశిరాత్రి దారినపోతున్న్పపుడు దారిపక్కన నల్లరాయి కుక్కలాగా, ఏదో ఒక జంతువులాగా రూప భ్రమ కల్గిస్తే ఆ నల్లరాతి గురించిన అనుభూతే జనం మనస్సుల్లో దయ్యమై కూర్చుంటుంది. రాత్రిపూట ఉన్నట్లుండి కదిలే ఆకులు, నల్లరాళ్లు కూడా పల్లెటూళ్లలో దయ్యాలు, భూతాల కథలకు పునాదిగా నిలుస్తాయి.
చందమామ కథల్లో దయ్యాలు, భూతాలు, పిశాచాలు, రాక్షసులూ కూడా చోటుచేసుకుంటూ వచ్చాయంటే ఇదే కారణం. అందుకే చింతచెట్టు దయ్యం కథలంటే చందమామ పాఠకులు చెవికోసుకునేవారు. భూతాలు, భీకర రాక్షసుల కథలను కంపిస్తూనే చదివారు. అలాగని ఆ కథలు మూడనమ్మకాలను ప్రేరేపించేలా ముగియలేదు. దయ్యమో, భూతమో, పిశాచమో ఏదో ఒకటి కథలో దూరటం తప్పనిసరి అయినప్పుడు అవి జనాన్ని పీడించి పీక్కుతినడం కాకుండా కష్టాల్లో మగ్గుతున్న వారికి కాస్త సహాయం చేసేలా ట్విస్ట్ చేస్తే…
చందమామలో చింతచెట్టు దయ్యాలు అలా రూపొందాయి. సహాయం అనేది కనుచూపు మేరలో లేకుండా కొట్టుమిట్టాడుతున్న వారికి కాసింత అండ, సాయం అందించే దయ్యాలు, రాక్షసులు పుట్టుకొచ్చారు. అందుకే చందమామ దయ్యాలు, రాక్షసులను చూసి పాఠకులెవరూ భయపడేవారు కాదు.
దశాబ్దాలుగా చందమామలో తరచుగా ప్రచురించబడుతున్న చింతచెట్టు దయ్యం కథలు, రాక్షసుల కథలూ పాఠకులను విశేషంగా అలరించాయి. ఈ తరహా కథలు ఎంత ఆకట్టుకున్నాయంటే అప్పట్లో వచ్చిన దయ్యాలు, రాక్షసుల కథలను మళ్లీ ప్రచురించవలసిందిగా ఈనాటికీ విభిన్న తరాల పాఠకులు కోరుకుంటున్నారు.
కానీ, చందమామ సరదా కోసమో, పాఠకులను అలరించడంకోసమో దయ్యాలు, రాక్షసుల కథలను ప్రచురించలేదు. వర్తమాన సమాజంలో పెనుభూతంగా మారిన సమస్యలకు ముడిపెట్టి దయ్యాలు, రాక్షసుల కథలను శక్తివంతంగా నడపడంలో కూడా చందమామ అద్వితీయ విజయం సాధించింది. పాతికేళ్ల క్రితం చందమామలో ప్రచురించిన ‘అల్లుడి శక్తి’ అనే కథ ఇందుకు గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.
1980ల పొడవునా దేశవ్యాప్తంగా మహిళల జీవితాలను, కుటుంబ వ్యవస్థను నరకప్రాయం చేసిన వరకట్నం సమస్యపై చందమామ తనవంతుగా ఈ గొప్ప కథను పాఠకులకు అందించింది. నీతి బోధించడమో, వరకట్నం సమస్యను చెండాడటమో చేయకుండా, మానవులను గజగజలాడించే బ్రహ్మరాక్షసులు కూడా ఈ కాలపు అల్లుళ్ల ముందు దిగదుడుపే అనీ, ఇంటల్లుళ్లు కోపంగా చూస్తే ఇంటిల్లిపాదీ నీరుగారిపోవలసిందేనని సూచన ప్రాయంగా తెలిపిన గొప్ప కథ ఇది.
మన సమాజంలో వరకట్నం సమస్య ఎంత భయానకంగా తయారయిందో అతి సున్నితంగా చెప్పిన కథ ‘అల్లుడి శక్తి’. దీర్ఘకాలంగా చెట్టుమీదనే ఉండిపోయిన రాక్షసుడు ఈ మూడువందల ఏళ్లలో మానవుల శక్తి ఇంతగా పెరిగిపోయిందా అని ఆశ్చర్య పడిపోయిన ఇతివృత్తంతో ఈ కథ తయారయింది. క్లుప్తంగా ఈ కథ పరిచయం లోకి వెళదాం.
ఒక ఊరిలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు. నలుగురు ఆడపిల్లల తండ్రి. అందరికీ పెళ్లిచేసి అత్తారింటికి పంపేసరికి అప్పులపాలై, వాటిని తీర్చలేక, ముఖం చూపించలేక ఇల్లువదిలి పట్నం బయలుదేరుతాడు. చీకటిలో నడుస్తూ ఒక ఊరి వెలుపల మర్రిచెట్టును చేరుకుంటాడు. ఆ చెట్టుమీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ విషయం తెలుసు కాబట్టి పట్టపగలు కూడా ఆ చెట్టు దరిదాపులకు ఎవరూ వెళ్లరు. అలాంటిది కటిక చీకట్లో తాను ఉండే చెట్టు సమీపంగా వెళుతున్న మానవుడిని చూసి రాక్షసుడు ఆశ్చర్యపడి నిలదీస్తాడు.
ఆ అరుపుకు వణికిపోయినప్పటికీ రామశాస్రి నలుగురు ఆడపిల్లలకు పెళ్లిచేసి అన్ని భయాలపట్లా రాటుదేలి ఉన్న కారణంగా ఎవరదీ అంటూ ప్రశ్నిస్తాడు. తన అరుపు వినగానే భయంతో మూర్చపోవలసిన మానవుడు తిరిగి తననే ప్రశ్నించడంతో బ్రహ్మరాక్షసుడికి మహా అవమానమైపోయింది. ఉక్రోషంతో వాడు చెట్టుమీది నుంచి దభీమని ముందుకు దూకి, నేనెవరో తెలియడం లేదా అని కోపంగా రంకె పెట్టాడు. చెట్టంత రాక్షసుడిని చూడగానే పై ప్రాణం పైనే పోయిన రామశాస్త్రి ఇల్లు వదిలి పెట్టిన వాడికి ఇక దేనికీ భయపడనవసరం లేదనిపించి ధైర్యం తెచ్చుకుని ఈ చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? పురుగూ పుట్రా ఉంటాయి కదా, చూడబోతే ఎంతో నాజూకుగా ఉన్నావు అని ఆ రాక్షసుడికే జాగ్రత్త చెబుతాడు.
తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని తొలిసారిగా అనుమానం కలిగిన రాక్షసుడు తన వద్ద దొంగవేషాలు వేయవద్దని, మూడు వందల ఏళ్లుగా ఈ చెట్టు మీదే ఉంటున్నానని నేనంటే ఈ ప్రాంతంలో భయపడని వాళ్లే లేరని గొప్పలు చెప్పుకుంటాడు. అందుకు రామశాస్త్రి అతడిని దువ్వుతూ నిన్ను చూస్తే మా అల్లుళ్లలో కలిగే భయంలో నాలుగోవంతు కూడా కలగడం లేదని తేల్చి చెబుతాడు. ‘నువ్వు ఎంత కోపంగా చూసినా, మా పెద్ద అల్లుడి కళ్లలో ఉన్న కోపంలో నూరో వంతు కూడా లేదని, నీ గొంతు మృదువుగా ఉన్నదని, నీ అరుపులు తన అల్లుళ్ల నవ్వుల కంటే వినసొంపుగా ఉన్నాయ’ని తీసిపారేస్తాడు.
దాంతో రాక్షసుడికి సగం పిచ్చి పడుతుంది. ‘’మానవుల్లో నాకంటే భయంకరులా? ప్రపంచం ఇంతగా మారిపోయిందా? ఈ మూడువందల ఏళ్లలో మానవుల శక్తి ఇంతగా పెరిగిపోయిదా?'’ అని తలుస్తూ సందేహ నివృత్తి కోసం ‘’నాకు లేని శక్తీ, బలమూ నీ అల్లుళ్లకు ఎలా వచ్చాయంటావు'’ అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. ‘నీకు పెళ్లికాలేదా’ అని రాక్షసుడిని అడిగిన రామశాస్త్రి, ‘’పెళ్లి మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్లు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు. మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేనూ, నా కూతురూ ఎక్కడివాళ్లం అక్కడే నీరుగారిపోతాం. ఇక కోపంగా అరిచాడంటే చాపచుట్టగా అందరమూ అతడి కాళ్లమీద పడిపోతాం. నీ కోపమూ, అరుపులూ అందుకే నామీద పనిచేయలేదు'’ అని వివరణ ఇస్తాడు.
దాంతో ఆలోచనలో పడ్డ రాక్షసుడు, పెళ్లి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాటైతే తనను చూసి భయపడే వారే లేకుండా పోతారు కనుక, తాను కూడా పెళ్లి చేసుకుని, తన శక్తి పెంచుకోవాలని అనుకుంటాడు. రాక్షసుడినైన తనకు పిల్లను ఎవరూ ఇవ్వరు కాబట్టి నువ్వే నాకు పిల్లను చూసి పెట్టు అని రామశాస్త్రిని ప్రాధేయపడతాడు. నీ తల దన్నేవాళ్లు ఇప్పుడు మా మనుషుల్లోనే చాలా మంది ఉన్నారు. ఎవరన్నా పిల్లను గొప్పవాడికి ఇవ్వాలని అనుకుంటారు కాని, నీలాంటి అమాయకుడికి, శక్తిలేనివాడికి ఎవరన్నా పిల్లను ఇవ్వడానికి ముందుకు వస్తారా అని శాస్త్రి రాక్షసుడిని తేలిక చేసి మాట్లాడతాడు.
రాక్షసుడు బాగా లోకువై పోయి అతడిని బతిమిలాడతాడు. చాలాసేవు అలా బతిమిలాడించుకున్న రామశాస్త్రి ఉండడానికి ఈ మర్రిచెట్టు తప్ప చిన్న భవనం కూడా లేనివాడివి నీకెవరు పిల్లనిస్తారు అని ఎద్దేవా చేస్తాడు. దీంతో రాక్షసుడు మరింత నీరుగారిపోయి, పిల్లను వెతకడానికి అయ్యే ఖర్చు, నీకు బహుమతి ఇచ్చే భారం కూడా తనదేనని, పెళ్లి అయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకి వెళతానని ప్రాథేయపడి శాస్త్రికి బంగారు కాసుల కుండ తెచ్చి ఇస్తాడు.
ఇక రామశాస్త్రి తప్పదన్నట్లుగా చూసి, తాను పిల్లను మాట్లాడే దాకా నువ్వు ఎవరి కంటా పడొద్దని, పెళ్లి కొడుకు కాపురం చెట్టుమీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు ఆలాగే వెనక్కు పోతాయని, కళ్లముందు ఎంతో మేటి మనుషులు ఉండగా పిల్లను తీసుకుని సాదాసీదా బక్క బ్రహ్మరాక్షసుడికి ఇవ్వడం పరువు తక్కువపని జనం అనుకుంటారని భయపెడతాడు. దీంతో తాను పెళ్లి అయ్యే దాకా ఎవరి కంటా పడనని, రాక్షసుడు రామశాస్త్రికి మాట ఇచ్చాడు. అటు తర్వాత రాక్షసుడిని ఆ చెట్టుమీద ఎవరూ చూడలేదు.
ఇదీ అల్లుడి శక్తి కథ. పెళ్లవగానే సగటు మనుషులు కూడా ఈ దేశంలో ఇంటల్లుళ్లలా మారిపోయి ఎంత శక్తిమంతులైపోతున్నారో తెలిపే అచ్చమైన కథ ఇది. ‘’మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేనూ, నా కూతురూ ఎక్కడివాళ్లం అక్కడే నీరుగారిపోతాం. ఇక కోపంగా అరిచాడంటే చాపచుట్టగా అందరమూ అతడి కాళ్లమీద పడిపోతాం. నీ కోపమూ, అరుపులూ అందుకే నామీద పనిచేయలేదు'’ అని రామశాస్త్రి చెబితే అంత పెద్ద బ్రహ్మరాక్షసుడూ జావగారిపోయి, ఎవరినో ఒకరిని పెళ్లిచేసుకుని తాను కూడా మానవులంత శక్తిమంతుడినవ్వాలని కోరుకుంటాడు.
‘’మానవుల్లో నాకంటే భయంకరులా? ప్రపంచం ఇంతగా మారిపోయిందా? ఈ మూడువందల ఏళ్లలో మానవుల శక్తి ఇంతగా పెరిగిపోయిదా?'’ అని చెట్టంత రాక్షసుడే మథనపడిపోయాడని సూచన ప్రాయంగా తెలిపిన ఈ కథ అల్లుడి శక్తివెనుక దాగి ఉన్న ఈ సమాజ భౌతిక ప్రాతిపదికను విప్పి చెప్పింది. కట్నకానుకల కోసం జరుగుతున్న పీడనలో లక్షలాది కుటుంబాలు చెదిరిపోతున్న, గజగజలాడిపోతున్న వైనాన్ని అల్లుడి శక్తి కథ అత్యంత సున్నితంగా, హృద్యంగా చెప్పింది.
ఈ కథలో ఎక్కడా నీతి బోధ లేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు. ఉపన్యాసాలు దంచలేదు. విప్లవమే పరిష్కారమని కూడా బోధించలేదు. దశాబ్దాలుగా మన సమాజంలో కొనసాగుతున్న చీకటి పార్శ్వాన్ని అద్దంలా ప్రతిబింబించింది. మన సమాజం ఇలాగే కొనసాగితే మనుషుల్లో సగం మంది రాక్షసులకంటే భయంకరులుగా మారిపోతారని ఈ కథ హెచ్చరించింది. పిల్లల్లో, పెద్దల్లో ఓ రకమైన భావ సంస్కరాన్ని ప్రేరేపించిన గొప్ప కథ ఇది. అందుకే ఈ కథను ఈనాటి పాఠకులకు కూడా అందించాలనే ఆలోచనతో ఈ ఫిబ్రవరి చందమామలో 25 ఏళ్ల నాటి చందమామ కథగా తిరిగి ప్రచురించడం జరిగింది.
సంస్కృతిగా పిలువబడుతున్న మన జీవిత విధానంలోని ఓ చీకటి కోణాన్ని అత్యంత సూటిగా, హాస్య స్ఫోరకంగా ప్రస్తావించిన ఈ కథ చందమామలో బాగా పేరొందిన వందలాది కథల్లో ఒకటి. వీలైతే ఫిబ్రవరి నెలలో వచ్చిన ఈ కథను మరోసారి చదవండి. ఫిబ్రవరి చందమామను తీసుకోలేకపోయిన వారు కింది చందమామ ఆన్‌లైన్ ఆర్కైవ్స్ విభాగంలో కూడా చూసి చదవచ్చు. పాతికేళ్లకు ముందు ఈ కథ చందమామలో ప్రచురించబడింది.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
కె. రాజశేఖర రాజు
చందమామ.