| ‘సినిమాలు చూడ్డం మానేశాను’ అనే వాళ్ళు సైతం చూసి తీరాల్సిన సినిమా ‘హజార్ చౌరాసీ కీ మాఁ’. బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి రచించిన నవల ‘హజార్ చౌరాసీ కీ మాఁ’ (తెలుగు లో ఒక తల్లి) నవలకు దృశ్యరూపమే ఈ చిత్రం. కొడుకు ఎలాంటివాడైనా అతనికేమైనా అయితే కన్న తల్లి ఎలా తపించిపోతుందో అనేది ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చెప్పింది. |
ఈ చిత్రం లోని దృశ్యాలు ఎంతటి కఠినాత్ములకైనా కంట తడిపెట్టించక మానవు. కొడుకు చనిపోయాడన్న వార్త తెలుసుకుని కుమిలిపోవడమా లేక ఒక విప్లవకారుడిగా చనిపోయిన తర్వాత కూడా సమాజంలోని వేలాది మంది మనసుల్లో నిలిచిపోయినందుకు గర్వించడమా అని అ తల్లి పడే మానసిక సంఘర్షణను చూసి తీరాల్సిందే . గ్లోబల్ విలేజ్ సంస్కృతి…… డాలర్ల మోజులో పడి తల్లి దండ్రుల్నీ . కుటుంబ బంధాల్ని కాదనుకుని విదేశాలకు వెళ్ళి స్థిరపడడం.. న్యూక్లియర్ ఫ్యామిలీలు…. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలకు ఎక్కువ విలువిచ్చే ఈ రోజుల్లో ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశమూ అమూల్యమైనదే.ముఖ్యంగా తల్లీకొడుకుల బంధం అంత సున్నితంగా వుంటుందనిపించక మానదు…. ఆదర్శాలు , విలువలు మృగ్యమవుతున్న నేటి సమాజాన్ని వెన్ను తట్టి లేపుతాయి ఈ చిత్రంలోని సన్నివేశాలు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వెయ్యి ఎనభై నాలుగో విప్లవకారుడి పేరు (1084) ప్రతి చటర్జీ….. హిందీ లో ఈ సంఖ్యని ‘ హజార్ చౌరాసీ ‘ అంటారు కాబట్టి అతని తల్లి ‘హజార్ చౌరాసీకీ మాఁ ‘ అయింది. చట్టం దృష్టి లో మనిషికన్నా సంఖ్యకే ప్రాధాన్యత వుంటుందన్నది రచయిత్రి ఈ పేరుని పెట్టడంబట్టి అర్థమవుతుంది. వాస్తవిక పరిస్థిని రచయిత్రి ఈ విధంగా చెప్పారు. ఈ అర్థం మారకుండా అదే పేరుమీద చిత్రాన్ని తీయడం గోవింద్ నిహలానీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది…. నేడు న్యూక్లియర్ కుటుంబాల్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎంత నామ మాత్రంగా వున్నయో స్వాతంత్ర్యం తొలినాళ్ళలో బెంగాలీ సంపన్న కుటుంబంలో వుండే సంబంధాలు సైతం ఏ మాత్రం భిన్నంగా లేవని ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఒక్క ఫోన్ కాల్ తో ఉలిక్కి పడిన హజార్ చౌరాసీ తల్లి సుజాత తన కొడుకు చనిపోయాడన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత పడే మానసిక సంఘర్షణను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో గోవింద్ నిహలానీ కృతకృత్యుడయ్యాడని చెప్పుకోవచ్చు.
తమపిల్లలకు ఆస్తిపాస్తులు సమకూర్చటం., ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం సంపన్న కుటుంబపు హోదాకు సంకేతం కావచ్చునేమోగానీ దాని మరుగున పిల్లలు ఎలా పెరుగుతున్నారో, వారిలో ఎలాంటి ఆలోచనలు వుంటున్నాయని పట్టించుకోకపోవడం మనకు కనిపిస్తుంది.తన కొడుకు ఒక విప్లవకారుడిగా మరణించినందుకు గర్వపడాలా, లేక ఇంతకాలం కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోలేనందుకు బాధపడాలో అర్థం కాక, సంపన్న సమాజమంతా కొడుకు చనిపోయిన విషయాన్ని హేళన చేయడాన్ని ఎలా భరించాలో తెలియక, కొడుకు కోసం కుమిలి పోతున్న తనను వేలెత్తి చూపిస్తున్న సంపన్న సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతూ ఒక విప్లవకారుడి తల్లి పడే ఆవేదనకి, సంఘర్షణకి దృశ్యరూపమే ‘హజార్ చౌరాసీ కీ మాఁ’. బెంగాల్ లో మొలకెత్తిన నక్సల్బరీ పోరాటం మొదలు నేటి మావోయిస్టు ఉద్యమం వరకు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కొల్పోయిన వేలాది కన్నతల్లులు పడే హృదయవేదన ఈ చిత్రంలోని సుజాత పాత్ర ద్వారా ద్యోతకమవుతుంది.
సుజాత బెంగాలీ సంపన్న కుటుంబపు మహిళే అయినా ఆమె ప్రారంభం నుంచీ తన వర్గాన్ని చీదరించుకుంటూ వుంటుంది. భర్త దివ్యనాథ్ (అనుపమ్ ఖేర్) స్త్రీలోలుడని తెలిసీ ప్రశ్నించే ధైర్యం లేని సుజాతకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు వున్నారు. వీరిలో ఆఖరి వాడే ప్రతీచటర్జీ. చిత్రంలో ఇతని పేరే హజార్ చౌరాసీ. ప్రతి చటర్జీ ఎదుగుతున్న క్రమంలో తండ్రి చేష్టల్ని చూసి అసహ్యించుకుంటాడు. ఈ విషయాలు తెలిసినా ఎందుకు ప్రశ్నించవంటూ తల్లిని ఎప్పుడూ అడుగుతూ వుంటాడు. ఆ ఇంట్లో మిగిలినవారెవరూ తల్లితో ఏమంత సన్నిహితంగ వుండరు. కానీ ప్రతి చటర్జీ మాత్రం ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే అన్న , అక్కలు ఇతడ్ని పాలుతాగే పాపాయి అంటూ గేలి చేస్తుంటారు. కానీ ప్రతిచటర్జీ ఇవేవీ పట్టించుకోడు.విప్లవం పట్ల ఆకర్షితుడైన తర్వాత ఈ విషయాన్ని తల్లితో చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించేవాడూ. విప్లవం గురించీ, తను చేసే పనుల గురించీ చెప్పాలని అనుకున్నా తల్లి సుజాత అతని మాటల్ని సరదాగా తీసుకుంటుంది.కొడుకు చనిపోయాడన్న వార్తని తెలుసుకున్న తర్వాత అవన్నీ ఙ్ఞాపకం వచ్చి కుమిలిపోతుంది…..
ప్రతి చటర్జీ చనిపోయాక పోలీసులు ఇంట్లోనే ప్రతి గదిని సోదా చేస్తుంటే , ఆ గదిలో అతను చదివే విప్లవ సాహిత్యాన్నీ, పోస్టర్లనీ , వాటికి సంబంధించిన సరంజామానీ చూస్తూ…..’ప్రతీ …!!! ఇవన్నీ నీ గదిలో వున్నాయని ఇప్పటిదాకా తెలుసుకోలేకపొయానే …..ఎలాంటి తల్లిని నేను ….. !? నువ్వు రోజూ రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోతుంటే చదువుకుంటున్నావేమొ అనుకునేదాన్ని. కానీ విప్లవాన్ని అధ్యయనం చేస్తున్నావని ఏ నాడూ అనుకోలేదురా …..! నువ్వు ఇంట్లోకి ఏవేవి తెచ్చేవాడివి… తీసుకెళ్ళేవాడిని…. ఇన్ని చేస్తున్నా ఏమీ తెలుసుకోలేకపొయానురా…! తల్లిగా ఏం చేశాన్నేను… ఆ రోజు రాత్రి … నీ ఆఖరి రాత్రి….నువ్వెన్ని చిత్రహింసలెదుర్కొని వుంటావు …..! అయినా నేను…… హాయిగా పరుపుపై నిద్ర పోయాన్రా ? అసలు నా మనసుకి అలజడైనా కలగలేదెందుకు ? ఏ తల్లికైనా ఇలా జరిగుంటుందా? ఎందుకు ?? ‘ అంటూ కొడుకు ఫోటోను గుండెలకి హత్తుకుని నిశ్శబ్దంగా రోదించే దృశ్యం మన మనసుని కదిలించేస్తుంది…..
ప్రతిచటర్జీ పాటు చనిపోయిన ‘సమూ’ ఇంటికి తన కొడుకు తరచూ వెళ్లేవాడని తెలిసి వాళ్ళింటికి వెళ్తుంది సుజాత. తలుపు తెరవగానే సుజాత వచ్చిందన్న విషయం తెలుసుకుని సమూ తల్లి (సీమా బిశ్వాస్ ) ఒక్కసారిగా గుండెలదిరేలా రోదిస్తుంది. కానీ సుజాత మాత్రం ఆమెలా స్వేచ్ఛగా ఏడ్చే పరిస్థితి సంపన్న వర్గంలొ పుట్టిన తనకు లేకుండా పోయిందే అని తనలో తనే జాలి పడుతుంది. మాటల్లేని మౌనభాష దృశ్యాలు మనకి అనేక ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. సమూ ఇంతికి ప్రతిచటర్జీ వెళ్లినపుడల్లా కొసరి కొసరి వడ్డించుకుని తినడం, పిన్నీ ‘ ఒక ఛాయ్ పెట్టవూ ‘ అంటూ టీ పెట్టించుకుని తాగడం… ఇలా వాళ్లింట్లో సన్నిహితంగా గడిపిన విషయాల్ని ఆమె చెబుతూ వుంటే ఆశ్చర్యంతో వింటుంది. సుజాత తనలో తాను నాకు మాత్రమే కొడుకువి అనుకున్నాను…. నా దగ్గర కంటే వీళ్ల దగ్గర ఎక్కువ చనువుగా వున్నావు…. ‘అనుకుంటూ లోలోపలే తనను,తన వర్గం లో వుండే పైపై ప్రేమల్ని తలుచుకుని బాధ పడుతుంది…. జనవరి 16 అర్థరాత్రి తర్వాత సమూ వాళ్ళింట్లో వున్న ప్రతీ ఛటర్జీని,సమూతో పాటు మరో ముగ్గుర్నీ వేరే గ్రూపు వాళ్ళు ఇంట్లోంచి బయటికి లాగి కర్రలతో దాడి చేసి, చివరికి తుపాకితో కాల్చిచంపడాన్ని కళ్లారా చూసిన సమూ తల్లి విలపిస్తూ ఆ సంఘటనని సుజాతతో చెప్పే దృశ్యం సహజంగానే ఎవరికైనా గుండెల్ని పిండేలా చేస్తుంది. సుజాత మనసు ఎలా వణికి పొతుందో చెప్పడం కన్నా చూస్తేనే తెలుస్తుంది….. ఇలాంటి అనేక దృశ్యాలు మనకి ఒక తల్లిని అనేక కోణాల్లో చూపెడుతుంది ఈ చిత్రం.
ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర నందిని . ఈ పాత్రని నందితాదాస్ తన నటనతో కట్టిపడేస్తుంది. వ్యక్తిత్వం ఉట్టి పడే నందిని లా స్టూడెంట్. ఆమె కూడా పార్టీలో పని చేస్తూ ప్రతీ చటర్జీ కి సన్నిహితంగా వుంటుంది. ఇద్దరూ పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు.ఈమె ప్రతిచటర్జీ చంపబడ్డ రాత్రే అరెస్టవుతుంది. జైలు శిక్ష అనుభవించి మెడికల్ గ్రౌండ్స్ మీద రెండేళ్ళ తర్వాత విడుదలవుతుంది. సుజాత ఆమెని కలిసిన సందర్భంలో కొడుకు గురించిన మరోకోణాన్ని నందిని ద్వారా తెల్సుకుంటుంది…..అప్పటికే సుజాతకి విప్లవ పోరాటం మీద కొంత అవగాహన ఏర్పడుతుంది. అందుకే నందినితో పార్టీ విషయాల్ని చర్చించగలుగుతుందామె… నందిని ఆమెతో, ‘ ఇప్పుడు కనిపించే ప్రశాంతత అంతా ఒట్టిదేననీ, విప్లవం జరుగుతూనే వుందనీ, ప్రభుత్వాలు వాటిని ప్రచారం కాకుండా చేస్తున్నారనీ, ఇంకా విప్లవకారులు మరణిస్తూనే వున్నార’నీ చెప్తుంది….’ అరోగ్యం మెరుగు పడగానే తాను మళ్ళీ ఉద్యమంకోసం పనిచేస్తాన’నీ సుజాతతో చెప్తుంది….. ‘తననీ మళ్లీ కలవడానికి ప్రయత్నించొద్దనీ, సమయం వస్తే తానే కబురు చేస్తాన’నీ చెప్పడంతో …. సుజాత చాలా బాధపడుతూ… ‘మళ్లీ కలవద్దా ? మీ అందరిలొ నా ప్రతీని చూస్తున్నాను…. అంటే నా కొడుకుని కలవద్దా….?’ అంటూ ఆమె తన కొడుకు గురించి పడే తపనని తెలియజేయడం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.
ఆ రోజు జనవరి 17. ప్రతీ చటర్జీ పుట్టినరోజు ….. యాధృచ్చికంగా అదే రోజు పోలీసు కాల్పుల్లొ చనిపోతాడు. ఆ రోజునే సుజాత చిన్న కూతురి నిశ్చితార్థం వేడుక… అదే రోజు విందు జరపడం సుజాతకి అస్సలు ఇష్టం లేదు…. ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేదెవరికీ…. అందుకే సాయంత్రం వరకూ చివరిసారిగా సమూ వాళ్ళింటికీ, నందిని దగ్గరికీ వెళ్ళి వాళ్ళతో గడిపి ఇంటికి తిరిగి వస్తుంది సుజాత. ఇంటికి వచ్చిన ఆమెపై భర్త దివ్యానాథ్ మండిపడతాడు… ఎప్పుడూ అతని మాటకి ఎదురు చెప్పని సుజాత అతనిపై మండిపడుతుంది… అసహ్యంగా చూస్తూ..’ తక్షణమే నా గదిలొంచి వెళ్ళి పొ …. లేదా నేనేం మాట్లాడతానో నాకే తెలీదు….. ఈ రోజు నాతో ఎవరూ ఏమీ మాట్లాడకండి ‘ అంటూ విరుచుకు పడుతుంది… ఈ సన్నివేశం ఆమెలో తిరుగుబాటుని తెలియచేస్తుంది….. ఆమె ఉగ్రరూపానికి దివ్యనాథ్ భయపడిపోతాడు…. మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు…… మనసులో ఎంత కుమిలిపొతున్నా తన బాధ్యత మర్చిపోదు సుజాత. అందుకే పార్టీ ఏర్పాట్లు చూసుకోవడానికి, అతిధుల్ని పలకరించడానికి పార్టీలోకి వెళ్తుంది… అందరూ తాగి నృత్యం చేస్తుంటే సుజాత మాత్రం ఒక మూలన మౌనంగా చూస్తూ నిల్చుంటుంది.. కొన్నేళ్ళుగా ఆమె అపెండిసైటీస్ ని మందులతో నెట్తుకొస్తున్నా ఆ రోజు మాత్రం నొప్పి తీవ్రం అవడంతో లోలోపలే బాధననుభవిస్తూ అలాగే వుండిపోతుంది…ఈ లోగా వేలాది విప్లవకారుల్ని చంపించిన పోలీసాఫీసరు కూడా పార్టీకి రావడాన్ని తట్టుకోలేక నొప్పి మరింత ఎక్కువై ఒక్కసారిగా అరుస్తూ కుప్పకూలిపోతుంది సుజాత.
నవలలో ఇక్కడితో కథ ముగిసిపోతే, సినిమాలో మాత్రం కొసమెరుపుగా చివరి అంకం చేర్చారు… ఈ అంకంలో వృద్ధురాలైన సుజాత తన భర్తతో పాటు కనిపిస్తుంది…. మునుపటి విషాదం ఆమెలో కనిపించదు…. నందిని కలకత్తాకి వచ్చిన విషయం తెలుసుకుని భర్తని తీసుకుని మానవహక్కుల కమీషన్ కి వెళ్తుందామె.నందినిని కలిశాక కాస్సేపటికి బయల్దేరబోతుంటే నందినిని కారులో డ్రాప్ చేయడానికి దివ్యనాథ్ వెళ్లడంతో సుజాత రోడ్డుపైనే నిల్చుండిపోతుంది. ఆ సమయంలో ఇద్దరు ఆగంతకులు జీపులొ వచ్చి ఒక మానవహక్కుల కార్యకర్తని చంపడం చూసి వెంటానే అలర్ట్ అవుతుంది……. పరుగెత్తుకు పోతున్న వారిలో ఒకడ్ని కాలు పట్టుకుని ఆపేస్తుంది.. ఈ లోగా జనం పొగై అతన్ని పొలీసులకి అప్పగిస్తారు… ఈ సంఘటనని డైరీలో రాసుకుంటూ సుజాత కొడుకుని సమీపంగా చూస్తుంది…భుజంపై కొడుకు చేయివేస్తే.. తల ఆనించి అలాగే కళ్ళు మూసుకోవడంతొ సినిమా ముగుస్తుంది.. సినిమా మొత్తానికి ఈ చివరి ఘట్టం కాస్త కృత్రిమంగా వుంది.. ఏదేమైనా నేటి సినిమా వ్యాపారంలో ఎక్కడా దేనికీ సరితూగని చిత్రం. సామాజిక అంశంతో సహజత్వం ఉట్టిపడే చిత్రం ‘హజార్ చౌరాసి కీ మాఁ’ అని చెప్పుకోక తప్పదు. దోపిడీ వర్గంలో పుట్టినప్పటికీ దోపిడికీ కారణాల్ని తెలుసుకుని ఒక విప్లవకారుడిగా తయారైన వైనం ప్రతిచటర్జీలో కనిపిస్తే, కొడుకు బ్రతికున్నన్నాళ్ళు విప్లవం గురించి ఓనమాలు కూడా తెలుసుకోలేకపోయిన సుజాత అతని గదిలోని విప్లవ సాహిత్యం చూసి అతని ప్రాపంచిక దృక్పథం అవగాహన చేసుకుంటుంది. ఆ తర్వాత నందిని ద్వారా విప్లవం గురించి తెలుసుకుంటుంది. సంపన్న వర్గంలో పుట్టిన కొడుకు విప్లవకారుడైతే, ఆ తర్వాత తల్లి విప్లవ సానుభూతి పరురాలవుతుంది. ఈ కొత్త విషయం చాలా మంది సుజాత లాంటి వాళ్ళకు ఆలోచనలు కలిగిస్తుంది. డబ్బుగానీ , సమాజంలో హోదా గానీ విప్లవంవైపు వెళ్ళడాన్ని నిలువరించలేవన్న సందేశాన్ని ఈ చిత్రం ఇచ్చింది. మాటలకందని ఎన్నొ మౌన భావాలు, ఎక్స్ ప్రెషన్స్ గోవింద నిహలానీ సామాజిక స్పృహకు అద్దం పడతాయి. మహాశ్వేతాదేవి కథా, గోవింద నిహలానీ దర్శకత్వమూ ఈ చిత్రానికి కాసులు కురిపించకపోయినా ఎంతో మంది సుజాతల్లో చైతన్యాన్ని రగిలిస్తుంది, ఆలోచనలని పురిగోల్పుతుంది. అందుకే సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం ఇది.
‘ఒక తల్లి’ నవలను తెలుగులో అనువాద రూపంలో మాత్రమే 80ల చివర్లో చదివాను. దాన్ని తొలిసారిగా చదివినప్పుడు తగిలిన షాక్ ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను. యద్ధనపూడి, యండమూరి నవలల మత్తులో మునిగి తేలుతున్న మా తరాన్ని పట్టి, నిలదీసిన అరుదైన నవలల్లో ‘ఒక తల్లి’ ఒకటి.
1983 నుంచి ప్రత్యేకించి 85 నిర్భంధ ప్రారంభంనుంచి 2000 చివరి దాకా,సామాజిక మార్పు కోరి కుటుంబాలను వదిలి ప్రజా ఉద్యమాల్లో నేలకొరిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని, ఉద్యమ కారిణిని కదలించి, ముందుకు నడిపించిన గొప్ప రచనలలో ఇదీ ఒకటి. సినిమాను ఇంతవరకు చూడలేకపోయినా మీ పరిచయం నిజంగా కదిలించివేసింది.
రచన దృశ్యంగా మారితే దాని టెంపో నీరసించిపోవడం అనేక సినిమాలలో చూశాం. మీ పరిచయాన్ని చదువుతుంటే సినిమా ఒకసారయినా చూడాలనిపిస్తోంది. సినిమా మీ వద్ద ఉంటే ఒక కాపీ చేసి నాకు ఇవ్వగలరా?
మంచి పరిచయానికి అభినందనలు.