గతితార్కిక భౌతికవాదం: రెండో అధ్యాయం (తరువాయి భాగం)
విపత్తు తలెత్తుతున్నప్పుడు ఏం చెయ్యాలి? దాని పెట్టుబడిదారీ నిర్మాతలను ప్రతిఘటించాలా? పెట్టుబడిదారీ వ్యవస్థనే అంతం చెయ్యాలా? అదేం కాదు. దాని పాలకులకు బలం చేకూర్చి, అలగా జనాన్ని బలహీనపరచాలి. కీర్కిగార్ద్ అస్తిత్వవాదపు మూలవిశ్వాసాన్ని ఇలా సూత్రీకరిస్తాడు.
“సత్యానికి సాక్ష్యం…రాజకీయాలకు సంబంధించినది కాదు”.49 అలగాజనం ఉపేక్షించదగినవారు. “బలి పశువులా తాను బాధపడుతూ, ఇతరులకు శిక్షణనిచ్చే వ్యక్తి మానవజాతిని క్రైస్తవభావంతో ప్రేమిస్తాడు. అలగాజనాన్ని వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. ఈ పద్ధతిలో తక్కిన అలగాజనంనుంచి వేరైన ప్రతి వ్యక్తీకూడా స్వర్గానందానికి పాత్రుడవుతాడు”.50 “రక్షణకు ఎన్నో యోజనాల దూరాన ఉండిపోయి, ఉపశమనంలేక వ్యథచెందే ఏకాకులైన వ్యక్తులను కాపాడడం ఎంతో ఆనందదాయకమైన సంఘటన”.51
పూర్తి ఏకాంతమే ఆనందానికి దారి తియ్యగలదనే ఈ అవాస్తవిక ప్రతిపాదన “అలగాజనా”నికి ప్రేరణనిచ్చి, కీర్కిగార్ద్ చెప్పిన “వ్యక్తిత్వం” పొందేందుకు ఏ మాత్రమూ ప్రోత్సహించలేదు. జనమంతా ఇలా తునకలుగా విడిపోయి, అవమానం పాలవడానికి తగినంత ఆధ్యాత్మిక ప్రలోభం కనబడలేదు. అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా గేబ్రియెల్ మార్సెల్ మతప్రమేయం లేని ఒక ఉన్నతవర్గాన్ని మధ్యయుగాల పద్ధతిలో పునఃసృష్టి చెయ్యడానికి ప్రయత్నించాడు. “ఉన్నతవర్గాల పునఃసృష్టి తప్పని సరిగా జరగాలి. లేకుంటే ‘సమానత్వం’ కోరే ప్రయత్నాలన్నీ దిగజారుడుతనానికే కారణమవుతాయి. అధికారక్రమంలో ఇది అట్టడుగు దశ. అందుకని ‘సమానీకరణ’మనేది జరగనేకూడదు”.52
జాస్పర్స్ క్రీ.శ. మొదటి శతాబ్దినాటి స్టోయిక్ గ్రీక్ తత్వవేత్త ఎపిక్టీటస్‌ను ఆమోదిస్తూ ఉటంకిస్తాడు. “మన బలహీనతలనూ, నిస్సహాయతనూ గుర్తించినప్పుడుగాని తత్వధోరణి తలెత్తదు”.53 ఎటొచ్చీ ఎపిక్టీటస్ బానిసవ్యవస్థ కలిగిన రోమన్ సామ్రాజ్యంనాటివాడు. వర్గపీడన రానురాను అంత్య దశకు చేరుతున్నప్పటికీ జాస్పర్స్ దానికే తలఒగ్గమని అంటాడు. అతని లక్ష్యమల్లా మార్క్సిజమే. ఎందుకంటే అతని లెక్కన “మార్క్సిస్టులు తమకు ‘సమస్తమానవజాతి’ గురించిన సంపూర్ణ అవగాహన ఉంటుందని చెపుతారు. ఇందులో వారి మానవత్వమే సమసిపోతుంది. నిజానికి మానవత్వమంటే స్వేచ్ఛా, భగవంతుడితో ఉండవలసిన సంబంధమూను”.54 ఇటువంటి తలకిందులు తర్కం ప్రకారం మార్క్సిస్టు అవగాహనద్వారా ‘సమస్తమానవజాతి’ని (అంటే ఫర్గసమాజం అన్నమాట) అర్థంచేసుకుని, వర్గదోపిడీనుంచి (పరలోకాన కాకుండా) ఇహలోకంలోనే విముక్తి సాధించడమంటే దోపిడీకి గురవుతున్నవారి ‘మానవత్వమే సమసిపోతుం’దన్నమాట.
హక్కులు సాధించటానికై “తమనుండి తామే దాక్కునే వాళ్ళంతా నీతిరహితులైన దరిద్రగొట్టు” లంటూ సార్త్ నిందిస్తాడు. “ఇదొక పెద్ద అబద్ధం. హక్కులనేవి ఎవరికీ ఉండవు”.55 ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’, ‘మానవులంతా సమానులే’, ‘ప్రతివారికీ కొన్ని నిరాకరించలేని హక్కులుంటాయి’ మొదలైన ‘పెద్ద అబద్ధా’లకు మారుగా సార్త్ నోరెత్తకుండా స్వపీడనతో సతమతమవుతూ నీచదశలో మిగిలిన ఏకాకివ్యక్తులను ఊహిస్తాడు. సార్త్ రాసిన ‘సైతానూ, సచ్ఛీలుడైన భగవంతుడూ’’ అనే పుస్తకంలో మంచితనాన్ని దుష్టత్వమే జయిస్తుంది. అదే ధోరణిలో ‘అస్తిత్వమూ, అభావస్థితీ’ అనే తన పుస్తకంలో ‘ఏమీ లేనటువంటి అభావస్థితే సామాజిక దౌర్భాగ్యస్థితికి ప్రత్యామ్నాయ’మని చెపుతాడు. పుస్తకం చివరలోమటుకు నిరాశను తగ్గిస్తున్నట్టుగా, అభావస్థితి స్థానంలో కాస్త అనుకూలభావనను ప్రవేశపెడతాడు. ‘నేనేమిటో నాకున్నదాన్ని బట్టే తెలుస్తుంది…డబ్బు నా పాటవానికి సూచకం… వస్తువులతో నాకున్న విచిత్ర సంబంధానికది ప్రతీక’. 56
అలాగే జాస్పర్స్ కూడా నిరీశ్వరవాది అయిన సార్త్ చెప్పిన అభావస్థితి అనేది భగవంతుడికి ప్రతిరూపమేనని స్పష్టంగా చెపుతాడు. “మానవుల ప్రయత్నాలూ, అవగాహనా అంతా నిష్ఫలమే… అవన్నీ మనని అంతులేని అగాథం ఒడ్డుకే చేరుస్తాయి. అక్కడ మనకు కనబడేదల్లా అభావస్థితో, దేవుడో మాత్రమే”.57 జాస్పర్స్ లెక్కన తత్వచింతన నిర్వహించేది అనుబంధపాత్ర మటుకే. దారి తప్పిన వారిని అది విజ్ఞానం వేపునుంచి విశ్వాసం వేపుకు తీసుకొస్తుంది. “తత్వవేత్త ధర్మశాస్త్రవేత్తలకూ, దేవా లయ వ్యవస్థకూ ఏం చెయ్యాలో చెప్పజాలడు. అతను చెయ్యగలిగినదల్లా ప్రాథమిక అవసరాలు ఏర్పాటుచెయ్యడమే”.58
తత్వవేత్తలు ప్రజలతోబాటు సామాజిక కార్యాచరణకు దిగాలా? మార్సెల్ లెక్కన “కీర్కిగార్ద్, నీచేవంటివారి అనశ్వరమైన ప్రతిభ అంతా ముఖ్యంగా వారు రుజువుచేసిన విషయాల్లోనే కనిపిస్తుంది. నిజమైన తత్వవేత్త ఎవడూ సమూహాల జోలికి పోడు. అతను తనకు సహజసిద్ధమైన ఏకాంతతను వదిలి, వెళ్ళాడంటే దారితప్పాడన్నమాటే”.59 ఫాసిజానికి ప్రాథమికంగా సైద్ధంతిక పునాదినిచ్చిన నీచేను పొగడడంద్వారా మార్సెల్ తాను ప్రశంసించే ఏకాంతత ఎటువంటిదో చెపుతున్నాడు. మానసికంగానూ, శారీరకంగానూ బందీలై, నోరు నొక్కేసిన మానవాళి నెత్తినెక్కి కూర్చుని పీడించే ఏకాంతత అది. నీచే లెక్కన “జీవితమంటే ప్రధానంగా పరాయివారినీ, బలహీనులనూ స్వాధీనపరుచుకోవటం, హాని చెయ్యటం, లోబరుచుకోవటం, అణిచెయ్యటం, కఠినత్వం…కనీసస్థాయిలో చెప్పాలంటే దోపిడీ చెయ్యటం…”60
కామూ చెపుతాడు. “నిజంగా గంభీరమనిపించే తాత్వికసమస్యల్లా ఒక్కటే; అది ఆత్మహత్య”.61 అదే విధంగా మార్సెల్ అంటాడు. “ఆత్మహత్య సాధ్యమేననేది చూస్తే అది ఎటువంటి వాస్తవమైన అతి భౌతికచింతనకైనా నాంది అవుతుంది”.62 మరి ‘వాస్తవమైన’ అతిభౌతికచింతన మార్సెల్ తదితరులను ఆత్మహత్యకు పురికొల్పవచ్చు కనక అతను అద్భుతాలమీద ఆధారపడమని చెపుతాడు. “అద్భుతా లకు అవకాశమున్న ప్రపంచంలో మాత్రమే ఆశకు చోటుంటుంది…”63
పక్కా కమ్యూనిస్టు విరోధి అయిన అబ్రహాం కప్లాన్ అస్తిత్వవాదాన్ని నమ్మేవారికి దాని విలువ ఎటువంటిదో ఇలా చెపుతాడు. “ఎక్కువగా చెప్పాలంటే అస్తిత్వవాదం మనకు ఓటమినెలా స్వీకరించాలోమటుకు నేర్పుతుంది…అది పరాజయాన్నీ, ఇంకా చెప్పాలంటే పరాజయాన్ని హుందాగా ఆమోదించే వైఖరినీ, కష్టపడి నిర్వచిస్తుంది. అందరికీ వర్తించే ఈ వాదాన్ని మనమంతా అంగీకరిం చాలి”.64
దుష్టత్వాన్నీ, చావు గురించిన తమ దృక్పథాన్నీ వర్ణిస్తున్నప్పుడు అస్తిత్వవాదులందరూ మార్చేదల్లా నామవాచకాలనే; అంటే పేర్లనే. సత్యానికి ఎడంగా వెళ్ళని వీరంతా మానవుడికన్నా పెట్టుబడిదారీ విధానాన్నే ఖచ్చితంగా విశదీకరిస్తారు. ప్రస్తుతయుగంలో కార్మికవర్గం వర్గసమాజాన్నీ, దాని అసంబద్ధపు దౌర్భాగ్యాన్నీ విస్మృతిపథంలోకి కూలదోసే విశాలదృశ్యానికీ, వర్గసమాజపు మొదటిదశలో కట్టుబానిసల సంకుచితదృక్పథపు భ్రమతో నిండిన వైఖరికీ చాలా తేడాఉంది. రెండో దాంట్లో కనబడేదల్లా చీకటియుగమే; అందులో వెలుతురుగాని, విమోచనకు నిజమైన ప్రాతిపదిక గాని, దోపిడీని అంతమొందించేందుకు అవసరమైన భౌతికపరిస్థితులుగాని, ఆలోచనల క్షితిజంపై ఉదయించవు.
References:
49. Kierkegaard, The Point of View for My Work as an Author, p.115
50. Kierkegaard, The Journals of Kierkegaard, p.151
51. Quoted in Grene, Introduction to Existentialism, p. 38
52. Marcel, Man Against Mass Society, p. 201
53. Japers, Way to Wisdom, p. 19
54. Ibid., p. 66
55. Quoted in Stern, Sartre, p. 32
56. Ibid., p. 187
57. Quoted in Farber, The Aims of Phenomenology, p. 208
58. Japers, The Perennial Scope of Philosophy, p. 108
59. Marcel, The Philosophy of Existence, p. 93
60. Nietzsche, Beyond Good and Evil, p. 203
61. Camus, The Myth of Sisyphus, p. 3
62. Quoted in Farber, The Aims of Phenomenology, p. 217
63. Marcel, Being and Having, p. 75
64. Kaplan, The New World of Philosophy, p. 115