| పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణసభ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) సెప్టెంబర్ 23న 2009 హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ప్రముఖ రచయిత్రి. సామాజిక కార్యకర్త, బుకర్ ప్రైజ్ విన్నర్ అయిన అరుంధతీ రాయ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసగించారు. |
ఈ ప్రపంచంలో మనది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అయితే ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో అర్థం చేసుకోవాలి. 60 ఏళ్ళు ఆచరణలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పాలకుల ప్రజాస్వామ్యంగా మారిపోయింది. ప్రజాస్వామ్యంలోని ప్రధాన వ్యవస్థలన్నీ పరిపాలన, పత్రికలు ,న్యాయవ్యవస్థ, ఎన్నికలు అన్ని చెడిపోయాయి. ప్రజాస్వామ్యాన్ని ఫ్రీ మార్కెట్ శక్తులు నడిపిస్తున్నాయి. దాని ఫలితమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ .ఈ దేశంలో మార్కెట్ పేరు మీద జరుగుతున్న విధ్వంసం ప్రజాస్వామ్య పునాదుల్ని సైతం పెకలించి వేస్తున్నది. ఈ విధ్వంసం 1989 లో సోషలిస్టు వ్యవస్థ కూలిపోవడంతో ఏక ధృవ ప్రపంచ దోపిడీ మరింత వేగంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఫాసిజం , హిందూత్వ ఫాసిజం రెండూ ఈ దేశంలో కలగలసి పోయాయి. ఒకదానికొకటి సమర్థించుకుంటున్నాయి కాబట్టే దేశంలోని పారిశ్రామిక వేత్తలు నరేంద్ర మోడిని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఫాసిజం ఒక న్యాయమైన సమాజాన్ని ( just society) కూల్చి వేస్తుంది. ఫాసిజం , ప్రపంచీకరణ సహజ భాషనే మార్చేసింది. గతంలో ‘గరీబీ హఠావో ‘ అన్న పాలకులు, ఈనాడు గరీబోంకో హఠావో అంటున్నారు. ( పేదరికం పోవాలి అన్నవారు , ఇపుడు పేదల్నే తరిమేద్దాం అంటున్నారు) అభివృద్ధి , సమగ్రత , ప్రజాస్వామ్యం, న్యాయం అనే పదాల్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నారు. న్యాయం అనేది అందరికీ జరిగినపుడే అది న్యాయం అనిపించుకుంటుంది. ఇక్కడ కొందరి అభివృద్ధి కోసం పేదలు తమ జీవితాల్ని త్యాగం చెయ్యాలి. జాతీయత పేరు మీద, దేశ సమగ్రత పేరుమీద వేలాదిమంది ప్రజల్ని కాల్చి చంపుతున్నారు. కాశ్మీర్ లో ఇప్పటి వరకు 78 వేల మందిని చంపేశారు. నాగాలాండ్ లో తన ప్రజలమీదే అకాశం నుండి బాంబుల కురిపించారు( arial Bombimg ) , మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రంలో ప్రతి ఏటా 200 నుండి 300 మందిని ఎన్ కౌంటర్ల పేరుమీద చంపేస్తున్నారు. అత్యంత బలమైన శక్తులు అత్యంత పేదలపై యుద్ధం ప్రకటించాయి.
2005 వ సంవత్సరంలో ఖనిజ సంపదను, సహజ సంపదల్ని కొల్ల గొట్టడానికి పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాన్ని (MOU) కుదుర్చుకుంది. అయితే అక్కడి ప్రజల ముఖ్యంగా ఆదివాసీలు వాటిని తీవ్రంగా వ్యతిరేకించడంతో , అక్కడ మావోయిస్టు ఉద్యమం బలంగా వుండడంతో ఆ ఒప్పందాలు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు.అందుకోసం ప్రభుత్వం ఆదీవాసీలతో యుద్ధానికి తలపడుతున్నది . అందుకే ప్రధాని మన్మోహన్ దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులనుంచి ప్రమాదం పొంచి వుందని మాట్లాడుతున్నాడు. మావోయిస్టుల ఏరివేత వెనుక అంటే, ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనుక ఉద్దేశ్యం అటవీ సహజ సంపదల్ని కొల్లగొట్టడమే.
ప్రపంచంలో మైనింగ్ కు ఒక చరిత్ర వుంది. కొలంబియా , ఆఫ్రికా దేశాలలో మైనింగ్ మాఫియా ప్రభుత్వాల్ని శాసించింది. మొత్తం ఆ సమాజల్లోని సహజ సంపదను దోచుకుని, అక్కడి పజల్ని నిరుపేదగా,నిర్వీర్యం చేసారు. 2009 లో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి C.P.జోషి, మైనింగ్ పేరుమీద పెద్ద ఎత్తున అటవీ భూములు కబ్జాలకు గురవుతున్నాయని నివేదిక ఇచ్చాడు. తమ దోపిడికి అడ్డం వస్తున్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి, సాల్వా జుడుంకు ఈ కార్పోరేట్ శక్తులే నిధులు సమకూర్చుతున్నాయి. అయినా సాల్వాజుడుమ్ మావోయిస్టు ఉద్యమాన్ని తగ్గించలేకపోయింది. ఫలితంగా కేంద్రం సాయుధ బలగాలను పంపి, ఆదీవాసీలను అస్థిర పరచి, వాళ్ళను అడవి నుండి వెళ్ళగొట్టడానికి నడుంకట్టింది. ఇప్పటికే దండకారణ్య ప్రాంతంలో 644 గ్రామాలు ఖాళీ అయ్యాయి.ఆపరేషన్ గ్రీన్ హంట్ ను బహిరంగంగా ప్రకటించడంతో పౌర సమాజం నుండి, హక్కుల సంఘాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒరిస్సాలోని బాక్సైట్ నిక్షేపాల విలువ నాలుగు ట్రిలియన్ల డాలర్లు. అది మన జాతీయ ఆదాయాని కంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఆ డబ్బుతో వాళ్ళు ఎవ్వరినైనా కొంటారు.ఫలితంగానే మధుకోడాలు, గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు పుట్టుకొస్తున్నారు. రాత్రికి రాత్రే కోట్లకి పడగలెత్తుతున్నారు.అయితే పత్రికలు మాత్రం ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరిచ్చారు? ఈ అవినీతి మూలాల్ని మాత్రం ప్రశ్నించడం లేదు? ఎందుకంటే ఆ మైనింగ్ కంపీనీలే ఈ పత్రికలకు ఫుల్ పేజీ ఆడ్వర్ టైజ్ మెంట్లు ఇస్తుంటాయి కాబట్టి. చిదంబరం తాను ఆర్థిక మంత్రే కాక పూర్వం ప్రపంచంలోని అతి పెద్ద మైనింగ్ కంపెనీలలో ఒకటైన ‘వేదాంత’ కంపెనీకి నాన్ - ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేసాడు. తను ఆర్థిక మంత్రి అయ్యాక, ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసాడు. వీళ్ళు బ్యూరోక్రాట్స్ ను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలరు. గిరిజన గ్రామాల్లో చేయాల్సిన ప్రజాభిప్రాయ సేకరణను, దంతెవాడ జిల్లా కలెక్టర్ తన ఆఫీసులో, అది కూడ పోలీసులు అనుమతించిన కొద్దిమంది గిరిజనుల సమక్షంలో జరిపి, ఆమోదం ప్రకటిస్తున్న పరిస్థితిని బట్టి, వాళ్ళ ప్రభావం ఏ స్థాయిలొ వుందో చెప్పవచ్చు.
విచిత్రం ఏమిటంటే, ఖరీదైన స్టుడియోల్లో కూర్చుని మావోయిస్టులు ఎందుకు ఎన్నికల్లో పోటీచేయరు? అని ప్రశ్నిస్తుంటారు. ఇటీవల ఒక ఇంటర్వూలో నన్ను ఇలాంటి ప్రశ్న అడిగారు. మావోయిస్టులు ఈ ఎన్నికల ఖర్చును భరించేంత ధనవంతులు కారని సమాధానం చెప్పాను. ఈ దేశంలొ ఎన్నికల ఖర్చు అమెరికాలో ఎన్నికల ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు దేశాన్ని ఎలా పాలిస్తారు? వాళ్ల నుండి అవినీతికి తావులేని పాలనను వాళ్ళనుండి ఎలా ఆశిస్తాం?
కార్పోరేట్ శక్తులు ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించుకున్నాయి. కాబట్టి వ్యవస్థను మార్చాలి. మార్చాలి అన్నపుడు ప్రత్యామ్నాయ మార్గం వుండాలి. మావోయిస్టులు అధికారంలోకి వస్తే అది ప్రత్యామ్నాయం అవుతుందా? అన్న ప్రశ్నవేస్తే………….. ఒక్కటే సమాధానం. ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రకృతి సంపద పకృతిలోనే, అడవుల్లోనే వుండాలి. బాక్సైట్ లు, ఇసుప ఖనిజాలు అడవుల్లోనే వుండాలి. నీళ్ళు నదుల్లోనే వుందాలి. సహజ సంపదల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలి. ప్రైవేటు కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేయాలి. దీనికోసం మనం అందరం పోరాడాలి. ఒక మానవీయ సమాజం కోసం పోరాటం చెయ్యాలి.
ఒక్క అభిప్రాయం
జరుగుతున్న పోరాటం ఈ దేశ సహజ సంపద పై ప్రజల ఆధిపత్యం ఉండాలనుకున్నవారికి, దానిని అమ్ముకునే వారికి మధ్య. కావున ఇది ఒక బలీయమైన మట్టికాళ్ళ మహారాక్షసితో. జరుగుతున్నది మన్మోహన ఒప్పుకున్నట్లుగా అంతర్యుద్ధమే. కాబట్టి ప్రజల చైతన్యం మేరకు ప్రతిఘటన కొనసాగుతుంది. నేడు తన బలగాలతో చిదంబరం అణచివేయగలిగినా ప్రజలలోని స్వేచ్చాకంక్షను ఎవరూ అణచివేయలేరు. పోరాటం ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. వాడు తొడుక్కున్న అభివృద్ధి ముసుగు తొలగి ప్రజలంతా గుర్తించిననాడు విజయం తప్పక సాధిస్తాం. ప్రజాస్వామిక వాదులంతా పచ్చదనంపై కొనసాగుతున్న వేటను తప్పక వ్యతిరేకించాలి.