‘ బెంగాల్‌కు తగినన్ని కేంద్ర పోలీసు బలగాలను పంపించాం, వాళ్లను నిర్దిష్టమైన పనులలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ‘ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం చిద్విలాసంగా సామంతుల కోర్టులోకి బంతిని తోసాడు.
ఐదు బెటాలియన్ల సిఆర్‌పిఎస్, ఒక బెటాలియన్ కోబ్రాలను జార్ఖండ్, బెంగాల్ సరిహద్దుల్లో మోహరించారు. వారితో పాటు సిపిఎం కార్యకర్తలు సాయుధులై లాల్‌గఢ్‌లో ప్రవేశించడానికి సమాయత్తం అవుతూంటే, ‘చాలా కాలంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులు అంతర్గత ప్రమాదం అంటున్నారు గనక ఇది కేంద్రం బాధ్యతే’ అంటూ బంతిని తిరిగి కేంద్ర ప్రభుత్వంవైపు నెట్టారు సిపిఎం నేత సీతారాం ఏచూరి.
More…సహజంగానే ఇద్దరూ లాల్‌గఢ్ పరిణామాలను శాంతి భద్రతల సమస్యగా చిత్రిస్తున్నారు. భూసంస్కరణల దశ ముగిసి అభివృద్ధి పథంలోకి పారిశ్రామికీకరణ ద్వారా దూసుకుపోవాలనే మారిన మైండ్ సెట్‌తో బుద్ధదవ్ భట్టాచార్య 2001లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆయన హయాంలో 2003 వరకు 12,06,086 మంది ఉద్యోగాలు కోల్పోతే, కాజువల్ కాంట్రాక్ట్ ఉద్యోగాలతో సహా 25,149 మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత 2004 నుంచి 2006 వరకు 4,24,000 మంది ఉద్యోగాలు కోల్పోతే కేవలం 84,000మంది కొత్తగా ఉపాధి పొందారు.
సింగూరు, నందిగ్రామ్‌లలో చేతులు కాల్చుకోక ముందే మేధినిపూర్ జిల్లాలోని సాల్బోనిలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని బుద్ధదేవ్ ప్రభుత్వం 2007లోనే భూసేకరణ ప్రారంభించింది. ఇది ‘ఆపరేషన్ బర్గా’ (నక్సల్బరీ పోరాట నేపథ్యంలో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం భూములు పంచిన కార్యక్రమం)లో ఆదివాసులకు పంచిన భూమియే. 2008 ఆగస్ట్ నాటికి ఈ భూమిని ప్రభుత్వం జిందాల్ కంపెనీకి సెజ్ కింద కట్టబెట్టింది.
నిజానికి ఆదివాసుల భూములను గాని, అటవీ భూములను గాని ప్రైవేట్ వ్యక్తులైనా, ప్రభుత్వమైనా అమ్మడానికీ, కొనడానికీ వీలు లేదని చట్టం. ఈ చట్టాన్ని సిపిఎం ప్రభుత్వం తుంగలో తొక్కింది. 2008 నవంబర్ 2న జిందాల్ ఉక్కు కర్మాగారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిపిఎం కార్యకర్తలే మహోత్సాహంతో పార్టీ సభ మాదిరిగా నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు అప్పటి కేంద్ర ఉక్కు మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కూడా పాల్గొన్నారు.
సజ్జన్ జిందాల్ ఆదివాసులకు ఉద్యోగ వాగ్దానాల వరాలు కురిపించారు. తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ తృటిలో మందుపాతరల ప్రమాదాన్ని తప్పించుకున్నది. నాలుగు రోజుల తర్వాత ఆ మందుపాత పేల్చింది తామేనని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. అయినా పశ్చిమ మేధినిపూర్ ప్రాంతమంతా నవంబర్ 5 నుంచి ఆదివాసులపై ప్రభుత్వ, సిపిఎం కార్యకర్తల దాడులు మొదలయ్యాయి.
ఈ దాడులకు వ్యతిరేకంగా పిఎస్‌బిజెసి అనే సంస్థ ఛాత్రధర్ మహతో నేతృత్వంలో ఏర్పడింది. పోలీసులు, సిపిఎం కార్యకర్తలు మేధినీపూర్, బంకురాలకు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా దిగ్బంధం చేశారు. పోలీస్ జీపులు, సిపిఎం మోటర్ బైకులు ఆణచివేతకూ, బీభత్సానికీ చిహ్నాలుగా మారిపోయాయి. నవంబర్ 6న పన్నెండు వేల మంది ఆదివాసులు లాల్‌గఢ్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేశారు.
సిపిఎం నాయకులందరూ పోలీస్ శిబిరాలలోనే తిష్ట వేశారు. మరోపక్క పెద్ద సంఖ్యలో సిపిఎం అభిమాను లు, ప్రత్యేకించి యువజనులు ఆందోళనకారులతో చేరిపోయారు. వారికి సిపిఎం కార్యకర్తలమనే దానికన్నా, సంతాల్ తెగవారిమనే స్పృహ ఏర్పడింది. గత ఫిబ్రవరి ఒకటిన నందలాల్ పాల్ అనే సిపిఎం నాయకుడు హత్యకు గురయ్యాడు. ఆయనను ఎవరు చంపారనేది తెలియదు.
సిపిఎం వారు మాత్రం అది మావోయిస్టుల పనే అని ప్రకటిస్తూ ఫిబ్రవరి 2న శవ ఊరేగింపులో పిఎస్‌బిజెసి మహాసభపై కాల్పులు జరిపారు. ఆ కాల్పు ల్లో ముగ్గురు వ్యక్తులు హతులయ్యారు. మరెంతోమంది గాయపడ్డారు. అక్కడ దొరికిన తూటాలు పోలీసులు ఉపయోగించే ఎకె47 రైఫిల్స్‌కు చెందినవి. జనవరి25న పోలీసు అత్యాచారాలు నిలిపివేయాలనే డిమాండ్‌తోపాటు, ఆదివాసు లు కొన్ని కొత్త డిమాండ్లు పెట్టారు.
అవి ఉపాధి అవకాశాలకు, సంతాల్ భాషను, సంస్కృతిని అభివృద్ధి పరచడానికి సంబంధించినవి. నూరు రోజుల పని కార్యక్రమాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా అమలుచేయాలని, బిపిఎల్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, ఇందిరా ఆవాస్ వంటి పథకాలలో అవినీతి లేకుండా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. పోలీసులూ, సిపిఎం నాయకుల లోపాయకారి మద్దతుతో చట్టవిరుద్ధంగా నడిచే మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంతాల్ స్త్రీలు పోరాడారు.
నూతన సామాజిక ప్రయోగాలకోసం వాళ్లు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పశ్చిమ మేధినిపూర్, బంకురా, పురులియా జిల్లాల్లో మూడు వందల గ్రామాలలో గ్రామ కమిటీలు ఉన్నాయి. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కుటుంబ సమస్యలను కూడా ఇవి పరిష్కరిస్తాయి. 1990 నుంచే మేధినిపూర్ జిల్లాలో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ప్రభావం ఉంది. ఈ ప్రాంతంలో గత రెండేళ్ళలో రెండు బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయి.
మావోయిస్టుల నెపంతో ఆదివాసుల మీద విరుచుకుపడడం కూడా జరుగుతున్నది. ‘మావోయిస్టుల దాడి జరిగినప్పుడ ల్లా పోలీసులు మా ఊర్ల మీద విరుచుకుపడి మహిళలను, పిల్లలను చితక బాదుతారు. ఈ పోలీసుల దుర్మార్గాన్ని ఎంత కాలం భరించాలి. మేం అందరం మావోయిస్టులమే, మమ్మల్ని అరె స్టు చేయండి. అంతా బయటికి వచ్చాం కదా’ అని లాల్‌గఢ్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టినప్పుడు ఆరతి ముర్ము అనే సామాన్య మహిళ పోలీసు స్టేషన్‌ను మూయించడానికి ముందుకు దూకింది. లాల్‌గఢ్ పోరాటం మే 18న జరిగిన ఎన్నికల సందర్భంగా రెండో దశకు చేరుకున్నది.
మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చినప్పటికీ పిఎస్‌బిజెసి కమిటీ మాత్రం ఎన్నికలు తమ ప్రాంతంలో పోలీసు బలగాలు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్‌తో చర్చలు జరిపింది. పోలీసులు లేకుంటే ఎన్నికల యంత్రాంగానికి తాము సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. కాకపోతే ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రభావం వల్ల పదమూడు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అణచివేత, సిపిఎం దాడులూ , ఎన్నికల సంరంభంతో నిమిత్తం లేకుండానే ప్రజా కమిటీల ద్వారా ప్రజలు మౌలిక రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదివాసులు అందరికీ అవసరమైన వైద్య సేవల కోసం వైద్య సేవల కమిటీని ఏర్పాటు చేశారు. కంఠాపహారియా అనే చోట రెండేళ్ళ కిందట ఏర్పడి నిర్లక్ష్యానికి గురైన ఆరోగ్య కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తీసుకొని కలకత్తా నుంచి డాక్టర్‌ని రప్పిస్తూ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు అది ప్రజావైద్యశాలగా, ప్రజల చిరకాల వాంఛను పాక్షికంగానైనా తీర్చగలుగుతున్నది. ఆదివాసులకు నీటి కొరత, వ్యవసాయ ఉత్పత్తుల సమస్యల పరిష్కారానికి ఇప్పుడు ఈ ప్రజా కమిటీ గొట్టపు బావులను తవ్వించే కార్యక్రమానికి పూనుకున్నది. ఒక్కోబోరు బావి ఏర్పాటుకు దాదాపు 12 వేల రూపాయలు, కాల్వల తవ్వకాలకు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని విరాళాల కోసం విజ్ఞప్తి చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఎందరో ప్రజలు స్వచ్ఛంద శ్రమ దానానికి ముందుకు వచ్చారు. ఆదివాసుల ప్రజా కమిటీల ప్రయత్నాలు ఇట్లా ఉండగా, సిపిఎం మేధినిపూర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడూం మాదిరిగా ఆదివాసులను చీల్చి ఘనప్రతిరోధ్ కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. గతంలో ఈ కమిటీ నిర్మల్ సర్దార్ అనే ఆదివాసీ నాయకుడిని హత్య చేసింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి శాంతి కోసం, ఆదివాసి ఆదివాసేతరుల ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేసింది.
ఛత్తీస్‌గఢ్ , జార్ఖండ్ ,ఉత్తరాఖండ్ మొదలు గూర్ఖాలాండ్ వంటి రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించే సిపిఎంకు ఆదివాసుల స్వయం ప్రతిపత్తి, హక్కులు, భాషా సంస్కృతుల పట్ల ఎటువంటి అవగాహన ఉంటుందో ఇక్కడ ప్రత్యేకించి చర్చించనక్కర లేదు. ఈ సైద్ధాంతిక అవగాహన - ఆచరణ రూపమే ఇవాళ లాల్‌గఢ్ ఆదివాసులపై సిపిఎం అనుసరిస్తున్న అణచివేత విధా నం.
దీనికి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నమూనా పట్ల బుద్ధదేవ్‌కు ఉన్న అభినివేశం, అందుకు మన్మోహన్ సింగ్ అండదండలు తోడైనవి. లాల్‌గఢ్ ఆదివాసుల వెనుక లేదా ముందు మావోయిస్టుల నాయకత్వాన్ని చూస్తున్న వాళ్ళు స్వావలంబనకు విరుద్ధంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అణచివేతనూ, అభివృద్ధిని నిశితంగా పరిశీలించాల్సిఉంది. (విస్థాపన్ విరోధి జనవికాస్ ఆందోళన్ తరఫున అమిత్ భట్టాచార్య ఇచ్చిన నివేదిక ఆధారంగా)
- వరవరరావు
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 19 జూన్ 2009