నేటి వరంగల్ జిల్లా కడివెండి గ్రామం లో 1946 జులై 4న దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వం పొంది నేటికి 63 సంవత్సరాలు గడిచింది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కొమురయ్య తమ్ముడు మల్లయ్యతోపాటు, తెలుగు ప్రజల గుండెలన్నీ భగ్గునమండాయి.
గుత్పల సంఘంతో పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటన చెలరేగింది. దీనికి కొనసాగింపుగానే 1947 సెప్టెంబర్‌లో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు 16 అంశాల కార్యక్రమం ప్రాతిపదిక ఇచ్చిన సాయుధ పోరాట పిలుపును రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మోహియుద్దీన్‌లు ప్రకటించారు.
రెండు దశల్లో అటు నైజాంతోనూ, ఇటు యూనియన్ సైన్యాలతో పోరాడి ఐదు వేలమంది ప్రాణ త్యాగాలతో చరిత్ర ప్రసిద్ధిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని 1951లో అర్ధాంతరంగా విరమించారు. తిరిగి నక్సల్బరీ వసంత మేఘ గర్జనలతో పులకించి. పునరుత్తేజం చెందిన తెలంగాణలో మళ్లీ పోరాటాలు, త్యాగాలు ఎగిసి పడ్డాయి. ఇదే కడివెండిలో పుట్టి దొడ్డి కొమురయ్య నెత్తుర్లను దోసిళ్ళకెత్తుకుని దేశమంతా వెదజల్లిన పీపుల్స్ వార్ నేత సంతోష్‌రెడ్డి (మహేష్), జనశక్తికి చెందిన పెద్ద యాదగిరి (రియాజ్‌తో పాటు కాల్చి చంపారు) లతో పాటు మరిన్ని వేల త్యాగాలు తెలంగాణను ఎర్రపూల వనం చేశాయి.
ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళ పోరాటంతో సమాంతరంగా 1969లో చెలరేగిన తెలంగాణ రాష్ట్రోద్యమం సుమారు 400 మంది వీర కిషోరాల త్యాగాలను నమోదు చేసి చరిత్రకు అందించింది. ఆరు దశాబ్దాల సాయుధ పోరాటం, నాలుగు దశాబ్దాల తెలంగాణ పోరాటం తెలంగాణ దేహానికి రెండు బాహువుల్లా పిడికి ళ్ళెత్తుకుని వేర్వేరు విప్లవ- ప్రజాస్వామిక ఉద్యమాలుగా సాగుతూ, ప్రజా జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చినప్పటికీ నేటికి ఏదీ పూర్తిగా విజయవంతం కాలేదు. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను గుర్తించని విప్లవ పోరాటం నిరర్థకమన్న లెనినిస్టు స్ఫూర్తిని చాలా వరకు విప్లవ పార్టీలు గుర్తించాయి.
అందుకే వెనుకా ముందు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను ప్రజాస్వామికాంశం గా ప్రకటించాయి. విప్లవ-ప్రజా స్వామిక ఆకాంక్షలను జమిలిగా, దీటైన ఐక్య సంఘటణా నిర్మాణ చతురతతో నడిపించడంలో జరిగిన విప్లవకారుల లోపాలు, తెలంగాణ అంశాన్ని రాజకీయ నిరుద్యోగుల పదవీ ప్రయోగాల వేదికగా మారడానికి దారితీస్తాయి. ఎన్నికల బేహారుల చేతుల్లో చిక్కి తెలంగాణ నేడు యుద్ధం లేకుండానే మరు భూమిగా మారి పోయింది.
రాష్ట్రంలో విప్లవోద్యమం నేడు అనేక ఎగుడు, దిగుడుల గుండా సాగుతున్నది. శ్రామికుల విభజనగా ఎదురవుతున్న వర్గ-కుల భారత ఉపఖండ విశిష్ఠ లక్షణాల్ని విప్లవోద్యమం గుర్తించి ఎత్తిపట్టింది. పితృస్వామ్య వ్యతిరేక పోరాటాలతో ప్రాంతీయ ప్రజాస్వామ్య ఆకాంక్షలతో మమేకమై పని చేస్తుంది. అయితే ఇవ్వన్నీ సంలీనమై ఏకోన్ముఖంగా సాగాల్సిన సమయంలో, రెండూ సమాంతరంగా ప్రయాణిస్తూ విడిపోవడం జరుగుతున్నది. ఒకదానికొకటి ప్రేరణగానూ, ఉత్ప్రేరకంగాను నిలిచి పరస్పరాధారితంగా సాగాల్సిన విప్లవ-ప్రజాస్వామిక ఉద్యమాలు ఒక్కొక్కచోట కలగాపులగం అవుతున్నాయి. అందుకే విప్లవోద్యమం ప్రత్యామ్నాయ మార్గంగా విజయవంతం కాలేని వెలితిని ఎన్నికల పార్టీలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, పార్లమెంటే విప్లవ ప్రతిపక్షాన్ని ఉగ్రవాదంగా చిత్రిస్తూ పాలకవర్గాలు సైనిక దాడులకు ఉవ్విళ్ళురుతున్నారు. అలాగే పార్లమెంటరీ ప్రక్రియలో సాధ్యమయ్యే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని అరాచక వాదంగా చిత్రిస్తూ దాటవేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకంగా సీమాం ధ్ర ఆధిపత్య వర్గ-కులాలు, అసమానతలు సృష్టిం చే సామ్రాజ్యవాదం, బహుళ జాతులకు భూతల స్వర్గమయ్యే గ్రేటర్ హైదరాబాద్, జలదోపిడీ, భూముల పందేరం, సెజ్‌ల విషపు వల, బొగ్గు గనులను మృత్యుకుహరాలుగా కూర్చే కుట్రలు దాగి ఉన్నాయి. వనరుల- కొలువుల దోపిడీ, విధ్వంసాలను అభివృద్ధిగా చిత్రించే దుర్మార్గం రక, రకాల ముసుగులేసుకుని రాజ్యమేలుతోంది.
నలబై ఏళ్ళుగా వంచనలు, ద్రోహాలు, మోసాలు ఎడతెరపి లేకుండా సాగుతున్నాయి. తెలంగాణను ఆర్థికం గానే కాకుండా సాంస్కృతికంగా, రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏకాభి ప్రాయ సాధన (ప్రజాస్వామ్యంలో నూతన వింత ప్రక్రియ) అంటూ, నక్సలైట్ల రాజ్యమంటూ, ముస్లింలు వ్యతిరేకమంటూ రక రకాల బూచీలతో పబ్బం గడుపుకుంటున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ఏకో నారాయణ మార్గమే ల్యాబీయింగ్ రాజకీయం. అందువల్ల ఇప్పుడు వ్యక్తులు కాదు- మార్గాలు సంఘర్షణ పడాలి. తెలంగాణ వాదులంతా ‘ఐక్యత-సంఘర్షణ- ఏకాభిప్రాయం’ల సాధన దిశగా ముందుకు సాగాలి.
‘తెలంగాణ రాష్ట్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే’ దిశగా ఏకాభిప్రాయాన్ని సాధించుకోవాల్సి ఉంది. అందుకు అనుగుణంగా తెలంగా ణోద్యమ కేంద్రంగా వివిధ సంస్థలు, శక్తులు, వ్యక్తులు విశాల ఐక్య సంఘటనగా ఏర్పడి, ఉమ్మడి పోరాట కార్యక్రమం రూపొందించుకోవాలి. ఈ విధంగా రూపుదిద్దుకునే శక్తి నుండే తెలంగాణ వాదమే లేదనే వాళ్లతో రెఫరెండానికి సవాలు చేయగలం. ఆంతరంగిక వలసపాలన నుండి విముక్తి కోసం అన్ని ప్రజాస్వామిక పోరాట రూపాలను అన్వేషించగలము. ఇటీవల తెలంగాణ రచయితల వేదిక ఇక్కడ నెలకొన్న తక్షణ నిస్సత్తువను బద్దలుగొడుతూ ‘తెలంగాణ పోరాటానికి గెలుపోటములేమీ లేవు- తెలంగాణను విముక్తి చేసుకోవడమా, బానిసత్వంలో మగ్గడమా అనే సవాలు తప్ప’అని సరిగ్గానే ప్రకటించింది.
ఆనాడు దొడ్డి కొమురయ్య అమరత్వం తర్వాత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభలు సంయుక్తంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి. ప్రస్థుత పరిస్థితులను బేరీజు వేసుకొంటూ తక్షణంగా తెలంగాణ వాదులందరిని ఏకతాటిపై నిలిచి ఉంచే విప్లవ- ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించాలి. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని విజయంవైపు నడిపించడమే దొడ్డి కొమురయ్యకు, వేల వేల అమరవీరుల త్యాగాల పరిపూర్తికి కనీస ప్రాతిపదిక వేయడానికి దారివేస్తుంది. అరవై మూడు సంవత్సరాల నాటి దొడ్డి కొమురయ్య త్యాగాన్ని, నలబై ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. అంతిమ నిర్ణేతలు ప్రజలే.
- అమర్
సి.పి.ఐ.ఎమ్.ఎల్ జనశక్తి రాజకీయ ఖైదీ
(జులై 4న దొడ్డి కొమురయ్య 63వ వర్థంతి సందర్భంగా)
సౌజన్యం: సూర్య దిన పత్రిక