శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీశ్రీతో ప్రముఖ రచయితల వ్యక్తిగత అనుబంధాల వ్యాస పరంపరలో ఇది మొదటిది..
ఎంతో మామూలుగా దగ్గిరగా మాట్లాడుతూనే ఒక ఎడాన్ని, గౌరవంతో కూడిన ఎడాన్ని మనలో కల్పిస్తాడు శ్రీశ్రీ. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటే అలాగే అని తనూ లేచి వెళ్లిపోతాడు. చలం దగ్గర వారం రోజులుండి మరి మేం వెళ్తాం అంటే ‘అయ్యో! అప్పుడే వెళ్లిపోతారా? మళ్లీ ఎప్పుడొస్తారు?’ అని బెంగగా చూసేవాడు. కృష్ణశాస్త్రి మేం సాయంత్రం ఆరుగంటలకు వస్తామని ఫోన్ చేస్తే ఐదు గంటల నించే వాకిట్లో ఎదురు చూస్తూ నిల్చునేవారు…
శ్రీశ్రీని మహాప్రస్థానం అట్ట మీద కాకుండా మొదటిసారి ఎప్పుడు చూశాను? 1968 మార్చిలో ననుకుంటాను. సౌమ్యనామ సంవత్సరం రాబోతోంది. విజయవాడ లో ఆకాశవాణి వాళ్లు ఉగాది కవి సమ్మేళనం జరుపుతున్నారని తెలిసి నేను, ఆదిలక్ష్మి, జయ గుంటూరు నుంచి వెళ్లాం. మాకప్పుడు బి.ఏ. మొదటి సంవ త్సరం పరీక్షలుండేవి కావు. స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరిగేవాళ్లం. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, సి.నారాయణరెడ్డి, నాయని కృష్ణకుమారి వంటి కవులంతా వస్తున్నారని తెలిస్తే యిక మమ్మల్నెవరు ఆపగలరు. ఆ రోజే ఉగాది పండగయింది మాకు.
ఆ సాయంత్రం ఎంత అందంగా ఉందో నాకి ప్పటికీ గుర్తే. శ్రీశ్రీ కవిత చదవటానికి లేచి పోడియం దగ్గరకు వస్తుంటే మేం ఒకరి చేతులొకరం పట్టుకున్నాం ఉద్వేగంతో. మహాప్రస్థాన మంతటి కవి- మా కళ్లల్లో ఇమిడిపోయాడు. అందరి కవితల విందు భోజనం తర్వాత- రాత్రి బస్సులో గుంటూరు తిరిగొస్తుంటే అప్రయ త్నంగా నా నోటి వెంట ఆ సాయంత్రం శ్రీశ్రీ చదివిని కవిత- ఉగాది కవి సమ్మేళన శుభోదయావసరాన సౌమ్యనామ వర్షానికి స్వాగతమో సమయాన భావిజూడ చూడనిచ్చు దూరదర్శనీ యంత్రం పట్టుకు వద్దామంటే బజారులో దొరకలేదు మామూలు పదాలు- కానీ వాటిలోనే ఒక లయ.
ఆ లయ వల్ల ఆ కవిత ఒక్కసారి వినగానే ఒంట పట్టింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత చూసినా అన్నీ సాధారణ పదాలే- కవితా రహస్యమేమిటో అంతుపట్టలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం నిత్య పారాయణ గ్రంథమే. పుస్తకం అవసరం లేకుండానే యోగ్యతా పత్రం నుంచి జగన్నాధ రథ చక్రాల వరకూ చదివేయగలననే గర్వంతో మిడిసిపడు తుండేదాన్ని. ఆ గర్వంతోనే బి.ఏ.
ఆఖరి సంవత్సరంలోకి వచ్చా. సంవత్సరమంతా నా సహచరులలో కొందరు పోలీసు కాల్పుల్లో చనిపోయారనే వార్తలతో బరువెక్కిన మనసు, అనేకమంది స్నేహితులు అజ్ఞాతంలోకి వెళ్లి కనపడటం లేదనే దిగులుతో నిండిన మనసు శ్రీశ్రీ షష్టి పూర్తి వార్త విని కాస్త తేలికపడింది. నేను, ఆదిలక్ష్మి బయలుదేరాం. విశాఖలో మెడిసిన్ చదువుతున్న రాజశేఖర్ అనే మిత్రుడు తప్ప మరెవరూ అప్పటికి తెలియదు. విజయవాడలో మెయిలెక్కాం. ఏదో గుబులు- ఏలూరు వచ్చేసరికి విశాఖ వద్దులే ఇంటికెళ్లిపోదాం అనే నిర్ణయానికి వచ్చాం. ఏలూరు స్టేషన్‌లో దిగి బైటికెలా వెళ్లాలా అని చూస్తూంటే గుప్పిట బిగబట్టి సిగరెట్ తాగే శ్రీశ్రీ లాంటి వ్యక్తి కనిపించాడు.
శ్రీశ్రీలాగే సిగరెట్ తాగుతున్నాడే అని ఆయన దగ్గరకెళ్లి మీ పేరేంటండీ అనడిగాం. అది తెలియని వాళ్లున్నారా అనే ఆశ్చర్యంతో కూడిన ధీమాతో ‘శ్రీశ్రీ’ అన్నాడాయన. నేనూ, ఆదిలక్ష్మి ఒకర్నొకరం కావలించుకుని ‘మీ షష్టిపూర్తికి విశాఖ వెళ్తున్నాం’ అన్నాం. ‘నేనూ నా షష్టిపూర్తికి విశాఖే వెళ్తున్నాను’ అన్నాడాయన. మేం మళ్లీ రైలు పెట్టెలోకి ఎక్కుతుంటే మా వెనకాలే శ్రీశ్రీ. ఆ బోగీలోనే ఉన్నాడాయన. ఇక రాత్రంతా ఎన్ని కబుర్లో. చాలా సరదా కబుర్లు కూడా గంభీరంగా, ఒక ఛ్ఛ్ట్చీఛిజిఝ్ఛn్ట తోనే ఎంతో దగ్గరగా అనిపిస్తాడు. సామాన్యంగా కనిపిస్తూనే, మామూలు మాటలు మాట్లాడుతూనే ‘నేను మేధావి’ని అని చెప్పక చెప్తాడు. ఆ మేధావిని చూసి మహా గౌరవం కలుగుతుంది. ఇవి అప్పటి నా ఫీలింగ్స్. ఆ రాత్రి ఉగాది కవితలో పదాల కూర్పు రహస్యం అడిగాను. సరదాగానే మహా సీరియస్ రహస్యం చెప్పాడు.
ఆ రోజు మా అదృష్టం ఏమని చెప్పాలి.. రైలు కొన్ని గంటల లేటు. అంత దగ్గరగా శ్రీశ్రీతో కలిసి కూర్చోగలిగే అదృష్టం మళ్లీ వస్తుందా? సాయంత్రం దాకా లేటయితే బాగుండనిపించింది. మాదే అదృష్టమనుకుంటే డా.కృష్ణ మూర్తి, శోభలు శ్రీశ్రీ ఉన్న రైల్లో ప్రయాణిస్తున్నపుడు రైలు పట్టాలు తప్పిందని మొన్న శతజయంతి రోజు చెప్తే వాళ్ల అదృష్టానికి కొత్తగా అసూయపడ్డాను. రెండు రోజులు విశాఖలో ఏం తిన్నామో, ఎక్కడున్నామో స్పృహలో లేం. విశాఖ విద్యార్థుల కరపత్రం, దిగంబర కవుల ఉపన్యాసాలు, ఆరుద్ర, సోమసుందర్, రావి శాస్త్రి యిత్యాది రచయితల వాగ్వివాదాలు- ఆ చరిత్రలో భాగమయ్యా. ఏలూర్లో దిగి పోయినట్లయితే- అమ్మో- సమ యానికి శ్రీశ్రీనే కనపడి చెయ్యిపట్టుకు లాక్కెళ్ళి చరిత్ర ముందు నుంచోబెట్టాడు.
విరసం ప్రారంభ సభలు ఖమ్మంలో జరుగుతున్నాయని తెలియగానే ప్రయాణం. నేనూ, దేవీ ప్రియ, సుగమ్‌బాబు, కిరణ్‌బాబు వెళ్లాం. సభల్లో శ్రీశ్రీ వేదిక మీదా.. లేదా కె.వి.రమణారెడ్డి, జ్వాలా ముఖి, చలసాని ప్రసాద్, వరవరరావు, చెరబండరాజు వంటి వాళ్ల మధ్య. ఆ సంరంభాన్నంతా దూరం నుంచి చూస్తూ, ఆలోచిస్తూ ఆవేశపడుతూ నేను. చివరిరోజు సాయంత్రం వర్షంలో తడుస్తూ పెద్ద గొంతుతో నినాదాలిస్తూ శ్రీశ్రీ పక్కనే నిలబడి ఖమ్మం వీధుల్లో ఊరేగా. ఐదడుగుల నేను ఆకాశా న్నందుకున్నట్లయింది. అప్పటినుంచి 1974 వరకూ అనేక సభలలో, విరసం కార్యవర్గ సమా వేశాల లో శ్రీశ్రీతో కలిసి కూర్చుని కొంచెం మాట్లాడే అవకాశాలొచ్చేవి.
గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామాలలో పెట్టిన పౌరహక్కుల సభలకు కూడా శ్రీశ్రీ వచ్చేవాడు. ఏ సౌకర్యాలూ అడిగేవాడు కాదు. 1972లో గుంటూరు విరసం సభలు మర్నాడు ప్రారంభమవుతాయనగా, ఆ రోజు అర్థరాత్రి ఆర్టిస్ట్ చంద్ర పెయింటింగ్‌ల ఎగ్జిబిషన్ అమరుస్తుంటే ఆ బొమ్మలను మెచ్చుకుంటూ నేనూ, చెరుకూరి సత్యం యింకొకరిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఉరుకులు పరుగులు మీద ఒక వార్త వచ్చింది. జిన్నా టవర్ దగ్గర కూచుని మాట్లాడుకుంటున్న భూమన్‌ని, అత్తలూరి నరసింహారావుని, డాక్టర్ ఎమ్.వి.రమణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కంగారు పడ్డాం. అందరూ ఆదమరిచి నిద్రపోయే అర్థరాత్రి ఏం చెయ్యాలి? తెల్లారేదాకా వాళ్లని పోలీస్ లాకప్‌లో ఎలా ఉండనివ్వాలి? వెళ్లి హోటల్ గదిలో నిద్ర పోతున్న శ్రీశ్రీని నిద్ర లేపాం. ఆయన ఆ అర్థరాత్రి వెంటనే వచ్చి స్టేషన్‌కెళ్లి తన పేరు చెప్పి వాళ్లను బైటికి తీసుకొచ్చాడు.
అందరం నిశ్చింతగా ఇళ్లకు వెళ్లాం. శ్రీశ్రీ మీద పిచ్చ కోపం వచ్చిన సందర్భం కూడా ఉంది. గుంటూరు విరసం సభల్లోనే. చివరి రోజు సాయం త్రం బహిరంగ సభ. వేలాది జనం గాంధీ పార్కులో చేరిపోయారు. శ్రీశ్రీ, కొడవటిగంటి, రావిశాస్త్రిలను చూడాలనీ, వాళ్ల మాటలు వినాలనీ తహతహలాడుతున్నారు. ఏరి వీళ్లు? ఎంతకూ రారు- బీనాదేవిగారి (జడ్జి) బంగళాలో ఉన్నారని వార్తలు- ఇక్కడ నిర్వాహకుల టెన్షన్ పట్టించు కోకుండా వాళ్లక్కడ మందు సేవిస్తున్నారేమోననే సందేహంతో ఒళ్లు తెలియని కోపం వచ్చింది. చివరికి అందరూ వచ్చారు.
నా కోపం తగ్గింది. సభ చాలా బాగా జరిగింది. అపుడే నేను ‘పంచాది నిర్మల వారసురాలిని’ అనే కవిత చదివాను. అందరూ బాగుందని మెచ్చుకుం టుంటే ఆ వయసులో నిజంగానే బాగుందని విర్రవీగుతాం కదా- అందులో నా డ్రీమ్ పొయెట్ శ్రీశ్రీ తో కలిసి పని చేయటమే కాక ఆయన నా కవితను మెచ్చుకోవటం- భూమ్మీద నిల్చే సందర్భమేనా? విరసం నుంచి రాజీనామా చేశాక శ్రీశ్రీని సభలలో కలవటం ఆగిపోయింది. ఎమర్జెన్సీ- శ్రీశ్రీ మీద విమర్శలు- రాజీనామా వార్తలు యివి వింటుంటే- ఆయన ఛ్ఛ్ట్చీఛిజిఝ్ఛn్ట స్వభావం గుర్తొచ్చేది. ప్రపంచపు బాధ తన బాధ చేసుకున్న వాడికుండే ఛ్ఛ్ట్చీఛిజిఝ్ఛn్ట ఎలా ఉంటుందో శ్రీశ్రీని చూస్తే అర్థమవుతుంది. చాలాసార్లు తన కవితాలోకంలో తను ఆడుకుంటున్న చిన్న పిల్లవాడులా అనిపించేవాడు. అంతలోనే భూమి పట్టనంత మేధావితనం కనపరిచేవాడు.
తెనాలిలో హిందీ ప్రచార సబ ప్రాంగణంలో మొదటిసారి శ్రీశ్రీ ఊగరా- ఊగరా- ఉరికొయ్య అందుకుని ఊగరా- కవిత చదువుతుంటూ విని ఊగిపోయిన అదృష్టం నాది. ఎంతో మామూలుగా దగ్గిరగా మాట్లాడుతూనే ఒక ఎడాన్ని, గౌరవంతో కూడిన ఎడాన్ని మనలో కల్పిస్తాడు. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటే అలాగే అని తనూ లేచి వెళ్లిపోతాడు. చలం దగ్గర వారం రోజులుండి మరి మేం వెళ్తాం అంటే ‘అయ్యో! అప్పుడే వెళ్లిపోతారా? మళ్లీ ఎప్పుడొస్తారు?’ అని బెంగగా చూసేవాడు. కొడవటిగంటి కుటుంబరావు కోసం చందమామ ఆఫీసు కెళ్తే ఎన్ని కబుర్లో చెప్పి, వ్యంగ్య వైభవంతో చురకలు వేసి, ఆత్మీయంగా ఇంటికి ఆహ్వానించి తన మనవరాల్ని, వరూధిని గారిని, తను పెంచే మొక్కల్ని పరిచయం చేసి భోజనం చెయ్యమనేవారు.
కృష్ణశాస్త్రి మేం సాయంత్రం ఆరుగంటలకు వస్తామని ఫోన్ చేస్తే ఐదుగంటలనించే వాకిట్లో ఎదురు చూ స్తూ నిల్చునేవారు… శ్రీశ్రీ మాత్రం అతి మామూలుగా సాహిత్య విషయాలు మాట్లాడి తన మేధస్సుతో మహాకవి ముద్రను ప్రతిసారీ గాఢంగా వేసేవా డు. అనితర సాధ్యమైన తన కవితా మార్గం తప్ప ఆయనకింకేం పట్టదు. శ్రీశ్రీ- శ్రీశ్రీ-శ్రీశ్రీ అని మరింత గాఢంగా ప్రేమిస్తాం ఆయనను. మొన్న ఏప్రిల్ 30న విశాఖ బీచ్‌లో అర్థరాత్రి నేనూ, కుటుంబరావు, కృష్ణమూర్తి, శోభ మహా ప్రస్థానం చదువుకుంటూ మళ్లీ ఉత్సాహాలూ, నెత్తుటి కాల్వలమయ్యాం. ‘నోరెత్తి హోరెత్తు నొగులు సాగరము / కరి కళేబరములా కదలదు కొండ’ ఆ సముద్రంలా మహా ప్రస్థానం హోరెత్తుతూనే ఉంటుంది. ఆ కొండలా మన హృదయాల్లోంచి కదలదు- ఎంత కాలమైనా. పది పదుల పసిపాపడు శ్రీశ్రీ చిరకాలం జీవిస్తాడు మన నాల్కల మీద!
- ఓల్గా
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.