హక్కులు అందరికీ సమానమే!
జంతువులు, పక్షుల సంఖ్య వేగంగా తరిగి పోవడం తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాం. కొన్ని జంతుజాతులు విలుప్తమయ్యాయి. కొన్ని కాబోతున్నాయి. మనం క్రూర జంతువులుగా భావించే పులులు, సింహాలు వగైరా మాంసాహార జంతుజాతులు వృద్ధాప్యంలో వేటాడలేక నరమాంస భక్షణ చేస్తాయి.
వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన శాసనం పాతదైన ఫలితంగా కొత్తదాన్ని తెచ్చారు. ప్రజల జీవించే హక్కు విస్తృతార్థాన్ని సంతరించుకునేందుకు కారకురాలైన శ్రీమతి మేనకా గాంధీ ఆ తర్వాత వన్యప్రాణుల జీవించేహక్కు కోసం పోరాటానికి నడుం బిగించా రు. వీరప్పన్ వంటి వారు తలెత్తకుండా వన్యప్రాణుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టేలా శాసనాలు చేయాలని మేనకా గాంధీ, అమల నాగార్జున వంటి వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
వాటికి అవసరమైన సహజ అరణ్య ఆవరణాన్ని కల్పిస్తున్నారు. ఎక్కడైనా పట్టుకున్న వన్యప్రాణులను జాతీయ వన్యప్రాణి కేంద్రాలలో ఉంచి పోషిస్తున్నారు. గిరిజనులను ఇతర గ్రామీణులను సైతం అడవుల నుంచి బయటికి పంపి మరీ రక్షిత ప్రాంతాలను జంతువుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు కూడా తమ హక్కులను పూర్తిగా అనుభవించే వీలు కల్పిస్తున్నారు. టెర్రరిస్టులను చంపినట్టుగా వన్య ప్రాణులను వేటాడి కాల్చిచంపడానికి వీల్లేదు. జంతుహక్కుల కార్యకర్తలను కూడా కాల్చి చంపడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను పెట్టినట్టుగా జైల్లో పెట్టడం లేదు. జంతు వాస్తవం ఇలా వుంటే, కొత్త ఢిల్లీలోని ‘ఇండియన్ లా ఇనిస్టిట్యూట్’లో ఇటీవల జరిగిన ఒక సెమినార్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ టెర్రరిస్టులకు మానవహక్కులు అనవసరమని ప్రకటించారు.
వారికి జంతుహక్కులు చాలన్నారు. హేతుబద్ధంగా సరైన విధంగా ఆలోచించగలిగే వారెవరైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోట వెలువడిన ఇలాంటి వ్యాఖ్యలు చేయజాలరు. తను చాలా తెలివిగా మాట్లాడానని ఆయన అనుకుంటే అది పొరపాటు. లేదా నిందార్థంలో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించానని ఆయన చెప్తే అవి ఏ మానవ గౌరవాన్నైతే న్యాయమూర్తిగా ఆయన కాపాడాలో దాన్ని ధిక్కరించినట్లవుతుంది. జంతువులను బాగా చూస్తున్నారనీ, వాటిని చంపేందుకు సైతం పలు చట్ట పరమైన అడ్డంకులు ఉన్నాయనీ, జంతు హక్కులు అనుమతించవని ఆయనకు గుర్తున్నట్టు లేదు. ప్రభుత్వాలను మార్చే ఓటును ప్రాథమిక హక్కుగా కలిగివున్న పౌరులను టెర్రరిస్టు, నక్సలైట్, మావోయిస్టు అని ముద్ర వేసి చంపుతున్నారు.
ఈ మానవ జంతుశాలలో ముస్లిం అయినందువల్ల, సిక్కు లేదా క్రైస్తవుడైనందువల్ల హింసకు గురవుచున్నారు. చంపబడుతున్నారు. న్యాయం అందించే సంస్థలు న్యాయపరంగా, సాంస్కృతికంగా ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటించాలని రాజ్యాంగం కోరుకుంటుంది. న్యాయపీఠాలపై కూర్చున్న వారు ఏ వ్యాఖ్యలు చేసినా, ఏ అభిప్రాయాలు వ్యక్తపరిచినా వాటిని న్యాయమూర్తుల అభిప్రాయాలుగానే ప్రజలు భావిస్తారు. వ్యక్తిగతమని భావించరు. ప్రజల పరంగా చూస్తే న్యాయమూర్తుల్లో ప్రతి ఒక్కరూ న్యాయసంస్థ ప్రతినిధులే. వారి మంచి/ చెడు ప్రవర్తనను సంస్థ నడవడికగా భావిస్తారు. జస్టిస్ పసాయత్ వ్యాఖ్యలు చూశాక నేను తక్షణం స్పందించాను. న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగమని కోరుతూ ఆయనకు లేఖ రాశాను. న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకొనరు. వారిని ఎవరూ ఎంపిక చేయరు. వారు న్యాయపీఠాలకు నామినేట్ చేయబడతారు.
ఎలాంటి భయానికీ, పక్షపాతానికీ తావు లేకుండా కేసులలో న్యాయనిర్ణయం చేసేందుకు తగిన స్థైర్యం కల్పించేందుకు న్యాయమూర్తులను కొలువునుంచి తొలగించే వీలులేని విధమైన శాసన రక్షణలు ఉన్నాయి. ఈ వాస్తవాన్ని వారు సదా గుర్తుంచుకుంటే అప్రతిహతమైన కులీన వర్గంగా తయారు కాకుండా వుంటారు. కార్యనిర్వాహక వర్గం నిరంకుశంగా మారకుండా వుండేందుకై న్యాయవ్యవస్థ నెలకొల్పబడింది. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని మీరి ప్రవర్తించే అధికారం న్యాయమూర్తులకు లేనేలేదు. ఈ అవగాహన న్యాయస్థానంలోనూ బయటా వారి ప్రవర్తనను నిర్దేశించేదిగా వుండాలి. రాజ్యాంగ లక్ష్యాలు, విలువల గురించిన అవగాహనకు అనుగుణంగా పనిచేసే విధంగా న్యాయమూర్తులు స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. నేరస్తులు సమాజం నుంచి దాని నిర్మాణం, దాని ఆచరణ నుంచి తయారవుతున్నారు. అసమాన సమాజంలో దుష్పరిపాలనకు స్పందనగా టెర్రరిస్టులు ఉద్భవిస్తుంటారు.
సిక్కులను సాంస్కృతికంగా నాశనం చేసి తర్వాత సిక్కు జాతి హననానికి తయారయ్యాం. స్పందనగా సిక్కు టెర్రరిజం పుట్టుకొచ్చింది. తర్వాత ముస్లింలను అదేవిధంగా చేయగా మనం ఇస్లామిక్ టెర్రరిజంగా పేరుపెట్టుకున్నది పుట్టుకొచ్చింది. పార్సీలు, యూదులు మన దేశానికి అతిథులనీ; క్రైస్తవులు, ముస్లింలు దురాక్రమణదారులనీ, కాబట్టి వారు ఇచ్చినదానితో తృప్తి చెందాలనీ, అంతకుమించి కావాలని కోరుకోరాదనే సిద్ధాంతం వుంది. అంటే ఆధునిక సమాజాలకు కూడా తమవైన బానిసలు కావాల్సివుంటుందని అర్థం చేసుకోవాలి.
రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానస్థాయి కల్పించకపోతే ప్రతి మైనారిటీ వర్గం కూడా తనదైన టెర్రరిస్టును తయారుచేస్తుంది. టెర్రరిజాన్ని నిలువరించేందుకు చట్టబద్ధ పాలనను హరించే చట్టాలను తెస్తున్నారు. అవేవీ ఇప్పటివరకు తమ లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. అమాయకులను నిర్బంధించి శిక్షింపజేసే ఆ చట్టాలు రాజకీయ అసమ్మతిని నిర్మూలించడంలో విఫలమయ్యాయి. చరిత్ర చెప్పిన ఈ పాఠాలను పసాయత్ లాంటి న్యాయమూర్తులు తప్పక చదువు కోవాలి.
-కె.జి.కణ్ణబీరన్
(వ్యాసకర్త పియుసిఎల్ జాతీయ అధ్యక్షులు)
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 30 ఏఫ్రిలు 2009
వ్యాసం చాలా బాగుంది
చాలా బాగుంది