ప్రజా భాగస్వామ్యమే సామాజిక న్యాయం
-ప్రొ. జి.హరగోపాల్
సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి; రెండు, సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు, ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు.
అందుకే ప్రపంచీకరణకు దాని వెనక ఉన్న సామ్రాజ్యవాద శక్తులకు దానికి మన దేశంలో వత్తాసు పలుకుతున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని కూడగట్టగలగాలి.
ఈఎన్నికలలో ప్రజల సంక్షేమంపై ఒక పార్టీకి మించి మరొక పార్టీ మాట్లాడాయి. నయా ఉదారవాద ప్రభావంలో అంతకు ముందు ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోని పార్టీలు కూడ ఈ భావజాలాన్నుంచి తప్పించుకోలేకపోయాయి. నయా ఉదారవాదాన్ని, ఆ అభివృద్ధి నమూనాని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు, అస్తిత్వ ఆధారిత పార్టీలు, పేదల పక్షం అని చెప్పుకునే పార్టీలు- దానిని అతి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు పాత్రను నిర్వహించాయి. గత ఎన్నికల్లో ఆ నమూనా గురించి ఎక్కువ మాట్లాడిన వారిని ప్రజలు చిత్తుగా ఓడించారు. అయితే గెలిచిన, ఓడిపోయిన పార్టీలకు మధ్య గుణాత్మక సైద్ధాంతిక తేడా లేకపోవడం వల్ల గెలిచినవాళ్లు అదే దారిన పరిగెడుతుంటే ప్రజలకు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సందర్భాల్లో నూతన ప్రతిపాదనతో కొత్త పార్టీలు పుట్టడం సహజం. అలా పుట్టిన పార్టే ప్రజారాజ్యం.
ఈ పార్టీ నిర్దిష్ట సంక్షేమ కార్యక్రమాల గురించి ఎక్కువగా మాట్లాడక సామాజిక మార్పు, సామాజిక న్యాయం అనే నినాదాలను ముందుకు తీసుకొచ్చింది. ఆ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చిన అన్ని అంశాల్లో భూ పంపిణీ చాలా కీలకమైన అంశం. ఏ కారణం వల్లో పార్టీ ఆ కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రచారం చేయలేదు. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేది. దేశంలోని ప్రధాన పార్టీల మేనిఫెస్టోల్లో సామాజిక న్యాయపరంగా ఐదు అంశాలను ప్రస్తావించారు: ఒకటి; పేద విద్యార్థులకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, రెండు; ఉద్యోగాలలో రిజర్వేషన్ల నిష్పత్తిని పెంచడం, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను కల్పించడం; మూడు; బడుగు వర్గాలకు మరింత ఆర్థిక సహాయం; నాలుగు; అవ్యవస్థీకృత శ్రామికుల సంక్షేమం కోసం కృషి; ఐదు; అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం. ఇవన్నీ సామాజిక న్యాయ భావనలో కీలకమైన అంశాలే కాని ఇవి సామాజిక మార్పుకు దారి తీస్తాయా? ఈ అన్ని అంశాల్లో రాజ్యం పాత్ర ప్రధానం.
రాజ్యవ్యవస్థ సామాజిక వ్యవస్థను మార్చగలదా అన్నది కీలకమైన సవా లు. గత రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా నయా ఉదారవాదం బలపడుతున్న కొద్దీ రాజ్యపు పాత్రను కుదించాలని, సామాజిక సమస్యలకు పరిష్కారం మార్కెట్ ద్వారా సమకూరుతుందన్న వాదన బలంగా ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు 1997లో ప్రచురించిన ఒక నివేదికలో ‘స్వల్పాతి స్వల్ప రాజ్య వ్యవస్థ’ను ప్రతిపాదించింది. అయితే గత ఎన్నికల్లో ఈ ధోరణులకు స్వస్తి చెప్పేలా ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఫలితంగానే ఈ ఎన్నికలలో సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయం రాజకీయ ఆలోచనలో పునః ప్రవేశించాయి. సంక్షేమమన్నది రిజర్వేషన్ల ద్వారా, విద్యా అవకాశాల ద్వారా అర్థిక సహాయం ద్వారా కొంత వరకు సాధ్యమే కాని సామాజిక మార్పుకు దోహదపడుతుందా అన్నది మౌలికమై న ప్రశ్న. రాజ్యాంగ పీఠికలోనే కాక ఆదేశిక సూత్రాలలో సంక్షేమ భావన చాలా లోతుగానే ఉంది.
ముఖ్యంగా ఆర్టికల్ 37,38 చాలా మౌలికమైన మార్పును ఆశిస్తున్నది. ఈ రెండు ఆర్టికల్స్ ఆర్థిక అసమానతలను తగ్గించాలనే లక్ష్య సాధనకు రాజ్యం దోహదపడాలని ప్రతిపాదించింది. ఈ స్ఫూర్తిని ఏ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రస్తావించ లేదు. అంబేద్కర్ ఈ లక్ష్య సాధన రాజ్యం ద్వారా సాధ్యమని భావించారు. రిజర్వేషన్ల ద్వారా, ఎన్నికల ద్వారా రాజ్యాధికారం ప్రజాస్వామీకరించబడుతుందని, ఆధిపత్య కులా ల, వర్గాల అధికారం క్రమేణ తగ్గుతూ, అధికారం ప్రజల పరమౌతుందని ఈ మార్పు సామాజిక పరిణామానికి, ఆర్థిక సమానత్వానికి దారి తీస్తుందని ఆయన భావించారు. కాని రాజ్యాంగం అమలులోకి వస్తూనే పరిస్థితి మారింది. రాజ్యం ద్వారా చట్టసభల ద్వారా మార్పును ఆశించిన వారు నిరాశ చెందడం వల్ల పార్లమెంటరీ వ్యవస్థను బయట ప్రజలు తమ సమస్యలకు తామే పరిష్కారాలను వెతుక్కునే క్రమంలో ప్రజా ఉద్యమాలు పుట్టాయి.
స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల తర్వాత భిన్నమైన ఉద్యమాలు సామాజిక మార్పు, న్యాయం కోసం ఉద్యమించడం మొదలైంది. రాజ్యం కొన్ని ఉద్యమాలకు స్పందించి కొన్ని కొత్త చట్టాలను తీసుకువచ్చింది. నిజానికి సామాజిక న్యాయం దిశలో చాలా చట్టాలే వచ్చా యి, కొన్ని మంచి చట్టాలు కూడా వచ్చాయి. కాని అదే క్రమంలో అణచివేత చట్టాలు కూడా వచ్చాయి. మంచి చట్టా లు వచ్చినప్పుడు ప్రజల హక్కులు వికసించాలి. అలా హక్కులు పెరిగితేనే చట్టాల అమలు సాధ్యమవుతుంది. కాని దానికి భిన్నంగా చట్టాల ప్రమాణాలు పెరిగిన కొద్దీ ప్రజల స్వేచ్ఛ కుంచించబడింది.
గత మూడు దశాబ్దాలలో కనీసం 30 చట్టాలైనా రాజ్యానికి ఉద్యమాల అణిచివేత అధికారాల ను ఇచ్చాయి. ఈ మొత్తం పరిణామక్రమాన్ని పరిశీలించిన ఎవరైనా ఈ వైరుధ్యాన్ని చూడవచ్చు. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలంటే సామాజిక న్యాయాన్ని అందిస్తామన్న ఏ రాజకీయ పార్టీ ఐనా ఒకవైపు మార్పుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవేశపెడుతూ అణచివేత చట్టాలను రద్దుచేయాలి. అలా చేస్తేనే సామాజిక న్యాయాన్ని సాధించడంలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది, మార్పుకు అడ్డుపుడుతున్న వారి ఆట కొంతవరకు కట్టడి అవుతుంది.
ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాన్ని మట్టుకోలేదు. అంతేకాక ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న అభివృద్ధి నమూనాని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రస్తావించలేదు. గత దశాబ్దాన్నర కాలం అమలులో ఉన్న ప్రపంచ బ్యాంకు ప్రేరేపిత అభివృద్ధి నమూనా ప్రజలకు చేసిన హాని ని అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవైపు ప్రపంచంలోని అతి సంపన్నులైన పై పది మందిలో మనదేశం నుంచి నలుగురున్నారు. ఒక దశలో ప్రపంచంలో అతి సంపన్నమైన మనిషి భారతీయుడే ఉన్నారు. అయితే మానవ అభివృద్ధి సూచికలో చాలా వెనకబడిన దేశాల్లో మన దేశం ఉంది. వృద్ధి రేటు తొమ్మిది శాతం అని పాలకులు పదేపదే ప్రచారం చేస్తున్నప్పుడు వేలాది మంది రైతు లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒక రంగంలో వృద్ధిని సాధించడానికి మరొక రంగం ఎంత విధ్వంసానికి గురవుతుందో గమనించవచ్చు. అభివృద్ధి రేటు ఎంత ఉన్నాదన్నది ప్రధానం కాదు.
కోట్లాది ప్రజలు అధారపడ్డ వ్యవసాయ రంగం పరిస్థితి ఎందుకు అంత దయనీయంగా ఉందో విశ్లేషించాలి. దేశంలో 20 పారిశ్రామిక లేదా సంపన్నమైన కుటుంబాలు జాతి స్థూల ఆదాయంలో 20 నుంచి 22 శాతం సంపదమీద ఆధిపత్యం పొందితే, అరవై కోట్లమంది 18 శాతం సంపదమీద ఆధారపడి బతుకు సాగించవలసి వస్తున్నది. దేశ సంపద ఇంత అస్తవ్యస్థంగా ఉంటే ఈ అభివృద్ధి దిశను మారుస్తామని ఏ పార్టీకూడా అనడం లేదు. అభివృద్ధి నమూనా దిశను మార్చే రాజకీయ శక్తి మన దేశంలోని రాజకీయ పార్టీలకు కాని, రాజకీయ వ్యవస్థకు కాని ఉన్నదా అన్నది మరొక ప్రశ్న. బాలనాగమ్మ కథలో మాయల మరాఠి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు మన అభివృద్ధి దిశ నిర్దేశం ఎక్కడో సుదూర ప్రాంతంలోని వాషింగ్టన్‌లో ఉన్నది. ప్రపంచ ఆర్థిక శక్తుల కనుసన్నలలో మన రాజకీయాలు నడుస్తున్నవి. ఆ అంతర్జాతీయ శక్తులను ఎదిరించి మాట్లాడడానికి వీళ్ళెవరూ సాహసించడం లేదు.
అలా ఎదిరిస్తే అప్పులు దొరకవని భయం. అప్పులు దొరకకపోతే దేశంలోని సంపన్నుల సంపద నుంచి రాజ్యం తన అస్తిత్వా న్ని కాపాడుకోవడానికి పెద్దవాటా తీసుకోవలసి ఉంటుంది. అతి సంపన్నుల సంపద నుంచి పేదవాళ్ల వాటా తీసుకోవడానికి ఈ పార్టీలు పేదవాళ్లను ప్రేమించాలి. సంపన్నులను కట్టడిచేయగలగాలి. అది సాధ్యం కాకుండా ఎన్నికల ప్రక్రి యే ధనమయమైపోయింది. ఏ ప్రజాప్రతినిధి కూడా రెండు మూడు కోట్లు ఖర్చుపెట్టకుండా గెలవని స్థాయికి ఎన్నికల తంతు దిగజారింది. ఈ కోట్లాది రూపాయలు ఎవరు పెడుతున్నారో వాళ్ళే రాజకీయ అధికారాన్ని శాసిస్తున్నారు.
అందుకే ఈ ఐదేళ్ల కొకసారి జరిగే ఎన్నికల పండగలో ప్రజలు ప్రేక్షకులు మాత్రమే. సూటిగా చెప్పాలంటే సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి. రెండు; సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు; ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు. అందుకే ప్రపంచీకరణకు దాని వెనక ఉన్న సామ్రాజ్యవాద శక్తులకు దానికి మన దేశంలో వత్తాసు పలుకుతున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకా న్ని కూడగట్టగలగాలి. ఇంత విశాలమైన భావన స్ఫూర్తి లేకుండా సామాజిక న్యాయాన్ని గురించి జరుగుతున్న చర్చకు అర్థం లేదు.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 30 ఏఫ్రిలు 2009