పాటను వేటాడిన పాలకులు
ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కాగల ప్రజల పాటలపై ఎన్నో కుట్రలు జరిగాయి. కళాకారులను విడదీయడం, వాళ్ళ అర్థిక పరిస్థితులను వాడుకోవడం, ప్రజల పాట-మాట-ఆట, యాస, జాస, డప్పు, దరువు, వాళ్ళ వేషం అన్నింటిని దొంగిలించారు. గద్దర్ పాటను అరెస్టు చేసే మహాకుట్ర జరిగింది. ఎన్నికల కోడ్ అనే బూచిని చూపి భావ ప్రకటన స్వేచ్ఛకు ఘోరీ కట్టడానికి ఐదేండ్లుగా కుట్ర కేసులను దాచిపెట్టి తుపాకులు, బేడీలతో గద్దర్ ఇంటిని చుట్టుముట్టారు.
అజ్ఞాతంలోని పాటను జనంలోకి రమ్మండు
కేసులు ఎత్తి వేస్తనండు
కోరస్ పాడుతానండు
నోరు తెరిస్తే చంపేస్తనండు
ముఖ్యమంత్రి గౌ ॥ శ్రీ ॥ చెన్నారెడ్డి గారు
పార్టీ పాట బ్యాన్
నోరుకట్టేసుకుని బ్రతుకు
రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ కేసులో పెట్టి
బ్లాస్టింగ్ చేసేస్తనన్నాడు
ముఖ్యమంత్రి గౌ॥ నేదురుమల్లి జనార్థన రెడ్డి గారు
నీవు మా కళాకారుడవు
మా కళాకారుల జాతినీ
బ్యాన్‌గీన్ ఎత్తేసినాను
నీ పాట, ఆట, మాట మాత్రం
నా సీటుకు ఎసరు పెడ్తే
ఖబడ్దార్, ఖబడ్దార్ అండు
ముఖ్యమంత్రి గౌ ॥ ఎన్ టి రామారావు గారు
నారి హైటెక్కు పాలన
ఐ డోంట్ స్పేర్ ఎనీ బడీ
నన్ను నిలదీసే పాటనే
నా మొదటి టార్గెట్
గద్దర్‌కు ఆరు తుపాకి గుండ్లు బహుమతి అన్నాడు
ముఖ్యమంత్రి గౌ ॥ చంద్రబాబు గారు
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి 2009 తెలంగాణ ఉద్యమం వరకు నా నలభై ఏండ్ల పాట సంబంధం మీ ముందు ఉంచుతున్నాను. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్ళాను. ఎన్నో పాటలు పాడాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎన్నికలలో నీరుగారిపోయింది. నా పాట మాత్రం పదునెక్కింది. మరోమలుపు తిరిగి ప్రజల విప్లవ పాటగా ప్రజల వద్దకు చేరుకుంది. అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఎమర్జెన్సీలో ఎన్నో చిత్ర హింసలను ఎదుర్కొంది. నక్సలైట్లు దేశ భక్తులని ఎన్‌టిఆర్ రాజకీయ ప్రవేశంతో కొంత వెసులు బాటు కనిపించినా, అధికారంరాగానే ‘మాట -పాట- ఆట’ బంద్ అనే నిర్బంధం మొదలయ్యింది.తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రజానీకం ఎన్నో పోరాటాలు చేసి ఎన్‌టిఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టింది.
జనరల్ ఎన్నికలు రానే వచ్చినయ్. చెన్నారెడ్డి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని నక్సలైట్లపై నిర్బంధం సడలిస్తానన్నాడు. స్వేచ్ఛ గా సభలు జరుపుకోవచ్చనీ, గద్దర్ బహిరంగంగా పాడుకోవచ్చనీ ఎన్నికల ప్రచారం చేశాడు. ఎన్‌టిఆర్ ఓడిపోయిండు. చెన్నారెడ్డి గెలిచిండు. చెన్నారెడ్డి గారి ఆహ్వానం మేరకు 1990 ఫిబ్రవరి 19న, ఆరు ఏండ్ల అజ్ఞాత జీవితంలో నుండి జనం పాటనై జనం ముందు నిలిచాను. నిజాం కాలేజి గ్రౌండ్ లో లక్షలాది ప్రజలు నా పాటకు పల్లవి పాడి ముద్దు పెట్టుకున్నారు. ముమ్ముగన్న తల్లులారా- తెలుగుతల్లి పల్లెలారా మీ పాటనై వస్తున్నానమ్మో- మీ పాదాలకు వందనాలమ్మో’ అని ప్రజల ముందు వాలిపోయాను. నిజాం కాలేజిగ్రౌండ్‌ల లక్షలాది ప్రజలతో పులకించి ప్రజల పాటకు వంత పాడి, ముద్దు పెట్టుకున్నాను. చెన్నారెడ్డి ఏ ఒక్క కేసు ఎత్తి వేయలేదు. లక్షలాది ప్రజల ఓరుగల్లు మీటింగు చూసి ఖంగు తిని నిర్బంధం విధించాడు.
పాటకు కష్టాలు మొదలయ్యాయి. నేదురుమల్లి జనార్థనరెడ్డి అధికారానికి రాగానే బూటకపు కేసులు పెట్టి గద్దర్‌ను హింసల పాలు చేశాడు. ఈ కాలం అంత ప్రజలే పాటను బతికించుకున్నారు. తిరిగి ఎన్నికలు వచ్చినాయి. ఎన్‌టిఆర్ అధికారానికి రావడానికి- గద్దర్ కళాకారుడు, బ్యాన్ ఎత్తి వేస్తాం అన్నాడు. అధికారానికి రాగానే భూపోరాటాలు బంద్ అన్నాడు. ప్రజలే పాటను బతికించుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మొదటి టార్గెట్ గద్దర్ పాటనే అయ్యింది. గ్రీన్ టైగర్స్ రూపంలోని గ్రేహౌండ్స్ పోలీసులు 1997 ఏప్రి ల్ 6న ఆరు తుపాకీ గుండ్లు పాట గుండెలో పేల్చారు. కోట్లాది ప్రజలు తిరగబడి గద్దర్ పాటను బతికించుకున్నారు. ఒక తుపాకీ గుండు వెన్నుపూసలో సాక్షిగా మిగిలే ఉంది. ఉత్తుత్తి విచారణ జరిపి- ‘ఆరు తుపాకి గుండ్లు పేల్చింది నిజమే. హత్యాయత్నం జరిగింది నిజమే. కాని, నేరస్తులు గుర్తించబడలేదు’ మాటలతో ముగించేశారు.
గాయపడ్డ పాట, వెన్నుపూసలో తూటాతో పల్లె పల్లెకు పయనం అయ్యింది. ఏరు, వాగు, అడవి, సముద్రాలను దాటిపోయింది.
‘మీ పాటనై వస్తున్నానమ్మో
మీ పాదాలకు వందనాలమ్మో’ అంది.
ప్రజల పాట తిరుగులేని శక్తి అయ్యింది. ఇది గమనించిన చంద్రబాబు ప్రజల పాటను శాంతి చర్చల ప్రతినిధిగా ఆహ్వానించింది. అవి బూటకపు శాంతి చర్చలని ప్రజల పాటై బహిర్గతం చేశాను. అలిపిరి ఘటనతో గద్దర్ పాట గుండెపై తిరిగి తూటాలను లోడ్ చేశారు. రకరకాల టైగర్స్ ఇంటిని చుట్టు ముట్టారు. పాట ఆగిపోలేదు. తన ప్రాణంలాంటి చిన్న కుమారుడు ‘చంద్ర’ అకస్మాత్తుగా చనిపోయి నా దుఃఖరసం పాటను వీరరసం పాటగా మార్చి పాలకులను ప్రశ్నించే పాటగా రాష్ట్రం-దేశం మొత్తంగా కోట్లాది ప్రజల వద్దకు ప్రజల పాటను తీసుకు వెళ్ళినాను. తిరిగి ఎన్నికలురానే వచ్చినాయి.
అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ పాలకులు శాంతిచర్చల జపం మొదలెట్టారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న గౌ॥ రాజశేఖరరెడ్డిగారు గద్దర్ రక్షణకై ఈ ఉత్తరం రాశారు. (అందులోని చివరి పేరా ‘Mr Gaddar is fighting against suppression and making awareness among the public more perticularly the working class. As he was brought to the main stream with a categorical assurance by the government, the government could have taken all steps for providing adequate security cover to him. In the wake of recent developments viz.. attempt on his life and subsequent developments of threatening etc. by the socalled ‘Green Tigers’ the request of Mr Gaddar and his family members for a security cover needs immediate consideration. Any unpleasant action against Mr Gaddar government will be held responsible and may have to pay a heavy penalty. I shall be happy if you could look into the matter and take appropriate action at the earliest. ‘ కాంగ్రెస్ గెలిచింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. శాంతి చర్చలు అంది, పార్టీ, ప్రజా సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేస్తనంది.
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే 09-09-2004 నాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి, ‘ఎవ్వరీ గ్రీన్ టైగర్స్’ అనే పుస్తకాన్ని అందచే సి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా మీరు రాసిన ఉత్తరాన్ని ఆచరణలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రెండవ విడత శాంతి చర్చలకు ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు.
ఈ శాంతి చర్చలు విజయవంతం చేయడానికి ప్రాణాలకు తెగించి, ఇరువురికి ఉత్తరాలను చేరవేసి చర్చల ప్రారంభానికి నా పాత్ర నేను నిర్వహించాను. ప్రభుత్వం కుట్ర బుద్ధి వల్ల ‘శాంతి చర్చలు’ ఫెయిల్ అయినాయి. చరిత్రలో చావు చర్చలుగా మిగిలిపోయినాయి. కని, విని ఎరగని నిర్బంధం మొదలయ్యింది. గద్దర్‌ను చంపడానికి టైగర్ గుంపు లు బయలెల్లాయి. రాజ్యం, దొరలు, గూండాలు గద్దర్ ఇంటిని చుట్టుముట్టి చంపడానికి పోటీపడ్డారు. ఈ విష వలయాన్ని, కాంగ్రెస్ కుట్రను, కోట్లాది ప్రజలు తిప్పి కొట్టారు. ప్రజల పాటను బతికించుకున్నారు. బూటకపు కేసుల తో, తుపాకులతో, బేడీలతో పోలీసులు నీడలా వెంటాడడం మొదలుపెట్టారు. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. ఎన్‌కౌంటర్ చేస్తాం అని ఒపెన్‌గా డిక్లేర్ చేసినారు. కాని ప్రజల నిరసన పోరాట పటిమను చూసి తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. గుంట నక్కలా, సమయం కోసం వేచి చూశారు. తుపాకులు లోడ్ చేసి పెట్టుకున్నారు.
ఈ తీవ్ర నిర్బంధంలో గద్దర్ పాట వేలాది కళాకారులతో కలసిపో యి, లక్షలాది ప్రజల పాట అయింది. ప్రజలు పాలుగొనే ప్రతి ఉద్యమం లో వాళ్ల ఉద్యమాల పాట అయ్యింది. ‘ఉద్యమాల ద్వారానే ప్రత్యేక తెలంగాణ’ అనే నినాదంతో గద్దర్ పాట పల్లె పల్లె కెల్లింది.
‘మా భూములు మాకే- మా నీళ్ళు మాకే
మా గనులు మాకే- మా వనరులు మాకే
అందుకే- మా తెలంగాణ మాకే’ అనే నినాదం పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది. పాట వేలాది మైళ్లు పాదయాత్ర చేసింది. లక్షలాది ప్రజలను భాగస్వాములను చేసింది. ఒక లక్ష 76 వేల కిలో మీటర్లు పల్లె పల్లె చుట్టి వొచ్చింది. తిరిగి తిరిగి వొస్తానంది. ప్రజల పాటలు ఓట్ల పార్టీలకు ఓడిపోతాయేమో అనే గుబులు, భయం పుట్టించినాయి. పాటలు రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదగసాగాయి. వేలాది ప్రజా కళాకారులు ప్రజల నోటి పాటలైనారు. కళాకారులు ‘ఒకే గొంతు-ఒకే అడుగు- ఒకే నినాదం’గా తెలంగాణ సాంస్కృతిక సంఘంగా సంఘటిత పడినారు. ఈ సంఘంకు గౌరవ అధ్యక్షులుగా గద్దర్‌ను ఎన్నుకొన్నారు. ప్రజా కళాకారులు సంఘటిత పడగానే పాలకులు కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఎన్నుకొని గద్దర్‌ను చంపడానికి, జిల్లా టైగర్స్, రెడ్ టైగర్స్ పేర వివిధ ఓజీజూజూజీnజ జ్చnజను రంగంలోకి దింపారు. కోట్ల రూపాయలకు ఒక షార్ప్ షూటర్‌ను కుదుర్చుకొన్నారు. ప్రజలు ఏకమై పాలకుల కుట్రను తిప్పికొట్టారు. తిరిగి నేటి ఎన్నికలు రానే వచ్చినయి.
ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కాగల ప్రజల పాటలపై ఎన్నో కుట్రలు జరిగాయి. కళాకారులను విడదీయడం, వాళ్ళ అర్థిక పరిస్థితులను వాడుకోవడం, ప్రజల పాట-మాట-ఆట, యాస, జాస, డప్పు, దరువు, వాళ్ళ వేషం అన్నింటిని దొంగిలించారు. గద్దర్ పాటను అరెస్టు చేసే మహాకుట్ర జరిగింది. ఎన్నికల కోడ్ అనే బూచిని చూపి భావ ప్రకటన స్వేచ్ఛకు ఘోరీ కట్టడానికి ఐదేండ్లుగా కుట్ర కేసులను దాచిపెట్టి తుపాకులు, బేడీలతో తిరిగి 08-04- 2009 ఉదయం గద్దర్ ఇంటిని చుట్టుముట్టారు.
‘పాటను అరెస్టు చేయలేవు- పాటను జైల్లో పెట్టలేవు
పాటను కాల్చి వేయలేవు-ప్రజల పాటదే విజయం అన్నారు’
ప్రజలు, విద్యార్థులు, దళిత, గిరిజన సంఘాలు తెగించి పోలీసుల విషవలయాన్ని ఛేదించి గద్దర్‌ను విడిపించి ప్రజల పాటను, ప్రజల గుండెల్లో దాచుకొన్నారు.
నా ప్రియమైన ప్రజలారా! చంద్రబాబు ఆరు తుపాకి గుండ్లు దించితే, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బూటకపు కేసులతో బతుకుంత జైలుపాలు చేయడానికి కేసులు పన్నాడు.
బతికినన్నాండ్లు నేను మాత్రం ప్రజల పాటనై బతుకుతాను-పాలకులను ప్రశ్నించే పాటనై బతుకుతాను. ప్రజలే నన్ను బతికించుకోవాలని ప్రాధేయపడుతున్నాను.
‘మీ పాటనై వస్తున్నాను- మీ పాదాలకు వందనాలు’
-వందనాలతో మీ గద్దర్
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 26 ఏఫ్రిలు 2009