ఓటమెవరిది?
ఏం చేయగలరు వీళ్లు.. వెంటనే రెండువేల నగదు, వంద వంటసరుకు, ఇంటికి కలర్ టీవీ, పెన్షన్లు వచ్చేస్తాయనుకున్నా మీ అంత అమాయకులుండబోరు. అధవా వచ్చినా.. జలయజ్ఞంలో ధనయజ్ఞం ఆగేనా? భూముల అమ్మకం ఆగేనా? విద్య అందేనా? వైద్యం అందేనా? మీ కాళ్ల కింద నేల కదలకుండా నిలిచేనా?
ఓట్ల జాతర ముగిసింది. దసరా, దీపావళి, సంక్రాంతి పొరపాటున ఒకేరోజు వస్తే ఎట్లా ఉంటుందో? అట్లాంటి జాతర. కొన్ని వాగ్దానాలు కొన్ని హామీలు, కొన్ని కొత్త మోసాలు, కొన్ని కొత్త ఎత్తులు, సరికొత్త జిత్తులు. ఓటరు కోసం పన్నిన వలలు. వలయాలు. పైసల గలగల.. కులం జిల జిల. మందు పోసిన మాయామోహం. రానివీ, పోనివీ, ఊహించినవీ. ఇదే నిజమని నమ్మి తన్నుకున్న వాళ్లు. కొట్టుకున్న వాళ్లు. ఓటు భక్తితో ఉప్పొంగిన వాళ్లు. నీరుగారిన వాళ్లు. ఎవరికోసమో క్షతగాత్రులయినవారు. ఎవరి కోఎసమో తన్నులు తిన్నవాళ్లు. భంగపడినవాళ్లు. బాగుపడినవాళ్లు. అయిదేళ్లకొకసారి ఇనుమడించిన, ఉద్రేక, ఉత్సాహాలతో ఓ’టింగురంగా’ అంటూ వచ్చే ఒక రంగురంగుల జాతర ముగిసింది.
బహుశా అలసిపోయి ఉంటారంతా. మైకులు, హోరు, కొత్తగా వచ్చిన వీధి ప్రదర్శనలు, ఈలలు, కేకలు, జిందాబాద్‌లు, హీరోలు, అభిమానాలు, డైలాగులు, నడివీధిలో తొడలు కొట్టుకోవడాలు, మీసం మెలిపెట్టడాలు, పచ్చి అబద్ధాలు, ఒకరి కోసం మరొకరు నటించడాలు, నవ్వడాలు, ఏడ్వడాలు, ఉక్రోశాలు, ఆక్రోశాలు మొత్తానికి ఒక నాటకం రక్తికట్టింది. పత్రికల నిండా జాలువారిన సర్వ ప్రపంచ విధానాలు, ప్రణాళికలు, టీవీ తెరల మీదుగా దుంకి ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ఇన్‌స్టంట్ రాజకీయ విశ్లేషణల అమృతధారలకు ఇక సెలవు. ఎవరికి వేస్తావు నీ ఓటు? ఓటెయ్యకపోతే చచ్చినట్టే. ఎచటికి వెళతావీ రాత్రి..అయోమయ కీకారణ్యంలో కి? ఎవరు దొంగ? ఎవరు దొర? ఎవరు కామ్రేడ్? ఎవరు తెలంగాణ వ్యాధి. ఎవరు పేద ప్రజలను అక్కున చేర్చుకునేవారు? ఎవరు సామాజిక న్యాయాన్ని సుళువుగా మీ చేతుల్లో పెట్టేవారు. ఎవరు వంట సరుకిస్తారు.
ఎవరు నగదు బదిలీ చేస్తారు? ఎవరు కలర్‌టీవీ ఇస్తారు? ఇదంతా గతం. అయినా నగదు బదిలీలు, కలర్‌టీవీలు, సామాజిక న్యాయాలు, వృద్ధాప్య పించన్లు, జలయజ్ఞాలు, తెలంగాణలు ఓట్ల పంట పండించినాక, కొసరు విషయాలెందుకు… మురుగు కాల్వల్లో దుర్గంధం ప్రవహించినట్టుగా… అన్నేసి కోట్ల ప్రవాహమెందుకు? అన్నేసి మద్యం కాల్వలు కట్టించడమెందుకు? ఇక్కడ ఆ కులం, అక్క డ మరోకులం, ‘మనాళ్లు’ ఎక్కడుంటే గెలుపు అక్కడ అనే కొసరు పనులెందుకు. అందుకే ఓటరులారా! ఎన్నికలు ముగిసినందువల్ల ఒక నగ్న సత్యాన్ని కనుక్కొని ప్రకటించుకోవాల్సి ఉన్నది. ఈ ఎన్నికలు బహుముదురు ఎన్నికలు, అవి లోకోద్ధరణ ప్రణాళికలతోనో, జనసేవ తీవ్ర ఆకాంక్షితులైన ప్రజాసేవకు ఉవ్విళ్లూరిన జననేతల ఆశయాలతోనో, కోట్లాది జనబాహు ళ్యం మేలుకోరే ఎన్నికల వాగ్దానాలతోనో జరిగినవని అనుకుంటే మీ అంత అమాయకు లు, మీ అంత పరిశుద్ధాత్మ గల విజ్ఞులైన ఓటరు మరి ఈ భూ ప్రపంచం మీద ఉండబోడు.
అంతా అబద్ధం. మిత్రులారా! మీలో పరిశుద్ధాత్ములు లేరని అనడం లేదు. మీలో స్వచ్ఛంగా ఒక ప్రజాస్వామ్య కర్తవ్యంతో, ప్రభుత్వాలను మార్చ గలిగిన ఒక అద్భుతమైన ఆశయంతో ఓటు వేసిన వాళ్లు లేరనీ అనడం లేదు. ఒక నియంత లాంటి వారిని, ప్రతి సారి ఎన్నికల సమయంలో ఎక్కి తొక్కీ వచ్చి, ఎన్నికలు అయ్యేదాకా సాధుజీవి, అయినాక నియంతలవుతున్న వారికి బుద్ధి చెప్పడానికి, ఎన్నికల యుద్ధంలో ప్రజల కోసం తేనెపూసిన నాలుకను ప్రదర్శించి, అదే నాలుకను కత్తిలా చేసుకునే విద్వేషపు మాటల మంటలు సృష్టించే నాయకులకు బుద్ధి చెప్పడానికి ఒక పవిత్ర కార్యంగా మీరు ఓటు వేసి ఉండవచ్చు. కానీ ప్రియ ఓటరులారా! వేల కోట్లు, లక్షల సీసాల మద్యం కులం గజ్జి, అబద్ధపు వాగ్దానాలు, ప్రజలను నేరుగా ఏమార్చే పథకాలు లేకుండా ఒక్క ఎన్నిక జరిగేనా? ఇది సందేహం. అదీ ఎన్నికలు ముగిసినందువల్ల ఒక విషయం ప్రకటించుకోవాల్సి ఉన్నది ఈ ఎన్నికలే కాదు.
ప్రజాస్వామ్య భారతంలో ఏ ఎన్నికలు కూడా కనబడ్తున్నంత స్బచ్ఛమైనవి కాకపోవచ్చు. కనపడని అనేక అవలక్షణాల పుట్టలని అర్థమయ్యీ ఉండవచ్చు. అయినా ఒక ఉద్రేక, ఉద్వేగా ల, భక్తి సమేత ఓటు ముగిసింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లినందుకూ సంతోషం. మార్పుకోసమో, తూర్పు కోసమో, ఉదార రాజకీయ నేతృత్వం కోసమో, సమూలంగా ఓటు ఆయుధంతో, నిజ ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసమో ఓటు వేసిన వారూ ఉండవచ్చు. ఇలాంటిదే దో చేస్తామని తామూ నమ్మి ప్రజానీకాన్ని, యావన్మందినీ నమ్మించిన వాళ్లూ ఉండవచ్చు . కానీ…అసలు సమస్య. ఇప్పుడి క ఎవరు గెలుస్తారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. ఎవ రు ఓడుతారు. ఎవరు మీరు కోరుకున్న ఉద్ధారకులు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డా? చంద్రబాబునాయుడా? చిరంజీవియేనా? మార్చిమార్చి చంద్రబాబునూ, వై.ఎస్‌నూ చూసి ఉన్నాం. బషీర్‌బాగ్‌నూ, ముదిగొండనూ రోదనలు, వేదనల మధ్య దర్శించి ఉన్నాం.
భూములు పోయినప్పుడు, భుక్తి పోయినప్పుడు, ప్రపంచ బ్యాంకు ఉన్న కొలువునూ ఊడబీకినప్పుడు మీ ఆస్పత్రిని, బడినీ మింగుతున్నప్పుడు, రైతురాయితీ కాజేస్తున్నప్పుడు కళ్లప్పగించి చూసి ఉన్నాం. కనుక ఈ ఇద్దరిలో ఎవరొచ్చినా.. ఇప్పటి మాటలకు, ఆ తర్వాతి చేతలకు మధ్య ‘ఫరక్’ ఉంటుందనైతే అంగీకరిస్తారా? ఇక చిరంజీవి మార్పేమిటో? ఆయన సామాజిక న్యాయమేమిటో? ఆయన ఆ తానులోనుంచి వేరే ముక్క ఎట్లా అవుతారో? ఆయన ఏ విధానాలు అవలంబిస్తా రో? అమ్మడం, కొనడంగా మారిన ప్రపంచంలో ప్రజలను ఎట్లా పాలిస్తారో? ఒక్క ముక్కన్నా అర్థమై ఉంటుందా? అందువల్ల విజ్ఞులైన ఓటరులారా! అయితే వై.ఎస్, కాదంటే చంద్రబాబు, మహా అయి తే చిరంజీవి ముఖ్యమంత్రి కావొచ్చు. కానీ… ఏం చేయగలరు వీళ్లు.. వెంటనే రెండువేల నగదు, వంద వంటసరుకు, ఇంటికి కలర్ టీవీ, పెన్షన్లు వచ్చేస్తాయనుకున్నా మీ అంత అమాయకులుండబోరు.
అధవా వచ్చినా.. జలయజ్ఞంలో ధనయజ్ఞం ఆగేనా? భూముల అమ్మకం ఆగేనా? విద్య అందేనా? వైద్యం అందేనా? మీ కాళ్ల కింద నేల కదలకుండా నిలిచేనా? ఎక్కడో తెలియని అదృశ్య శక్తులు ఆడిస్తే ఆడే తోలుబొమ్మలాట.. కదా! ప్రభుత్వాలంటే.. తెలియని తీరాల నుంచి వచ్చే భూతాల బారిన పడకుండా కాపాడగలిగే వారుంటారని భ్రమ మాత్రం పడకుం డా.. ఉంటేనే మంచిది. ప్రపంచం ఏమీ మారదు. అంతా సక్రమంగానే జరుగుతుంది. బహుశా ఎవరో ఒకరు గెలుస్తారు. అది మాత్రం ఖాయం. విజ్ఞులైన ఓటరులారా! బహుశా ఓటమి ఓటరుది కావొచ్చు. జాగ్రత్త…
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 25 ఏఫ్రిలు 2009