కొడవటిగంటి కుటుంబరావు: శతజయంతి సంవత్సర కానుక
ప్రతి ఇంటా ఉండవలసిన కొకు రచనా ప్రపంచం
విరసం ప్రచురణగా కొకు రచనా ప్రపంచం 16 సంపుటాలు
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజాసాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది.
తెలుగు సమాజంలో విప్లవభావాలను వ్యాపింపజేయడంలో అసాధారణమైన కృషి చేసిన కుటుంబరావు వ్యాసాలను మాత్రమే కాక, కథలనూ నవలలనూ కూడ కలిపి రచనా ప్రపంచం మొత్తాన్నీ ఆయన శతజయంతి కానుకగా పాఠకులకు అందించడానికి ఈ ప్రయత్నం.
కుటుంబరావు ఇరవై రెండో ఏట 1931లో తొలికథ అచ్చయిన నాటినుంచి 1980 ఆగష్టున మరణించేదాకా రచనే జీవితంగా గడిపారు. రాశిలోను వాసిలోను గణనీయమైన రచనలు చేసిన అతి కొద్దిమంది తెలుగు మేధావులలో కుటుంబరావు అగ్రగణ్యులు. ఆయన రచనా కృషి కథ, నవల,నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలలో నాలుగువేల పేజీలకు పైగా; శాస్త్రవిజ్ఞానం, రాజకీయాలు, సాహిత్య విమర్శ, సినిమా, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం వంటి అనేక రంగాలపై వివరణాత్మక వ్యాసాలు మరొక నాలుగువేల పేజీలకు పైగా విస్తరించి ఉంది. కుటుంబరావు రచనలు గతంలో విడివిడిగా అనేకసార్లు, సమగ్ర సంపుటాలుగా ఒకసారి అచ్చయినప్పటికీ అవేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అప్పటికి అలభ్యంగా మిగిలిపోయిన రచనలు కూడ కలిపి, ప్రణాళికాబధ్ధంగా విభజించి శతజయంతి సందర్భంగా విరసం ప్రచురించబోతున్నది.
కొకు రచనా ప్రపంచం మొత్తం 16 సంపుటాలుగా ఒక్కొక్క సంపుటి 450 పేజీలకు తగ్గకుండా వెలువడుతుంది. ఈ సంపుటాలకు చలసాని ప్రసాద, కృష్ణాబాయి కూర్పరులుగా ఉంటారు. కొకు రచనా జీవితం కథలతో ప్రారంభమైంది గనుక కథలు అచ్చయిన కాలక్రమానుగతంగా మొదటి ఐదు సంపుటాలలో వస్తాయి. ఆ తర్వాతి మూడు సంపుటాలలో నవలలు, ఒక సంపుటంలో నాటికలు,గల్పికలు, ఇతర రచనలు వస్తాయి. ఆ తర్వాతి ఏడు సంపుటాలలో సైన్స్ వ్యాసాలు,చరిత్ర-సంస్కృతి వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సినిమా వ్యాసాలు, తాత్విక వ్యాసాలు, లేఖలు వెలువడుతాయి.
కొకు రచనా ప్రపంచం తొలి నాలుగు సంపుటాలు 2009 జనవరిలో తెనాలిలో జరుగనున్న విరసం సాహిత్య పాఠశాల (కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి పాఠశాల) నాటికి వెలువడుతాయి. ఆ తర్వాత ప్రతి నాలుగు నెలలకు నాలుగు సంపుటాల చొప్పున ఆ సంవత్సరం పొడువునా అన్ని సంపుటాలు వెలువడతాయి.
ఈ పదహారు సంపుటాల కుటుంబరావు రచనా ప్రపంచం ప్రణాళికలో భాగం పంచుకోవలసిందిగా కుటుంబరావు అభిమానులకు, సాహిత్యాభిమానులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది. ప్రవాసాంధ్ర సాహితీ మిత్రుల సూచనల మేరకు సంపుటాల వెల, రవాణా ఖర్చులు, విరాళం కలిపి ఒక్కొక్క సెట్ కి $200 గా నిర్ణయించడం జరిగింది. ( నాలుగు విడతలుగా అందే సంపుటాలకు రవాణా ఖర్చు $50 పైనే ఉంటుందని అంచనా.) అమెరికాలో కొకు రచనా ప్రపంచం సెట్ కొనుక్కోదలచిన వారు జనవరి 1,2009 లోపు
డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ బాధ్యులు
శ్రీ ఆరి సీతారామయ్య ( ari@oakland.edu),
శ్రీ మద్దిపాటి కృష్ణారావు ( maddipati@wayne.edu) లను సంప్రదించవచ్చు.
విశాలాంధ్ర వారు వేసిన కొకు సంపుటాల్లో లేనివి విరసం ప్రచురణలో వున్నవి ఏమిటో తెలియజేయగలరు. ఇదివరకే కొకు సమగ్రసాహిత్యం కొనుక్కున్నవారికి ఈ సమాచారం ఉపయోగించొచ్చు.
విశాలాంధ్రవారు లోగడ కుటుంబరావుగారి కాల్పనిక సాహిత్యం మాత్రమే ప్రచురించారు. అందులో కథలు, నవలలు, గల్పికలు, నాటికలు ఉన్నాయి. చదువు నవలను విడిగా ప్రచురించారు. అయితే విశాలాంధ్ర సంపుటాలు చాలామటుకు అమ్ముడుపోయాయి. కుటుబరావుగారి వ్యాసాలనూ, లేఖలనూ లోగడ విరసం ప్రచురించింది కాని అవన్నీ ఎప్పుడో అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ మొత్తం సాహిత్యాన్ని 16 సంపుటాలుగా వెలువరిస్తున్నారు. ఇదివరకు కొకు సమగ్ర సాహిత్యం అనేది సెట్టుగా ఎవరూ ప్రచురించలేదు.
రోహిణీప్రసాద్ గారూ, మీరిచ్చిన సమచారానికి థాంక్స్. భూమికి వెలుపల జీవరాశి అన్న వ్యాసం బాగుంది. దానికింద అభిప్రాయాల బాక్స్ లేదు. అందువల్ల ఇక్కడ రాస్తున్నా. ఇటీవల జరిగిన బిగ్ బాంగ్ ప్రయోగం గురించి, దాని నేపధ్యం గురించీ విపులంగా తెలుసుకోవాలనుంది. అటువంటి వ్యాసం రాయగలరు.