పేలుళ్లపై దర్యాప్తు ప్రహసనం!
-కె. బాలగోపాల్
ధనవంతుల వేషధారణలో ఫ్యాషన్లు మారినట్లు టెర్రరిస్టు నేరాల పరిశోధనలోనూ ఫ్యాషన్లు మారుతుంటాయి. నిన్నటి సూత్రధారి ఇవ్వాళ వినపడడు, ఇవ్వాళ్టి సూత్రధారి రేపు వినపడడు. దీనిని ప్రహసనం అనకపోతే ఇంకేమనాలి? ఇది ఎవరికి మంచిదని మన పాలకులు ఈ ప్రహసనాన్ని సాగనిస్తున్నారు?
పట్టణాలలో బాంబు పేలుళ్లు నిజమే. వాటి అమానుషత్వం నిజమే. కానీ ఈ బాంబు పేలుళ్ల గురించి పోలీసులు చేస్తున్న నేర పరిశోధన ఒక ప్రహసనం. దీనిని ప్రహసనం అంటే బాంబు పేలుళ్లను సమర్థిస్తున్నట్టే నన్న నింద వేస్తారని ఎవరయినా ఎన్నాళ్లు భయపడగలరు? 2007లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్ర ధారి మూసారంబాగ్ నివాసి అయిన షాహిద్ ఉరఫ్ బిలాల్ అని పోలీసులు అప్పటికప్పుడే ప్రకటించారు.
అతను బంగ్లా దేశ్ కేంద్రంగా గల హర్కతుల్ జిహాదీ ఇస్లామీ(హుజీ) కార్య కర్త అన్నారు. అతనితో పాటు తప్పాచబుత్ర, జిర్రా, ఆసిఫ్ నగర్ ప్రాంతాలలో సూట్‌కేసులు, స్కూల్ బ్యాగులు తయారుచేసే బెంగాలీ మాట్లాడే ముస్లింలు పలువుర్ని కూడా అరెస్టు చేశారు. షాహిద్ తమ్ముడినీ, ఇరుగుపొరుగునూ, గతంలో అతనితో పాటు ఆందోళనలలో పాల్గొన్న వారినీ అరెస్టు చేశారు. వీరంతా ద్వేషం కక్కే ఉపన్యాసాలతో నిండిన కాసెట్లతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కృషి చేస్తున్నారనీ, ఒక కబరస్తాన్‌లో కూర్చొని కాసెట్లు పంచుకుంటుండగా పోలీసులకు దొరికిపోయారనీ కేసు పెట్టారు. భారత ప్రభు త్వం మీద యుద్ధం చేస్తున్నారనీ, రాజద్రోహానికి పాల్పడ్డార నీ, హుజీ నేత అయిన షాహిద్ మార్గదర్శకత్వంలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారనీ అభియోగం మోపారు. ఇద్దరి అరె స్టుతో మొదలయిన ఈ కేసులో 64 మందిని కాలక్రమంలో ముద్దాయిలుగా చూపించారు. పట్టుకున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు.
కాబట్టే కొత్తపేర్లు దొరుకుతూ వచ్చాయి. పెరిగి పెరిగి 64 అయ్యాయి. అయితే రెండు వారాల క్రితం హైదరాబాద్ పోలీసుల నేర పరిశోధనతో నిమిత్తం లేకుండ ముంబయి పోలీసులు అనేక బాంబు పేలుళ్ల ఘటనలతో బాటు హైదరాబాద్ పేలు ళ్ల రహస్యాన్ని కూడ ఛేదించామని ప్రకటించారు. వారి కథ లో ‘హుజి’ లేదు, షాహిద్ లేడు. వారి కథలో హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి రియాజ్ భట్‌కల్ కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా వాసి. అతని సంస్థ ఇండియన్ ముజాహిదీన్. మరైతే మన రాజధానిలో అరెస్టుచేసి జైలు పాలు చేసిన 64 మంది సంగతేమిటి? చార్జిషీటు దాఖలయిపోయింది గానీ లేకపోతే హుజీ కాదు, ఇండియన్ ముజాహిదీన్ వారి మాతృసంస్థ అనకపోదురా? ఒకప్పుడు ఎక్కడ పేలుళ్లు జరిగినా లష్కర్, జైష్‌ల పేర్లు చెప్పేవారు.
వాటితో పాటు ఐఎస్ఐని జత చేసి ఈ మూడు సంస్థల కుట్ర అనేవారు. ఆ తరువాత హుజీ రంగ ప్రవేశం చేసింది. దేశంలో ఎక్కడెక్కడో కూలి చేసుకొని బతుకుతున్న బంగ్లాదేశీలను అరెస్టు చేయడానికిది పనికొచ్చింది. కొంత కాలం ఏ బాంబుపేలుడు జరిగినా అది హుజీ పనేనన్న గంభీరమైన ప్రకటన చేస్తూవచ్చారు. మీడియా దాన్ని నిర్విమర్శగా రాసింది. అయితే సిమి పైన నిషేధానికి ఆధారాలేవీ లేవని ట్రిబ్యునల్ కొట్టేసిన తరువాత అన్ని పేలుళ్లలోనూ సిమి హస్తాన్ని చూడసాగారు. అంతకు ముందు ఎప్పుడూ సిమి పేరు లేదు. ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో స్టే చేయించడానికి ఇది పనికి వచ్చింది. అయితే త్వరలోనే సిమి స్థానంలో ఇండియన్ ముజాహిదీన్ వచ్చి చేరింది. ధనవంతుల వేషధారణలో ఫ్యాషన్లు మారినట్లు టెర్రరిస్టు నేరాల పరిశోధనలోనూ ఫ్యాషన్లు మారుతుంటాయి. నిన్నటి సూత్ర ధారి ఇవ్వాళ వినపడడు, ఇవ్వాళ్టి సూత్రధారి రేపు వినపడడు.
నిజమే, బాంబు పేలుళ్లు సత్యమే, వాటి అమానుషత్వం సత్యమే, వాటిలో పోతున్న అమాయక ప్రాణాలూ సత్యమే. అయితే అవి ఎంత భయంకర సత్యాలయినా వాటి చాటున ఈ అబద్ధాన్ని ఎన్నాళ్లు దాచుతాం? ఆ సత్యం పేరిట ఎన్నాళ్లు ఈ అబద్ధాలను మోస్తాం? ఢిల్లీ జామియానగర్ ‘ఎన్‌కౌంటర్’ చుట్టూ ఒక వివాదం చెలరేగుతున్నది. సెప్టెంబర్ 19నాడు జరిగిన ఈ ఎన్‌కౌం టర్‌లో అంతకు కొద్దిరోజుల ముందు ఢిల్లీ లో జరిగిన బాంబు పేలుళ్లకు బాధ్యులయిన ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలతో బాటు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు సంపాదించుకున్న మోహన్ చంద్ శర్మ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ చనిపోయాడని మొదట చదివినప్పుడు ఇది నిజ మైన ఎదురు కాల్పుల ఘటనేనేమో అని అందరం అనుకున్నాం. కానీ తరువాత చాలా సందేహాలు తలెత్తాయి. చనిపోయిన ఇద్దరు ముస్లిం యువకులు (మహమ్మద్ సజిద్, అతీఫ్ అమీన్) విద్యార్థులు. మొదటి అతని వయస్సు కేవలం 17. రెండో అతని వయస్సు 24. ఢిల్లీ, బెంగుళూరు, అహమ్మదాబాద్, హైదరాబాద్ (అవును, మళ్లీ హైదరాబాద్) పేలుళ్ల పథకరచనలో వీరికి కీలక పాత్ర ఉందని పోలీసులన్నారు.
ఇరుగు పొరుగు ఎవరూ ఇది నమ్మడం లేదు. చనిపోయిన ఇద్దరు కాక మరొక ఇద్దరు కూడ అక్కడ ఉన్నారనీ వారు కాల్పులు జరుగుతున్న క్రమంలో తప్పించు కున్నారనీ పోలీసులు అన్నారు. ఎన్‌కౌంటర్ జరిగింది ఒక నాలుగంతస్తుల భవనంలోని నాలుగవ అంతస్తులో. ఆ భవనం నుంచి కిందికి పోవడానికి ఒకే మెట్ల దారి ఉంది. వాటి దిగువన సాయుధ పోలీసులు కాపలా ఉన్నారు. ఎవరయి నా ఎట్లా తప్పించుకోగలరు? సజిద్ తలపైన మధ్య భాగం లో ఏడెనిమిది గాయాలున్నాయని అతని మృతదేహాన్ని ఖననం చేసేముందు స్నానం చేయించిన వారు గమనించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో కూడా తీశారు. పోలీసుల పైన కాల్పులు జరుపుతూ అతను కింద పడిపోయాడని, అందువల్ల తలకు బుల్లెట్ గాయాలయ్యాయనీ పోలీసుల వివరణ. ‘ఎన్‌కౌంటర్’ జరిగింది సెప్టెంబర్ 19న కాగా 24 వ తేదీన నిజ నిర్ధారణ కోసం అక్కడికి వెళ్లిన బుద్ధిజీవుల బృందానికి ఎదురయిన అనుభవం ఏమిటంటే ఆ గల్లీ మొత్తం పోలీసు పహరాలో ఉంది.
ఆ బిల్డింగ్‌లోకి పోలీసుల అనుమతి లేకుండ ఎవరూ స్థానికులతో మాట్లాడడానికి వీలులేదు. నిజాలు దాచి పెట్టే ఉద్దేశ్యం లేకపోతే ఇంతటి నిఘా ఎందుకు ఇద్దరు మిలిటెంట్లను చంపి వారికి సహకరించారని భావించిన తక్కిన వారినందరినీ అరెస్టు చేసిన తరువాత కూడ ఇంతటి బందోబస్తు ఎందుకు? ఇంతటి నిఘా మధ్య కూడ స్థానికులు అనేక విషయాలు బయట పెట్టారు. చనిపోయిన యువకుల గదినుంచి స్వాధీనం చేసు కున్నట్టు చెప్తున్న లాప్‌టాప్, ఆయుధాలు వగైరాలకు పంచ నామా అక్కడ జరపలేదు. స్థానికులు వాటి స్వాధీన ప్రక్రియకు సాక్షులు కారు. నేరానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకునేటప్పుడు స్థానికులు సాక్షులుగా పంచనామా జరపాలన్న నియమాన్ని ఎందుకు పాటించలేదు? 15 నిమిషాల పాటు కాల్పులు జరిగిన తరువాత పోలీసులు అక్కడున్న పూలకుండీల ను ఎత్తిపడేసి విరిగిన ముక్కలతో కిటికీల అద్దాలు పగల గొట్టి ‘ఎన్‌కౌంటర్’ సీన్ సృష్టించారని స్థానికులు అన్నారు.
గాయ పడిన మోహన్‌చంద్ శర్మను కిందికి తీసుకొచ్చిన తరువాత ఆ ఇద్దరు యువకులను నాలుగవ అంతస్తునుంచి తీసుకు రావడం చూసామని, ఆ తరువాతే వారిని చంపారనీ కొందరు అన్నారు. పోలీసులు ఏదో సమాచారం ఆధారంగా సోదా కోసం వచ్చారనీ, అక్కడున్న యువకులు ఎదురు తిరిగిన కారణంగా ఏకపక్షంగా కాల్పులు మొదలుపెట్టారనీ, ఇరుకు గోడల మధ్య జరిపిన కాల్పులలో మోహన్‌చంద్ శర్మ పోలీసు బుల్లెట్లకే గాయపడ్డాడనీ, ఆ తరువాత వారు ఇద్దరు యువకులను చంపారనీ ఒక బలమైన అభిప్రాయం ఉంది. అప్పటికే ఢిల్లీ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా భావించిన వారి ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు మృతులను ఖన నం చేయడానికి ముందు వీరి ఫోటోలను ఆ ఊహాచిత్రాలతో పోల్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇవన్నీ నిరాధారమైన సందేహాలు కావచ్చు. ఆ బిల్డింగ్ లో నివసించే వారంతా ముస్లింలు కావడం వల్ల కావాలని అబద్ధాలు చెప్తుండవచ్చు.
నిజ నిర్ధారణ చేయ ప్రయత్నించిన బుద్ధిజీవులు పోలీసులను బదనాం చేయడమే పనిగా పెట్టు కున్న వికృత బుద్ధులు కావడం వల్ల లేనిపోని వ్యాఖ్యలు ప్రచారం చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు న్యాయవిచారణ డిమాండ్ చేయడం, సిబిఐ చేత నేర పరిశోధన జరిపించాలని డిమాండ్ చేయడం తప్పెట్లాగయింది? ఎన్‌కౌంటర్ మృతుల సహచరులన్న పేరు మీద పోలీసులు అరెస్టుచేసిన జామియా మిలియా విశ్వ విద్యాలయం విద్యార్థులకు న్యాయ సహాయం అందియ్యాల ని వైస్ చాన్సలర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు దేశద్రోహ కరమైన చర్యగా భావించాలి? ప్రొఫెసర్ ముషీరుల్ హసన్ ఏ అర్థంలోనూ సనాతనవాదికాడు, తీవ్రవాది కాడు. సామా జిక శాస్త్రరంగంలో ఉదారవాద భావాలు గల పరిశోధకుడి గా ఆయనకు గుర్తింపు ఉంది, మంచిపేరు ఉంది. పోలీసుల కథనంలోని అనుమానాస్పద విషయాల కారణంగా బీద విద్యార్థులు న్యాయసహాయం లేక అబద్ధాలకు బలికావద్దని ఆయన భావిస్తే తప్పేముంది? భారతదేశ పౌరులుగా మనం ఒక విషయం ఇకనైనా గ్రహించాలి.
మన పోలీసులకు బాంబు పేలుళ్లకు బాధ్యులయిన వ్యక్తుల గురించి,సంస్థల గురించి ఏమీ తెలీదు. మేము తెలుసుకోలేక పోతున్నాం, కొంత గడువు ఇవ్వండి అని అడి గితే వారిని ఎవరూ ఏమీ అనరు. అది నిజాయితీగానూ ఉంటుంది. రహస్యాలను ఎప్పటికప్పుడు ఛేదించడానికి వారేం మాంత్రికులు కారు. అయితే నిజాయితీ వీరోచితంగా కనిపించదు. కాబట్టి ఒక బాంబుపేలుడు జరగగానే ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక గంభీరమైన ప్రకటన తో ముందు కొస్తుంది. నిన్నటిదాకా ఏమీ తెలియని వాళ్లు, నేరాన్ని నిరోదించని వాళ్లు, ఇవాళ పూర్తి సమాచారంతో ముందుకొస్తారు. సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, కుట్రదారులెవరు, పేలుడు పదార్థం ఎక్కడ తయారయింది, పాకిస్తాన్‌తో వారి సంబంధాలేమిటి, అన్నీ చెప్పేస్తారు.
(ఏమైనా మిగిలిపోతే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ చెప్పేస్తాడు) సూత్రధారులూ కుట్రదారులూ దొరకరు కాబట్టి వారికి సహకరించిన స్థానికులు అన్న పేరు మీద అరెస్టులు మొదలుపెడతారు. మళ్లీ ఇంకొక చోట బాంబుపేలుళ్లు జరిగితే ఆ రాష్ట్ర పోలీసు లు ఇదే తంతు మొదలు పెడతారు. వారి జాబితా వారు ప్రకటిస్తారు. ఈ సూత్రధారులు, కుట్రదారులు ఒక ఘటనకు పరిమితమా అంటే కాదు. అహమ్మదాబాద్, బెంగుళూరు, సూరత్, ఢిల్లీ, హైదరాబాద్ అంటూ దండకం చదవాల్సిందే. కానీ ఒక రాష్ట్ర పోలీసుల సూత్రధారులు ఇంకొక రాష్ట్రానికి పనికిరారు.
అన్ని బాంబు పేలుళ్ళకూ సూత్రధారులొకరే గానీ వారెందరో! దీనిని ప్రహసనం అనకపోతే ఇంకేమనాలి? కానీ ఇది జోక్ మాత్రం కాదు. ఈ క్రమంలో వందల మంది, బహుశా వేల మంది ముస్లింలు అరెస్టవుతున్నారు. చిత్ర హింసలకు గురవుతున్నారు. ఢిల్లీలోలాగ కొందరు ‘ఎన్‌కౌం టర్’ అవుతున్నారు. ఈ దేశంలో ముస్లింలకు న్యాయం జర గదన్న నిరసన పెంచుకుంటున్నారు. ఇది ఎవరికి మంచిదని మన పాలకులు ఈ ప్రహసనాన్ని సాగనిస్తున్నారు?
——————————————————————————–
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 22 అక్టోబరు 2008
బాలగోపాల్ గారూ, మీ వ్యాసం అద్భుతం.
బాలగోపాల గారి నుంచి ముంబయ్ పేలుళ్ళు, తీవ్రవాదముఠాలకు ఆసరాగా మాట్లాడుతున్న అప్సర్ ఖాన్ల్స గూర్చి ఒక వ్యాసం వస్తుందేమో అని ఎన్ని రోజులు ఎదురు చూడాలి. నా కళ్ళు కాయలు కాస్తున్నాయి గోపాలా :-(