ఉరితాళ్ళు పేనింది పాలకులే!

సిరిసిల్ల పవర్‌లూమ్ వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

చిరంజీవి గత నెల 20వ తేదీన ఏ కారణంతో సిరిసిల్ల పర్య టన చేపట్టినప్పటికీ, అక్కడి నేత కార్మికుల దుర్భర పరిస్థితుల్ని మరొకసారి లోకానికి చాటినట్టయింది. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితికి ఎన్డీఏ, యూపీఏ -రెండూ బాధ్యత వహించాల్సిందే. అందు వల్ల సమస్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి సిరిసిల్ల బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. బాధిత ప్రజలను, నేత కార్మిక సంఘాలను చేనేత రంగ నిపుణులను సహకార సంఘాలను కూడగట్టి సమిష్టి పరిష్కారాన్ని కనుక్కునే బాధ్యతను తెలంగా ణవాదులు తమ భుజానికెత్తుకోవాలనేది నా అభిలాష.

మొదట ఆత్మహత్యలు అరికట్టడానికి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, హక్కుల సంఘాలు నిలబడి తమకు చేతనైన సహాయం చేస్తూనే, బాధిత ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఎల్లవేళలా పాలకవర్గాలు ఉత్పత్తి సంక్షోభాన్ని కేవలం మార్కెటు సమస్యగా చిత్రించి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆధునికత- అభివృద్ధి పేరిట అనుసరించిన సామ్రాజ్య వాద విధానాల వల్ల, అందులో భాగంగా రూపొందించిన నూతన జౌళి విధానం వల్ల సిరిసిల్లకు ఈ దుస్థితి పట్టింది. నూతన జౌళి విధానానికి స్వస్తి చెప్పి, నేత రంగంపై ఉన్న అప్పులన్నీ రద్దుచేసి, కార్మికులందరికి ఉపాధి కల్పించే దిశగా, అంతిమంగా దేశీయ వస్త్ర పరిశ్రమను కాపాడుకునే విధంగా ఆందోళన కొనసాగాల్సిన అవసరం ఉంది.

అతిపెద్ద ఉపాధిరంగంగా ప్రసిద్ధి గాంచిన చేనేతరంగాన్ని విడిగా అభివృద్ధి చేయకుండా పాలకవర్గాలు మిల్లురంగం, పవర్‌లూమ్ రంగాలను చేనేతతో కలిపి భారత జౌళిరంగ విధానాన్ని రూపొందించారు. కార్మికులు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ దీనిని 1985లో ప్రజలపై రుద్దారు. పైగా వ్యవస్థాగత సర్దుబాటు కార్య క్రమం పేరిట 1991లో సరళీకృత విధానాలు అమలు చేశారు. దీనివల్ల నూలు- రంగుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలోనే జౌళీ పార్కుల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం టెక్నికల్ అప్‌గ్రెడేషన్ ఫండ్ (టియుఎఫ్) పేర 25,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చింది. భారీ పెట్టుబడిదార్లకు ఆటోమైజేషన్ పేరుమీద భారీ సబ్సిడీలు ఇచ్చింది. ఆధునిక టెక్నాలజి పేరు మీద మరమగ్గాల దిగుమతులకు రాయితీలిచ్చింది.

20 శాతం పెట్టుబడి రాయితీలు, 100 శాతం మౌలిక వసతుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఉచిత నీరుతోపాటు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడానికి అంగీకరించి ఎన్డీఏ ప్రభుత్వ జాతీయ జౌళీ విధానం బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదార్లకు ఎర్ర తివాచీలు పరిచింది. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో జరిగిన ఆత్మహత్యలను అరికడతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ చర్యలు తీసుకోలేదు. పైగా ఆటోమైజే షన్‌తో కూడిన 14 జౌళీ పార్కుల నిర్మాణానికి రాష్ట్ర జౌళీ విధానం పేర భారీ ప్రణాళిక(2005-10)ను ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో హైదరాబాద్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు 300 ఎకరాల స్థలంలో 300 కోట్లతో ప్రారంభ సన్నాహాలు చేశారు. ఈ పార్కుల్లో కూడా జెట్‌లూమ్స్ (నాడీ లేకుండా వాయు వేగంతో నడిచే మరమగ్గాలు) ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ పథకం. సరిగ్గా తమిళనాడు, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల్లో ఇదే రకం ఉత్పత్తి విధానంతో పోటీపడలేక సిరిసిల్ల పవర్‌లూమ్ రంగం కుప్పకూలిందని నేత కార్మి కులు ఆరోపిస్తున్నారు.

ప్రపంచీకరణతో పొరుగుదేశాల నుంచి వస్త్రాలు, పట్టునూలు దిగుమతి చేసుకోవడంతో వారణాసి మొదలుకుని పోచంపల్లి వరకు పట్టు వస్త్ర పరిశ్రమ వీధుల్లో పడ్డది. పోచంపల్లి టై అండ్ డై తోపాటు చేనేత నైపుణ్యంపై కార్మికులకు పేటెంట్ హక్కులిచ్చి, అప్పులన్నీ రద్దు చేయాల్సింది. ఇది చేయకపోగా, సిరిసిల్ల లాంటి పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమను పరిరక్షించకుండా, ప్రతి మనిషి రోజుకు సగటున 960 గజాల వస్త్రం నేసే జెట్‌లూమ్‌ల కోసం జౌళీ పార్కుల విధానాన్ని ప్రకటించడం, సిరిసిల్లను మరింత వధ్యశాలపై నెట్టడానికే దారితీస్తుంది.

వస్త్ర పరిశ్రమను కొద్దిమంది బడా వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. అలాగే సరళీకరణ-ప్రపంచీకరణలో భాగంగా గుత్తపెట్టుబడిదార్లకు అనుగుణంగా ఉన్న జాతీయ జౌళి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ జౌళి విధానాలను మార్చకుండా 414 కోట్లకు చేరిన చేనేత రంగ బకాయిలు, ప్రైవేటు అప్పులు చెల్లించకుండా నేత రంగంలో ఆత్మహత్యలను అరికట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి బాధిత సిరిసిల్ల ప్రజలమధ్య ‘పీపుల్స్ రౌండ్ టేబుల్’ జరగాలని అభిలషిస్తూ, కొన్ని అంశాలు చర్చకు ప్రతిపాదిస్తున్నాను. 1997ను ప్రాతి పదికగా తీసుకుని, ఆత్మహత్యలు- ఆకలిచావులతోపాటు అనారోగ్యం తదితర కారణాలతో బలవన్మరణాలకు గురయిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇచ్చి, పిల్లలకు ఉచిత చదువుతో పాటు కుటుంబంలో ఒకరికయినా ఉపాధి కల్పించాలి.

పేరుకుపోయిన వస్త్రాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి, తిరిగి ఉత్పత్తికి అవసరమయిన ముడిసరుకును, విద్యుత్‌ను సబ్సిడి రేట్లకు అందజేయాలి. సిరిసిల్ల పవర్‌లూం వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

అపెరల్ పార్కుల పేరిట భారీ రాయితీలతో సాగుతున్న గుత్తపెట్టుబడిదారు ల దోపిడికి అడ్డుకట్ట వేయాలి. ఉపాధి ప్రాతిపదికగా ప్రజామోదంతో సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించాలి. కార్మికులందరికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ప్రత్యేక వృద్ధాప్య పింఛనును 1,000 రూపాయలకు పెంచాలి. నేత కార్మికులకు కనీసవేతనాలు అమలు పరచాలి. నిత్యావసర సరుకులన్నీ సబ్సిడి రేట్లకు చౌక దుకాణాల ద్వారా అందించాలి. తక్షణ సహాయ చర్యలకోసం, రుణ విముక్తికోసం కార్పస్‌ఫండ్‌తో స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత పరిశ్రమ పేటెంట్ హక్కులిచ్చి చారిత్రిక కళానైపుణ్యాలను పరిరక్షించాలి.

-అమర్ (జనశక్తి రాజకీయ ఖైదీ)

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 9 అక్టోబరు 2008
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

5 అభిప్రాయాలు

  1. యన్.సీతారాంరెడ్డి 26 అక్టోబర్ 2008 , 6:39 am

    ప్రభుత్వ విధానాల పరంగా మీరు ఈ వ్యాసంలో రాసిన అన్ని విషయాలతో నేను ఏకీభవిస్తాను. కానీ దీనికి మూలమైన టెక్నాలజీ సృష్టించే సంక్లిష్టతల్ని అర్ధం చేసుకోవడంలో మనం వెనుకపడ్డాము.

    డబ్బులు పొదుపుచేసుకొన్న పద్మశాలి చేనేత మగ్గం నడపడు. మరమగ్గం కొంటాడు. చేనేత బట్టే కట్టడు.తనకి ఇష్టం వచ్చిన బట్ట కడతాడు. వ్యక్తిగత స్థాయిలో నూతనంగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించడం ఇంచుమించు అన్ని సాంప్రదాయక శ్రామిక వర్గాలలో కనపడుతుంది. వ్యవసాయక వర్గాలలో కూడా కనపడుతుంది.

    అంటే సుఖపడాలానుకొనే మానవ సహజాతం బలంగా పనిచేస్తుంది. పెట్టుబడి అనేది రంగంలోకి రాకమునుపే ఇది మొదలౌతుంది. ఎవరో బయటివారు వచ్చి పెట్టుబడి పెట్టి కలుషితం చేయకున్నా స్థానిక ప్రజల పొదుపు, మిగులు కూడా పెట్టుబడి రూపం సంతరించుకొంటుంది. వాళ్ళకు అమెరికా తెలియకపోవచ్చు. మార్క్స్ కూడా తెలియక పోవచ్చు. టెక్నాలజీని వినియోగం మొదలైనదంటే అనివార్యంగా వ్యవస్థ ఓపెన్ గా ఉండవలసివస్తుంది. ఓపెన్ గా ఉన్న వ్యవస్థలో పెద్దపెద్ద సంస్థలు తయరౌతాయి. వాటిచేతుల్లో అందరూ కీలుబొమ్మలౌతారు.

    కాబట్టి మనం టెక్నాలజీ పరిణామాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి. ఏ విధంగా స్వీకరించాలి. అందుకు వ్యక్తి చేతన స్థాయిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. మనకు పెట్టుబడి కార్మికులు అనే దృష్టి మాత్రమే అలవాటైంది. టెక్నాలజీ, మానవసహజాతం అనే కోణాలు మరుగునపడిపోతున్నాయి.

    ఈ విషయాలు కూడ పరిగణలోకి తీసుకోకపోతే ఈ విషయంలో మనము ముందుకు వెళ్ళలేమోనని నా అభిప్రాయం.

  2. Marthanda 12 జనవరి 2009 , 9:56 am

    మార్కెట్ దోపిడీలో బ్యాంకుల వాటా కూడా ఉంది. రైతులు అప్పులు అడిగితే వెంటనే ఇవ్వరు కానీ రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. బ్యాంకు అధికారుల దృష్టిలో రైతులు మనుషులు కారు, వాళ్ళ లాగ తెల్ల చొక్కాలు వేసుకునే వాళ్ళు మాత్రమే మనుషులు. సత్యం కంపెనీ లాంటి దొంగల సిండికేట్లకి కూడా మన బ్యాంకులు అడిగిన వెంటనే అప్పులు ఇచ్చేశాయి. సత్యం కంపెనీ రాజులు (రాబందులు) చేసిన ఘరానా మోసం ఇప్పుడు బయట పడింది. వాళ్ళు బ్యాంకు లావాదేవీల గురించి కూడా తప్పుడు లెక్కలు వ్రాయగలిగారు. ప్రభుత్వ బ్యాంకులు డబ్బున్న రైతులకి మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇస్తామని చెప్పుకుంటాయి కానీ గ్రామీణ ప్రాంతాలలో వాటి బ్రాంచిలు కనిపించవు. అందుకే రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి, అవి తీర్చలేక కాకుల్లా రాలి చనిపోతున్నారు. రైతులు ఎలా చచ్చినా బ్యాంకు అధికార్లకి పట్టదు. కార్పరేట్ రాబందులకి మాత్రం తమకి సాధ్యమైనంత సేవ చేస్తున్నారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దొంగల రాజ్యం. ఫాక్టరీలు కట్టడానికి పచ్చని వ్యవసాయ భూముల్ని కారు చవకగా ఆక్రమించుకోవడం, కంపేనీ లాభాలు పెంచుకోవడానికి షేర్ హోల్డర్లని నట్టేట ముంచడం, నష్టాలొస్తే ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం (ఎన్రాన్ కంపెనీ 22,000 మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేసింది), ఇంకా అనేక రకాలుగా నీతి లేని పనులు చేస్తారు కార్పరేట్ రాబందులు.

  3. Marthanda 25 జనవరి 2009 , 9:45 am

    “రైతు కన్నీటి కథ” పేరుతో ఒక కథ వ్రాసాను

    http://telugu.stalin-mao.net/?p=124

  4. Ram 08 ఫిబ్రవరి 2009 , 11:27 am

    బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. -మంచి డిమాండ్. రాయితీలు ఎవరికి లాభాలందిస్తున్నాయి? అనేదీ చూడాల్సి ఉంది.
    సత్యం కంపెనికి దివాల తీసిన తరువాత కూడా బ్యాంకులు 600 కొట్ల అప్పులు ఇస్తున్నట్లు పేపర్ల్లొ వచ్చింది.

  5. rahamthulla 11 మార్చ్ 2009 , 6:29 am

    మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు
    ఏకగ్రీవ ఎన్నిక వలన లాభాలు:
    1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
    2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
    3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
    4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
    5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.

    మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

    * 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
    * 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
    * 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
    * 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
    * 1955 : రామారావు కామారెడ్డి
    * 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
    * 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
    * 1957 : సీతాకుమారి బన్స్ వాడ
    * 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
    * 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
    * 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
    * 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : కే.వి.రెడ్డి బోదన్
    * 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
    * 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
    * 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
    * 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎస్.భూపాల్ అమరచింత
    * 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
    * 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
    * 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
    * 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
    * 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
    * 1981 టి.అంజయ్య రామాయంపేట
    * 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)