- మహమూద్ దార్వీష్
పాలస్తీనా జాతీయ కవి
(ఫద్వా తుఖాన్ స్మృతిలో)
1.
ఉహు! మాకు గుర్తు చేయనక్కరలేదు
మాలోనే వుంది, మౌంట్-కేరమెల్ పర్వతం
మా కనురెప్పల పైన కదులుతున్నాయి, గెలీలీ లోని గడ్డిపోచలు
మా నేలలోని పర్వతానికీ, భూభాగానికీ, మాకూ మధ్య భేదం ఉందనుకోకండి
దానిని మేం చేరగలమా అని అడగకండి
మేమూ మా దేశమూ ఒకే దేహం ఒకే ప్రాణం .
2.
మేము వసంతంలో ఎగిరే పావురాలం కాదు
మా ప్రేమబంధం ఎన్నటికీ చెదిరిపోయేది కాదు
అక్కా! ఇరవై యేండ్ల నుండి కవిత లే రాస్తలేం
పోరాటాలే చేస్తున్నాం .
3.
నీ కళ్ళముందు కనుమరుగవుతున్న నీడ, ఒక సైతాన్
జూన్ నెలలో వచ్చి మా తలలకు సూర్యుడ్ని చుడుతుంది
దాని రంగు త్యాగం , దాని రుచి ప్రార్ధన
ఎంత చక్కగా చంపుతుంది, ఎంత చక్కగా పునర్జీవనం చేస్తుంది.

4.
నీ కళ్ళలో ఆరంభమైన ఆ రాత్రి
నా ఆత్మలో భారంగా ముగిసిన ఆ రాత్రి
కరవు కరతాళం చేస్తున్న కాలంలో
తిరుగు పయనంలో మళ్ళీ మనం కలుస్తాం.
5.
మనందరికీ తెలుసు
కోకిలగానం దురాక్రమణదారుల గుండెల్లో బందూకు ఎలావుతుందో
మనందరికీ తెలుసు
స్మశాన నిశబ్దం పండగ ఎలావుతుందో , పచ్చని జీవితం ఎలావుతుందో
6.
అక్కా! నువ్వు కవితలు గానం చేస్తున్నప్పుడు
బాల్కనీ గోడలను వదిలిపోవటం చూసాను
నగరం చౌరస్తా కొండకోనలకు విస్తరించటం చూసాను
మేము విన్నది, సంగీతం కాదు
మేము చూసింది, పదాల మాయాజాలం కాదు
లక్షలాది వీరులను కళ్ళారా చూసాం.
7.
భూమితల్లి అమరులను తన ఒడిలోకి చేర్చుకుంటుంది
భూమితల్లి బుక్కెడు బువ్వను ఇస్తానంటుంది
ప్రార్ధించండి!
మనమంతా దాని నీరూ, ఉప్పు
మనమంతా దాని గాయం, కానీ పోరాడే గాయం .
8.
అక్కా! నా కంఠంలో కన్నీళ్ళున్నాయి
నా కళ్ళలో నిప్పులున్నాయి
స్వేచ్ఛ గానే వున్నాను, నేను
సుల్తాను గేటు దగ్గర ఇంకెప్పుడూ నిరసన తెలపను, నేను
ఈ నేలపైన మరణించిన , మరణించే వారందరూ
ఆప్యాయంగా కౌగిలించుకొని నన్నొక ఆయుధంగా మలిచారు.
9.
ఓ నా కనిపించని గాయమా!
దిక్కులేనిదీ కాదు, నా దేశం
యాత్రికుడినీ కాదు, నేను
నేనొక ప్రేమికుడిని, ప్రేమించ తగ్గది యీ భూమి.
10.
పురావస్తు పరిశోధకుడు రాళ్ళను పరిశీలిస్తున్నాడు
కూలిన శిధిలాలలో తనకళ్ళను వెతుకుతున్నాడు
చూపులేని, నాగరికత తెలియని దిమ్మరిగా నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు, నన్ను
ఈలోపు, నేను కొత్త మొక్కలు నాటుతున్నా , ప్రేమ గానం చేస్తున్నా.
11.
మాటలు ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది
కోకిలపైన, భూమిపైన ప్రేమను నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది
నేడు ఆయుధం గిటారుని కబళి స్తోంది
నా వెనక పెరుగుతున్న చెట్టు, నన్ను అద్దంలో కనుమరుగు పరుస్తుంది.
కవితలో సహజత్వం రక్త స్పర్శ లా కనిపిస్తోంది.
వున్నపళాన చంపి ముక్కలు చేసి ఎటో విసిరేసిందీ కవిత.
అబ్బా …ఎంత బావుందో చెప్పలేను.
అప్పుడప్పుడు ఇలాంటి కవితలు ప్రచురిస్తూ వుండండి.
కవిత అద్భుతంగా ఉన్నది. అనువాదకుడి పేరు వేస్తే బాగుండేది. దార్వీష్ నెరూడా తో పోల్చదగ్గ మహాకవి. అభినందనలు