వెన్నెల మైదానాన్ని కప్పుకొని బస్సెక్కుతాను
వందనోటు చిల్లర వెంపర్లాటలో
దాన్ని ఎటో కుక్కిపెడతాను
ఈ సీటో ఆ సీటో వూగుతూ ప్రయాణంసాగి

బస్సుదిగి ఇంటిమెట్లెక్కుతూ గుర్తుకొచ్చి
జేబులోనో సంచిలోనో చెయ్యిపెడితే
ఎంతకీ దొరకదు
ఎక్కడ పోయిందని వెతకాలో
సందిగ్దంగా
కాళ్ళీడ్చుకుంటూ లోనికెళ్ళి
ఏ మంచంమీదో వొరిగిపోతాను
నిద్రిస్తున్న కళ్ళలో తెరసిన ఆకాశంలోంచి
జలపాతమై తుంపరలై వర్షిస్తుంది
తడిసిపోతూ
స్నానమాడుతూ
కనుకొలుకుల్లో బందీచేసాననుకుంటా
రెప్పతెర్వగానే
రివ్వున ఎగిరిపోతుంది
మళ్ళీ వేట
మళ్ళీ వెదకులాట
మళ్ళీ దోబూచులాట
- జాన్‌హైడ్ కనుమూరి

3 అభిప్రాయాలు

  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి 28 ఆగస్టు 2008 , 3:16 am

    మనమివ్వాళ దేన్ని పోగుట్టుకున్నామో,అసలు దేన్ని వెతకాలో,పరిసరాలకు పరాయివారం ఎందుకయ్యామో కవి గారు బాగా చెప్పారు.పదండి వెతుక్కుందాం.

  2. అపూర్వ 28 ఆగస్టు 2008 , 6:23 am

    నిజమే డబ్బు వెంపార్లాటలో ఎంత వెన్నెల్ని పోగొట్టుకున్నామో?? పోగొట్టుకుంటునామో??
    “నిద్రిస్తున్న కళ్ళలో తెరసిన ఆకాశంలోంచి
    జలపాతమై తుంపరలై వర్షిస్తుంది” బాగుంది

  3. Tirunagari Satyanarayana 05 సెప్టెంబర్ 2008 , 12:44 pm

    కవిత బాగుంది. ఊహ బాగుంది. అయితే నిర్మాణమే కొంచెం సరి చూసుకుంటే బాగుండేది. వీలయినంత వరకు క్రియలు తగ్గించి, వాచ్యంగా ఉండే వాక్యాలు (బస్సుదిగి ఇంటిమెట్లెక్కుతూ గుర్తుకొచ్చి జేబులోనో సంచిలోనో చెయ్యిపెడితే ఎంతకీ దొరకదు) లాంటివి తగ్గిస్తే ఇంకా బలంగా ఉండేది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)