మాయమైపోతున్నాడు మనిషి!

- ప్రొ॥ జి. హరగోపాల్

ఒక సంవత్సరం క్రితం (25 ఆగస్టు 2007) లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో జరిగిన అమానుష మైన బాంబు పేలుళ్ళలో దాదాపు నలభై మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన మీద ఒక తెలుగు టి.వి. చానెల్ ఘటనా స్థలం లోనే నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బాధితుల అనుభవము, ఆక్రందన చూస్తే మనం ఎంత దిగజారిన సామాజిక వ్యవస్థలో బతుకుతున్నామో అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. బాధితులు అన్ని రకాల వ్యక్తుల, వ్యవస్థల, సంస్థ ల పట్ల ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

వాళ్ళు ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను, రాజకీయ పార్టీలనే కాక చుట్టూ ఉన్న మనుషులను వాళ్ళ నిర్లక్ష్యాన్ని సామాజిక బాధ్యతారాహిత్యాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు. వాళ్ళు పౌరహక్కు ల, మానవహక్కుల సంఘాలను కూడా వదలలేదు. మొత్తం వ్యవస్థ సంక్షోభాన్ని దిగజారుతున్న మానవ విలువలను, సామాజిక తత్వం పట్ల తమ తీవ్ర ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఇక ఈ వ్యవస్థ ఇలా కొనసాగడం సాధ్యంకాదేమో అన్న ధ్వని అందులో వినిపించింది. రాజ్య వ్యవస్థ మనుషుల ప్రాణాల్ని కాపాడేందుకు, దానికి రక్షణ కల్పించేందుకు ఆవిర్భవించిందన్నది ఉదారవాద సిద్ధాం తానికి కీలక భూమిక.

ఎక్కడ ఎప్పుడు మనుషులు అసహ జంగా మరణించినా రాజ్యం తన మౌలిక బాధ్యతను విస్మ రించినట్టే. రాజ్యాన్ని, రాజ్య అధికారాన్ని చలాయిస్తున్న వారికి కనీస అవగాహన ఉండాలి. సమస్యల్లా ఈ స్పృహ అధికారంలో ఉన్న వాళ్ళు కోల్పోయారు. ప్రతి వైఫల్యాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని అధికారాలు కావాలని , పోలీసు బలగాల్ని ఇంకా పెంచాలని, మరింత పదునైన, పరుషమైన చట్టాలు కావాలని వాదిస్తున్నారు తప్ప, తాము నిజంగా ఎందుకు వైఫల్యం చెందుతున్నామో కార ణాలను తెలుసుకొనడం లేదు. ఇప్పుడు కావలసింది ఎక్కడ ఏ అమాయకుడు అసహజంగా మరణించినా అది తమ వైఫల్యమని బాధపడే మనసుండాలి.

సామాజిక బాధ్యత ను గుర్తించే స్పృహ ఉండాలి. అలాంటి స్పృహ మొత్తం యంత్రాంగంలో ఉంటే అప్రమత్తత కూడా సహజంగా అలవడుతుంది. ఇలాంటి సంఘటనలు మానవ వైఫల్యాలుగా చూడగలిగిన దృష్టి ఉండాలి. తమపై సమాజం పెట్టిన బాధ్యత గుర్తిస్తే చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. సామాజిక వ్యవస్థను ప్రశ్నించిన వారిని వెతికి, వెతికి వేటాడుతున్న యంత్రాంగం అంతర్గతంగా సామాజిక గర్భంలో ఉండే హింసను గుర్తించడం లేదు. ఒక సంవవత్సరం క్రితం ఇంత మంది చనిపోతే ఇంతవరకు దోషుల గురించి, కనీస సమాచారం కూడా సేకరించక పోవడం చాలా విచారకరమైన విషాదకర అంశం.

బాధితులు పోలీసు యంత్రాంగ వైఫల్యానికి కారణం రాజకీయ నాయకులు అని తిట్టి పోసుకున్నారు. పోలీసు వ్యవస్థకు సామాజిక నిర్వహణలో అతి పరిమితమైన పాత్ర ఉంటుంది. రాజకీయ వైఫల్యాలన్ని శాంతి భద్రతల సమస్యలుగా ఊహించి రాజకీయ రంగం వాటిని పోలీసుల మీదికి నెట్టి వేస్తున్నది. అయితే చారిత్రక అవగాహన లేని పోలీసు ఉన్నతాధికారులు లేనివి ఉన్నవి అన్నీ తమ నెత్తిలో వేసుకుంటున్నారు. రాజకీయ వ్యవస్థ చేయవలసిన పనేమిటి? పిల్లలు సాయంత్రం ఆడుకునే స్థలంలో బాంబులు పెట్టిన క్రూరత్వానికి మూల కారణాలు వెతకాలి.

పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటే రాజకీయ రంగం సమస్య మూలాల లోకి వెళ్ళాలి. కేవలం బల ప్రయోగం మీద ఆధారపడే రాజకీయాలు రాజకీయాలే కాదు. అవి అరాచకీయాలు. చారిత్రిక విషాదమేమంటే, చారిత్రిక అవగాహన, సామాజిక స్పృహ, తాత్విక దృక్పథం, మానవీయ విలువలు గౌరవించని పాలక ముఠా రాజ్యాన్ని నడుపుతున్నది. రెండు మూడు దశాబ్దాల క్రితం లుంబిని పార్కు లాంటి సంఘటనలు లేవు. ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే కమిటీలు వేసేవారు. పరిశోధనను ప్రోత్సహించేవారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలను మానివేశారు. అంటే సమస్యలకు రాజకీయ పరిష్కారాలు వెతకడం మానేశారు.

అందుకే ప్రజలకు రాజకీయాలంటే అసహ్యం కలిగేలా పరిస్థితి మారింది. రాజకీయ వ్యవస్థ తన క్రియా శీలత కోల్పోతే సమాజం ఎంత సంక్షోభానికి గురౌతుందో లుంబినీ పార్క్ చేదు అనుభవం ఒక విషాద దృష్టాంతం మాత్రమే. బాధితులు రాజకీయ వ్యవస్థ మీద మాత్రమే కాక తమ చుట్టూ జీవిస్తున్న మనుషుల పట్ల, సామాజిక వ్యవస్థ పట్ల అంతులేని ఆగ్రహాన్ని వ్యక్త పరచారు. ముఖ్యంగా బాధిత మహిళల రోదన చూస్తుంటే, వాళ్ల అనుభవాలను వింటుం టే మనం మనుషుల మధ్యనే జీవిస్తున్నామా అనే అనుమా నం కలుగుతుంది.

ఒక బాధితురాలు తనను ఒక మామూలు మనిషిగా మారనివ్వడం లేదని, తాను నవ్వినా తనను తప్పు పట్టే ఒక దుర్మార్గం మధ్యన తాను జీవించవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. పిల్ల వాడిని కోల్పోయి న మరో మహిళ తన బాధను అర్థం చేసుకోవడం అటుంచి ,సానుభూతి లేని మనుషుల మధ్య జీవిస్తున్నందుకు తీవ్ర వేదనకు గురౌతున్నానని చెపుతూ తన బాధను అర్థం చేసు కోవడానికి ప్రతి తల్లి ఒక పిల్లవాడిని ఇలా కోల్పోతే తప్ప ఇది సాధ్యం కాదా అని ఆగ్రహంగా ప్రశ్నించింది. మానవ అస్తిత్వాన్ని ప్రశ్నించే ప్రశ్న ఇది.

రాజకీయ సామాజిక జీవనం ఎందుకు ఇంత దుర్భరంగా మారుతున్నదన్న ప్రశ్న మన ముందు ఒక పెద్ద సవాలుగా నిలబడింది. సమకాలీన ప్రపంచం మారుతున్న తీరును చూస్తుంటే ప్రతి మనిషికి ‘తన స్వార్థం, తన సౌఖ్యం’ చూసుకోమనే ఒక తప్పుడు అవగాహన ఇప్పు డు విపరీత ప్రచారంలో ఉంది. మనుషులు తమ స్వప్రయోజనం కొరకే జీవించాలనే అభివృద్ధి సిద్ధాంతం మనుషులకు ఎలాంటి విలు వ లు కానీ, కనీస ప్రమాణాలు కానీ నిర్దేశించడం లేదు.సహజీవనమూ, సహ భావన ఇక చరిత్రలో సాధ్యం కాదన్న వాదనను ముందుకు తీసు కువచ్చారు.

మనకు తెలియకుండానే మనలో చాలా మందిమి ఈ ఆలోచనా క్రమంలో భాగస్వాములం అయ్యాం. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ సంఘటనల తరువాత రాష్ట్రంలో ఎంత స్పందన రావాలో అంత రాలేదు. ఇవ్వన్నీ జరుగుతూనే ఉంటాయి అన్న ధోరణి కనిపించింది. అలాగే అహ్మదాబాద్‌లో మొన్న జరిగిన బాంబుపేలుళ్ల సమ యంలో నేను ఆ నగరం నడివీధిలో ఉన్నాను. ఒకవైపు బాంబులు దద్దరిల్లుతుంటే అదే పట్టణంలో మరో ప్రాంతం లో జీవితం చాలా సాఫీగా సాగుతున్నది. ఆ పేలుళ్ళతో మనకేం సంబంధం అన్నట్టు ఉన్నారు.

ఎక్కడా మనుషులు భయపడ్డట్టు కాని, బాధ పడ్డట్టు కానీ కనిపించలేదు. గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రమే. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమే. కాని ఈ అభివృద్ధి సునా మీలో మనం కోల్పోతున్నది మనిషిని. ‘మాయమై పోనాడ మ్మా మనిషన్న వాడు’ అన్న అందెశ్రీ పదాలు ఎంత నిజం అనిపిస్తుంది. అభివృద్ధికి మానవ ముఖం (హూమన్ ఫేస్) తోడవా లని ప్రపంచ బ్యాంకు అంటున్నది. నిజానికి అభివృద్ధే మానవీయంగా ఉండాలి. పశు శరీరం మానవ ముఖంతో పశుత్వాన్ని ప్రేరేపిస్తుంది కానీ మానవీయతను ఎలా కలిగిస్తుంది?

మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషిస్తూ -ఆ వ్యవస్థ వస్తూత్పత్తిని ఎంత పెంచినా, ఎంత అభివృద్ధి సాధించినా, అది మనిషిని వస్తుమయ మాయాజాలంలోకి నెట్టుతుందనీ, పరాయీకరణ చెందిన మనిషి సహజంగా జీవించడం సాధ్యం కాదు కాబట్టే పెట్టుబడిదారీ దశను దాటి మరో ఉన్నతమైన సామాజిక వ్యవస్థను సాధించు కుంటాడనీ- ఆ పరిణామం అనివార్యమన్న ఒక చారిత్రిక గమ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. నిజానికి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న జిడిపి ఎంత పెరుగుతున్న ది, వృద్ధి రేటు ఎంత అన్నది కాదు. సమాజం ఎంత మాన వీయంగా ఉన్నదన్నది ప్రశ్న.
(రచయిత రాజనీతిశాస్త్ర ఆచార్యులు)

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: ఆగష్టు 29. 2008

2 అభిప్రాయాలు

  1. anonymous 31 ఆగస్టు 2008 , 11:51 am

    ఈ విషయాలు మీరు 1980 లో చెప్పిఉంటే బాగుండేది. అప్పుడు ప్రజలకి పనిలేకపోతే, ప్రభుత్వాలు పని కల్పించలేకపోతున్నాయని గొడవ, ఇప్పుడు అందరికీ పని దొరుకుతోంది, మనిషి మాయమైపోతున్నాడని గొడవ.

    మీరు ఏ వాదాన్ని సమర్ధిస్తున్నారు, అలాంటివాదం పనిచేస్తున్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఏంటి, వాళ్లిప్పుడు ఎటువైపుకి మళ్లుతున్నారు? ఇప్పుడు చైనా ఏంచేస్తోంది?

    మనమెప్పుడు అర్ధం చేసుకుంటాం?

  2. Vipul 01 సెప్టెంబర్ 2008 , 2:05 am

    ఈ అనానిమసు మనిషి తన పేరు చెప్పకుండానే మాయమౌతున్నాడు. అందరికీ పనులు దొరుకుతున్నాయట. ఎటువంటి పనులు ఎవరెవరికి దొరుకుతున్నాయి. భూములు అగ్రకులాల వాళ్ళకు, మార్వాడీలకు, రాజకీయులకు. లాఠీలు పట్టుకుని ఈ వ్యవస్థని, వాళ్ళ సమ్పదని, వాళ్ళ విధానాలకి కాపలాకాసే వేలవేల కానిస్టేబులు ఉద్యోగాలు దళితులకు, అగ్రవర్ణ పేదలకు. అంతకుమించి ఉద్యోగాలుండవు. ఉపాథిహామి గ్రామాలను తొక్కిపెట్టి ఉంచే ఒక మాయ. ఒక అభూత కల్పన. ఇటీవల లంబాడీలను ఫాబసిటి నుంచి పోలీసులచేత తరిమికొట్టించారు మార్వాడీలు. దేశంలో ప్రత్యాన్మాయ ప్రభుత్వాన్ని టాటా, బిర్లా, అంబానీలు నడిపిస్తున్నారు. సహజవనరులు వాళ్ళ చేతుల్లోకి, ఉద్యోగాలిచ్చే శక్తి వారికే, అంతా వారికే.. మనిషన్నవాడు మాయమవక మరేమవుతాడు. అధిక జీతాలిచ్చే సాఫ్ట వేరు ఉద్యోగస్థులు కూడా విదేశీయుల సర్వీసులకోసమే. పేరు చెప్పకుండా మాయమైన ఈ అనానిమసు మనిషి ఎటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడో. ఇతడికి మార్పు అవసరంలేదు. రాజకీయనాయకులకు, పెట్టుబడిదారులకు జై కొట్టి ఊరుకుంటే చాలు.

    మన ప్రభుత్వాలు కావాలనే సామాజిక శాస్త్రాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి వాళ్ళను తయారుచేయడానికే.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)