మా… తుఝే సలామ్
- అల్లం నారాయణ
ఇక ఇక్కడితో స్వేచ్ఛ అంతమవుతుంది. కనీసం మరో ఏడాది దాకా. అడపాదడపా ఇంటి స్థలం కోసం కూడా తుపాకి తూటాలు స్వీకరించిన వారి స్వేచ్ఛ గురించి మాట్లాడే ఒక సందర్భం రావొచ్చు కానీ, మరో ఏడాది దాకా స్వాతంత్య్రం గురించి మాట్లాడాల్సిందేమీ లేకపోవచ్చు. పొద్దున్నే మెలకువతో ప్రారంభమయింది స్వేచ్ఛ. ‘మా తుఝే సలామ్’ అంటున్నడు రహమాన్. వందేమాతరం అని ఒత్తి పలికి విరిచి, బహుశా అది బంకింబాబు వందేమాతరం కాకపోవచ్చు.
కాలం మారిపోయింది కదా. ఉన్న గుడ్డలూడదీసి, ఉన్న పందిరి పీకేసీ, పంట భూమిని మృత్యుమండలం చేసి, చేతి వృత్తిని సడుగులిరగగొట్టి, కాటికి పంపే ముందు చిల్లర కాణీలు ఖర్చుకు ఇచ్చే ఒక ఆధునికానంతర అభివృద్ధి మాయాజాల ‘మోహ’ పు కాలం గదా. వందేమాతరం రహమాన్‌ది కూడాను.
ఎప్పటిలాగే ముసలితనం అంటని గొంతుతో లతామంగేష్కర్ పాట. మైకుల నిండా ఒక్కరోజు కోసం పొంగి ప్రవహిస్తున్న దేశభక్తి. ‘మేరె వతన్‌కీ లోగో… జో షహీద్ హుయే హై ఉన్‌కీ.. జర యాద్ కరో ఖుర్బానీ’… త్యాగాల చాలు పోసి… వద్దులే త్యాగాలు అజరామరమైనవి. త్యాగ ఫలితాలదే చింత. ఎవరి స్వాతంత్య్రమన్నది ఒక శాశ్వత ప్రశ్న. బహుశా బిలియన్ డాలర్ల ప్రశ్న. డాలర్ దోపిడి… అవును. దేశభక్తి ‘డాలర్ డ్రీమ్స్’కూ ఉంటుంది. కార్పొరేట్లకూ ఉంటుంది. ఒక్క రోజు దేశభక్తి సినిమా నటులకూ ఉంటుంది.
అంతా దేశభక్తి… అవునూ ఎవరి విముక్తికోసం ఎవరి బంధనాల నుంచి స్వేచ్ఛకోసం, ఎవరి ఆర్థిక దోపిడినుంచి, వనరులు కొల్లగొట్టడంనుంచి, వివక్షనుంచి, ఇక్కడి పత్తినీ, మస్లిన్ గుడ్డనూ, సహస్ర వృత్తులనూ, సకల వైభోగాలనూ రైలు పట్టాలమీదుగా తరలించుకుపోయిన ఒకానొక మృత్యుశీతలకాలం మీద గదా పోరాటం… తెల్లవాడిని తరమడం. షహీద్ ఎవరు! భగత్‌సింగ్ గుర్తున్నాడా. చిరునవ్వుతో ఉరికొయ్యలకు ఊగులాడిన ఒక మహాయోధుడి జ్ఞాపకం. చివరికి మిగిలింది. ఒకపరి స్వేచ్ఛకోసం మాట్లాడదాం.
అంతరించిపోతున్న వ్యవసాయంలో, అంతరించిపోయిన వృత్తుల నిపుణతల్లో, కాలు చెయ్యి కూడ దీసుకునే శక్తిలేని అన్నదాతల పురుగుమందుల పెరుగన్నం చావు విందుల గురించి మాట్లాడదాం. నిజమే దేశీయ వనరులను కొల్లగొట్టిన రవిగ్రుంకని మహా సామ్రాజ్యవాదంమీద మోగించింది నగారా. నిజమేనా? దేశీయ వనరులు కోటాను కోట్ల పుట్టెడు భారతీయులకు ముట్టినట్టేనా ఆరు దశాబ్దాలు కన్న రుతువులు ఏమిచ్చినట్టు? ఏమి పొందినట్టు. ఈ దేశం మీద మట్టి పిసుక్కుని బతికే ఏ శ్రమజీవి బతుకు ఒడ్డెక్కినట్టు? ఏ హక్కు నెరవేరినట్టు, ఏ స్వేచ్ఛ పురివిప్పినట్టు “అయినా స్వేచ్ఛ ఒక దుకాణం కాదు.
ఒక అయ్య అమ్మడానికి, ఒక అమ్మ కొనుక్కోవడానికి'’ నిజమే కదా… ఏ సామ్రాజ్యవాదంనుంచి ఏ విముక్తి లభించినట్టు. మహాత్మా… ఏ కలలు సాఫల్యమైనట్టు. ఒక పరాజిత భారతం. ‘ఇంట్లో బియ్యం నిండుకున్నాయి.’ సూర్యుణ్ని పైకెత్తడానికి వెళ్లిన కొడుకు తిరిగి రాలేదు. బహుశా అతను లేడు. బివేర్ ఆఫ్ భగత్ సిం గ్ మెమొరీ! అతను ఈ దేశానికి ఆనాడే తిరుగుబాటు నేర్పాడు. ఒక ఆయుధధారియై, బాంబులు విసిరి పథనిర్దేశనం చేశాడు..కానీ… కానీ…. ఇప్పుడు అప్పటంత స్పష్టంగా ఉండడు శత్రువు. అతను జాత్యహంకారంతో గాంధీని రైల్లోంచి తోసేయడు.
అతను పచ్చిగా, నిక్కచ్చిగా వ్యాపారం మీద ఆధారపడి, పారిశ్రామిక విప్లవపు మహా మంద సరుకును, కంపెనీ వస్తుసామగ్రిని దేశంలోకి దించి మొరటుగానూ, నాటుగానూ, తెలిసి పోయేట్టుగానూ, తేటతెల్లంగానూ చేతివృత్తులను ధ్వంసం చెయ్యడు. స్థానిక సంస్కృతులను ధిక్కరించడు. మలబారులోనూ, మన్యంలోనూ క్రూరంగా వేటాడడు. అతనిప్పుడు సైమన్ కాదు, కర్జన్ కాదు. పడక గదుల్లో మెత్తగా పరుచుకున్న మస్లిన్ గుడ్డ రహస్యం మాత్రమే తెలిసినంత అమాయకుడు కాడు. ఇప్పటివాడు. మహా మాయలమారి. అతను నీ శవం మీది చిల్లర నాణేలు ఏరి నీ అంత్యక్రియల చావు ఖర్చులకు ఇవ్వగలిగినంత చతురుడు.
మింగేదాకా తెలియని ఒక కూకేటి పాము. ముందుగా అతను నీకు అప్పిస్తాడు, ఆ అప్పుకు బదులు అనేక తప్పుడు పనులు చెప్తాడు. చివరకతను అప్పుల కోటలు కట్టి కుప్పలుగా ప్రయోజనాలు పొందుతాడు. ఎట్లా బతకాలో చెబుతాడు. ఏమి తినాలో చెబుతాడు. ఏ పంట భూముల్లో… నీ అడుగూ అడుగూ కలిసిన నీ పంట భూమిలో ఏ పంట వేయాలో చెబుతాడు. నీ దేశాన్ని నువ్వు రక్షించుకోవడానికి ఏ అణ్వాయుధాలు వాడాలో చెబుతాడు. ఏ కంపెనీలు ఎక్కడ పెట్టాలో చెబుతాడు. నీ భూములు ప్రత్యేక మృత్యుకూడళ్ల రహదారులైనప్పుడు అతను అవన్నీ లక్షలాది ఉద్యోగాల పరికల్పన కోసం అనివార్యమంటాడు.
ఒక తోలుబొమ్మలాట నడుస్తుంటుంది. బహుశా మీట ఎక్కడుంటుంది? ఏ మీట నొక్కితే ఎవరు ఎలా తలలూపుతారో? పార్లమెంటులను అడుగు. ప్రభుత్వాలను అడుగు. అపూర్వ సహోదరులైన చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలను అడుగు. ప్రపంచ బ్యాంకు, అప్పులు, విధివిధానాల్లో ఒకే ఒక్క బాటన నడిచే అన్ని రాష్ట్రాల ఏలికలను అడుగు.. ఆ ఒక్కటీ అడగకు. ఎవరి పెత్తనం కింద ఎవరు అణగారిపోతున్నారో అడగ కు..బహుశ అది దేశద్రోహం కావొచ్చు. ఒక్కరోజు దేశభక్తి కొసం…. రింగుటోన్ మోగుతున్నది. దేశభక్తి పాట.. ఎవరి త్యాగాలను ఎవరో కీర్తిస్తున్నా రు. ఎవరో వేదనతో పాడుతున్నారు.
పచ్చని పంటపొలాలు, ఇంటి జాగాలు ప్రత్యే క ఆర్థిక కాదు కాదు.. మృత్యు మండళ్ల కోసం «ఖాళీ చేసిన ప్రజలు వీధుల్లో అడుక్కుంటున్నారు. ఈ ఒక్కరోజు కొంచెం స్వేచ్ఛను కొత్తతరహా స్వాతంత్య్రాన్ని. ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు డెబ్భైయ్యారు సెజ్‌ల్లో 80 వేల మందికి ఉద్యోగా లు. అది సింగూరు కావొచ్చు. అది నందిగ్రామ్ కావొచ్చు. అది పోలేపల్లి కావొచ్చు. అది కృష్ణ పట్నం కావొచ్చు ‘సెజ్’లు కాళ్లకింది నేలను లాగుతున్న ప్రత్యేక తరహా వారి స్వాతంత్య్రం. సిరిమంతుల ప్రత్యేక స్వేచ్ఛ ఇప్పుడిక స్వేచ్ఛ కోసం ఒక్కరోజు కాదు. మున్నూటా అరవై ఐదు రోజులూ స్వేచ్ఛ కోసం సూర్యుడిని ఎత్తిపట్టే వాళ్లకోసం వీధులు ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు దేశభక్తితో ‘మాతుఝే సలామ్ ‘.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: ఆగష్టు 15, 2008