పార్లమెంటులో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెసు ప్రభుత్వం, జార్జ్ బుష్ తో “అణుఒప్పందం” చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పైకి న్యూక్లియర్ రియాక్టర్లకు అవసరమయ్యే యురేనియం ఇంధనం సమకూర్చుకోవటం యీ ఒప్పంద లక్ష్యమైనా, దీనివెనక ఎంతో రహస్య ఎజెండా వుంది. అంతర్జాతీయ మార్కెట్టులో యురేనియం, ప్లూటోనియం ఖరీదు చేయాలంటే, అమ్మడానికి సిద్ధంగా ఎన్నో దేశాలున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనటానికి అవకాశమున్నది. మరి అమెరికా నిబంధనలకు తలవగ్గాలిసిన అవసరమున్నదా?

భారతదేశ విదేశాంగవిధానాన్ని యుద్ధోన్మాద అమెరికాకు తాకట్టుబెడుతూ, లాలూచీలతో, రహస్య ఒప్పందం చేసుకోవటం దేశప్రయోజనాలకు వ్యతిరేకం కాదా? అసలు ఒప్పందపత్రాన్ని జనానికి తెలియకుండా, పార్లమెంటుకు చూపకుండా రహస్యంగా వుంచటం ఎంతవరకు సమంజసం. పచ్చిఅబద్దాలు చెప్పి ఇరాక్ ప్రజలపైన యుద్ధానికి పాల్పడిన అమెరికా అధ్యక్షుడు, పదిలక్షల ఇరాకీప్రజల మరణానికి కారణమైన జార్జ్ బుష్ ప్రపంచప్రజల దృష్టిలో, ఆఖరికి అమెరికాలోను విశ్వసనీయతను కోల్పోయాడు. పదవీకాలం ముగిసే లోగ ఎదోవొక ఒప్పందం చేసి గుర్తింపు పొందాలని యీయన తాపత్రయం.

యీ ఒప్పందం వెనక చాలా బ్యురోక్రసీ వున్నది. అణ్వాయుధాల వ్యాప్తినిరోధక ఒప్పందం( NPT), దీనిని అమలుపరిచే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA), యురేనియం అమ్మే న్యూక్లియర్ సప్లై గ్రూపు (NSG), అమెరికా కాంగ్రెసు చేసిన హైడ్ చట్టం (HYDE Act), 123 ఒప్పందం ఇలా చాలా చాలా వున్నాయి. 1970 అమలులోకి వచ్చిన అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పైన దాదాపుగా 187 దేశాలు సంతకాలు చేసాయి. భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రెయిల్, ఉత్తరకొరియా యీ ఒప్పందానికి అంగీకరించలేదు.

యీ ఒప్పందం ‘సంతకం చేసిన దేశాల’ను రెండు రకాలుగా వర్గీకరిస్తంది. 1) అణ్వాయుధాలు కలిగిన దేశాలు ( Nuclear Weapon States):
ఆ కాలంలో అణ్వాయుధాలు కలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, ప్రాన్స్, చైనాల దగ్గర వున్న అణ్వాయుధాలను అణ్వాయుధాల వ్యాప్తినిరోధక ఒప్పందం(NPT) చట్టబద్దం చేస్తుంది. యీ దేశాలు ఎలాంటి నిబంధనలు, పరీక్షలు ఎదుర్కోవలసిన అవసరం లేదు. అణ్వాయుధాలు కలిగిన దేశాలు అణ్వాయుధాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు అందించకూడదు.

2) అణ్వాయుధాలు లేని దేశాలు (Non- Nuclear weapon States):
అణ్వాయుధాలు తయారు చేయకూడదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ( IAEA) నిబంధనలు, పరీక్షలు ( Inspections) ఎదుర్కోవాలి. దేశప్రయోజనాల కోసం శాంతియుతమైన అణుశక్తి కార్యకలాపాలు సాగించవచ్చు.

ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అణ్వాయుధాలు కలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, ప్రాన్సు,ఇజ్రాయిలీలు , ఇతరదేశాలకు నీతులు చెపుతున్నాయి. ముందుగా తమ దగ్గరవున్న అణ్వాయుధాలు ధ్వంసం చేసిన తర్వాత ఇతరులకు నీతులు చెబుతే బాగుంటుంది కదా! వాస్తవానికి అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) చాలా మోసపూరితమైనది. అగ్రరాజ్యాల దగ్గరవున్న విధ్యంసక అణ్వాయుధాలను చట్టబద్దంచేస్తూ, ఇతర దేశాలపైన ఆంక్షలు, నిబంధనలు పెడుతుంది యీ ఒప్పందం. ఇజ్రాయిలు, పాకిస్థానులు అణ్వాయుధాలు తయారుచేయడానికి రహస్యంగా సహాయం చేసిన అమెరికా; అలాగే ఉత్తర కొరియా,ఇండియాలకు సహాయపడిన రష్యా, చైనాలు ఎన్.పి.టీ ఒప్పందాన్ని ఎప్పుడో ఉల్లంగించాయి. భారతదేశం “అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం” (NPT) పైన సంతకం చేయకపోయినా, ఆచరణలో మటుకు దాని నిబంధనలను పాటించాలని ప్రయత్నిస్తుంది.

అమెరికా ప్రభుత్వం చేసిన హైడ్ చట్టం ( Hyde act) లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇండియా ఆపాలని నిబంధనలు పెట్టింది. అంటే అమెరికా కనుసైగలతో ఇండియా నడుచుకోవాలి. అమెరికా ఆజ్ఞతో “అంతర్జాతీయ అణుశక్తి సంస్థ” (IAEA)లో ఇరాన్ వ్యతిరేకంగా భారతదేశం ఓటువేసింది. జాతీయ ఇంధనావసరాలకు ఎంతో కీలకమైన ఇరాన్-పాకిస్థాన్-ఇండియా గ్యాసు పైపులైన్ ప్రాజెక్టు దెబ్బతీసింది.

1947 తర్వాత భారతదేశం విదేశాంగవిధానం చాలా కాలం సోవియట్ యూనియన్ ప్రభావం లోనే వుండింది. గతంలో బిజెపీ, ఇప్పటి కాంగ్రెసు ప్రభుత్వాలు సామ్రాజ్యవాద అమెరికా, దురాక్రమణదారీ ఇజ్రెయిలీలకు ఊడిగం చేసాయి. అలీనావిధానమని ఎన్ని నాటకాలు పడినా భారతదేశ విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగా లేదు. అమెరికా ఏజెంటు ప్రపంచబ్యాంకు భారతప్రభుత్వ విధానాలను నియంత్రిస్తూనే వుంది.

ఇండియా-అమెరికా అణుఇంధన ఒప్పందం వల్ల నష్టాలు ఏమిటి?
- ఇండియాలోని న్యూక్లియర్ రియాక్టర్లు IAEA పరీక్షలు, నిబంధనలను ఎదుర్కోవాలి. - అమెరికా అనుమతి లేనిదే ఇండియా ఎవరి దగ్గర యురేనియం కొనకూడదు.
- IAEA ఆంక్షలకు, మోసపూరితమైన NPT ఒప్పందాలకు కట్టుబడివుండాలి.
- అమెరికా అడుగులకు ఇండియా మడుగులు వత్తాలి. - అమెరికా సామ్రాజ్యవాద కుట్రలో ఇండియా భాగమై ఇరాన్ కి వ్యతిరేకంగా పనిచేయాలి. ఇజ్రాయిలీ దురాక్రమణలను బలపరచాలి.
- అమెరికా కొనసాగిస్తున్న తప్పుడు విదేశాంగవిధానాలను, ఇరాక్ లో అమెరికా దురాక్రమణను భారతదేశం బలపరచాలి. అమెరికా సాగిస్తున్న సామ్రాజ్య మిలటరీదురాక్రమణ లో భారతదేశం పావు అవుతుంది.
- అమెరికా ఆయుధ దళారుల దగ్గర బిలియన్లతో విధ్వంసక ఆయుధాలు కొనటం.
- భారతదేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి, సామ్రాజ్యవాద అమెరికాకు గులాంగిరి చేయటం, అమెరికా యుద్ధోన్మాదాన్ని పెంచిపోషించటం.
- భారతదేశ విద్యుత్తు ఉత్పాదనలో అణుశక్తి కేవలం 3%, మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయక ఇంధనవనరులాంటి సోలార్ ఎనర్జీ మరియు హైడ్రో ఎనర్జీలను పెంపొందించుకోవచ్చు.

కాంగ్రెసు పార్టీ ప్రజావ్యతిరేక విధానాలలో భాగస్వామి అయిన సి.పి.యం, సి.పి.ఐ పార్టీలు నాలుగు సంవత్సరాలు తర్వాత నిద్రలేచి మద్దత్తును వాపసుతీసుకున్నాయి. రాజకీయ దళారి అమర్ సింగ్, ములాయం సింగ్ లు నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. దేశంలో ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోవటం, నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్యహత్యలను ఏమాత్రం పట్టించుకోకుండా, మన్మోహన్ సింగ్-సోనియా నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ కేవలం అణుఇంధన ఒప్పందాన్ని పట్టుకొని వేలాడుతుంది. త్వరలో పతనమౌతుంది. భారతదేశ సార్వభౌమధికారాన్ని తాకట్టు పేటే అణుఒప్పందాన్ని ప్రవాసభారతీయులు, అంతర్జాతీయకార్మికులు, విద్యార్ధులు, దళితులు, సాహిత్యకారులు వ్యతిరేకిస్తూ ఉద్యమించాలసిన అవసరమున్నది.

- సాజీగోపాల్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)