- సిహెచ్. ఉషారాణి, హైదరాబాదు

హఠాత్త్ పరిణామాలేమీ కాదు
తలారా నూరిపోస్తున్నవే
మార్చి మార్చి
పూలపొట్లాలలో చుట్టితెచ్చిన నాన్నగుండె బరువును తరుముతూన్న నేనే
పదే పదే నా ప్రతిబింబాన్ని పదిల పర్చుకొటున్న నేనే

ప్రతిసారీ గోడచాటుగా తడికళ్ళను తుడిచే పట్టుచీరకొంగు
పెళసుకట్టీ ఎండుపూల వాసన వేసే అదేచీరను సరిచేస్తూ నేనే
కరపత్రాలంత చీప్‌గా చూపుల్ని సారించినా
బలిపీఠపు శివార్లకి వేళ్ళాడాల్సిందే
ఎవరెవరికో ఆస్వాదనలుగా నిలబడాల్సివచ్చినా
ఉరికంబం కొసల్లో కొట్టుకోవల్సిందే
కాంతివలయాలను కప్పుకొన్నది నల్లగులాబీనే అన్నంత నిజంగా
అన్నంత సహజంగా వుంటుంది మీకు.
బేరసారాలు, వేలంపాటలు నాముందే జరిగిపోతుంటాయి
నిలువెల్లా చెట్టునుచేసి నరుక్కుపోతూనే వుంటారు
తప్పదు సిగ్గుల పరదాల్ని జీరాడేసుకోవాల్సిందే
అరిగిపోయవా అని అడక్కు
వెనుదిరిగిన ఎన్నో అవమానాలు
మేటయైన కొండమీదుగా
పదేపదే ముసురు మేఘాన్నవుతూనే వుంటాను
అసహనంగా పెదవుల చివరిమాటల్ని దిగమ్రింగినా
తడబాటు అడుగుల్ని వేసినా అనుమానమే
పనికిరాని వస్తువుగా నన్ను తీర్చిదిద్దుతారు
అయినా తప్పదు
సిగ్గు పరదాల్ని జీరాడేసుకున్న బేలతనానికి
సిద్దంకావలసిందే మళ్ళీ మళ్ళీ
ఏ ఘడియన పరాయిగా పేరుపెట్టిపిలిచావో
ఒంటరిగా విరక్తి గూడుల్ని నిర్మించుకోవడం మొదలుపెట్టాను
నా ప్రతి కదలికకూ ఎప్పుడైతే సున్నితత్వాన్ని ఆపాదించావో
కుమిలి కుమిలి సున్నితత్వాన్ని కోల్పోవడం మొదలెట్టాను
నీ ప్రయత్నాలన్నీ ఆప్యాయతల రేణుల్ని చీలుస్తున్నట్లే తోస్తాయి
ప్రతి అర్థరాత్రి గుండెమీద చేయితీసి వులిక్కిపడిలేస్తున్నా
ఓసారి అరిగిన చెప్పులుగా వేసారినా!
ఓదారి తూనికరాయిలా తొణికసలాడినా!
నీ మీద ఏమాత్రం జాలిచూపలేను! నాన్నా!
నేనీలోకాన్ని ముద్దిడికమునుపటిమాట
ఇప్పుడు కళ్ళముందు కదులుతుంది కాబోలు
తాతయ్య మున్నీరు తాగేసిన వైన ఇప్పుడు తెలిసింది కాబోలు
మౌనాన్ని ఇంకా మధ్యవర్తిగా మరి ఏమాత్రం వుంచలేను.

ఒక్క అభిప్రాయం

  1. అపూర్వ 25 జులై 2008 , 9:07 am

    “బేరసారాలు, వేలంపాటలు నాముందే జరిగిపోతుంటాయి
    నిలువెల్లా చెట్టునుచేసి నరుక్కుపోతూనే వుంటారు
    తప్పదు సిగ్గుల పరదాల్ని జీరాడేసుకోవాల్సిందే”

    ఎంత సాదాసీదాగా నిజాన్ని చెప్పారు
    అభినందనలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)