అణు ఒప్పందం గురించి రాస్తున్నవారందరూ అపోహలు తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నా రు. ప్రజలకు స్వతహాగా అపోహలు కలగడానికిది సాయిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపానమో కాదు. ఒకరు కలిగిస్తే తప్ప ఈ విషయంలో అపోహలు కలి గే అవకాశం లేదు. ఊహలయినా అపోహలయినా వ్యాఖ్యా తల అభిప్రాయాల వల్ల కలుగుతున్నవే.
ఈ అభిప్రాయాలకు ప్రత్యక్ష ఆధారం మూడే మూడు పత్రాలు. ఒకటి భారత-అమెరికా 123 ఒప్పందం. రెండవది అమెరికా జారీ చేసిన హైడ్ చట్టం. మూడవది భారత్‌కూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఏ)కూ మధ్య కుదిరిన ముసాయిదా ఒప్పందం.
ఈ మూడూ చిన్న పత్రాలే. మూడూ ఇప్పుడందరికీ వచ్చేసిన ఇంగ్లీష్ భాషలోనే ఉన్నాయి. మూడూ కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు అర్థం కావడం పెద్ద కష్టం కాదు. అయినప్పటికీ ఎడతెగని అభిప్రా యభేదాలు ఎందుకున్నాయి? ఈ మూడు పత్రాలలోని విషయాలు అందరికీ స్పష్టంగానే ఉన్నాయి. అయితే అత్యంత స్పష్టమైన సంగతేమిటంటే అవి కీలకమైన అంశాలలో ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టంగా ఉన్నాయనేది. భారత ప్రయోజనాలుగా పాలకపక్షమూ ప్రతిపక్షాలూ కూడ అంగీకరించే వాటికి ఈ అస్పష్టత నష్టకరం అనేది ఒకరి వాదన కాగా, ఏం ఫరవాలేదనేది మరొకరి వైఖరి.
లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ అయితే ఈ అస్పష్టత ‘అత్యవసర పరిస్థితులలో మన ప్రయోజనాలకే లాభదాయకం’ కాగలదని ధైర్యంగా అనేశారు. ఇంత సీరియస్ విషయంలో ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టత ఉందంటే దాని వెనుక బలవత్తరమైన కారణం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 123 ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఏ పరిస్థితులలో భావించబడుతుంది, ఆ పైన ఒప్పందం ద్వారా భారత్ పొందగోరే లబ్ధికి ఏం గతి పడుతుంది అనే నిర్ణయాలు అమెరికా గుప్పిట్లో ఉంచడం ఈ అస్పష్టతకు గల లక్ష్యం. దీనికి సాధనం హైడ్ చట్టం. ఈ సంగతీ అందరికీ అర్థం అయింది.
ఆ కారణంగానే వ్యతిరేకించేవారు ఆందోళన చెందుతుండగా, ఆ కారణంగానే ఒప్పందాన్ని సమర్థించే వాళ్లు ధైర్యంగా ఉన్నారు (ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావించడం లేదు. వాళ్లది వట్టి అవకాశవాదం. అధికారంలో ఉంటే ఈ ఒప్పందం వాళ్లే చేసుకునే వారు). రెండు వైఖరులూ సమకాలీన చరిత్ర పైన ఆధారపడినవే. రెండూ ఆ చరిత్రను వాస్తవికంగా అర్థం చేసుకున్నవే. తన పంచన చేరిన వారి ప్రయోజనాలకు అమెరికా ఎట్టి పరిస్థితిలోనూ నష్టం కలగనీయదు. అంతర్జాతీయ న్యాయసూత్రాలు, ఒప్పందాలూ ఏవీ దీనికి అడ్డురావు.
అట్లాగే తన పంచన చేరని వారిని అదుపు చేయడానికి అమెరికా ఎంత దౌర్జన్యానికైనా ఎంత నీచానికైనా ఒడిగడుతుంది. దానికి సహితం ఏ న్యాయసూత్రాలు, ఒప్పంద సంబంధమైన నియమాలూ అడ్డం రావు. కాంగ్రెస్ పాలనలో భారత్ అమెరికా పంచన ఇప్పటికే కొంతమేరకు చేరిపోయింది, ఇంకా పూర్తిగా చేరబోతుంది. దీనికి ‘వ్యూహాత్మక సహచర్యం’ అని వారూ వీరూ కూడా పేరు పెట్టుకున్నారు. ఆ వ్యూహం ఏమిటంటే ఆసియాలో అమెరికాకు కొరకరాని కొయ్యలుగా ఉన్న ఇద్దరు ప్రత్యర్ధులను నిలువరించడం. ఒకరు చైనా, రెండవవారు ఇస్లాం పేరు మీద అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న పశ్చిమాసియాకు చెందిన వివిధ దేశాలు, సాయుధ సంస్థలు.
రెండంకెల వృద్ధిరేటును వెంటాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కల్పించే పెట్టుబడి అవకాశా లు ఈ వ్యూహంలో ఒక బోనస్ కావచ్చు లేదా దాని ఆర్థిక పార్శ్వంగా భావించవచ్చు. అమెరికాకు ఏం కావాలో స్పష్టంగానే ఉంది. మన పాలకులకేం కావాలి? రాత్రికి రాత్రి అగ్రరాజ్యం అయిపోవాలి. ఒక్క పాలకపక్షమే కాదు, అణు ఒప్పందాన్ని సమర్ధిస్తున్న వారందరూ ఈ ఒప్పందం ద్వారా ఎదురుచూస్తున్న మహద్భాగ్యం అదే. అమాయకుడో తెలివితక్కువ వాడో కానీ రాహుల్ గాంధీ మొన్నటి పార్లమెంటు చర్చలో ఈ మాట నిస్సంకోచంగా అననే అన్నాడు:
‘అణు విద్యుత్తు ఎంత ఉత్ప త్తి కాబోతుంది, మన అవసరాలు ఎంత తీర్చబోతుంది అనేది కాదు సమస్య. భారత్ అగ్రరాజ్యం అవుతుందా లేదా అన్నది సమస్య’. ఆర్థిక సంస్కరణలు ఏమని మొదలుపెట్టి రెండంకెల వృద్ధిరేటు ఏకైక ఆర్థిక లక్ష్యంగా పెట్టుకున్నామోగానీ మానవ అభివృద్ధి సూచికలో ఆఫ్రికాలోని కడు బీద దేశాలతో పోటీపడుతున్న ఇండియాలో అప్పటినుంచి ఈ వికారమైన కోరిక చాలామందిని పట్టుకుంది. దానికి సులభమైన మార్గం అమెరికా చంకనెక్కి కూర్చోవడం. మన్మోహన్‌సింగ్, చిదంబరం లాంటి వాళ్లు మరీ రాహుల్ గాంధీ అంత అమాయకులు కారు కాబట్టి మరీ అంత ఎబ్బెట్టుగా అనలేక, అడిగిన ప్రతి ప్రశ్నకూ డొంక తిరుగుడు జవాబులు చెప్తున్నారు.
అణు విద్యుత్తుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక గణాంకాలను శాస్త్రవేత్తలెవరూ కాదనడం లేదు. ప్రస్తుతం భారత విద్యుదుత్పత్తిలో అది 3 శాతం కూడా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధిరేటును పొంది, నిలబెట్టుకునేట్టయితే 2020 నాటికి అవసరమయ్యే విద్యుత్తులో అణువిద్యుత్తు-మనపాలకుల కోరికలన్నీ ఒనగూడినా కూడ 7.5 శాతం దాటదని దేశ ప్రణాళికా సంఘం 2006లో అంచ నా వేసి చెప్పింది. వృద్ధిరేటు 10 శాతం ఉండేటట్టయితే ఇది ఇంకా తక్కువ ఉంటుంది. ఈ మహాభాగ్యానికి దేశాన్ని ఇతరత్రా ఇంత నష్టకరమైన ఒప్పందంలోకి ఎందుకు నెడుతున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర జవాబేమీ లేదు.
అది ప్రణాళికా సంఘం 2006 ఆగస్టు నెలలో వేసిన అంచనా అనీ, ఇప్పటి అంచనాల ప్రకారం 2020 నాటికి అణు విద్యు త్తు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 9.5 శాతానికి చేరుకుంటుందనీ ప్రభుత్వం అంటున్నది. అదేం పెద్ద సంఖ్యకాదుగానీ దానికయినా ఆధారమేమిటన్న ప్రశ్నకు ఏ జవాబూ లేదు. అసలు హైడ్ చట్టాన్ని గురించే అన్నిటికంటే డొంక తిరుగుడు జవాబు చెప్తున్నారు. 123 ఒప్పందం ఉభయదేశాల జాతీయ చట్టాలను అనుసరించి అమలవుతుంది అని ఆ ఒప్పందమే అంటుంది. అమెరికాకు సంబంధించినంతవరకు అటువంటి ఒక జాతీయ చట్టం హైడ్ చట్టం.
దాని ప్రకా రం 123 ఒప్పందం కొనసాగాలంటే ఇండియా అణు విస్ఫోటనానికి పాల్పడకుండా ఉండటమేకాదు, అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించే పేరిట అమెరికా అంతర్జాతీయంగా అనుసరించే విధానాలకు అనుగుణ్యమైన విదేశాంగనీతి కలిగి ఉండాలి. ప్రత్యేకించి, ఇరాన్‌ను కట్టడిచేసే విషయంలో అమెరికాకు సహకరించాలి. 123 ఒప్పందం చేసుకున్న ఫలితంగా భార త్ ఐఎఇఏ పర్యవేక్షణ కింద పెట్టే పౌర అణురంగానికి ఇక మీదట కేవలం యురేనియం దిగుమతులేకాక అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు, పరికరాల దిగుమతులు లభిస్తాయ ని ప్రభుత్వం అంటుండగా, భారత్ గడచిన యాభై ఏళ్లలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన రీ ప్రాసెసింగ్, హెవీ వాటర్ సాంకేతిక ప్రక్రియలకు సహకారం ఇవ్వడం జరగదని హైడ్ చట్టం అంటుంది.
ఒప్పందంలోని ఏదో ఒక అంశాన్ని భార త్ అతిక్రమించిందని చెప్పి అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నట్టయితే అప్పటిదాకా దిగుమతి చేసుకున్న రియాక్టర్ల జీవితకాలం అవసరమయ్యే యురేనియం నిలవ ఉంచుకునే అవకాశం 123 ఒప్పందంలో ఉందని మన్మోహన్ సింగ్ అంటున్నారు. అయితే హైడ్ చట్టంలో మాత్రం ఎప్పటికప్పు డు నిర్వహణకు అవసరమయ్యే మేరకు మాత్రమే ఇండియా యురేనియం నిల్వలు ఉంచుకోవచ్చునంటుంది. ఒక వేళ అమెరికా తెంపేసుకున్నట్టయితే అణు సంబంధ సామాగ్రిని ఎగుమతి చేయగల ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటామని మన్మోహన్ అంటుండగా, ఇండియా గానీ ఒప్పందా న్ని అతిక్రమిస్తే తాను సహకారాన్ని నిరాకరించడమేకాక ఇత ర దేశాలను కూడ అదే దారిలో పెట్టే బాధ్యత అమెరికా పైన ఉందని హైడ్ చట్టం అంటుంది.
వీటి విషయం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే, హైడ్ చట్టం అమెరికా వారి చట్టం, అది వారికి శిరోధార్యం, మనకు కాదు అన్న అర్థరహితమైన జవాబు చెప్తున్నారు. మనకు 123 ఒప్పందమే శిరోధార్యం అంటున్నారు. అయితే అమెరికా ఆ ఒప్పందాన్ని హైడ్ చట్టం వెలుగులో అర్థం చేసుకుంటుంది కదా అంటే 123 ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన పిదప అది కూడ ఒక చట్టమే అవుతుందనీ, వెనకొచ్చిన చట్టం కాబట్టి ముందొచ్చిన హైడ్ చట్టం పైన దీనిదే బలమనీ న్యాయకోవిదుడయిన చిదంబ రం అంటున్నారు.
ఈ న్యాయసూత్రం బాగానే ఉందిగానీ వెనకొచ్చిన చట్టమే ఈ ఒప్పందం ముందొచ్చిన చట్టాలకు లోబడి అమలవుతుందని చెప్పినప్పుడు దేనిది పైచేయి అవుతుంది? ఇవన్నీ వాదనకోసమే గానీ, 123 ఒప్పందాన్ని చిం చి చెత్తబుట్టలో పారేయాలని అమెరికా నిర్ణయించుకున్ననాడు వారికి ఒక చట్టం అవసరమా? ఒక న్యాయసూత్రం అవసరమా? ఏ న్యాయసూత్రం చూసుకొని అమెరికా ఇరాక్ ను ధ్వంసం చేసింది ? ఇరాన్‌ను బెదిరిస్తున్నది? ఉత్తర కొరియాను లోబరచుకుంది? ఇక్కడే మొదట్లో చెప్పిన విషయానికి తిరిగి వస్తాం. మనం ఎప్పటికీ ఆ స్థితిలో ఉండమని ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్న వారి ధీమా. ఎందుకుండము? మనం ఇంక ఎప్పటికీ అమెరికాతో గొడవ పెట్టుకోము కాబ ట్టి, నమ్మిన బంటుగానే ఉంటాము కాబట్టి.
ఇది ఎంత మంది భారతీయులకు ఆమోదనీయం? కాగా, అసలు అణుశక్తి అభివృద్ధికి అవసరం అన్న అభిప్రాయాన్నే ప్రశ్నించవలసివుంది. వేగంగా అభివృద్ధిరేటు పెంచుకుంటూ పోవలసిందేననీ, దానికి అపారంగా కరెంటు కావలసిందేననీ, అందుకోసం అణుశక్తి అవసరమేననీ దబాయించే తర్కాన్ని ఎందుకు ఆమోదించాలి? ప్రపంచాన్నంతా వలసలుగా పంచుకొని పిడికెడు పెట్టుబడిదారీ దేశాలు సాధించిన కృత్రిమ జీవన శైలిని అందరమూ ఎందుకు అనుకరించాలి? ఒక వేళ అనుకరిస్తే ఈ భూమి, ఈ ప్రకృతి తట్టుకోగలవా? రెండంకెల విధ్వంసక వృద్ధిరేటు మన లక్ష్యం ఎందుకు కావాలి? ఆ విధ్వంసానికొక చిహ్నం అయిన అణుశక్తిని ఎందుకు ఆహ్వానించాలి? అది చవక అని కొన్నాళ్లు అన్నారు.
ఇప్పుడు కాదని ఒప్పుకొంటూ కూడ ప్రత్యక్ష కాలు ష్యం లేని కారణంగా ‘శుభ్రమైన’ ఇంధనం అని దానిని కీర్తిస్తున్నారు. పొగ, మురికి నీళ్లు అణుశక్తి కేంద్రాల నుంచి బయటకు రాకపోవచ్చును గానీ ప్రాణాంతకమైన అణు ధార్మిక కాలుష్యం నిరంతరాయంగా ప్రసారం అవుతూనే ఉంటుం ది. ఆ విషయం గ్రహించి ఒక్క ఫ్రాన్స్‌ను మినహాయించి తక్కిన అభివృద్ధి చెందిన దేశాలు పౌర రంగంలో అణు సాంకేతిక ప్రక్రియలను విసర్జించాయి. ఆ కారణంగా తమ దగ్గర పోగుపడ్డ సాంకేతిక ప్రక్రియలనూ పరికరాలనూ అమ్ముకోవడానికొక మార్కెట్ అవసరం జనరల్ ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకొచ్చింది. దాని పర్యవసానమే ‘అణుశక్తి పునరుజ్జీవనం’ గురించి అమెరికా వంటి దేశాలు ఇప్పుడు చేస్తున్న ప్రచారం.
మన దేశంలోనూ దీనికి వంత పాడుతు న్న వారు చాలామంది ఉన్నారు. ఈ పునరుజ్జీవనం ఎక్కడ జరుగుతున్నదో తెలుసుకోవాలంటే ఐఎఇఏ డైరెక్టర్ జనరల్ మాటలలోనే వినండి: ఇండోనేషియా, థాయిలాండ్, వియ త్నాం, చైనా, ఇండియా, జపాన్, కొరియా, పాకిస్థాన్, అల్జీరి యా, బెలారస్, ఈజిప్ట్, ఇరాన్, జోర్డాన్, లిబియా, నైజీరి యా, టర్కీ, యెమెన్! జపాన్‌నూ, కొంతమేరకు చైనానూ, ఇండియానూ మినహాయిస్తే అభివృద్ధిచెందిన దేశాలు ఏ సాంకేతిక ప్రక్రియలను తమ మీద రుద్దితే వాటిని కొనుక్కొని వాడుకునే స్థితికి నెట్టబడ్డ దేశాలు ఇవన్నీ. ‘అణుశక్తి పునరుజ్జీవనం’ ఈ దేశంలో వెల్లివిరియడం అంటే ఏమిటో వివరించి చెప్పనవసరం లేదు.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది:జూలై 30,2008
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
ఒప్పుకుంతున్నము కాని సిగ్గు వదిలెసిన కమ్మిలు ఎదొ చెథ కారన్నన్ని చుపి వెరెగా పొతి చెయ్యలని ఈ కుత్రంథా.
ఇలాంటి విశ్లేషణలు చదివి చదివి బుర్ర పాడవుతోంది. మనకి నచ్చినట్లుగానే అన్నీ కావాలంటే, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమే కనిపెట్టుకోవాలి. అణుశక్తి ని పక్కన పెడితే మనమందరమూ ఉపయోగిస్తున్న ఈ కంప్యూటర విజ్ఞానము కూడా మనది కాదు. ఒక్కసారి అమెరికా ఈ పరిజ్ఞానాన్ని మనకి ఎగుమతి చేయడానికి నిరాకరిస్తే ఏమౌతుందో ఎప్పుడైనా ఆలోచించారా.
తెలివితక్కువ వాళ్లకి ఎక్కువగా బేరాలాడే అవకాశం లేదు, మనదేశం అదే కోవలోకి వస్తుంది.
కౌరవులులా వందమంది ఉండి ఏమిలాభం పాండవులులా 5 గురుండినను చాలు … (ఇది నచ్చకపోతే)
గంగిగోవుపాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు …
I am referring to above in the context of our population strength.
There is a saying: If you are cheated once, it is the other’s mistake, if you are cheated twice it is your mistake
ఇంకొక విషయమేమంటే, మనకొక పద్దతి నచ్చకపోతే నచ్చలేదని చెప్పి మరొక ఆమోదయోగ్యమైన పద్దతి చెప్పాలి, అది సరి కాదు, అది సరి కాదు అని చెప్తే ఉపయోగం లేదు. తర్వాత మనం చెప్పే పద్దతి ఎంతమందికి ఆమోదయోగ్యమో కూడా తెలుసుకోవాలి.
తప్పని సరిగా అవసరమే. ఇక్కడ మూలన కూర్చుని ఎర్ర జండా అట్టుకుంటే విద్యుత్ రాదు. తరువాయి ఏభై ఏల్లలో నిరంతరంగా విద్యుత్ ని అందించాలంటే తప్పనిసరిగా అణువిద్యుత్తే అవసరం.అప్పుడే రైతుకైనా ఉచితంగా విద్యుత్ అందించగలిగేది. మీకు రష్యాలో (మీ అత్త వారిల్లు) ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలున్నాయో తెలుసా?