ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి

- అల్లం నారాయణ

‘ఈనె అడ్డగోలుగున్నడు సార్. మా బతుకులు నాశ్నం చేస్తండు. డిజిటల్ మీటర్లని పెట్టిచ్చిండు.కంపెనీల కాడ దొ… మా ఆటోవాళ్ల బత్కు లు బండలు చేసిండు సార్. ఈనె జూడు. ఎట్ల కట్టుకున్నడో బంగ్ల’ ఉరుము లేని పిడుగు. ఒక ఆటోవాలాకు అంత ఆగ్రహం ఉన్నట్టుగానీ, అది ఒక అపరిచితునితో, ఆటో లో కూచున్న కస్టమర్‌తో అంత ఉద్రేకంగా పంచుకుంటాడనిగానీ ఊహించి ఉండలేదు. ‘ద హిందూ’ దగ్గర ఎక్కా ను ఆటో. మోతీనగర్ అంటే అప్పటికే ఆరుగురు ఆటో వాలాలు నిరాకరించి ముఖంమీదే చీదరగా చూసి వెళ్లా రు. నాకు ఆటోవాలాల మీద పీకలదాకా కోపంగా ఉంది.

ఒకతను 70 రూపాయలిస్తావా? అని అడిగాడు. ఇదిగో… ఇతను నన్ను కరుణించి ఒక్క మాటా మాట్లాడకుండా ‘ఛలో’ అని ఆటో స్టార్ట్ చేశాడు. ఫర్లాంగ్ దాటీ దాటగానే ఇదీ సంభాషణ - ‘అది ఆయన బంగ్ల కాదు. సర్కారుది. ముఖ్యమంత్రిది గదా. అది ఆయన క్యాంపు ఆఫీసు. మరి ఉండాలెగదా’ అన్నా నేను. ‘బిల్డింగ్ సరే సార్. ఏమ న్న బత్కెటట్లున్నదా. ఏదన్న కొనెటట్టున్నదా? తినెటట్టున్నదా? ఎట్ల బత్కాలె. ఆటో కిరాయి నూటిరవై రూపాలు. పెట్రోల్ అరవై రూపాలు. పైనుంచి డిజిటల్ మీటర్. ఇంగ ఏం సంపాంచి, ఏం తినాలె సార్. పిలగండ్లను ఎట్ల సదివియ్యాలె. సంసారం ఎట్ల నడపాలె. ఈ ధరలేంది సార్.

ఈళ్లేమొ కోట్లకు కోట్లు సంపాస్తరు. ముఖ్యమంత్ర య్యే దంక చెప్పిందేంది. అయినంక చేసిందేంది’ అన్నడు. నాకెందు కో భయంగా ఉన్నది. ఇట్లా ఒక ఆటోడ్రైవర్ మాట్లాడ్తడని, అదీ నేనేమీ అనకుండానే, నేనెవరో తెలియకుండానే ఇట్లా అంటాడని ఊహించని దిగ్భ్రాంతి. దానికి తోడు సీఎం క్యాంపు ఆఫీసు నుంచి కదిలి వెళ్తున్నప్పుడు ఇట్లా మాట్లాడ్డం. “మరి చంద్రబాబు కాలం బాగుండెనా?'’ భయం భయంగనే అడిగినా. “ఆయనా?'’ ఇంక జెప్పకు సార్. ఇద్దరూ గంతే. ఆయనట్ల చేసిండనే ఓడగొడ్తిమి. గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు?'’ అన్నడు ఈసడింపుగా ఆటో వాలా. చిన్నగా గడ్డం పెరిగి ఉంది.

నాలో సగటు కుతూహలం. మనిషి మామూలు గా బక్క పలుచగా… ముఖం మీద ఒక విధమైన నిరసన. ‘మరెట్లాగయ్యా’… ఆయ నంటే అట్లంటివి? ఈయనంటె ఇట్లంటివి ఎట్లా మరి'’… ఎట్లంటె ఏమున్నది సార్! “ఎర్ర జెండా'’.. గదొక్కటే మార్గం… నాకెందుకో భయం పెరిగిపోయింది. అసలే బలిమెల. కలిమెల కాలం. సీఎం ఇంటి పరిసరాలు.. దాటేసినందుకు కాస్త ఊరట. అయినా నాతో ఇవన్నీ ఎందుకు? చెబ్తున్నట్టు ఈ ‘ఎర్ర జెండా’ ఏంది? కుతూహలం. ‘నన్నెక్కడన్నా చూసినవా? అని అడిగినా. ‘లేదు సార్’.

నాది ముందు నుంచీ ఎర్ర జెండే. సీపీఎం కార్యకర్తను నేను. గా ఎర్రజెండ లేకుంటే గీ ప్రపంచం గిట్లెందు కుంటుండె సార్. గది జెయ్యవట్టే కొంత భయపడ్తరు. అడివీల ఉన్నరు చూడు. ఆళ్లు ఉండబట్టే ఈళ్లు భయపడ్తరు. కాని వాళ్లిప్పుడు లేరు సార్. చర్చలని పిలిచి ఆళ్లనూ నమ్మించి సంపిండ్రు.'’ మా సంభాషణ ఎటో పోతున్నట్టు గమనించాను నేను. ‘సరే లేవయ్యా! అయినా సీపీఎం అంటున్నవ్. అడవిలో ఉన్నరంటున్నవు. వాళ్లు వీళ్లు వేరు కదయ్యా’ అన్నానేను.

వేరే సార్. కానీ ఏదైనా ఎర్రజెండే. గది లేకుంటే గంతే సార్…’ మరి వాళ్ల రాజ్యం వస్తదంటవా. వాళ్లేమొ అడవుల్లో… మీ వోళ్లే మొ తెలుగుదేశంతోని ఎట్ల కలు స్తది’ అన్నా నేను. గదేసార్.. గందుకే ఎర్రజెండ ఎగుర్తలేదు. ఎర్రజెండోళ్లందరు ఒక్కటైతే గిసొంటోళ్ల ఆటలు సాగయి. మస్తు దందగిరి చేస్తండ్రు సార్. మా బత్కులయితే నాశ్నం అయితన్నయి. ఆటో మోతీనగర్‌కు చేరుకుంటున్నది. నాకొక రకంగా విభ్రమంగా, సంభ్రమంగా, కంగారుగా, కంగాళీగా ఉంది.

ఈ ఆటోవాలా సంభాషణకు ఒక విరామం ఇస్తే అన్న ఆలోచనతో అడిగాను. అవునయ్యా ‘రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దర్నీ అంటున్నవ్. ఎర్రజెండా రాదు. మరెట్లా’? అని అడిగినా. అందుకే గదా సార్. వస్తు న్నడు చిరంజీవి. ఆయన రావాలె సార్. ఏమన్నా మా బత్కు బాగుపడ్తది. ఎట్లా? ఇది నా ప్రశ్న. ఆటో దిగాను. మనసంతా శూన్యమా? గందరగోళమా? మీమాంసా? ఏమో? ఎర్రజెండన్న కావాలె. కాదంటే చిరంజీవన్నా రావాలెనా? అంటే -? ఏదో ఒక ఖాళీ పూరించకుండా మిగిలినట్టున్నది… ఔనా…?

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 19 జులై 2008

5 అభిప్రాయాలు

  1. ఎర్రజండా పార్టీలు ఎప్పటికీ అధికారంలోకి రావు. అన్నలు అడవులువిడిచి జనజీవనంలోకి రారు..రాజకీయాల్లోకి అసలు రారు. పాపం ఇక మిగిలింది చిరంజీవి మీద ఆస..అదికూడా ఏమౌతుందో?

  2. chavakiran 20 జులై 2008 , 7:26 am

    To me this article seems to be very intelligent way of projecting AJ’s favorite!

  3. సూర్య 22 జులై 2008 , 2:58 am

    చావాకిరణ్ గారు,

    పదాలకు మీరు కొంచెం విపరీతార్ధాలు తీస్తున్నారు. పత్రిక యాజమాన్యాలకి సొంత ఎజెండావుండవచ్చు, కాదనలేము. కానీ వ్యాసకర్త మీద నిందవేయటం సమంజసం కాదు కదా.

    - సూర్య

  4. chavakiran 23 జులై 2008 , 2:14 am

    That is why I called Intelligent

    మరింత వివరించాలంటే నాకు చాలా సమయం కావాలి, సోమవారం లోపులో వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  5. anonymous 16 ఆగస్టు 2008 , 3:11 am

    అంటే మీటరు మీద కాకుండా వాళ్లెంట అంటే అంత అని ఒప్పుకునే ప్రభుత్వం కావాలన్నమాట. సూపరో సూపరు ;)

    మీటరు మీద నడిపే నిజాయితీ లేని వాళ్లుకూడా వేరే ఎవరో ఎదో తినేస్తున్నారని ఏడుపే. నాకర్ధమయ్యిందేమిటంటే, వాళ్లు తినేస్తున్నారన్నదానికంటా మనం తినలేకపోతున్నామనే బాధ ఎక్కువగా ఉన్నదనిపిస్తోంది

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)