- జాన్ హైడ్ కనుమూరి
మాటలకు వేర్లొచ్చి
మనసు పొరల్లో పాదుకొని
నిటారుగా కొమ్మలువేసి
జీవనిర్జీవాక్షరాలుగా
నవ్వుతూ తుళ్ళుతూ
దొర్లుకుంటూ పొర్లుకుంటూ
నడచుకుంటూ పొడుచుకుంటూ
ఏడ్చుకుంటూ, ఛీత్కరించుకుంటూ
వూగుతూ, తూగుతూ
వ్యధలుగా కథలుగా
మథిరగా రుధిరంగా
మధురంగా సేవిస్తూ
వలకబోసుకుంటూ , ఎత్తుకుంటూ
ఒరుచుకుంటూ, పరుచుకుంటూ
ప్రవహిస్తున్న శబ్దం
ష్!!!!! స్!!!! … నిశబ్దం…
నాకేవో సాంకేతాల సవ్వడివినబడుతోంది
డౌనులోడు చేసుకోనివ్వండి
అక్షరాలుగా… దృశ్యాలుగా …
గొంతులుగా రూపమివ్వాలి
అంతకరణల గర్భందాల్చాలి
పురిటినొప్పుల కుహరందాటి రావాలి
బాలింత పాలధారనవ్వాలి
పొత్తిళ్ళకు పాతచీరలొద్దు
కొత్తవస్త్రాన్ని కప్పుదాం
నాభిలోంచో వూభిలోంచో
నఖంలోంచో ముఖంలోంచో
మట్టిలొంచో పక్కటెముకలోంచో
నడుంనిలిపిన నరులారా! రండి
కలలునాట్లు వేసుకోవాలి
స్వేదాల కుప్పలు నూర్చాలి
మడుగుల్లోంచో అడుగుల్లోంచో
యెదల్లోంచో రొదల్లోంచో
వెల్లువై ప్రవహించాలి
సంగమించే సముద్రాలవైపు కాదు
ఆరిపోతున్న గొంతులవైపు
పూడిపోతున్న బావుల జలనిధులవైపు
రోదనల చారికలవైపు
ప్రవహించీ ప్రవహించీ
ఓ బిందువై ఎక్కడోకచోట
బుగ్గచుక్కనై మెరవాలి
లేతబుగ్గనై పొంగాలి
పాలవెన్నునై విరియాలి
అక్కడే
అనేకాశ్వాల రథానికి
మరోచక్రాన్ని బిగిద్దాం
“పురిటినొప్పుల కుహరందాటి రావాలి
బాలింత పాలధారనవ్వాలి
పొత్తిళ్ళకు పాతచీరలొద్దు
కొత్తవస్త్రాన్ని కప్పుదాం”" బాగుంది, కానీ నాకో సందేహం
ఇక్కడకూడా స్త్రీ ప్రతీకల్నే వాడాలా??
సంగమించే సముద్రాలవైపు కాదు ఆరిపోయం గొంతులవైపు….. మంచి కవిత చదివాం….
కలల నాట్లు వేసుకోవాలి
చాలా మంచి అభివ్యక్తీకరణ.
బొల్లోజు బాబా