- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం
తాత్విక వికాసంలోని ముఖ్యదశలు
పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం
తత్వశాస్త్రం అనేది ” వివిధ విషయాలను గురించిన ఆలోచనాత్మక అధ్యయనం” అన్నాడు తత్వ్తవేత్త హెగెల్; అది వివిధ విషయాల అంతర్గతస్వభావాలను విశదపరిచే ఆలోచనాత్మక పరిజ్ఞానం.1 ఈ “ఆలోచనాత్మక అధ్యయనం”లో రెండు అంశాలుంటాయి; (భావనల రూపంలో) మేధస్సు యొక్క నిర్మాణాత్మక ప్రక్రియలూ, (ప్రభావవంతంగా ఉండే) భావావేశపరమైనవీను. మేధస్సు అంతకంతకూ సమగ్రమయే తార్కికశక్తిని సంతరించుకుంటుంది; భావావేశాలు వ్యవస్థీకృతమైన విలువలకేసి దారితీస్తాయి.
తత్వశాస్త్రం అనేది “ఆశ్చర్యం”తో మొదలౌతుందో2, “సందేహం”తోనో3, కొంతవరకూ రెండిటితోనో చెప్పలేంకాని “ఆలోచనాత్మక అధ్యయనం” మూలాలన్నీ అతిప్రాచీన కాలానివీ, నమోదైన చరిత్ర మొదలవక మునుపటివీను. ఈ ఆలోచనలన్నీ క్రమంగా పోగవుతున్న సాంకేతిక పరిజ్ఞానంతోనూ, సంస్కృతితోనూ పరస్పరచర్యలకు లోనవుతాయి. తేటతెల్లం అనిపిస్తున్న విషయాల్లో లోతుగా దాగి ఉన్న సత్యాన్ని ఈ ఆలోచనలు వీలున్నప్పుడల్లా ప్రత్యక్షంగా పరిశీలిస్తాయి; వీలుకానప్పుడు ఊహిస్తాయి. బానిసవిధానం మొదలైనప్పుడే నాగరికత ఆరంభమైందని కొందరు సమాజశాస్త్రవేత్తలంటారు కాని అది కాస్త నిర్హేతుకం అనిపిస్తుంది. “…స్వభావంలోగాని, తార్కిక, ప్రతీకాత్మకపద్ధతుల్లో యోచించడంలోగాని, నాగరిక, ఆదిమానవుల్లో భేదమేమీ ఉండదు”.4 ఆదిమానవుల్లోకూడా విశిష్టులైన చింతకులుండేవారు; వారు మౌలికమైన సాధారణసమస్యలతో తంటాలుపడ్డారు. వారికి వైజ్ఞానిక తత్వశాస్త్రపు ప్రాథమిక విషయాల అవగాహన కొంత ఉండేది. చాలా విషయాలను వస్తుగతరీతిలో అర్థం చేసుకోగలిగారు. వాటి చలనశీలతా, పరస్పర సంబంధాలూ వారికి అవగతం అయాయి.5 వర్గాలు ఏర్పాటుకానటువంటి (పూర్వవర్గ) ప్రాథమిక సాముదాయక సమాజాల్లో (తెగ, కులం) తత్వశాస్త్రాన్ని వివేకంగా గౌరవించేవారు. ఆ సమాజంలో వివేకవంతుడైనవాడు ఆలోచనాపరుడూ, వ్యవహర్తాకూడా. అటువంటి వ్యక్తిని సాముదాయక వివేకానికి ప్రతినిధిగానూ, రక్షకుడుగానూ గౌరవించేవారు. “ఏ యుగంలోనైనా శ్రమ విభజనలో తత్వశాస్త్రానికి స్పష్టమైన స్థానం ఉండేది; దాని పూర్వోహలన్నీ పూర్వీకులనుంచి అందిన ఖచ్చితమైన మేధో సమాచారం మీదనే ఆధారపడేవి. వాటినుంచే ఆ తత్వశాస్త్రం మొదలౌతుంది”.6 తత్వశాస్త్ర చరిత్రకు ఒక తర్కం అంతర్గతంగా ఉంటుంది. “ఈ చరిత్ర కేవలం కల్పనాత్మక ఊహలు కలబోసినట్టు కాదు; అనుకోకుండా జరిగేదీ కాదు…ఇదొక శాస్త్రంగా వికాసం చెందుతున్న క్రమంలో తప్పనిసరిగా తలెత్తే దశలే ఇవన్నీ…”.7
సామాజిక ఆచరణలో ప్రగతి కలిగినప్పుడల్లా బోలెడంత సమాచారం పోగవుతుంది; ఇందులో కొంత భోగట్టా ముడిరూపంలో లభిస్తే, మరికొన్ని సమగ్రమైన వాస్తవాలుంటాయి. వాటిద్వారా విస్తృతమైన సమస్యలను లేవనెత్తి పరిష్కారాలు సూచించవచ్చు. సామాజిక ఆచరణలో ప్రగతివల్ల యోచనాప్రక్రియలు పరిపక్వం కావడం, యోచనలు మళ్ళీ ఆచరణను ప్రభావితం చెయ్యడం వీలైంది. అరిస్టాట్‌ల్ లెక్కన “జీవితావసరాలన్నీ లభ్యం అయిన తరవాతనే మనిషికి తాత్వికచింతన మొదలవుతుంది”.8 అరిస్టాట్‌ల్ కాలంలో తీరుబడిగా సౌఖ్యజీవనం గడిపే కొద్దిమంది సంపన్నులకూ, బానిసల యజమానులకూ, వారి పరివారానికీ మాత్రమే తత్వశాస్త్ర అధ్యయనంవంటిది చేసేందుకు వీలుండేది. అయితే కడుపు ఖాళీ అయినంత మాత్రాన బుద్ధి శూన్యమౌతుందనటానికీ లేదు. అంతేకాదు; సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని వెతికి, కనిపెట్టి, ఉపయోగించేందుకుగాను తత్వశాస్త్రానికి తరుచుగా ప్రేరణ లభిస్తుంది; జీవితావసరాలు లోపించినంత మాత్రాన దానికేమీ భంగం కలగదు.
పూర్వవైజ్ఞానికదశలో తత్వశాస్త్రం సాధారణసత్యాలూ, మూఢనమ్మకాలతో కూడుకుని ఉండేది; ఇవన్నీ (మొదట్లో గారడీగానూ, ఆ తరవాత మతంగానూ) అసంపూర్ణమయిన భావాల తునకలుగా కలగలిసి ఉండేవి. ఆదిమానవులకు “అతీంద్రియ హేతువులేవీ లేని వస్తుగత ప్రపంచం గురించిన అనుభవసిద్ధ చైతన్యం” ఉండేది; వారు “రోజువారీ సంఘటనలకు కాకుండా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే” అతీంద్రియశక్తుల సహాయం కోరేవారు.9 పూర్వవర్గ సమాజాల్లో మనుషులు గారడీ తమ శక్తులను పెంచుతుందనీ, దానివల్ల తమ సంకల్పాలకు ప్రకృతిమీదా, ఇతరులమీదా ఆధిపత్యం కలుగుతుందనీ నమ్మేవారు. వర్గసమాజంలో పాలకవర్గాలు దోపిడీకి గురవుతున్న వర్గాలను భౌతికంగానేకాక, ఆధ్యాత్మికంగాకూడా మతంద్వారా అణగదొక్కి ఉంచేందుకు నిత్యమూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. గారడీలాగా కాకుండా మతంలో మనుషులు ప్రకృతిని శాసించరు; సర్వశక్తిమంతమైన అతీంద్రియశక్తి (లేదా శక్తుల) నుంచి వరాలు యాచించటానికి తమను తామే కించపరుచుకుంటారు. పార్శీ మతానికి దేవాదిదేవుడైన అహురమజ్దకు ఉన్న 72 పేర్లలో సృష్టికర్త, సంరక్షకుడు, పరిశుద్ధతముడు, సర్వజ్ఞుడు, స్వచ్ఛంద సర్వాధిపతి మొదలైనవి ఉన్నాయి.10
మతం ఒక ఆదిమ తత్వశాస్త్రం. “ప్రపంచానికి వర్తించే సామాన్యసిద్ధాంతం”గా మతం మానవ జీవితాన్నంతటినీ పరిగణిస్తుంది.11 “…భగవంతుడంటే ప్రకృతియొక్క అతి సామాన్య లక్షణాలన్నిటి సమాహారమే…”.12 విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఒక భాగమైన తాత్వికప్రగతి ఒక్కొక్కప్పుడు అర్థంలేని భావనలను తొలగిస్తుంది; లేదా వాటి స్థానే మరీ అసంగతం కావనిపించే భావనలను ప్రవేశపెడుతుంది.13 పూర్వవర్గ తత్వవిచారం ఆదిమ సహజ భౌతికవాదంలోనూ, సహజ గతితర్కంలోనూ పరాకాష్ఠకు చేరుకుంది.
ప్రాచీనకాలంలో ఏథెన్స్‌లో బానిస సమాజం బాగా భ్రష్టుపట్టిపోయిన దశలో వివేకవంతులను సోఫిస్టులనేవారు (సోఫిస్టీజ్). వీరు పాలకవర్గాలకు జీవితంలో విజయమెలా సాధించాలో నేర్పే శిక్షకులుగా ఉండేవారు; పైకి సమంజసంగా కనిపించే తర్కాన్ని వంచనకు ఎలా ఉపయోగించాలో (సోఫిస్ర్టీ) కూడా వీరు నేర్పేవారు. గణితంలో అగ్రగామి అయిన పైథాగొరస్ తత్వవేత్త అనడానికి “ఫిలాసఫర్” (వివేకాన్ని ప్రేమించేవాడు) అనే మాటను సృష్టించాడు; అది గంభీరమైన జ్ఞానాన్ని అన్వేషిస్తున్న సోఫిస్టులకు భిన్నంగా ఉండే పదం. ఈ అన్వేషణ ఇంకా పెద్ద ఎత్తున మొదలవని కాలమది.
తత్వశాస్త్రంలో రెండు ముఖ్యమైన అంశాలుంటాయి.
1. ప్రభావవంతమైన లక్ష్యాలు - తక్షణం, ప్రత్యక్ష పరిస్థితులకు పరిమితం కాకుండా విస్తృత పరిధి కలిగినటువంటి విలువల వ్యవస్థలు; తనకూ, ఇతరులకూ, సమాజశ్రేయస్సుకూ అనుగుణమైన జీవితశైలికి వర్తించే నిబంధనలు. మనుషుల మధ్యనా, మనుషులకూ, ప్రపంచానికీ మధ్యనా ఉండే సంబంధాలతో వీటికి ప్రమేయం ఉంటుంది;వర్గ సంబంధాలతోనూ, వర్గరహిత సంబంధాలతోనూ కూడా అంతే.
2. మేధోపరమైన సాధనాలు - సమస్త విజ్ఞానంద్వారా బాహ్యప్రపంచం గురించీ, తన గురించీ పొందినటువంటి ఖచ్చితమైన జ్ఞానం. గణితంలో యూక్లిడ్, పైథాగొరస్ కనిపెట్టిన విషయాలు దీని వికాసానికి చెప్పుకోదగ్గ ప్రేరణనిచ్చాయి. మొత్తం వ్యవస్థలో మనుషుల స్థానం ఎటువంటిదోననే జిజ్ఞాస కూడా ఈ శాస్త్రీయప్రగతిలోని భాగమే.
తత్వశాస్త్రంలోని సాధారణత్వంలో అనేక స్థాయిలుంటాయి. వీటిలో కొన్ని తత్వశాస్త్రరంగానికి పరిమితమైన అతిసామాన్యమైన స్థాయి ఒకటి. తక్కినవి అంత సామాన్యమైనవిగా అనిపించవు. అవి భౌతిక, రసాయన, ఆర్థిక, రాజకీయ, కళాశాస్త్రాలకూ, సాంకేతిక రంగాలకూ, వివిధ వృత్తులకూ సంబంధించిన తత్వస్థాయిలు.
పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం వివిధ విషయాల సామాన్యఅంశాలను పరిగణిస్తుంది. ప్రతి విషయానికీ వర్తించే అతిసామాన్య అంశాలు కొన్నయితే, కొన్నిటికి మాత్రమే వర్తించే తక్కిన విషయాలు అంత సాధారణమైనవి కావు. పూర్వవైజ్ఞానిక తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రాలు వికసించడానికి భూమికను సమకూర్చింది. ‘అతి ప్రాచీన గ్రీక్ చింతకులెవరూ విజ్ఞానాన్నీ, తత్వశాస్త్రాన్నీ వేరువేరుగా పరిగణించలేదు’.14 యాంత్రిక, గణిత, భౌతిక, జీవశాస్త్రంవంటి ప్రత్యేక విషయాలను ప్రాథమిక, పూర్వవైజ్ఞానికదశల్లో తత్వశాస్త్ర విభాగాలుగానే పరిగణించేవారు. ‘సత్యవిజ్ఞానమే తత్వశాస్త్రం’ అన్నాడు అరిస్టాట్‌ల్. ఐజాక్ న్యూటన్ తన ఉద్గ్రంథానికి The Mathematical Principles of Natural Philosophy అని పేరు పెట్టుకున్నాడు. తత్వశాస్త్రానికీ, విజ్ఞానశాస్త్రాలకూ మధ్యన ఇటువంటి బంధుత్వం పంతొమ్మిదో శతాబ్దం దాకా కొనసాగుతూనే వచ్చింది. జాన్ డాల్టన్ తన పథనిర్దేశక గ్రంథానికి New Principles of Chemical Philosophy అని పేరు పెట్టాడు.
భూస్వామ్యవిధానం పోయి పెట్టుబడిదారీపద్ధతి వచ్చేదాకా విజ్ఞానశాస్త్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు. త్వరిత సాంకేతికప్రగతీ, సమాచారం క్రమబద్ధంగా పోగుపడడమూ అనేక రంగాల్లో వైజ్ఞానిక ఆవిష్కారాలను వేగవంతం చేశాయి. తత్వశాస్త్రమూ, సామాజికశాస్త్రాలూ మాత్రం పూర్వవైజ్ఞానిక అపరిపక్వదశలోనే మిగిలిపోయాయి. అయినప్పటికీ ఈ ప్రత్యేక విజ్ఞానశాస్త్ర పరిశీలనల్లోని అనేక విషయాలూ, అంశాలూ అన్నీకూడా కొంతవరకూ పోలికలు కలిగినవై ఉండేవి. ఇవన్నీ విశ్వవ్యాప్తంగా అన్ని విషయాలకూ, ప్రక్రియలకూ వర్తించే అతిసామాన్య లక్షణాలుగా అనిపిస్తాయి. వీటన్నిటి సమాహారమూ ఒక ప్రత్యేకశాస్త్రం అవుతుంది. తక్కిన విజ్ఞానశాస్త్రాలన్నీ పరిపక్వదశకు చేరుకున్నాక తత్వశాస్త్రంలో దిగబడిపోయిన విజ్ఞానం అదే.
References:
1. Hegel, Logic, p4
2. Hegel, Lectures on the History of Philosophy, Vol.2, p.135
3. Pisarev, “Popularizers of Negative Doctrines’, Selected Philosophical, Social and Political Essays, p.561
4. Radin, Primitive Man as Philosopher, p.373
5. Ibid., pp.208-328, Srr also Chattopadhyaya, Lokayata: A Study in Ancient Indian Materialism, Introduction
6. Engels, in Marx and Engels, Selected Correspondence, p.483
7. Hegel, Lectures on the History of Philosophy, Vol.3, p.552
8. Quoted in Hegel, ibid., Vol.1, p.51
9. Radin, Primitive Man as Philosopher, p.31
10. Tylor, Religion in Primitive Culture, p.441
11. Marx, in Marx and Engels, On Religion, p.41
12. Ludwig Feuerbach, quoted in Lenin, Philosophical Notebooks, p.81
13. Engels, in Marx and Engels, Selected Correspondence, p.482-83
14. Piaget, Insights and Illusions of Philosophy, p.44
15. Aristotle, Metaphysics, p.35
16. Quoted in Kaufman, Hegel, pp.372, 374
పూర్తి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?
వాడిన పుస్తకాల షాపుల్లో దొరికే అవకాశం ఉంది. ఐరా గాలబిన్ గారు రెండు నెలల క్రితం మరణించారు. కొత్త ప్రతులు అచ్చయ్యే అవకాశాలు లేవు. గతి తార్కిక భౌతిక వాదానికి వారు చేసిన సేవ గొప్పది. 4th june 2008. సిద్దప్ప