మనకూ ఉన్నారు రాజ్బీర్లు!
- కె.బాలగోపాల్
ఢిల్లీ పోలీసుల ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్బీర్ సింగ్‌ను పౌరుడెవరో ‘ఎన్కౌంటర్’ చేశాడని విని ‘చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత’ అనుకున్నాం. అయితే ఘటన పూర్వా పరాలు బయటకొచ్చే కొద్దీ అతను చేసుకున్నది ఇంకా చాలా ఉందని అర్థం అవుతున్నది. అతగాడిని చంపిన విజయ్ భర ద్వాజ్ అనే పౌరుడు వ్యాపారవేత్త అట.
అతను రాజ్బీర్ సింగ్‌కు 95 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడట. ఒక ఎసిపి స్థాయి పోలీస్ అధికారి మరొకరికి కోటి రూపాయల దాకా అప్పు పెట్టగలగడం చిన్న విషయం కాదు. ఆ అధికారి తన ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా అన్న సందేహం ఢిల్లీ పోలీసు పెద్దల కెప్పుడయినా వచ్చిందా? లేక అటు వంటి సందేహాలు ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ల విషయంలో రాకపోవడం ఆ హోదా లక్షణాలా? రాజ్బీర్ సింగ్ ఇచ్చిన రివాల్వర్తోనే భరద్వాజ్ అతనిని చంపాడట.
అసలు రాజ్ బీర్ సింగ్ అతనికి రివాల్వర్ ఎందుకిచ్చాడు? భరద్వాజ్‌కు వేరెవరో 35 లక్షలు బాకీ ఉన్నారట. ఆ బాకీ వసూలు చేసుకో వడానికి రివాల్వర్ కావాలని భరధ్వాజ్ ఇతనిని అడిగాడట. అది వసూలయితే తన బాకీ ఆ మేరకు తీరుతుందన్న ఆశతో కాబోలు రాజ్బీర్ సింగ్ అతనికి రివాల్వర్ ఇచ్చాడట. రావలసిన బాకీ అయినాసరే తుపాకీతో బెదిరించి వసూలు చేసుకుంటే చట్టం దానిని నేరంగానే భావిస్తుంది. ఆ నేరానికి ఆయుధం సరఫరా చేయడమూ నేరమే. ‘ఎన్కౌంటర్ స్పెష లిస్టు’ రాజ్‌బీర్‌సింగ్ ఎన్కౌంటర్లలోనే కాక బలవంతపు బాకీ వసూళ్లలోనూ స్పెషలిస్టని దీని అర్థమా? అంతేకాదు అతను భరద్వాజ్‌కు ఇచ్చిన రివాల్వర్ అతని స్వంతం కాదు. అది అశోక్ శివ్రాన్ అనే ఒక ( హర్యానాకు చెందిన) అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ సర్వీస్ రివాల్వర్ అట.
ఆయన గారు 2007 సంవత్సరంలో ఒక దొంగల ముఠాను వెంబడిస్తుండగా ఈ సర్వీస్ రివాల్వర్ తప్పి పోయిందట (దొంగల ముఠా కూడా తప్పిపోయింది. వారితో బాటో ఆ తరువాతో ఆ పోలీస్ అధికారి రివాల్వర్ తప్పిపో యింది). భరద్వాజ్ చేతికి వచ్చేసరికి దానిపైనున్న నంబర్ చెరిపేసి వేరే నంబర్ వేసి ఉంది. అసలది రాజ్బీర్ సింగ్ దగ్గ రికి ఎట్లా వచ్చింది? ఎన్కౌంటర్లు చేయడమే కాక దొంగ తనాలు కూడ చేయించేవారా? లేక దొంగిలించి నంబర్లు మార్చిన రివాల్వర్లతో ‘సెకండ్స్’ వ్యాపారం చేసేవారా? లేక దొంగిలించిన రివాల్వర్లు కొని వాటి నంబర్లు తానే మార్చి బలవంతపు బాకీ వసూళ్ల వంటి మానవీయమైన కార్య కలాపాలకు అరువు ఇస్తుండేవారా? రాజ్‌బీర్‌సింగ్ ఎన్ కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నాడని పత్రికలు ఎప్పుడయి నా వాఖ్యానిస్తే (తరచుగా వ్యాఖ్యానించేవని కాదు) అతను ఆ పత్రిక ఆఫీసుకు పోయి ఏడ్చేవాడట.
‘నేను దేశం కోసం చేస్తున్నాను. నా స్వార్థం కోసం చేస్తున్నానా?’ అని కన్నీళ్లు పెట్టుకునేవాడట. ‘ నాకూ పెళ్లాం పిల్లలున్నారు’ అని ప్రకృతి సత్యాన్ని వెల్లడించేవాడట. అతను దేశం కోసం ఎన్కౌంటర్లే కాదు, దొంగతనాలు, దొంగిలించిన సర్వీస్ రివాల్వర్లతో వ్యాపారం,బలవంతపు బాకీ వసూళ్లు ఇత్యాది అనేక కార్య కలాపాలకు పాల్పడుతుండేవాడని అతని మరణం రుజువు చేస్తున్నది. ఇన్నాళ్ళూ తనలోనే దాచుకున్నాడు పాపం. రాజ్బీర్ సింగ్ గొప్ప నేర పరిశోధకుడు కూడ. 2001 డిసెంబర్ 13 పార్లమెంటు దాడి కేసును చిన్న చితక ఇన్స్ పెక్టర్లు పరిశోధించగా వారి పరిశోధనను పర్యవేక్షించింది రాజ్బీర్సింగే. తన చేతిలోకి తీసుకున్న తరువాత ‘ రెండు రోజులలో కేసు పరిష్కరించేశాడ’ని అతని తరహా పోలీస్ అధికారులను అభిమానించే పత్రికలు అతని మరణానంతరం రాశాయి.
డిసెంబర్ 20 నాటికి ప్రధాన నిందితుడ యిన మహమ్మద్ అఫ్జల్ గురు చేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ప్రాసిక్యూషన్ కథ మొత్తం చెప్పించేశాడు కూడ. అప్పటికి నేరం జరిగి వారం రోజులే అయింది. అయితే ఆ కేసులో ఉన్న సాక్ష్యమంతా ముద్దాయిలు పోలీసు కస్టడీలో ఇచ్చిన ఒప్పుకోళ్ళేనని ఆ కేసు కాగితాలు చూసిన వారందరికీ తెలుసును. అంటే రాజ్బీర్ సింగ్ రెండురోజుల్లో చేసేసిన నేర పరిశోధన ఏమిటంటే అప్పటికే అరెస్టయి పోలీసు రిమాండుకు అప్పగించబడ్డ ముద్దాయిల నుంచి నేరాంగీకారం పొందడం. అది ఏ విధంగా పొందాడో ఊహించుకోవచ్చు. ఈ ‘నేర పరిశోధన’ను అనుకూలురయిన పత్రికా విలేకరుల సహకా రంతో ఎప్పటికప్పుడు పత్రికల కెక్కించి, ఢిల్లీ యూనివర్సిటీ అరబ్బీ లెక్చరర్ ఎస్. ఆర్.గిలానీని కర్కశమైన మతోన్మాదిగా దేశానికి చూపించాడు.
నిజానికి గిలానీ ఒక్కడే ఎంత హింసించినా ‘ఒప్పుకోలు’ ఇవ్వలేదు. అతని పాత్ర ఏమీ లేదు కాబట్టి ఇవ్వలేదు. అఫ్జల్‌గురు, షౌకత్ హుస్సేన్‌లు ‘ఒప్పుకోళ్లు’ ఇచ్చారు. అయితే వారు తన కథనం మొత్తం పత్రికల ముందు సమర్థిస్తారన్న రాజ్బీర్ సింగ్ ఆశకు భిన్నంగా, డిసెంబర్ 20 నాటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేరంలో గిలానీ పాత్రేమిటని విలేకరులు అఫ్జల్‌ను అడగగా ‘అతనికి ఆ దాడి గురించి ఏమీ తెలీదు’ అని అన్నాడు. పక్కనే ఉన్న రాజ్బీర్ సింగ్ కోపంగా లేచి ‘గిలానీ గురించి ఏమీ మాట్లాడొద్దని నీకు చెప్పానా లేదా’ అని అఫ్జల్‌ను గద్దించాడు. ఆ ఒక్క వాక్యం ఎడిట్ చేయమని విలేకరులను ఆదేశించాడు. కేవలం ప్రింట్ మీడియానే కాదు, అన్ని టీవీ ఛానెల్స్ కూడా రాజ్బీర్ ఆదేశాన్ని పాటించాయి. అందరూ దేశభక్తులే మరి.
అదృష్ట వశాత్తు ఆజ్‌తక్ విలేకరి (అతను ముస్లిం కావడం కాక తాళీయం అనుకోలేము) కేసు విచారణకు రాకముందే గిలానీ కోసం ఏర్పడిన డిఫెన్స్ కమిటీకి జరిగిన వాస్తవం చెప్పడమే కాక ఎడిట్ చేయని టేప్ చూపించాడు. కోర్టులో భయపడుతూ భయపడుతూ సాక్ష్యం సహితం చెప్పాడు. ఆజ్‌తక్ యాజమాన్యమూ సహకరించింది. అయినప్పటికీ గిలానీకి సెషన్స్ కోర్టు మరణ దండన విధించింది. కానీ హైకోర్టు ఈ విషయాన్ని, ఇతర విషయాలనూ లెక్కలోకి తీసుకొని గిలానీ ని విడుదల చేసింది. అంటే దేశంకోసం రాజ్బీర్ సింగ్ ఎన్ కౌంటర్లు చేయడం, దొంగతనాలు చేయించడం, దొంగిలించిన సర్వీస్ రివాల్వర్లతో ‘సెకండ్స్’ వ్యాపారం చేయడం, బలవంతపు బాకీ వసూళ్లకు సహకరించడం ఇత్యాది మాత్రమే కాదు, నేరం చేయని వ్యక్తిని పట్టుకొని హింసించి ఉన్మాదిగా పత్రికల కెక్కించి, అతనొప్పుకోకపోయినా, కేసులో ప్రధాన ముద్దాయి తన పాత్ర ఒప్పుకుంటూ కూడ అతను నిర్దోషి అని చెప్పినా, అవన్నీ తొక్కిపెట్టి అతనికి మరణ దండన వేయించగలిగాడు.
ఏమయితేనేం పోయాడు కదా- ఎట్లా బతికాడో అట్లాగే పోయాడు కదా- ఇప్పుడిదంతా ఎందుకు అంటారేమో!. ఒక రాజ్బీర్ సింగ్ పోయాడు. ఇంకెంతమంది ఉన్నారో? మన రాష్ట్రంలోనే ఎంతమంది ఉన్నారో. ఎన్కౌంటర్ల గురించి మన వారికి తెలిసినంత ఢిల్లీ పోలీసులకేం తెలుసు? ఇక్కడున్నం త మంది స్పెషలిస్టులు ఢిల్లీలో ఉంటారా? చట్టం ఇచ్చిన అధి కారాన్ని చలాయిస్తున్న వారు దేశం బాగుకోసం, సమాజం మేలుకోసం, చట్టాన్నీ చట్టం నిర్దేశించే పరిమితులనూ పక్కన పెట్టి అధికారం చలాయించవచ్చునని తీర్మానించిన నాడే రాజ్బీర్ సింగ్‌లకు బీజం పడింది. ఆ స్వేచ్ఛ పొందిన అధి కారి ఎక్కడా ఆగడు. దేశం కోసం చేసే హత్యలతో పాటు స్వంతఖాతాలోనూ హత్యలు చేస్తాడు. తాను నిర్వర్తిస్తున్న మహత్తర కర్తవ్యానికి ప్రభుత్వమిచ్చే బోడి జీతం ఒక పారితో షికం కాజాలదు కాబట్టి అదనపు సంపాదన మార్గాలు వెతు క్కుంటాడు.
మాజీ నక్సలైట్లతో చేతులు కలిపి బలవంతపు సెటిల్మెంట్లలో లక్షలు వెనకేసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్టు లు ఆంధ్రప్రదేశ్‌లో లేరా? పోలీసు యంత్రాంగానికి చెందిన పై అధికారులలోని బుద్ధిమంతులకు ఇవన్నీ తెలియకపోవు. కానీ వారు ఈ స్పెషలిస్టులను నియంత్రించే సాహసం చేయ రు. హోం మంత్రికి కోపం వస్తుందో, ముఖ్యమంత్రికే కోపం వస్తుందో. వాడి పాపమే వాడిని మింగేరోజు కోసం ఎదురు చూస్తుంటారు (రాజ్బీర్ అంత్యక్రియలకు ఢిల్లీ పోలీసు శాఖ కు చెందిన ఒక్క ఉన్నత స్థాయి అధికారీ హాజరు కాలేదని దేశ భక్తి గల దినపత్రికలు విమర్శించాయి. డిపార్ట్మెంట్కు అంత గొప్ప సేవలు అందించిన వ్యక్తిని ఇట్లాగేనా సత్కరించేది అని ప్రశ్నించాయి. వాటి విమర్శలకేం గానీ అది అధికారుల సిగ్గు మాలినతనానికీ సిగ్గుకూ కూడా ఏక సమయంలో తార్కా ణం).
కొంచెం ఆలోచిస్తే ఇవేవీ ఊహకందని విషయాలు, అర్థం కాని విషయాలూ కావు. అయినప్పటికీ టెర్రరిజం, సంఘటిత నేరాలు పెరిగిపోతున్నప్పుడు పోలీసులకు తగు చర్యలు చేపట్టే స్వేచ్ఛ ఉండడం అవసరం అనీ, చట్టం ఈ విషయం లో ‘ఉదారంగా’ ఉండాలనీ కోర్టుల లోపలా బయటా వాదిం చే వాళ్లు సమాజంలో చాలామందే ఉన్నారు. హ్రస్వ దృష్టికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. చట్టాన్ని ధిక్కరించి హింసకు పాల్పడేవాడి కంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని హింసకు పాల్ప డేవాడు పదిరెట్లు ప్రమాదకారి. వాడిపేరు చెప్పి వీడిని ప్రోత్సహించడం వినాశనకరమైన తెలివితక్కువతనం అని ఎప్పుడు తెలుసుకుంటాం?
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
మంచి సమాచారం.