- డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్
జీవపరిణామం గురించిన సరైన అవగాహన భౌతికవాద దృక్పథానికి తోడ్పడుతుంది. అందుచేత అదేదో జీవశాస్త్రం గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. అందులోని తాత్విక అంశాలు అందరూ తెలుసుకోదగ్గవే. ఇది పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైన సిద్ధాంతం.
1835లో డార్విన్ దక్షిణ అమెరికాలోని ఈక్వడార్ దేశానికి వెయ్యి కిలోమీటర్లు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గలాపగోస్ ద్వీపాలకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు కొన్ని జాతులకు చెందిన జంతువులు కనబడ్డాయి. ఒకే ద్వీపసమూహంలో ఉన్నవే అయినా ఒక్కొక్క ద్వీపంలోనూ తక్కిన ద్వీపాలతో సంబంధం లేకుండా ఎదిగిన వాటి లక్షణాల్లో తేడాలు కనిపించాయి. ఒకే కుదుటి నుంచి మొదలైన ప్రాణుల్లో స్థానిక పరిస్థితులను బట్టి క్రమంగా శరీరాకృతిలోనూ, అలవాట్లలోనూ కాస్త కాస్తగా తేడాలు ఏర్పడ్డాయని అర్థమైంది. జీవపరిణామ సిద్ధాంతం ప్రతిపాదనకు ఈ పరిశోధనలు తోడ్పడ్డాయి.
డార్విన్ చెప్పిన జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం చూస్తే ప్రకృతీ, వాతావరణమూ శక్తివంతమైనవనీ, ప్రాణుల జీవితాలను ఎప్పటికప్పుడు శాసిస్తూ, వాటి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటాయనీ అనిపిస్తుంది. కాని ఇది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే ప్రకృతి భౌతికసూత్రాలకు లోబడి మారుతూ ఉంటుంది. ఈ మార్పులు అప్పుడప్పుడూ ప్రాణులవల్ల కూడా కలుగుతూ ఉంటాయి.
ఆధునిక యుగంలో మనిషి చర్యలవల్ల వాతావరణంలో కలుగుతున్న కాలుష్యం వగైరాల వల్ల ఎన్ని అనర్థాలు వచ్చిపడ్డాయో అందరికీ తెలుసు. కేవలం మనుషులే కాదు, ఇతర కొన్ని ప్రాణులు కూడా కావాలని పరిసరాలని తమకు వీలుగా కొద్దో గొప్పో మార్చుకుంటాయి. చెట్లని తినే బీవర్ జంతువులు కొమ్మలని నరికి తమకూ, పిల్లలకూ పనికొచ్చే చిన్న నీటి గుంటలను ఏర్పాటు చేసుకుంటాయి. ఎటొచ్చీ ఈ మార్పులు నెమ్మదిగా, సహజంగా, “ఆమోదయోగ్యం”గా జరుగుతాయి గనక వీటి గురించి ఆందోళన కలగదు.
అలాగే రకరకాల ప్రాణులు తమ ఉనికి ద్వారా ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జంతువులవల్ల మొక్కలూ, వృక్షజాతులలో బలమైన మార్పులు కలుగుతాయనేది తెలిసినదే. మిడతల దండువంటివి వచ్చిపడ్డప్పుడు మొక్కలు విపరీతంగా నాశనం అవుతాయి. పంటపొలాలూ, ఆహార ధాన్యమూ నాశనమై మనిష్యులకు హాని కలిగినప్పుడు వీటి గురించి మరింతగా మథనపడతాం కాని ప్రకృతిలోకూడా ఇవి గొప్ప మార్పులే. మొక్కలపై తిన్నగానో, పరోక్షంగానో ఆధారపడే సూక్ష్మజీవాలూ, పశువులూ, పక్షులూ ఇలా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతాయి. ప్రకృతి నిశ్చలనమైనది కాదు, మనిషి ప్రమేయం ఉన్నా, లేకపోయినా అందులో రకరకాల మార్పులు తప్పనిసరిగా జరుగుతూనే ఉన్నాయి. అలా జరగకపోయి ఉంటే ఇన్ని రకాల జీవాల పుట్టుకా, మనిషి ఆవిర్భావమూ జరిగి ఉండేవే కావు.
మొత్తం మీద జీవపరిణామమంతా “గుడ్డి”గా జరిగే వ్యవహారం. దానికి “ముందుచూపు” ఏమీ ఉండదు. మారుతున్న పరిసరాలని బట్టి ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు బలపడతాయి. సహజంగా జరిగే జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని జీవాలు చస్తూ, మరికొన్ని బతుకుతూ ఉంటాయి. బతికినవాటి లక్షణాలు వాటి సంతతికి అబ్బుతాయి. వాటి సంఖ్య పెరిగి, పరిస్థితులు తారుమారయేంత దాకా ఆ జాతి కొనసాగుతుంది. జన్యుపరంగా జరిగే మార్పులకు కొంత పరిధి ఉంటుంది. విస్తృతమైన మార్పులకు అవకాశం ఉండదు. కొన్ని మార్పులు అనుకోని పరిణామాలకు దారితీస్తాయి. ఈకలు మొదట్లో చలి కాచుకునేందుకు రూపొందాయి. అవి కాలక్రమేణా ఎగరడానికి రెక్కలకు ఆచ్ఛాదనంగా కూడా పనికొచ్చాయి. ధ్రువప్రాంతాల్లో ఎక్కువగా ఉండే పెంగ్విన్ పక్షులు ఎగరగలిగిన జాతినుంచి పుట్టుకొచ్చినవే అయినా వాటి రెక్కలు ఎగరడానికి బదులు నీటిలో ఈదడానికి పనికొస్తున్నాయి. ఈనాడు మనకు కనబడుతున్న శరీర నిర్మాణపు కొన్ని లక్షణాల ఆధారంగా మొదట్లో అవి ఏ కారణంచేత పరిణామం చెందాయో ఊహించడం కష్టం.
ఒకప్పుడు ప్రపంచమంతా చిత్తడి నేలలతో, వెచ్చగా, తేమగా ఉండే వాతావరణంతో నిండింది. ఒత్తుగా, ఏపుగా పెరిగిన మొక్కలను తిని బలిసిన రాక్షసిబల్లులు అడ్డూ ఆపూ లేకుండా భారీ శరీరాలతో పెరుగుతూ పోయాయి. వాటి బరువు వాటి జీవనశైలికి ఏ విధంగానూ ప్రతిబంధకం కాలేదు కనక అవి సన్నబడలేదు. పైగా వాటిని వేటాడి, చంపి తినగలిగిన డైనొసార్లు తయారయాయి. అయినా అవన్నీ ఒక్కపెట్టున అకస్మాత్తుగా అంతరించిపోయాయి. అప్పటికి ఎలుకల సైజులో రాత్రిళ్ళు భయంగా తిరిగే క్షీరదాలు క్రమంగా భూమినంతటినీ ఆక్రమించాయి. ఇలా ఒక జాతి నశించడం, మరో జాతిది పైచెయ్యి కావడం భౌగోళిక, భౌతికమార్పుల వల్లనే జరిగింది, జరుగుతోంది కూడా.
జీవపరిణామం మాట ఎలా ఉన్నా ప్రాణులన్నీ తమ జాతికి చెందినవాటితో కూడా నిరంతరం పోటీపడుతూనే ఉంటాయి. అందులో “నిస్వార్థ” గుణాలకి తావులేదు. ప్రతి ప్రాణీ తన మనుగడకై పాకులాడుతుందే తప్ప తన జాతికి మంచి జరిగే పనులేవీ చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాటి ప్రాణులకు సహాయపడే గుణం కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని గబ్బిలాలు ఆహారం అందని ఇతర గబ్బిలాలకు తమ నోటనున్న తిండి పెట్టడం జరుగుతుంది. అయినా ఇది నిస్వార్థచర్య కాదు. ఎందుకంటే గబ్బిలాలు “కలసి ఉంటే కలదు సుఖం” అన్న ప్రాతిపదిక మీద కొన్నిటితో జత కడతాయి. తమ సహచర మృగాన్ని ప్రాణాలతో ఉంచితే వాటికే లాభం. గబ్బిలాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఒకదానికొకటి తోడ్పడగలవు. అందువల్ల వాటి సహాయం స్వార్థపూరితమైన చర్యే.
తల్లిదండ్రుల క్రోమొసోమ్లలో ఒకరిది వ్యాధి కలిగించేదైనా రెండోవారికున్న ఆరోగ్యవంతమైన భాగం బలమైన ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా పిల్లలు ఆరోగ్యంగానే పెరుగుతారు. అయినప్పటికీ వ్యాధి కలిగించగలిగిన జన్యువులు సమసిపోకుండా కొనసాగుతాయి. ఇద్దరికీ ఒకే వ్యాధికి సంబంధించిన బలహీనత ఉన్నప్పుడు పిల్లలు జబ్బుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనుషులు సంతానోత్పత్తికై సామాన్యంగా తమను పోలినవారితోనే జతకడతారు. తెల్లవారు నల్లవారితోనూ, మంగోలాయిడ్ జాతివారు హిందువులతోనూ పెళ్ళిళ్ళు చేసుకోవడం అరుదు. అందువల్ల జన్యువుల్లో భిన్నత్వం ఏర్పడే అవకాశం తగ్గుతుంది. తక్కిన ప్రాణులుకూడా స్థానికంగా ఉన్నవాటి ద్వారా సంతానం పొందుతాయి కనక జన్యుపరమైన లక్షణాల్లో తేడాలుండే అవకాశం తక్కువే. ప్రకృతిలో జరిగే సహజమైన ఏరివేత కార్యక్రమంలో ప్రాణికి హాని కలిగించే జన్యుపరమైన మార్పులన్నీ రానురాను తగ్గిపోతాయి. అయినా జీవపరిణామం కొనసాగుతూనే ఉంటుంది.
జీవపరిణామం గురించి ఇంతగా చర్చించడం అవసరమా? కేవలం సైన్స్ పుస్తకాన్నో, వ్యాసాన్నో చదువుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి సిద్ధాంతాల గురించి ఆలోచిస్తూ, తరవాత మరిచిపోవడం జరుగుతుందా? అది నిజమైతే మనం చిన్నప్పుడు చదువుకున్న కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం అవసరం. మనకు ఇప్పుడు ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది వాటిలో ఒకటి. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివేననీ పిల్లలకు కూడా తెలుసు. గతంలో వీటికి తలొక “పూర్వీకుడూ” ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ “ఆదిమ” శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్ని రకాల ప్రాణులు “వాటంతట అవే” ఎలా ఉద్భవిస్తాయని అనుమానం కలగడం సహజమే. అయినా ఎంతటి సృష్టికర్తకైనా ఇన్ని రకాల, సైజుల, రంగుల, మచ్చల, చారల జీవాలని తయారుచేస్తూ కూచోవడం కష్టమే.
ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలి మానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్ల రంగులో ఉన్న ఒక మానవ సమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. అంచేత జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఈ రోజుల్లో దాదాపుగా ఎవరూ లేరనే అనుకోవచ్చు.
జీవపరిణామం అనేది గురుత్వాకర్షణవంటి “శక్తి” కాదు. అది ప్రాణులను మార్పుల దిశగా “నెట్టుతుందని” అనిపిస్తుంది కాని అటువంటి ప్రత్యక్షమైన ఒత్తిడి ఏమీ ఉండదు. దానికి “నిర్దేశిత గమ్యం” కూడా ఏమీ ఉండదు. జన్యువులలో తనంతట తానుగానో, ఏ కాస్మిక్ కిరణాల ప్రభావం వల్లనో జరిగే “లాభకరమైన” మార్పులకు అది సహాయపడుతుంది. అంతేతప్ప అది స్వయంగా జన్యువులను మార్చదు, మార్చలేదు. జీవకణాల విభజన జరిగినప్పుడు డిఎన్ఏల కాపీలు తయారవడంలో లోపాలు కలగడం, తప్పులు దొర్లడంవల్ల ఆకస్మిక పరివర్తన (మ్యుటేషన్) జరుగుతుంది. అవి అనియతంగా (రేండమ్) జరుగుతాయి కనక వాటి ఫలితంగా శరీర లక్షణాల్లో కలిగే మార్పులన్నీ కాకతాళీయమే.
జంతువులకూ, పక్షులకూ పుట్టిన పిల్లల్లో కొన్ని పుట్టుకతోనే బలహీనంగా ఉండడం చూస్తాం. ఆ కారణంగా అవి ఎక్కువ కాలం బతకవు. తిండి సంపాదించుకోలేకనో, ఇతర మృగాల వాత పడడం వల్లనో అవి చావగా, బలహీనతను కలిగించే వాటి జన్యువులు త్వరగా అంతరించిపోతాయి. పంటలకు సంబంధించకుండా ప్రకృతిలో పెరిగే మొక్కలూ, ధాన్యమూ, కాయగూరల వంటి వాటిలో గిడసబారినవీ, చేదుగా ఉండేవీ, తినడానికి పనికిరానివీ ఉంటాయి. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం కలిగించుకుని, తనకు పనికొచ్చేవాటిని మాత్రమే ఏరుకుని పండించుకుంటాడు. అలాగే పొగరుబోతు గొడ్లనూ, కుక్కలనూ కాకుండా మచ్చికగా ఉండే జంతువులనే పెంచుకుంటాడు. ఇక్కడ గమనించవలసినదేమిటంటే ప్రకృతిలో అన్నిరకాలూ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. జన్యువుల్లో, విస్తృతంగా కాకపోయినా చిన్న చిన్న మార్పులు యాదృచ్ఛికంగా జరుగుతూ ఉండడంవల్ల ప్రాణుల సంతతిలో ఎప్పటికప్పుడు తదనుగుణంగా తేడాలు తలెత్తుతాయి.
ఇలాటి తేడాలు శరీర లక్షణాలలోనే కాదు, ప్రవర్తనలోనూ, అలవాట్లలోనూ, సామర్య్థంలోనూ కూడా మార్పులు కలిగిస్తాయి. సామర్య్థం అంటే కేవలం ఎక్కువ బలమో, వేగమో, పెద్ద శరీరమో ఉండడమో కాకపోవచ్చు. జీవపరిణామం కేవలం మనుగడ కొనసాగించడానికే (సర్వైవల్) అని అంటారు. కాని, ఆయుర్దాయం సరిసమానంగా ఉండే ప్రాణుల్లో సైతం సంతానోత్పత్తిని సాధించడంలో తేడాలుండవచ్చు. తన జోడీని ఆకర్షించి, సంపర్కం ద్వారా ఎక్కువ సంతానం కలిగిన ప్రాణి యొక్క జన్యువులు మాత్రమే కొనసాగుతాయి. జీవపరిణామం కొన్ని సందర్భాల్లో విపరీతమైన మార్పులు కూడా కలిగిస్తుంది. వీటిలో కొన్ని అత్యాశ్చర్యం కలిగించేట్టుగా ఉంటాయి. నీటి మీద నడిచే పిట్టలూ, నీటి బొట్టును తుపాకీ గుండులాగా కొట్టి కీటకాలను చంపే చేపలూ, ఎన్ని మైళ్ళు ఎగిరినా దారి తప్పకుండా గూటికి చేరే తేనెటీగలూ, ధ్వనిని రేడార్లాగా ఉపయోగించే గబ్బిలాలూ మొదలైనవన్నీ జీవపరిణామం వల్లనే తమ “శక్తులను” సాధించాయి.
ఇవేవీ “కావాలని” జరిగిన మార్పులు కావు. ఉదాహరణకు నల్లని మనుషులకు చర్మంలో మెలనిన్ అనే పదార్థం తగ్గడం వల్ల తేలిక రంగులో ఒకరో, ఇద్దరో పిల్లలు పుట్టడం అసాధారణం కాదు. మెలనిన్ సూర్యకాంతిలోని అల్ర్టావయొలెట్ కిరణాలవల్ల చర్మ రక్షణకై ఉత్పత్తి అవుతుంది. ఎండ ద్వారా అటువంటి ప్రేరణ లభించని పరిస్థితిలో చర్మం నల్లబడదు. నలుపు తగ్గిన సంతతి ఎండ లేని ప్రాంతాల్లో మరింత బాగా మనుగడ సాగించగలగడంతో క్రమంగా వారి సంఖ్య బలపడి కొన్ని వేల తరాల అనంతరం తెల్లవారి జాతి తయారౌతుంది. అలాగే చెట్ల నీడల్లో దాగి ఉండేందుకు అనువైన రీతిలో మచ్చలూ, చారలూ కలిగిన పులులు ఆవిర్భవించాయి. అవి మరింత బాగా వేటాడి తమ సంతతిని వృద్ధి చేసుకోగలిగాయి. సాలెపురుగు అద్భుతంగా గూడు కట్టగలిగినా, పిల్లులకు నిశ్శబ్దంగా నడిచేందుకు అనువైన పాదాలున్నాయన్నా అవన్నీ సహజమైన ఏరివేత కార్యక్రమంలో వాటికి దక్కిన సదుపాయాలే. పరిణామం ఒక దిశలో విజయం పొందాక ఆ ప్రాణి మనుగడకు మరింతగా దోహదపడే శరీరాకృతి ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రకృతిలోని వింతలకు కారణాలు పరలోకంలో వెతకనివారికి జీవపరిణామం గురించిన భౌతిక ఆధారాలు ఎన్నో లభిస్తాయనేది మాత్రం నిజం.
అద్భుతమైన వ్యాసాల పరంపర………