- ఐరా గొలోబిన్
(ఒక్క అమెరికా సంయుక్త రాష్ర్టాల తత్వశాస్త్రపు చరిత్రనే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతిలో విశ్లేషించడం అవసరమనీ, తక్కిన దేశాలకది వర్తించదనీ కాదు; అటువంటి ప్రయత్నం ఇతర దేశాల విషయంలో జరగలేదు)
అణగారిన వర్గాలూ, అణచబడిన దేశాలూ ప్రాథమిక సామాజిక సత్యాలను అన్వేషించడం మానవు. స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టాలు పడినా, జరుగుతున్న సంఘటనల తెర వెనక ఏమవుతోందో గమనిస్తూ, అనవసర, ప్రత్యేక విషయాలను లక్ష్యపెట్టకుండా, లోతైన సామాన్య సత్యాలను కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వర్గాల స్వాతంత్య్ర పోరాటాలని బలపరిచి, మార్గదర్శనం చెయ్యగలిగిన తాత్వికసత్యాలు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. పాలకవర్గాల చరిత్రలో మాత్రం ఇటువంటి ఆలోచనలూ, చర్యలూ అన్నిటినీ అణిచెయ్యడం మామూలే; ఒకవేళ వాటిని ప్రస్తావించినా, వాటికి వక్రభాష్యాలూ, నిందలూ తప్పవు. ఇన్ని పరిమితులున్నప్పటికీ, ఈ ప్రయత్నాల గురించి మనకు తెలిసి నమ్మదగ్గ ఆధారాల్లో, ఆకరాల్లో అనేకచోట్ల కొన్ని వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. వీటిద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజల పోరాట చరిత్రను పునర్నిర్మించడం వీలవుతుంది.
రైతులూ, చేతిపనివారూ, తమతమ ఇతర వృత్తులలో ఉత్పాదన చేసేవారూ అందరిదీ ముఖ్యపాత్రే అయినప్పటికీ, వలసయుగంలో అమెరికా ఆర్థికప్రగతి ఎక్కువగా బత్తెం కూలీల, బానిసల, అర్ధ భూస్వామ్య నౌకర్ల శ్రమపైనే ఆధారపడింది. వలసవచ్చినవారిలో కొందరు (ముఖ్యంగా వారి సంతానం) సంఘంలో పెటీ బూర్జువా, బూర్జువా తరగతుల్లో పైకి రాగలిగారు. అయితే నల్లవారూ, అమెరికా ఆదిమతెగలూ, మెక్సికో జాతులూ, ఆసియావాసుల్లో అధిక సంఖ్యాకులకు మాత్రం దేశవ్యాప్తంగా వర్గపీడన తప్పలేదు; దానితో వారి పోరాటమూ ఆగలేదు.
ఈ అల్పసంఖ్యాకుల, మొత్తం కార్మికవర్గపు సాహిత్యం, సామెతలూ, పాటలూ, పోరాటాలూ అన్నిటిలోనూ కొన్ని దృక్పథాలు కనిపిస్తాయి. ఇవన్నీ సమాజం, మానవజీవితం, ఆలోచనా విధానాల గురించి స్పష్టంగానూ, భావగర్భితంగానూ వ్యక్తపరిచినటువంటివి. నిరక్షరాస్యత ఒక సమస్యేగాని లోతైన ఆలోచనాశక్తికి అది పెద్ద ప్రతిబంధకం కాదు.
“ఏవో కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప అమెరికాలోని తత్వశాస్త్ర అధ్యయనమంతా విద్యారంగానికే పరిమితం”.49
అయితే స్వయంశిక్షితులైన కొందరు తత్వవేత్తలు మాత్రం కొంతవరకూ భౌతికవాద, గతితార్కికవైఖరి కలిగి ఉండేవారు. వైజ్ఞానికధోరణి ఉన్నా, లేకపోయినా “మొదటి నుంచీ తాత్విక ఆలోచనలూ, భావాలూ, ప్రతిపాదనలూ అమెరికా చరిత్రను మలచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి”.50
ప్రజాకవి వాల్ట్ వ్హిట్‌మన్ రచనలవల్ల ప్రజాస్వామిక ఉద్యమాల మీద చెప్పుకోదగ్గ భౌతికవాద, గతితార్కిక ప్రభావం ఉండింది. “గడ్డి పరకలు” అనే తన కవితలో వ్హిట్‌మన్ అంటాడు
“ప్రశ్నించ సాహసించనిక దాన్ని,
యదార్థత నాకు ఆమోదం
ఆద్యంతం రంగరించిన భౌతికవాదం
రూఢి అయిన విజ్ఞానానికి జయం కలగాలి –
ఖచ్చితమైన ప్రయోగాలు పెంపొందాలి” 51
హెగెల్ గతితర్కాన్ని గురించిన తన వ్యాఖ్యానంలో (హెగెల్ తత్వశాస్త్రానికి జె. గోస్టిక్ రాసిన టీక గురించిన వ్యాఖ్యానం) వ్హిట్‌మన్ మేధావిగా గాంభీర్యాన్నీ, తన భావాలపై గతితర్కం ప్రభావాన్నీ ప్రదర్శిస్తాడు.
“మనిషి మనసులో అతి గంభీరమైన భావన ఒకటుంటుంది. ఒకవంక నేను అనే మానవ సహజమైన అవగాహనా, భావాలూ, అంతరాత్మా, మేధావులకు కలిగే ఆనందమూ ఇలాంటివింకా ఎన్నెన్నో ఉంటే, మరొకవంక నేను కానిది అంటే మొత్తం వస్తుగతంగా కనబడుతున్న భౌతిక విశ్వాంతరాళమూ, దాని సూత్రాలూ, వీటన్నిటికీ అవతల స్థల, కాలాల్లో ఏముంటుంది వగైరా ప్రశ్నలన్నీ ఉంటాయి. వీటినెలా సమన్వయించి వివరించడం, వీటి మధ్యనున్న సంబంధం ఎటువంటిది, అనే ప్రశ్నలకు సమాధానం పైనే విజ్ఞానమూ, కళలూ, దేశదేశాల ఆకాంక్షలూ, మొదలైనవన్నీ ఆధారపడి ఉంటాయి…ఈ అంశాల గురించి ఇప్పటివరకూ జి.ఎఫ్. హెగెల్ అంత బాగా పూర్తి వివరణ ఇచ్చినవారెవరూ లేరు”.52
వ్హిట్‌మన్ చెప్పేవాటిలో సమన్వయభావనా, సర్వస్వాన్నీ పరిగణించడం, వ్యతిరేకశక్తులను విడదీయరానివిగా భావించడం మొదలైన అంశాలున్నాయి. వీటన్నిటికీ నిర్మాణాత్మక ఆధారాలూ, మూలకారణాలూ హెగెల్ సూత్రాల ద్వారా లభిస్తాయి; అవన్నీ సాకల్యాన్నీ, వ్యతిరేక శక్తుల సంఘర్షణ ద్వారా కలిగే స్వయంచలనాన్నీ గురించినటువంటివి.
“అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే హెగెల్ వివరణ సంఘర్షణ అనేదాన్ని గతితర్కానికి నమూనాగా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది…వ్హిట్‌మన్ చెప్పిన ప్రజాస్వామిక సమన్వయానికి ఇది తగిన తత్వధోరణి”.53
టూకీగా చెప్పాలంటే (బ్రూక్ ఫాం తదితర ఆదర్శ కమ్యూనిస్ట్ సమాజాలను స్థాపించిన) ట్రాన్సెండెంటలిస్ట్ లనబడే అధిగమనవాద తాత్వికులు వాస్తవాలనుకాక, బూర్జువా వాస్తవాలను అధిగమించే ప్రయత్నం చేశారు. “ట్రాన్సెండెంటలిస్ట్‌లది ఏదో ప్రత్యేక సిద్ధాంతవాద వైఖరి కాదు; భావరహితమైన వ్యాపార సంస్కృతి ఒత్తిడి కారణంగా మనసున కలిగే ఆక్రోశం”.54
(”భావరహితమైన” అనే పదం తాత్వికపరంగా కాక నీతిపరంగా వాడబడింది. మెటీరియలిజం అంటే భౌతికవాదం, భావరహితం అనే రెండు అర్థాలు “భౌతికవాదం, ఆదర్శవాదం” అనే మూడో అధ్యాయం మొదట్లో వివరించబడ్డాయి) వీరికి ప్రముఖ అనుయాయి అయిన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇలా రూఢిగా అన్నాడు. “నేను సోషలిస్టుల ఉదారభావనలనీ, వారి సిద్ధాంతాల గొప్పతనాన్నీ, వాటి ప్రోత్సాహానికి తోడ్పడే ఉత్సాహాన్నీ నిజంగా గౌరవిస్తాను.55 శాస్త్రాల్లో గతితర్కాని కెటువంటి స్థానం ఉందో అతను చెప్పాడు. “నక్షత్రాలను వివరించే ఖగోళశాస్త్రమూ, సంఖ్యలను వివరించే గణితశాస్త్రమూ, స్వభావాలను వివరించే రసాయనశాస్త్రమూ ఉన్నట్టే శాస్త్రాలకు శాస్త్రం ఒకటుంది అదే గతితర్కం. అది నిజానికీ, అబద్ధానికీ విచక్షణ తెలిపే మేధ”.56
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో సోషలిజం వేళ్ళూనుకున్నది పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల కార్మికవర్గ పోరాటాల్లోనూ, సంఘాన్ని సంస్కరించి ఆదర్శవంతమైన సోషలిస్ట్ సమాజాలను నెలకొల్పే ప్రయత్నాల్లోనూను. 1848 నాటి అనుభవజ్ఞులైన జర్మన్ (జోసెఫ్ వేడర్‌మేయర్ తదితర) విప్లవకారుల రాకతోనూ, 1905 రష్యా విప్లవం తరవాత వలసవచ్చినవారితోనూ సోషలిజం బలపడి, శాస్త్రీయరూపంలో దర్శనమిచ్చి వికాసం చెందింది. మొత్తం మీద “అమెరికా తత్వధోరణికి నిరంతరం కొత్త జీవాన్నీ, దిశనూ ఇచ్చినది కెరటాల్లా వలసవచ్చిన ప్రజలే”.57
కార్మికతత్వవేత్త అయిన జోసెఫ్ డియెట్జెన్ హెగెల్‌ను అధ్యయనం చెయ్యకుండానే గతితర్కంలో అద్భుతమైన కృషి చేశాడు. ఒక సోషలిస్ట్ ప్రచురణకు సంపాదకుడుగా 1888లో అతను హే మార్కెట్ సమ్మెలో బలి అయినవారి తరఫున వాదించాడు. The Positive Outcome of Philosophy, Philosophical Essays అనే తన రచనలూ, అనేక ఉపన్యాసాల ద్వారా డియెట్జెన్ గతితార్కిక భౌతికవాదంలోని ముఖ్యాంశాలకు కార్మికులలో ఆదరణ కల్పించాడు. ఎడ్వర్డ్ బెలమీ సోషలిస్ట్ సమాజం గురించి రాసిన Looking Backward అనే నవల కూడా బాగా ప్రాచుర్యం పొందిందనేది గమనార్హం.
వైజ్ఞానిక తత్వశాస్త్రం గతితార్కిక భౌతికవాదం అమెరికా సంయుక్త రాష్ర్టాలలో బాగా వేళ్ళూనుకుని ఉన్నటువంటిది. దాని చరిత్ర తప్పక లిఖించబడుతుంది. జ్ఞానవికాసం కలిగించే అటువంటి చరిత్ర వెలువడడానికీ, సోషలిస్ట్ ధోరణి కలిగిన కార్మికవర్గపు ఆవిర్భావానికీ సంబంధం ఉంటుంది.
References:
49. Howard Mumford Jones, American Humanism: Its Meaning for World Survival, p.24
50. Werkmeister, A History of Philosophical Ideas in America, p.3
51. Quoted in Parrington, Main Currents in American Thought, Vol.3, p.81
52. Quoted in Schneider, A History of American Philosophy, p.162
53. Ibid., p.163
54. Miller, The American Transcendentalists, p.ix
55. Ibid., p.17
56. Seldes, Great Quotations, p.237
57. Schneider, A History of American Philosophy, p.vii