అనువాదం: అబ్బాస్

కమ్ముకున్న చీకటిరాత్రిలోంచి నీ జ్ఞాపకం తన్నుకొస్తుంది-
నది, తన ధీరవిలాపాన్ని సముద్రంలో కలిపేస్తోంది!!
ఉదయపువేళల చిన్నబోయి ఉండే బోసిరేవులా ఉన్నావు-
ఇక వీడ్కోలు చెప్పుకోవలసిన ఘడియ సమీపించింది!!
తలలు తెగిన మంచుపూలు గుండె మీద రాలిపడుతోన్నాయి-
చెత్తాచెదారాలతో చెలువారే గుంటవి,
ముక్కలు చెక్కలయిన ఓడయాత్రికుల మహోగ్రకుహరానిని!!
యుద్ధాలూ, తిరుగుబాట్లూ పేరుకున్నది నీలోనే-
పాటపక్షులు రెక్కలు విప్పిందీ నీలోనే!!
దూరంలా - సంద్రంలా - కాలంలా,
అన్నిటినీ దిగమింగేశావు నువ్వు;
నీలోలోపల అన్నీ ములిగిపోయాయి!!
దాడులతోనూ, ముద్దులతోనూ నిండిన సంతోష సమయమది;
’బంకోలా’ లా భగ్గుమన్న మంత్రఘడియలవి!!
చోదకుడి భయాన్నీ – నావికుడి ఆగ్రహాన్నీ
ప్రేమోన్మాదపు మైకాన్నీ – అన్నిటినీ నీలో కలిపేసుకున్నావు!!
నా ఆత్మ రెక్కలు విప్పిందీ
దెబ్బలు తిన్నదీ కూడా
ఈ మంచుతెరల బాల్యంలోనే!!
దారితప్పిన శోధకా, నీలో సకలం ములిగిపోయాయి!!
దుఖాన్ని కమ్ముకున్నావు
వాంఛను పట్టుకు వేళ్లాడావు;
విషాదం నిన్ను బిత్తరపోగొట్టింది
నీలో సర్వం మునిగిపోయాయి!!
నీడలగోడలు వెనక్కితగ్గేలా చేశాను -
కామాన్నీ – కార్యాన్నీ మించి, ముందుకుసాగాను!
ఓ మెత్తని కండరమా, నా రక్తంలో రక్తమా!!
నేను మోజుపడి, కోల్పోయిన నాదానా!!
చెమ్మగిల్లిన వేళల్లో
నీకోసం కబురుచేస్తాను-
నీకోసం గొంతెత్తిపాడతాను!!
అనంతమైన మార్దవాన్ని నింపుకున్న కలశానివి-
అంతెరగని అనామకత్వం
నిన్ను చెక్కాబద్దా చేసిపారేసింది!!
ప్రియతమా, ఆ దీవుల నల్లవి ఏకాంతంలోనే -
నువ్వు నన్ను కౌగిల్లోకి తీసుకున్నది!!
ఆకలేసి దాహమేసినప్పుడు నువ్వే నాకందిన పండువి!
శోకాలూ శిథిలాల మధ్య నాకెదురైన అద్భుతానివి!!
నీగుండెనేలలో నన్నెలా మోశావో తెలీదు -
నీ చేతుల శిలువలో నన్నెలా ఎత్తుకున్నావో తెలీదు-
కానీ, నా దానా, నీకు జోహార్లు!!
నా కామం ఎంత దారుణమైందో – ఎంత క్షణికమైందో,
ఎంత కష్టం కలిగించిందో – ఎంత కళ్ళుమూసుకుపోయిందో
ఎంత వేధించిందో – ఎంత లేకిదో కదూ!!
చుంబనాల శ్మశానమా,
నీ సమాధిలో అగ్గి ఇంకా రగులుతూనే ఉంది!!
పిట్టలు పొడిచినప్పుడెల్లా,
ఈ పళ్ళచెట్లలోంచి రవ్వలు రాలుతూనే ఉన్నాయి!!
ముద్దొచ్చిన నోరు – మురిపించిన చేతులు,
నకనకలాడే పళ్లు – పెనవేసుకుపోయిన ఒళ్ళు
అన్నీ అద్భుతాలే !!
అంతులేని ఆశా, కడలేని కృషీ
కలనేసిన అల్లిబిల్లి అల్లికలలో
మనం కలిశాం – విడిపోయాం !!
మంచినీళ్ళలా – పేలపిండిలా,
గాలిలో తేలే మార్దవం –
పెదవులు పలకని మాట!!
ఇది నా రాత!
ఇదే నా చిరవాంఛితయాత్ర!!
ఇక్కడే నా కాంక్ష రాలిపడింది –
సర్వం నీలో మునిగిపోయాయి!!
చెత్తచెదారాలతో చెలవారే గొయ్యివి,
నీలో సకలం మునిగిపోయాయి!!
నువ్వు ప్రకటించని దుఖంలేదు!!
నిన్ను ముంచని కెరటం లేదు!!
ఉప్పెన మీద ఉప్పెన ముంచెత్తుతూ ఉన్నా
నువ్వు పాటలాపలేదు!
నౌకాముఖంలో పాతుకుపోయిన కళాసిలా,
చెక్కుచెదరలేదు!!
చెత్తాచెదారాలతో చెలువారే గొయ్యివి,
ఉప్పునీటితో నిండిన దిగుడుబావివి –
అయినప్పటీకీ, నువ్వు పాటల్లో పుష్పించావు,
కెరటాలలో ఎగసిపడ్డావు!!
చూపులేని నావికా, వేట నీకు కలసిరాలేదు!!
దారితప్పిన శోధకా, నీలోనే అన్నీ మునిగిపోయాయి!!
విడిపోవలసిన తరుణం విచ్చేసింది –
కఠినమూ, కష్టమూ అయిన కాలం కాస్తా వచ్చేసింది!!
అన్ని టైమ్ టేబుల్స్ లోనూ ఈ ఘడియను
విధిగా చేరుస్తుంది రాత్రి!
గలగలలాడే సముద్రపు ఒడ్డాణం
తీరాన్ని చుట్టుకుంటోంది!
చుక్కలకుప్పలు పోగుపడుతున్నాయి –
చీకటిపక్షులు వలసపోతున్నాయి!!
వేకువజామున బోసిపోయిఉండే రేవులా,
గజగజ వణికే నీ నీడ నాచేతిలో మెలికలు తిరుగుతోంది!!
అతి దూరసీమా! అత్యంత సుదూర సీమా!!
నే వదిలేసినా నాదానా,
మనం విడిపోవలసిన తరుణం విచ్చేసింది, వచ్చేసింది!!
ప్లాబో నెరుడాని అనువదించటం చాలా చాలా సాహసం. మూలాన్ని, దీన్ని పక్క పక్క న పెట్టి చదూతూంటే ఒళ్లు జలదరించింది. చాలా అద్బుతంగా ఉంది.
నెరుడా కవితలలో కనీసం ఒక్క దానినైనా అనువదించాలన్నది నా జీవితాశయం. ఇది చూసిన తరువాత నాకు భయమేస్తుంది. ఇంతటి స్పష్టత, స్వచ్చత, బ్రెవిటీ, నేను తీసుకురాలేనేమోనని.
అబ్బాసు గారు హేట్సాఫ్
బొల్లోజు బాబా
బంకోలా’ లా భగ్గుమన్న మంత్రఘడియలవి!!
The hour of the spell that blazed like a lighthouse.
బంకోలా అంటే ఏమిటి?
అద్భుతమైన కవిత.అమోఘమైన అనువాదం.
కవికి, అనువాదకరత్నానికి అభినందనలు.