బతికున్న మనుషులకు గల ముఖ్యలక్షణం చైతన్యం (consciousness). తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే ఇది ప్రాథమిక స్థాయిలో మొదలవుతుంది. మనిషి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇది ఎక్కువై, మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ అనిపించేదాకా ఎదుగుతుంది. వస్తుపరమైన యథార్థత (objective reality) అనేది మన చైతన్యానికి సంబంధం లేనిదని లెనిన్ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్ వంటి మేధావులుకూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
ఎంతటి మిథ్యావాదులైనా మెదడుకూడా విశ్వంలోని పదార్థరాశిలో ఒక భాగమేనని ఒప్పుకుంటారు. మెదడూ, కొన్నిరకాల ప్రాణులకు ఉన్న నాడీమండలమూ ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో రూపొందాయో విజ్ఞానం చెపుతుంది. ఈ సందర్భంలో 450 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూమిమీద మనుషులు పుట్టి 20 లక్షల సంవత్సరాలే అయిందని గుర్తుంచుకోవాలి. అంటే మనిషికి తన మెదడు ద్వారా లభిస్తున్న స్పృహ ఏర్పడని కోట్లాది సంవత్సరాల క్రితంనుంచీ పదార్థం (matter) అనేది ఉంటూనే ఉంది. మార్క్సిజం చదువుకున్నవారికి ఇదంతా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగాని తమ “మనసులు” కలిగించే రకరకాల భావాల పరంపరలో కొట్టుకుపోయేవారికి ఇది ఎప్పటి కప్పుడు గుర్తుచేస్తూనే ఉండాలి. మనిషి మెదడులోని కణజాలం ఆలోచనకూ, జ్ఞాపకశక్తికీ, వివేచనకూ తోడ్పడుతుంది కాని అది కూడా పదార్థంతో రూపొందినదే. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్ అన్నాడు.
తిరపతి మొక్కులూ, సాయిబాబా భజనలూ గిట్టని ఒక మోస్తరు హేతువాదులకుకూడా మనసులో కొన్ని “అనుమానాలు” ఉండటం చూస్తూఉంటాం. దీనికి ముఖ్యకారణం చావును గురించిన సందేహాలు. ఎన్నో సంవత్సరాలు బతికి, ఆలోచించి, నవ్వి, ఏడ్చి ఏదో ఒకనాడు శ్వాసపీల్చడం మానేసిన మనిషి ఉనికికి చావు అనేది శాశ్వతమైన అంతం అని అంగీకరించడానికి “మనసొప్పదు”. మరణం అనేది జీవపరిణమానికి అవసరం (evolutionarily necessary) అని రిచర్డ్ డాకిన్స్ వంటి శాస్త్రవేత్తలు అంటారు. చచ్చిన తరవాత మనలో “నశించనిది” ఏదీ ఉండదు. మనిషి శరీరం యంత్రపరంగా వందా నూటయాభై ఏళ్ళకు మించి “నడవదు”. అరిగి, తరిగి శిథిలమవుతుంది. అందుకనే నూట ఇరవై దాటిన “శతాధిక” వృద్ధులెవరూ ఉండరు. జీవపరిణామంలో చావు అనేది ప్రకృతిపరంగా చూస్తే “లాభదాయకం” (cost effective).
నానాటికీ అరిగిపోయే ప్రతి ప్రాణి శరీరాన్నీ బాగుచేస్తూ కలకాలం మన్నేట్టు చెయ్యడం కంటే ఆ శరీరంలో “పనికొచ్చే” పదార్థాన్ని కొత్త శరీరంలో ప్రవేశపెట్టి ముసలి శరీరాన్ని అవతలికి నెట్టడమే ప్రకృతికి “సులభం” అవుతుంది. పనికొచ్చే పదార్థం అంటే మనలోని జన్యుపదార్థం. మనవాళ్ళు అనుకుంటున్నట్టుగా మనలో “అమరమైనది” ఆత్మకాదు, జన్యుపదార్థం.
దీన్ని వ్యతిరేకిస్తున్న ఇతర భౌతికవాదాలుకూడా లేకపోలేదు. మనిషి శరీరంలో కాలంతోబాటు వృద్ధాప్యలక్షణాలు కలగడం అనివార్యం కాదనీ, జన్యువుల్లో అప్పుడప్పుడూ జరిగే హానికరమైన మార్పులను సరిదిద్దుకునే ప్రక్రియలు జన్యువుల్లోనే జరుగుతాయనీ వెల్లడయింది. అయినప్పటికీ కొంతకాలానికి ఈ రిపేరు అంతుచిక్కని ఏవో కారణాలవల్ల మందగిస్తుందనీ, క్రమంగా వార్ధక్యం చావుకు దారితీస్తుందనీ ప్రయోగాల్లో రుజువయింది. వీటికిగల జీవరసాయన కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
Selfish Gene, The Blind Watchmaker అనే తన పుస్తకాలలో డాకిన్స్ ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించాడు. భూమి ఆవిర్భవించిన తొలిదశల్లో నీటిలో రకరకాల రసాయనపదార్థాలు యాదృచ్ఛికంగా పరస్పరం కలయిక చెందడంవల్ల పునరుత్పత్తి సాధించగలిగిన జీవరసాయనిక పదార్థాలు రూపొందాయని (మార్క్సిస్టు వ్యతిరేక) పాశ్చాత్యవిజ్ఞానమే చెపుతోంది. ఒకసారి ఈ జన్యు పదార్థం తయారయాక అది నిరంతరం తనను తాను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతుందని డాకిన్స్ అంటాడు. ప్రాణులు పుట్టి, “యుక్త”వయస్సు చేరుకుని, పునరుత్పత్తి సాధించడంతో వాటి “పని” అయిపోతుంది. ఇక అవి చచ్చిపోయి తమ సంతతి తిని పెరగడానికి పక్కకు తొలగడమే “మంచిది”. ఎంతో వివేచనా, ఆత్మనిగ్రహమూ సాధించామనుకున్న మనుషుల దగ్గర్నుంచీ జంతువులూ, క్రిమికీటకాలూ అన్నిటిలోనూ కూడా తగిన సమయం వచ్చేసరికి సృష్టి కార్యానికి అవసరమైన ఉద్రేకాలూ, “మనోవికారాలూ” అన్నిటినీ “స్వార్థగుణం” కలిగిన జన్యువులే కలిగిస్తాయి. ఈ పని ఎంత బాగా జరిగితే సంతానం అంత చక్కగా కలుగుతుంది. జీవపరిణామం మొదలైనప్పటి నుంచీ ఇది నిరాటంకంగా జరుగుతూనే ఉంది. ఇది ఎంత మౌలికమైన లక్షణం అంటే దీనితో పోలిస్తే పాలిచ్చి పెంచే క్షీరదాలకు ఉండే “మాతృప్రేమ” తరవాత ఎప్పుడో రూపొందిన లక్షణం.
పునరుత్పత్తి మాత్రమేకాదు, హాని కలగకుండా చూసుకోవడం, ప్రతికూలపరిస్థితులకు లోనవకుండా తప్పించుకోవడం, లేదా వాటికి తట్టుకునే లక్షణాలను సంతరించుకోవడం ఇవన్నీ జీవరాశి లక్షణాలు కావడంలో ఆశ్చర్యంలేదు. ఏదో ఒక ప్రాథమికస్థాయిలోనైనా చైతన్యం, స్పృహ మొదలైనవి ప్రాణికోటికి అవసరమయాయి.
ప్రకృతి మృత్యువును “ఎంపిక” చెయ్యడానికి జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. ఒకే ప్రాణి మరణం అనేది లేకుండా బతుకుతూ ఉంటే దాని జన్యువులూ, శరీరలక్షణాలూ, మారుతున్న బాహ్య పరిస్థితులకు అనుగుణంగా మారలేవు. కాలం గడుస్తున్నకొద్దీ పర్యావరణం మారిపోయే అవకాశం ఉంటుంది. సంతానోత్పత్తి జరిగినప్పుడల్లా జన్యువుల్లో మ్యుటేషన్లు కలగడం, వాటి కారణంగా రూపొందిన శరీరలక్షణాల్లో కొన్నయినా ప్రాణి మనుగడకు దోహదపడడం వీలవుతుంది. ఒక ప్రాణి సాధించలేనిది తరాలు గడుస్తున్నకొద్దీ జన్యువైవిధ్యంద్వారా జరుగుతుంది. ఈ ఏర్పాటువల్ల జన్యు పదార్థం నశించకుండా కొనసాగడం సాధ్యమౌతుంది. ఈ వివరణలో అతీతశక్తుల ప్రమేయమేదీ లేదు. ప్రాణికోటిలోని భాగమైన మనుషులకు ప్రత్యేకత ఏమీ ఉండదు. తక్కిన జీవాల్లాగే మనం కూడా పుట్టడం, గిట్టడం జరుగుతాయి.
మనిషి మరణాన్ని “కుక్కచావు” వంటిదానితో పోల్చడం అవమానకరంగా అనిపిస్తుంది కాని, జన్యుపరంగా చూస్తే ఈ విషయంలో తేడా ఏమీ ఉండదనీ, అది సమంజసమేననీ అనిపించకమానదు. మధ్యయుగపు మనస్తత్వంతో ఇటువంటి విషయాల వివరణకు వేదాలనూ, ఉపనిషత్తులనూ వెతకడం మానేసి, స్కూలు స్థాయి జీవశాస్త్రం చదువుకుంటే పై విషయాలన్నీ ఎవరికైనా అర్థం అవుతాయి. సులువైన వివరణను పట్టించుకోకుండా ఎవరికీ తెలియని, ఎవరూ నిరూపించలేని ఆత్మల గురించి మథనపడడం చాలా అనవసరం.
పునర్జన్మ గురించీ, ప్రేతాత్మల గురించీ, సైకిక్ పవర్ గురించీ కొన్ని దశాబ్దాల కిందట ఉండిన ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది. స్టాటిస్టికల్ పద్ధతిలో విశ్లేషణకు నిలబడని ఈ సిద్ధాంతాలన్నీ వట్టి నమ్మకాల స్థాయిలో మిగిలాయి. పూనకాలూ మొదలైనవన్నీ మెదడులో విడుదల అయే న్యూరో ట్రాన్స్‌మిటర్ల హెచ్చుతగ్గులవల్ల తలెత్తుతున్నవే. వీటి ఆధారంగా జీవాత్మలనూ, పరమాత్మలనూ నమ్మడంలో అర్థంలేదు.
చావును గురించిన దృక్పథం మాట ఎలాఉన్నా ఇటీవల జీవశాస్త్రంలో జరుగుతున్న పరిశోధనలు పుటక గురించిన అయోమయాన్ని పటాపంచలు చేస్తున్నాయి. క్లోనింగ్, దానికి సంబంధించిన వార్తలు సామాన్యులకు జీవపదార్థం గురించిన అవగాహనలో పెనుమార్పులు కలిగిస్తున్నాయి. ప్రాణులు పుట్టడం మాత్రమేకాదు. వాటి పెరుగుదలా, వాటిలో కలిగే శారీరక మార్పులూ అన్నిటినీ నియంత్రించడం సాధ్యమని విజ్ఞానం నిరూపిస్తోంది. జన్యువులను కృత్రిమంగా తయారుచెయ్యడం, టెస్ట్‌ట్యూబుల్లో పిల్లలను పెంచడం పాతబడిన విద్యలైపోయాయి. కృత్రిమ చర్యల ద్వారా పక్షులకూ, జంతువులకూ (అనుమతిస్తే మనుషులకూ కూడా) అదనపు వేళ్ళూ ఇతర అవయవాలూ పెరిగేట్టు చెయ్యడం వీలవుతుందని పరిశోధనలు నిరూపించాయి. “విశ్వామిత్ర సృష్టి” ఎవరైనా చెయ్యవచ్చు. మనిషే సృష్టికర్త అవుతున్నాడు. “అన్నిటినీ” సృష్టించిన సృష్టికర్త అనేవాడు మరెవరూ సృష్టించనవసరంలేని “స్వయంభువు” అనుకోవడంకంటే ప్రకృతి అనేదాన్ని ఎవరూ సృష్టించ నవసరం లేనిదిగా భావించడమే సబబుకదా అని రసెల్ ఎప్పుడో అన్నాడు.
ప్రాణులు అభివృద్ధి చెందే కాలంలో, కొన్ని భౌతిక పరిస్థితుల్లో మనిషి ఆవిర్భావం జరిగింది. మనుషులు సమష్టిగా జీవించడం తప్పనిసరి అవడంతో ఈనాడు మనుషులకు ఏర్పడిన సామాజిక లక్షణాలకు పునాదులు పడ్డాయి. పుట్టడం, చావడం వాటితో ముడిపడ్డ భావనలూ అన్నీ ఆటవికదశలో రూపొందాయి. మనిషి మెదడులో కలిగిన గొప్పమార్పులు అతని ఆలోచనలకూ, వాస్తవాలకు తేడా లేదేమో అన్నంత భ్రమను కలిగించే స్థాయికి పెరిగాయి. అందుకనే పుట్టిన వెంటనే పొందని చైతన్యం చావుతో ఒక్కసారిగా అంతమైపోతుందని నమ్మడం మనకు కష్టం అనిపిస్తుంది. మరణానంతర జీవితం గురించిన ఊహలు మొదలవుతాయి. మరికాస్త కిందిస్థాయిలో మనకు సహజంగా జీవితానుభవం నేర్పే కార్యకారణ సంబంధం వల్ల “అన్నిటినీ ఆడించే” శక్తిని గురించిన భావనలు తలెత్తుతాయి. వీటిని గుర్తించి అందరిలోనూ సరైన అవగాహన కలిగేట్టు చూడడం భౌతికవాదుల కర్తవ్యం.
Tel what is more impressive is the kind of time and effort put in by the author in gathering data and analysing it with little flow of unwarranted emtions. An ideal style of writing ! Shd be eye opener for lot of intelluctuals..