- ఐరా గొలోబిన్
తొలి రోజుల్లో అమెరికాకు వలసవచ్చి స్థిరపడినవారికి చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చకతప్పలేదు; కొంతమంది తత్వవేత్తల్లాగా కేవలం వాటిని అర్థం చేసుకోవడంతో వారికి సరిపోలేదు. ఏదో చేసెయ్యాలనేదే తప్ప శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథం లేకపోవడంతో వీరందరికీ సిద్ధాంతాలంటే ఏవగింపు ఉండేది. అయినప్పటికీ వీరందరూ తమ మాతృదేశాల్లో అమలులో ఉండిన రకరకాల తత్వధోరణులని కలగాపులగమైన పద్ధతిలో గుడ్డిగా ఆచరించడం మాత్రం చేసేవారు. తత్వశాస్త్రాలని గట్టిగా నమ్మినవారి సంఖ్య అప్పట్లో తక్కువే అయినప్పటికీ వలసదేశమైన అమెరికాలో తాత్విక వైఖరి శూన్యంగా మాత్రం ఉండేది కాదు.
వివిధ ప్రాంతాల్లోనూ, సమయాల్లోనూ ఆనాటి తత్వశాస్త్ర వైఖరిలో స్పష్టమైన వర్గవిభజన కనబడేది కాదుగాని, అమెరికా అనుభవాల్లో అది ద్యోతకం అవుతూ, అక్కడికి దిగుమతి అయిన తత్వధోరణుల్లో మార్పులు కలిగిస్తూనే ఉండేది. ఆనాటి “పల్లె వేదాంతి”కి తత్వశాస్త్రంలో సరైన శిక్షణ లేకపోయినప్పటికీ స్థానికంగా కొంత ప్రతిష్ఠ ఉండేది. ఇలాంటివారు ఆర్థిక, రాజకీయ విలువల గురించీ, లోకంలో మానవజాతికున్న ప్రపత్తి గురించీ అందరికీ తెలిసిన పద్ధతిలో స్థూల ప్రపంచజ్ఞానం కొంత ప్రదర్శించేవారు. న్యాయవాదులూ, వైద్యులూ, రాచప్రతినిధులూ మొదలైనవారికి మాత్రం శాస్త్రీయ తత్వశాస్త్రంతో పరిచయం ఉండేది. అయితే వీరి అభిప్రాయాలు అధికసంఖ్యాకుల ఆర్థిక, రాజకీయ ధోరణులకు భిన్నంగా ఉండేవి. అలాంటివారిలో పెద్ద పెద్ద భూస్వాములూ, వ్యాపారస్థులూ, పరిశ్రమల యజమానులూ అందరూ ఉండేవారు. 1743లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్థాపించిన అమెరికన్ తత్వ సమాజంలో (American Philosophical Society) వీరి అభిప్రాయాలను వ్యక్తం చేసే అధికార ప్రతినిధులుండేవారు.
ఇంగ్లండ్‌నుంచి స్వాతంత్య్రం పొందాక అమెరికాలో వర్గవిభజన పెరిగింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న డేవిడ్ బ్రౌన్ అనే సైనికుడికి 1798లో కారాగార శిక్షా, 400 డాలర్ల జరిమానా విధించారు. ఎందుకంటే అతనొక స్వాతంత్య్ర స్తూపం నిర్మించాడు. దాని మీద ఇలా రాసి ఉంది. “స్టాంప్ చట్టం, దేశద్రోహ చట్టం, పరదేశీ చట్టం రద్దు చెయ్యాలి; భూమి పన్ను చట్టం పోవాలి. అమెరికా శాంతి సమాజపు నియంతృత్వం కొనసాగరాదు; అధ్యక్షుడు పదవీ విరమణ చెయ్యాలి; ఉపాధ్యక్షుడికీ (థామస్ జెఫర్సన్), అల్పసంఖ్యాక వర్గానికి జయం కలగాలి; పౌర ప్రభుత్వానికి నీతిమార్గమే ప్రాతిపదిక కావాలి!”. షే (Shay) తిరుగుబాటుకూ (1786-87), విస్కీ తిరుగుబాటుకూ (1794) గల మూలకారణాలు కొన్ని అతని ఈ ప్రకటన వల్ల తెలుస్తాయి.
“అమెరికా సంయుక్త రాష్ర్టాల యాభై లక్షల మందిలో అయిదు వందలమందికే పబ్లిక్ ఆస్తివల్ల లాభాలన్నీ కలుగుతున్నాయి; తక్కిన సమాజపు శిథిలాలమీదనే వారికి పూట గడుస్తుంది.. సమాజంలోని శ్రామికవర్గానికీ, ఆ వర్గాన్ని ఎలాగైనా తుదముట్టించేందుకు రకరకాల పైశాచిక కుయుక్తుల నుపయోగించే సోమరిపోతు వెధవలకీ మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది; మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నవాళ్ళందరూ తమ బాధ్యతలు నిర్వర్తించకుండా, వెర్రి వెంగళప్పల్లాగా నోటికొచ్చినట్టు పేలుతూ, అదే ధోరణిలో కొనసాగడానికి ఎంతకైనా తెగిస్తున్నారు”.32
1787లో రహస్యంగా జరిగిన రాజ్యాంగ సమావేశంలో పారిశ్రామికవేత్తలూ, బానిసల యజమానులూ, భూస్వాములూ, వ్యాపారస్థుల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని పటిష్ఠపరిచే ప్రయత్నం జరిగింది. వెళ్ళగొట్టబడిన బ్రిటిష్ పాలకుల స్కాట్లండ్ తరహా వాస్తవిక లోకజ్ఞానం దీనికొక తాత్విక ప్రతిరూపంవంటిది. 1780 లగాయతు కళాశాలల్లో తత్వశాస్త్ర అధ్యాపకులుగా వృత్తిపరమైన శిక్షణనిచ్చే ప్రయత్నాలు మొదలయాయి. “ఎన్ని జాతులున్నప్పటికీ పద్ధెనిమిదో శతాబ్దం ముగిసేనాటికి విదర్‌స్పూన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో స్కాట్లండ్ తరహా లోకజ్ఞాన తత్వశాస్త్రంలోనే శిక్షణ మొదలయింది. ఇది క్రమంగా పెరిగి తత్వశాస్త్రమంతా దాదాపుగా ఈ పద్ధతిలోనే కొనసాగింది…ఇందులో సున్నితమైన వాద ప్రతివాదాలుండేవి కావు; అన్నీ బలమైన మొరటు నమ్మకాలే. దీనివల్ల బైబ్‌ల్ బోధలను అక్షరాలా పాటించే వైఖరి సులువయేది కనక స్వతంత్రభావాలు కలవారిని బాధించడం వీలయింది”.33
చదువురాని సామాన్యులకూ, పెద్ద చదువులు చదివినవారికీకూడా తత్వశాస్త్రంలో శిక్షణ పొందడం ఒక అనవసర భేషజంలాగా అనిపించేది. పెరుగుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎదుగుదల అనేది తీవ్రమైన సమస్యగా ఉండేది కాని అసాధ్యమనిపించేది కాదు. సమస్యల్లో సైద్ధాంతికమైనవీ, వ్యవస్థాత్మకమైనవీ ఏవీ ఉండేవికావు. 1830లలో ఫ్రెంచ్ రచయిత డి టోక్‌విల్ ‘అమెరికాలో ప్రజాస్వామ్యం’ అనే తన ప్రసిద్ధ పరిశోధన మొదలుపెట్టి, అమెరికన్ల తాత్వికపద్ధతిని ప్రస్తావిస్తూ, “నాగరిక ప్రపంచంలో తత్వశాస్త్రాన్ని అమెరికాలాగా ఎవరూ నిర్లక్ష్యం చెయ్యరని నా అభిప్రాయం” అన్నాడు. వారి తత్వశాస్త్ర పద్ధతిలోని ముఖ్యధోరణిని గురించి చెపుతూ “మానసిక చర్యల విషయంలో ప్రతి అమెరికన్ తన కర్థమైనంత మేరకు ప్రధానంగా వ్యక్తిగత కృషిని గురించే ప్రస్తావిస్తాడు” అన్నాడు.34
1880ల గురించి చెపుతూ జాన్ డ్యూవీ “అప్పట్లో తత్వశాస్త్రాన్ని నేర్పేవారంతా మతాచార్యులే; దాదాపు అన్ని కళాశాలల్లోనూ తత్వశాస్త్ర బోధనలో మతానికీ, దైవశాస్త్రానికీ పనికొచ్చే విషయాలే ప్రధానంగా ఉండేవి…మానవజీవితాలకు అవసరంగా భావించబడిన దైవశాస్త్రంతోనూ, దాని నీతి నియమాలతోనూ తత్వశాస్త్ర శిక్షణ ఎంతగా ముడిపడి ఉండేదంటే వాటికి ఎదురుచెప్పడం ఊహించరానిదిగా ఉండేది”.35
తత్వశాస్త్ర విద్య యావత్తూ ఎంతో కాలం పాటు దైవశాస్త్రపు ఊబిలో కూరుకుపోయి ఉండటాన్ని గురించి ఎం.ఆర్.కోహెన్ 1950లలో రాశాడు. “ప్రధానంగా పాలకవర్గాల ప్రయోజనాలకే దోహదపడే సామాజిక, ఆర్థిక వాతావరణం మేధోవికాసానికి అడ్డుతగిలింది. అందువల్లనే తత్వశాస్త్రమంతా రోజువారీ పనుల దినచర్యకూ, మతాల ఓదార్పు ప్రక్రియలకూ పరిమితమయిపోయింది. కారణాలేవైనప్పటికీ అమెరికాలోని తత్వశాస్త్రమంతా ఎక్కువగా క్రైస్తవమతపు సంజాయిషీ ధోరణిగానే మిగిలిపోయింది. రాజకీయంగా ప్రజాస్వామిక వ్యవస్థలో జీవిస్తున్నప్పటికీ మన మత తాత్వికులంతా ఉన్నత రాజవంశపు పరివారంలాగే ప్రవర్తించారు..”.36 ఈ వైఖరి వల్లనే “దేవుణ్ణి నమ్మనివారెవరూ తత్వవేత్తలు కారనే అభిప్రాయం అమెరికా అంతటా బలపడిపోయింది”.37
బూర్జువాలూ, బానిస యజమానులతో కూడిన పాలకవర్గాల ప్రయోజనాల్లో ఇటువంటి పరలోక చింతన బాగా పాతుకుపోయింది. “ఆ కారణంగానే మన వలసవ్యవస్థా, విప్లవయుద్ధమూ, బానిసవిధాన వ్యతిరేకతా, అంతర్యుద్ధమూ, ఎందరో వలసవచ్చి స్థిరపడడమూ, సరిహద్దు ప్రాంతాల్లో స్వేచ్ఛాజీవనమూ ఇవేవీకూడా అమెరికాలోని తత్వశాస్త్రశిక్షణపై తమ ప్రభావం చూపలేకపోయాయి…”.38 దైవశాస్త్రానిదే పైచెయ్యి కావడం, యథాస్థితి కొనసాగేందుకు ఏవో సాకులు చెపుతూ ఉండడం వగైరాలన్నీ చూస్తే బానిసవిధానం పట్ల తటస్థ వైఖరి ఎందుకుందో అర్థమౌతుంది. ఎందుకంటే “జాన్ సి. కల్‌హూన్ రచనలు ఏవో కొన్నిటిలోతప్ప మన ప్రధాన తత్వగ్రంథాల్లో నీగ్రో జాతులు బానిసలుగా ఉండేవారన్న ప్రస్తావన ఎక్కడా కనబడదు. ప్రసిద్ధమైన స్వాతంత్య్ర ప్రకటనను రచించి, 1797 నుంచి 1815 దాకా అమెరికన్ తాత్విక సమాజానికి అధ్యక్షుడుగా పనిచేసిన జెఫర్సన్ వంటి ఉదారవాద ప్రజాస్వామిక తత్వవేత్తలు కూడా ఒకవంక బానిసలను ఉంచుకోవడం, అమ్మడం చేసేవారు; మరొకవంక మనుషులందరూ సమానులనీ, స్వేచ్ఛాజీవులనీ కూడా నమ్మేవారు…”.39 (అమెరికన్ తాత్విక సమాజాన్ని స్థాపించిన ఫ్రాంక్లిన్‌కూ, జెఫర్సన్‌కూ నల్లవారిని గురించి ఎటువంటి సాంస్కృతిక వైఖరి ఉండేదో స్టీవెన్ జే గోల్డ్డ్ The Mismeasure of Man, అనే తన పుస్తకంలో వివరిస్తాడు, పుట 32).
బూర్జువా తత్వవైఖరికి దైవశాస్త్రం ఇలా అడ్డుతగలడంతో తత్వశాస్త్రానికి ఉండవలసిన విశ్వ దృక్పథానికీ, విజ్ఞానంద్వారా తెలియవలసిన విషయాలకూ విఘాతం కలిగినట్టయింది. “లాక్ (Locke) తరవాత ఆంగ్ల అమెరికన్ తత్వశాస్త్రమంతా మనుషుల మనోవైజ్ఞానిక ప్రవృత్తిమీదా, వారి ధార్మిక విధులమీదా మాత్రమే కేంద్రీకృతం అయింది”.40 (1688లో జరిగిన “దివ్యవిప్లవం” తరవాత బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానం అక్కడి భూస్వామ్యపద్ధతికి స్వస్తి పలికింది) ఇటువంటి వైఖరి ప్రాచీన పాలకవర్గాల్లోనూ ఉండేది. “రోమన్, గ్రీక్ సంప్రదాయాల్లో మనుషుల వ్యవహారాలను అతిగా పట్టించుకోవడంవల్లనే తత్వశాస్త్రం సంకుచితమై, ఉదారతను కోల్పోయింది”.41
ఇటీవలిదాకా తత్వశిక్షణలో దైవశాస్త్రానిది పెద్ద పాత్రే కాని, 1900 ప్రాంతాల నుంచీ కార్యసాధకవాదం (ప్రాగ్మాటిజం) దీనికన్నా బాగా ముందుకొచ్చింది; ప్రజలలో దీనికి ఆదరణ పెరిగింది కూడా. చార్ల్‌స్ పియర్స్ ప్రతిపాదించిన ఇటువంటి తత్వానికి విలియంజేమ్స్ మూలవిరాట్టు వంటివాడు.
విజ్ఞానంలో ప్రగతీ, కార్మికవర్గంలో పెరుగుతున్న అవగాహనలవల్ల సామాన్యప్రజలమీద మతాల పట్టు సడలుతోందని విలియం జేమ్స్ గుర్తించాడు; యథాస్థితి కొనసాగడానికి కార్యసాధక వాదమే మంచిదని అతను ప్రతిపాదించాడు. తన బూర్జువా సలహాదారులతో అతను “మీకు కావలసిన వ్యవస్థలో శాస్త్రీయ వాస్తవాలను ఆమోదించి, వాటిని గుర్తించే సదుపాయం ఉండాలి; అనుకూలతా, అనుగుణ్యతా కావాలి. అయితే మునుపటిలాగా మానవవిలువలపై విశ్వాసమూ, దానివల్ల అప్రయత్నంగా కలిగే సద్యోజనఫలితాలూకూడా అవసరమే; అవి మతపరమైనవి కావచ్చు, కాల్పనికమైనవి కావచ్చు” అన్నాడు.42 అందువల్ల “కాస్త విచిత్రంగా అనిపిస్తుందిగాని, నా లెక్కన ఈ రెండు అవసరాలనూ తీర్చగలిగిన తత్వశాస్త్రం కార్యసాధకవాదమే. అది ఒకవంక హేతువాదాల్లాగా మతలక్షణాలను కోల్పోకుండా, మరొకవంక అనుభవవాదంలాగా వాస్తవాలకు అతి దగ్గరగానూ కూడా ఉండగలదు”.43 చివరగా జేమ్స్ “మీకు అవసరమయే ఆలోచనా విధానానికి కార్యసాధకవాదమే దారి తీయగలదని నా ఆశ” అన్నాడు.44
ఇరవయ్యో శతాబ్ది ప్రారంభానికల్లా ఏ శషభిషలూ లేనటువంటి కార్యసాధకవాదమే అమెరికా పెట్టుబడిదారీ పద్ధతిని సామ్రాజ్యవాదరంగంలో ప్రవేశపెట్టగలిగింది. (జేమ్స్ “మీరు, మీకు అవసరమయే” అన్నదిందుకే) ఈ పరిణామమే అమెరికా ప్రపంచం మీద “గుత్తాధిపత్యాన్ని” కోరేందుకు ప్రేరకమయింది. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక, ఈ లక్ష్యాన్ని సాధించిన ఉన్నత దశలో, రాకఫెల్లర్ సంస్థ అమెరికా తత్వశాస్త్ర సమాజం (1945లో 870 మంది) సభ్యులను ఆహ్వానించింది. వారిని “సమకాలీన తత్వశాస్త్ర పరిస్థితిని పరిశీలించి, యుద్ధానంతర ప్రపంచంలో అది నిర్వహించగలిగిన పాత్ర ఎటువంటిదో అంచనావెయ్య”మని ఆదేశించింది.45 అయితే అప్పటి బూర్జువా తత్వవేత్తలంతా అర్థం లేని ముఠా తగాదాలతో సతమతమౌతూ ఉండిపోయారు; అందుచేత అమెరికా సామ్రాజ్యవాదపు ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రణాళికలకు ప్రపంచవ్యాప్తంగా వత్తాసు పలుకుతూ, చురుకైన సైద్ధాంతిక మద్దతును ఇవ్వడం వారికి వీలుకాలేదు. రాకఫెల్లర్ సంస్థ అమెరికా తత్వశాస్త్ర సమాజం కోసం సమర్పించిన నివేదిక పరిచయవాక్యాల్లో ఇలా ఉంది. “సమకాలీన పరిస్థితుల్లో తత్వశాస్త్రం అనేది ఒక పటిష్టమయిన సిద్ధాంతంగా రూపొంది, దాన్ని గురించి సాధికారికంగా చెప్పగలిగిన ప్రతినిధులెవరూ కనబడరు. ఎన్నో తత్వధోరణులూ, ఎందరో తత్వవేత్తలూ కనబడుతున్నప్పటికీ తమ ముందుకొచ్చిన కొన్ని సమస్యల విషయంలో మాత్రమే భిన్నాభిప్రాయాలు తలెత్తడం చూస్తాం”.46
ఒకప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగేసిన పెట్టుబడిదారీ విధానంలో ఇప్పుడు కార్యసాధక వాదమే తత్వపరంగా ముఖ్యాంశమయింది. చైనా, కొరియా, వియత్నాంలలో అమెరికన్ సామ్రాజ్య వాదానికి ఎదురైన ఓటములూ, ఇతర సంక్షోభాలూ, క్షీణదశ లక్షణాలూ మొదలైన కారణాలవల్ల కార్యసాధకవాదం పట్ల బూర్జువాలకు ఆసక్తి పెరిగింది. ఇలాంటప్పుడు అస్తిత్వవాదమే ప్రయోజనకరంగా అనిపిస్తుంది. దానివల్ల కళ్ళెదుట కనబడుతున్నది మాత్రమే యదార్థమనీ, అస్తిత్వమనీ, అంతర్గతంగా ఉండే లోతైన భౌతిక వాస్తవాలన్నీ యదార్థమైనవి కావనీ అనిపిస్తుంది. అస్తిత్వవాదం పెట్టుబడిదారీ గుత్తాధిపత్యపు అసమంజసమైన క్షీణదశ లక్షణాలను సామాన్యప్రజలకు వివరించి, అవన్నీ ఆమోదయోగ్యమేనని అనిపించగలదు. వీటన్నిటికీ బూర్జువా వర్గాలను తప్పుపట్టి లాభంలేదనీ, వీటికి అసలైన కారణాలు ప్రతి మనిషిలోనూ, ముఖ్యంగా సామాన్య జనుల్లో సహజంగా ఉండే పాపభూయిష్ఠమైన బూర్జువా ప్రేరణలేననీ అస్తిత్వవాదం నమ్మించగలదు. మానవుడి సహజలక్షణాలే అతన్ని పెట్టుబడిదారీ నరకప్రాయమైన ప్రపంచంలోకి నెడతాయనీ, ఇదంతా బైబ్‌ల్‌లో చెప్పిన పాపాల ఫలితం వంటిదేననీ అది నమ్మబలుకుతుంది. ఇహలోకంలో తప్పించుకునే మార్గమేమీ ఉండదని చెప్పే అస్తిత్వవాదం వల్ల పరలోకంలో నమ్మకం లేనివారందరూ మళ్ళీ దైవసిద్ధాంతానికే తిరిగిరాక తప్పదు. ఇది ఒకరకంగా దైవశాస్త్రానికి లౌకికమైన దొడ్డిదారి. (అస్తిత్వవాదం గురించిన వాస్తవాల వివరణ రెండో అధ్యాయంలోనూ, ఇతర అధ్యాయాల్లోనూ కనిపిస్తుంది. బైబ్‌ల్ వివరాలపై ఆధారపడే “విమోచనాత్మక దైవశాస్త్రం” అనే మరొక సమకాలీన సిద్ధాంత ధోరణికూడా ఉంది. ఇది అణచివేతను ఎదిరించడాన్నీ, సోషలిజంతో ప్రమేయాన్నీ సమర్థిస్తుంది) దీని లెక్కన “అధోగతికి దారితీయగలిగినవి రెండే రెండున్నాయి ప్రపంచవ్యాప్తమైన కమ్యూనిజమూ, గతితార్కిక భౌతికవాదమూ”.47
భాషాశాస్త్రవిశ్లేషణ అనబడే మరొకధోరణి పదాలను అపూర్వపద్ధతిలో విశ్లేషిస్తుంది. తత్వశాస్త్రమని పేరుపొందిన ఈ పద్ధతి నిజానికి తత్వశాస్త్రానికి వ్యతిరేకం. దీనికి తత్వశాస్త్ర విద్యారంగంలో కొంత ఆదరణ ఉంది. దీన్ని అవలంబించే బూర్జువా అభిమానులకు ఇది అంత ఉపయోగకరం కాకపోయినా క్షేమకరంగా అనిపిస్తుంది.
“1952లో డ్యూవీ చనిపోయాక…అమెరికన్ తత్వశాస్త్రంలో పెనుమార్పులు కలగసాగాయి; అపూర్వమైన తర్క పద్ధతుల వాడకమూ, చిన్నచిన్న విషయాలనుకూడా భూతద్దం పెట్టి వెతకడమూ మొదలయింది…దైవశాస్త్రవేత్త జొనాథన్ ఎడ్వర్స్డ్ (1703-1758)నుంచి డ్యూవీదాకా సమకాలీన వ్యాఖ్యాతలుగా అమెరికన్ తత్వవేత్తలకు అంతులేని గౌరవం లభించింది; ఎందుకంటే వారికి మతం, రాజకీయాలు, విద్య మొదలైనవాటి పట్ల ఆసక్తి ఉండేది. కాని వారి తరవాత వచ్చినవారు మాత్రం విశాల ప్రపంచాన్ని అంతగా పట్టించుకోలేదు”.48
References:
32. Quoted in Frank M. Anderson, “Enforcement of the Alien and Sedition Laws”, pp.122, 124, in Annual Report of American Historical Association for 1912. See also, James Morton Smith, Freedom’s Fetters, pp.257-274
33. Cohen, American Thought: A Critical Sketch, p.258
34. De Tocqueville, Democracy in America, Vol.2, pp.3-4
35. Dewey, On Experience, Nature and Freedom, pp.6, 20
36. Cohen, American Thought: A Critical Sketch, p.256
37. Kaufmann, Existentialism from Dostoevsky to Sartre, p.46
38. Cohen, American Thought: A Critical Sketch, p.255
39. Ibid.
40. Ibid., pp.274-75
41. Ibid., p.275
42. James, Pragmatism, p.26
43. Ibid., p.33
44. Ibid., p.37, See also Wells, Pragmatism, pp.99-115
45. Siu, The Tao of Science, p.35
46. Ibid.
47. Rev. Dr. Ernest R. Palen, New York Times, Feb. 15, 1960
48. White, Science and Sentiment in America, pp.268, 301
అమెరికాలో మొదటగా స్థిరపడ్డ యూరోపియన్ల తాత్వికధోరణి ఎలా ఉండేదో, అది ఎటువంటి పరిణామాలకు లోనయిందో ఈ వ్యాసంవల్ల అర్థమవుతుంది. ప్రస్తుతం అగ్రరాజ్యంగా చలామణీ అవుతున్న ఈ దేశానికి అధినేతల తాత్విక, రాజకీయ వైఖరీ, అహంకారమూ మొదలైనవన్నీ నాలుగైదు శతాబ్దాల నాటి తాత్వికచరిత్రకు అద్దంపడతాయి. డార్విన్ పరిణామసిద్ధాంతాన్ని నిరాకరించడం, తాత్వికచింతనకు మతవిశ్వాసాలే ప్రత్యామ్నాయం అనుకోవడం మొదలైన మొరటు పద్ధతులన్నీ సాంకేతికంగా ఇంత అభివృద్ధిని సాధించిన దేశస్థులు అవలంబించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దానికి ఆధారం ఎలా ఏర్పడిందో ఈ వ్యాసం వల్ల కొంత తెలుస్తుంది.
http://www.washingtonpost.com/wp-dyn/content/article/2008/02/15/AR2008021502901.html