భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. దానివల్ల బుద్ధిని గురించిన వాదనలెన్నో తలెత్తుతాయి. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖా లన్నిటికీ మెదడే కారణం.

తన గురించీ, పరిసరాలను గురించీ, అవగాహన కలిగి, అనుభూతి పొందగలిగే ప్రాణి మనిషి ఒక్కడే. అయినప్పటికీ విశ్వంలో బుద్ధి అనేది అంత ప్రాథమికమైనదా అనేదొక ప్రశ్న. ఊహించరానంత పెద్దదైన ఈ విశ్వంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలను చూస్తే మనకు స్థల, కాల, పదార్థాలను గురించి తెలుస్తుంది కాని బుద్ధి, ఆలోచనల గురించిన ఉదాహరణలు భూమిమీద తప్ప మరెక్కడా కనబడవు. విశ్వంలో పెద్దపెద్ద నక్షత్రాలు పేలడమూ, రేడియేషన్‌ ప్రసారం కావడమూ వగైరా సంఘటనలకు “సాక్షులు” ఉండవలసిన అవసరం కనబడదు. ఇతర గేలక్సీల్లోనూ, గ్రహాల్లోనూ బుద్ధిజీవులు ఉండే అవకాశం ఎక్కువే అయినప్పటికీ బుద్ధి అనేది విశ్వంలో ఒక ప్రధాన లక్షణంగా కనబడదు. ప్రాణికి తన పరిసరాలకు అనుగుణంగా మసిలేందుకు మాత్రమే పనికివచ్చే బుద్ధి వికాసం ప్రకృతిలో ఒక నియమిత పాత్ర నిర్వహిస్తుందనుకోవడమే సబబేమో. మనిషికి మాత్రమే ఉండే మెదడుకూ, బుద్ధికీ గల సంబంధాన్ని చర్చించే ముందు మనిషి అసలు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. తక్కిన ప్రాణులు ఎలాంటివైనా మనిషి నిజంగా “కారణజన్ముడా”? అందుకు కూడా ఋజువులేవీ కనబడవు.

డార్విన్‌ పరిణామవాదాన్ని ఆమోదించినవారు సైతం జీవపరిణామానికి మనిషే పరాకాష్ఠ అని భావిస్తారు. మనకు తెలిసిన జంతుజాతిలో అత్యున్నతమైనది మనిషిజాతే అని మనం అనుకుంటూ ఉంటాం. కాని ఇందులో నిజం లేదని స్టీవెన్‌ జేగోల్డ్‌ అనే శాస్త్రవేత్త వాదించాడు. డార్విన్‌ పరిణామ వాదంలో కొన్ని మార్పులనుకూడా ఆయన సూచించాడు. తమ పరిసరాల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా విభిన్న జీవాలమధ్య మనుగడకై జరిగిన పోటీకి తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు బలపడినందువల్లనే కొన్ని జాతులు బతికి “బట్టకట్టా”యనీ, తక్కినవి నశించిపోయాయనీ డార్విన్‌ అన్నాడు. దీనికి ఆధునిక విజ్ఞానం జన్యుపరమైన (జెనెటిక్‌) వివరణ ఇచ్చింది. ఇవన్నీ కాస్త కాస్తగా నెమ్మదిగా జరిగే మార్పులు. గోల్డ్‌ దీన్ని సవరించి కొన్ని జీవజాతులు పెద్దపెట్టున నశించి పోవటానికి డార్విన్‌ చెప్పిన కారణం ఒక్కటే సరిపోదని అన్నాడు.

దీనికి ఒక ఉదాహరణగా ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అంతరించిన డైనొసార్‌ రాక్షసిబల్లులను చెప్పుకోవచ్చు. అంతరిక్షం నుంచి వచ్చి భూమిని ఢీకొన్నఒక బ్రహ్మాండమైన ఉల్క కలిగించిన ఉత్పాతం వల్లనే సుమారు 15 కోట్ల సంవత్సరాలు భూమిమీద వెల్లివిరిసిన ఈ భారీ జంతువులు అంతరించాయనే సిద్ధాంతం ఉంది. అప్పుడు గాలిలోకి లేచిన ధూళిమేఘం అనేక సంవత్సరాలు సూర్యకాంతిని అడ్డుకుని చీకటినీ, శీతలస్థితినీ కలిగించిందనీ, డైనసార్లు తినే మొక్కలు పెరగకుండా వాతావరణంలో విపరీతమైన మార్పులు తెచ్చిందనీ ఊహిస్తున్నారు. జీవపరిణామ క్రమంలో జన్యుపరమైన పోటీకి సంబంధించని బాహ్యకారణాలు జీవరాశిలో పెనుమార్పులు తేగలవనీ, తెచ్చాయనీ చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

అసలు భూమిమీద జీవరాశి ఎలా ఆవిర్భవించింది? సౌరకుటుంబంతో బాటు రూపొందిన భూగోళం వయస్సు 460 కోట్ల సంవత్సరాలు కాగా, భూమి కేంద్రంలోని వేడిమికి కరిగి చల్లారగా తయారైన అతి ప్రాచీన శిలల వయస్సు 390 కోట్ల సంవత్సరాలని తేలింది. ఆ తరవాత “త్వరలోనే” (350 కోట్ల సంవత్సరాల క్రితం) తొలి ఏకకణ జీవులు పుట్టుకొచ్చాయి. ఆ తరవాతి పరిణామం మనం అనుకున్నంత క్రమంగా జరగనేలేదు. బహుకణజీవులు 60 కోట్ల సంవత్సరాల క్రితంవరకూ ఆవిర్భవించనేలేదు. అంటే దాదాపు 300 కోట్ల సంవత్సరాలపాటు ఏకకణజీవులే “రాజ్యం” చేశాయి. బహుకణ జీవులు విభిన్న రూపాల్లో అకస్మాత్తుగా ఒక్కపెట్టున పుట్టుకొచ్చాయి. ఈ వైవిధ్యం 53 కోట్ల సంవత్సరాల క్రితం అంత అకస్మాత్తుగానూ తగ్గిపోయింది. ఇది క్రమంగాకాక, ఆగి ఆగి, హెచ్చు తగ్గులతో జరిగిన మార్పు కనక దీని వెనక “సృష్టి రచనాక్రమం” ఏదీ లేదనీ, బాహ్య పరిస్థితుల్లో కలిగిన మార్పులే కారణమనీ తెలుస్తోంది.

ఇక మనుషుల ప్రత్యేకత గురించి చెప్పాలంటే మనుష్యులకు తక్కిన ప్రాణులతో పోలిస్తే అతి సంక్లిష్టమైన మెదడూ, నాడీ వ్యవస్థా ఉన్నాయి. నరాలు కలిగించే భావనలే మనిషికి ఆలోచనలనూ, వివేచననూ, ముందాలోచననూ ప్రసాదిస్తాయి. అవగాహన అనేది మనిషికి తప్ప భూమిమీది మరే ప్రాణికీ ఉన్నట్టు దాఖలాలేదు. ఇదే మన గొప్పతనం అనుకుంటాం. కాని ఇది నిజం కాకపోవచ్చు. ఎగతాళిగా చెప్పాలంటే ఆరుకాళ్ళున్న చీమలూ, ఇతర కీటకాలూ రెండుకాళ్ళ మనుష్యులను గురించి తక్కువగా అనుకోవచ్చు.

నాడీవ్యవస్థ లేనంతమాత్రాన తక్కిన జీవాలు “గొప్పవి” కావా? అతి సూక్ష్మరూపంలో ఉండే బాక్టీరియా భూమి పుట్టినది మొదలు తక్కిన ప్రాణులన్నిటికన్నా ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఒక్క మనిషి పేగులలో ఉండే బాక్టీరియా సంఖ్య మొత్తం భూమిమీద ఉండిన పెద్ద ప్రాణులన్నిటికన్నా ఎక్కువ. తక్కిన ఏ ప్రాణీ బతకలేని పరిస్థితుల్లో రకరకాల బాక్టీరియా మంచుకొండల నుంచి అగ్నిపర్వతాలదాకా ఎన్నో ప్రతికూలవాతావరణాల్లో చక్కగా వృద్ధి చెందుతున్నాయి. మనకు నాడీమండలం ద్వారా లభిస్తున్న శక్తులను చూసుకుని అన్నిటికన్నా మనమే గొప్ప అనుకోవడంలో అర్థం లేదంటాడు గోల్డ్‌.

ఆధునికమానవుడి ఆవిర్భావానికి దారితీసిన నాలుగు ముఖ్యసంఘటనలు ఎంత యాదృచ్ఛికంగా జరిగాయో గోల్డ్‌ వివరించాడు. పదిలక్షలకు పైబడిన జంతుజాతులను సుమారు 35 వర్గాలుగా విభజిస్తారు. అందులో మనుషులు వెన్నెముకగల ఒక వర్గానికి చెందుతారు. నేటి ప్రాణుల్లో వీటి సంఖ్య ఒక శాతం మాత్రమే. తక్కిన భూచరాలన్నీ మరొక్క వర్గానికి చెందినవి. వాటి సంఖ్య మనకన్నా చాలాఎక్కువే. మిగిలిన ప్రాణుల్లో చాలామటుకు జలచరాలు. మనుషుల ఆవిర్భావానికి కాకతాళీయంగా దారితీసిన వేలకొద్దీ సంఘటనలు ఒకదానికొకటి ముడిపడిఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటైనా మరో విధంగా జరిగుంటే ఆధునికమానవుడు ఆవిర్భవించి ఉండేవాడుకాడని గోల్డ్‌ అన్నాడు. జీవపరిణామం మరేదో పద్ధతిలో జరిగి, మానసికస్పృహనూ, చైతన్యాన్నీ కలిగిన మానవుడు రూపొంది ఉండేవాడు కాడు.

వీటిలో మొదటిది 53 కోట్ల సంవత్సరాల క్రితపు ప్రాణుల్లో వెన్నెముకకు ఏర్పాటు ఒక్క జాతిలోనే కలగడం. చిన్నచిన్న పాములనుంచి ఏనుగులూ, తిమింగలాల దాకా ఎన్నెన్నో జంతువుల ఆవిర్భావానికి మూలమైన తొలి వెన్నెముక ఆనాటి విభిన్న ప్రాణుల అవశేషాల్లో ఒక్క రకం ప్రాణిలోనే దర్శనమిచ్చింది. దీని తరవాత చాలాకాలానికి ఒక సంఘటన జరిగింది. చేపలవంటి అనేక జలచరాల్లో ఉభయచరంలా భూమి మీదికొచ్చి నడవటానికీ, తన శరీరపు బరువును మొయ్యటానికీ అనువైన కాళ్ళుగలిగిన ప్రాణి ఒక్కటే పుట్టుకొచ్చింది. దీనితో వెన్నెముకగల కొన్ని ప్రాణులు భూచరాలు కాగలిగాయి. మళ్ళీ చాలాకాలానికి మరొక పెద్దమార్పు కలిగింది. భూమిమీద రాక్షసిబల్లులు పరిఢవిల్లిన కాలంలో పిల్లలకు పాలిచ్చి పెంచే క్షీరదాలు చిన్న పరిమాణంలో ఉండేవి. అవి రాక్షసిబల్లుల కాళ్ళకింద పడినలగకుండా రాత్రిళ్ళు తిరుగుతూఉండేవి. రాక్షసిబల్లులు అంతరించిపోవడానికి ఉల్కాపాతం కారణం కాగా, క్షీరదాలు ప్రాచుర్యం పొంది అనేక జాతులతోబాటు మనిషి ఆవిర్భవించటానికి ఆస్కారం ఏర్పడింది.

వాటిలో కొన్ని “నరవానరాలు” నిటారుగా నిలిచి, నడవడం, పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఇది సుమారు 40 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో జరిగింది. వాతావరణ మార్పులవల్ల వృక్షరాశి ఎండిపోవడంతో చెట్లమధ్య ఖాళీ స్థలాలు ఏర్పడ్డాయి. వాటిని దాటుతున్నప్పుడు క్రూరమృగాలబారిన పడకుండా ఉండటానికి పరుగు అవసరమైంది. రెండుకాళ్ళ నడకతోబాటు బుద్ధివికాసం, వేటకూ, తిండికీ పరికరాలు తయారుచేసుకోవలసిన అవసరం, అందుకు తగిన నేర్పూ అన్నీ క్రమంగా అలవరుచుకున్న ఆదిమానవులు అంతకంతకూ తెలివిని సాధించారు.

ఇందులో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ మార్పులన్నీ యాదృచ్ఛికంగా, భౌగోళిక మార్పుల ప్రేరణతో జరిగినవే. వీటి వెనక “ఉద్దేశ”మేదీ లేదు. తక్కిన ప్రాణుల్లోనూ అంతే. తిమింగలం వంటి జంతువులు నీటిలో తేలుతాయి గనక భూచరాలకంటే పెద్దవిగా రూపొందాయి. అలాగే పక్షులకన్నా భూచరాలు పెద్దవి. ఇటువంటి భౌతికప్రేరణలకు మనిషి అతీతుడు కాడు. ప్రకృతి సూత్రాలు మనిషికీ, పువ్వులకూ, పుట్టగొడుగులకూ ఒకలాగే వర్తిస్తాయి. జీవరాశి కాలంతోబాటు అంతకంతకూ సంక్లిష్ట స్వరూపాల్ని సంతరించుకుంటుందనీ,మనిషి పుట్టుక దాని ఫలితమేననీ అనుకుంటూ ఉంటాం కాని అది పొరపాటు. పరాన్నభుక్కులని పేరుపొందిన పేరసైట్స్‌ ఎన్నెన్నో అభివృద్ధి చెందాయి, చెందుతున్నాయి. ఇవన్నీ పరిణామ “విజయాలే”.

ప్రకృతిలో మనిషిది ప్రత్యేక స్థానం అనే భావాన్ని విజ్ఞానం రోజురోజుకూ పటాపంచలు చేస్తోందని ఫ్రాయిడ్‌ అన్నాడట. మొదట కోపెర్నికస్‌ భూమి సూర్యుడిచుట్టూ తిరుగుతుందని చెప్పడం, డార్విన్‌ ప్రతిపాదనలూ, ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలూ అటువంటివే. మనిషి ఆవిర్భవించినంత మాత్రాన తక్కిన ప్రాణులు వెనకడుగు వెయ్యలేదు. వెన్నెముకగల జంతువులూ, అనేకరకాల జరచరాలూ, సూక్ష్మజీవులూ అన్నీ వేటికవిగా వృద్ధిచెందుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు మనిషికి ప్రత్యేకంగా ఒక ఉనికీ, ఆత్మా, అంతరాత్మా ఉంటాయని అనుకోవడం భ్రమే కదా. మనుషులకూ, ఇతర ప్రాణులకూ ఉండే స్పృహా, చైతన్యాలన్నీ కూడా కేవలం వాటి అవసరాలకై రూపొందినవే. తక్కిన విశ్వంలో వాటి అవసరమేమీ కనబడదు.

8 అభిప్రాయాలు

  1. umamaheswara rao c 04 జనవరి 2008 , 5:39 am

    I will be happy if any person approaches our universities to see these lucid, wonderful essays of Mr. Rohini Prasad on evolution prescribed for the telugu reading students. Because my perspective of life quite changed when I had read J B S Haldane’s article in English reader when I was in school.

  2. P.ANAND KUMAR 27 జనవరి 2008 , 7:41 am

    మనిషి బ్రతికెది భ్రాంతిలొనె.దాన్నిగురించి అనుకొని వ్రుధా.

  3. umamaheswara rao c 27 జనవరి 2008 , 10:30 am

    అవును. అన్నంతినకుండా తిన్నాననుకుని,చలి ఎండ వానల్లో బట్టలులేకుండా కప్పులేకుండా వున్నాయనుకుని బతుకులాగించేసే భ్రాంతి మనిషికి వుంటే బ్రహ్మాండం.గొడవేలేదు వ్యవస్థ్హకి.

  4. aandhrudu 04 ఫిబ్రవరి 2008 , 7:25 am

    As usually poignant essay from Rohini Prasad garu….

  5. Dr.P.M.Rao 21 మార్చ్ 2008 , 3:55 am

    ప్రతీ జీవీ నిర్జీవీ కారణ జనితమే.ఏదీ కారణం లేకుండా ఉద్భవించదు. దీన్ని మహా మేధావులూ,సైంటిస్టులూ అంగీకరించారు.వాటి గురించే ఈ శాస్త్ర ఙ్ఞుల పరిశోధనలు.గోప్యంగా తెలీకుండా వున్న దాన్ని తెలుసుకునే ప్రయత్నం.అన్నీ కారణ జన్యమే! ఒక Action కు మరో reaction వుంటుంది.అని అందరికీ తెలుసు.ఓ తల్లీ తండ్రీ కలవటం అనే కారణం వల్ల మరో జీవి ఉద్భవిస్తుంది! అందువల్ల అందరూ ఏదో ఒక కారణం వల్ల జన్మించిన వారే! కొందరు తమ జన్మ ను సార్థక్యం చేసుకుంటారు. అందువల్ల వారిని మిగిలిన వారు “కారణ జన్ములు అంటారు.అలా అనటం వల్ల మిగిలిన వారూ తమని కూడా జనులు అలా పిలవాలని ఆదర్శవంతంగా బతుకుతారు-జనులకు వారు చిరస్మరణీయులూ ఆదర్శప్రాయులూ అవుతారు.అందుకోసమే ఈ కారణ జన్మ మనే పదం! అది లేకుంటే పశువులూ-కీటకాలూ.చెట్లూ పుట్టలూ పుట్టి గతించినట్టు మనిషి బతికేస్తాడు.

  6. KS Kiran Kumar 17 మే 2008 , 2:35 am

    చాలామంచి వ్యాసమండి.
    డాక్టర రావు గారు ఒక తల్లీ తండ్రి కలవటం అనే కారణం వల్ల మరో జీవి ఉద్భవిస్తుందన్నారు. కాబట్టి వీరు కారణజన్ములంటారని చెప్పారు. బానే ఉంది. ఒక ఆవు ఎద్దు కలవటం అనే కారణంవల్లనే కదా ఒక దూడ ఉద్భవిస్తున్నది. మరి అది కూడా కారణజన్మనెత్తటమే కదా. మరి చివరి వాక్యంలో పశువులూ, కీటకాలు అంటూ వాటిని ఎందుకు ఛీత్కరించే విధంగా మనిషి బతికేస్తాడు అని అన్నారు?

  7. Dr.P.M.Rao 17 మే 2008 , 10:12 am

    దూడ పుట్టుటకు కారణం మీరు చెప్పిందే!మనిషి ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తాడు.అందువల్ల మిగతాజీవుల విషయంలో ఈ కారణ జన్మ మనే పదం వాడరు గానీ హెచ్చు దిగుబడినిచ్చే పాల సంకరమున్న జాతిది కారణ జన్మమనే భావించాలి.ప్రతి జీవికీ కొన్ని క్యారెక్టర్స్టిక్సు వుంటాయి,అవన్నీ వాటి కి కారణ జన్మగానే భావించాలి.మన ఒంగోలు జాతిదీ ఒక కారణ జన్మమే! స్పైన్ లోఆబోతులు ఫైటింగ్ చేస్తాయి.అదో కారణ జన్మ! అంటే ప్రతి జీవికీ కొన్ని నిర్దిష్టమైన పనులు నిర్వర్తించాలనీ,నిర్దిష్టమైన జీవన విధానాలు నిర్ణయిమ్పబడ్డాయి.అవన్నీ వాటి వాటి కారణ జన్మలుగా భావించాలి.మనిషి తనను తాను ఉన్నతుడిగా భావించుకోవటంవల్ల,చాలా యితర జీవులను ఆహారంగా వాడుకొఅవటమ వల్లా మిగిలిన అన్ని జీవులనీ చాలా చులకనగా చూస్తాడు.పశువుల్లొ పశువులు మాటాడుకో లేవుగా అందుకే అవి తమలో తాము ఆదర్శజీవులగూర్చి ఆలోచించి మాటాడుకోలేవు.

  8. Rohiniprasad 25 మే 2008 , 5:00 am

    రావుగారు వాడిన “నిర్ణయింపబడ్డాయి” అనే కర్మణి ప్రయోగంలోనే ఉంది కీలకమంతా!!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)