సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగిన శక్తి సామాన్యంగా ప్రతివారికీ ఉన్నప్పటికీ పుట్టుకతోనే ఎవరూ సిద్ధాంతకర్తలుగా అవతరించరు. “…మనోభావనల ఆధారంగా ప్రతిపాదనలు చెయ్యడమనేది జన్మతః వచ్చే విద్యకాదు; అందుకు రోజువారీ జీవితపు చైతన్యం ఉంటే చాలదు. దానికై నిజంగా ఆలోచించాలి …”.21
ఇందుకోసం పాటుపడనివారికి అంతా “అగమ్యగోచరంగా ఉండటానికి కారణం వారికి రూపరహిత భావనలను అర్థంచేసుకునే అలవాటు లేకపోవడమే”.22 ఇటువంటిది అలవడాలంటే తక్కిన విద్యల్లాగే అందుకు కొంత శిక్షణ అవసరం అవుతుంది.
గతితర్కం అనేమాట విని, దాని అర్థం తెలుసుకున్నంత మాత్రాన దాన్ని గురించి తెలిసిపోతుందని కాదు. అయితే మనకు తెలియకుండానే మనం కొంత అర్థంచేసుకోగలం. ఎటొచ్చీ”గతితర్కం అంటే ఏమిటో తెలియకమునుపే మనుషులు గతితార్కిక పద్ధతిలో యోచించడం మొదలుపెట్టారు; వచనం అనే మాట తెలియకముందే వచనంలో సంభాషించినట్టుగా”.23 కార్మికుల్లో ఉండే “అసాధారణ” తాత్వికవైఖరిని బూర్జువా సిద్ధాంతకర్తలు గుర్తించకపోవడమూ, మహాఅయితే వట్టి లోకజ్ఞానంగా కొట్టిపారెయ్యడమూ మామూలే. గతితార్కిక భౌతికవాదాన్ని అధ్యయనం చేసి, ఆచరించినట్టయితే ఆలోచనల అవగాహనా స్థాయి రానురాను పెరుగుతుంది; వాటిలోని ప్రగాఢతా, ఖచ్చితత్వమూ, పొందికా ఎక్కువవుతాయి.
కార్మికులకు సిద్ధాంతాలేవీ తెలియవని పెట్టుబడిదారుల విశ్వాసం. ఈ అబద్ధాన్ని నిజమని నిరూపించటానికి వారు కార్మికులకున్న సహజశక్తులను తగ్గించటానికీ, అణచటానికీ కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకుగాను వారు తమ అధీనంలో ఉన్న విద్యా, ప్రసార మాధ్యమ వ్యవస్థలను ఉపయోగిస్తారు. కార్మికులకు మేధస్సు తక్కువగా ఉంట• బూర్జువావర్గాలు దాన్ని ప్రకృతి యొక్క వరప్రసాదంగా భావిస్తారు. నిజానికి అదొక మానసిక వికృతి; బూర్జువా నిపుణులు జాగ్రత్తగా పెంచి, పెంపొందించినది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, చాలామంది కార్మికులు ఢక్కాముక్కీలు తినైనా సరే, గట్టి శిక్షణను సాధిస్తారు. అది వారిలో నిద్రాణంగా ఉన్న తాత్వికశక్తులను మేలుకొలిపే టటువంటిది.
“పేదరికంవల్ల మార్పుకూ, చర్యకూ, విప్లవానికీ కాంక్ష జనిస్తుంది. ఎంత చక్కటి, కొత్త చిత్రాన్నైనా తెల్లకాయితం మీదనే గీయగలం”.(మావో) తప్పుగా అర్థం చేసుకున్నవారికన్నా ఏమీ తెలియనివారే వాస్తవాలను కాస్త బాగా గ్రహించగలరు.
సిద్ధాంతాల నర్థంచేసుకోగలిగిన కార్మికుల పటిమ సాకారం కావాలంటే నిరంతరమూ ప్రయత్నపూర్వకంగా కృషిచెయ్యాలి. ఎదిగీ ఎదగని మానసికశక్తి అభ్యాసంద్వారా వారికి ఉన్నత అవగాహన కలుగుతుంది. “ప్రారంభం కష్టంగా ఉంటుందనేది శాస్త్రాలన్నిటికీ వర్తిస్తుంది”.24 వైజ్ఞానిక తత్వశాస్త్రంలోని పరమసత్యాలు అర్థంకావాలంటే బాగా శ్రమపడాలి. “విజ్ఞాన సముపార్జనకు రాజమార్గాలేవీ ఉండవు; అందుకోసం కష్టపడి పర్వతారోహణ చెయ్యగలిగినవారే ఉన్నత శిఖరాల నధిరోహించగలుగుతారు”.25
ఒక భౌతికశాస్త్రవేత్త చెప్పినట్టుగా “వైజ్ఞానిక విషయాల్లోని నిగూఢమైన సత్యాలన్నీ తేటతెల్లంగా ఉన్నట్టే అనిపిస్తాయి; అయితే వాటిని కష్టపడి నేర్చుకోవాలి; తరుచుగా ఆచరణలో పెడితే మరీ మంచిది. ఆ సత్యాలను తమంతట తామే తెలుసుకున్నవారికీ, అర్థం చేసుకున్నవారికీ ఇది ఇంకా సులువు”.26 నిజానికి “ఒక భావనో, సిద్ధాంతమో పూర్తిగా అర్థమవాలంటే దాన్ని మళ్ళీ కనిపెట్టినంత పనిచెయ్యాలి”.27 బాగా నేర్పగలిగినవారే దీన్ని వివరించగలరు.
కేవలం చదివినంతమాత్రాన వైజ్ఞానికతత్వశాస్త్రం పట్టుబడదు; నేర్చుకున్నదాన్ని నిజ జీవితంలో అర్థవంతంగా ఆచరించాలి. అధ్యయనాన్ని ఆచరణతోనూ, రోజువారీ జీవితానికీ, ప్రాథమిక సమస్యలకూ సంబంధించిన మరింత అధ్యయనాన్ని ఇంకొంత ఆచరణతోనూ ముడిపెట్టాలి; అప్పుడే మొదట్లో కాస్తకాస్తగా అర్థమయినదంతా రానురాను లోతైన అవగాహనగా రూపొందుతుంది.
చిన్నచిన్న అడుగులు వేస్తూ పోతే ఎంత దూరాన్నయినా జయించవచ్చు. “చదివినది మొదట్లో అర్థం కాకపోతే మళ్ళీ చదివినప్పుడు అవగతం అవుతుంది; లేదా ఆ తరవాత అదే సమస్యను మరొక కోణంనుంచి సమీక్షించాలి”.28 ఈ సందర్భంలో హెగెల్ రచనలు చదవమని ఎంగెల్స్ ప్రోత్సహిస్తాడు. “హెగెల్ పుస్తకం చదువుతున్నప్పుడు ఊబిలో కూరుకున్నట్టనిపిస్తే నిరాశ పడరాదు; ఓ ఆర్నెల్లు పోతే అదే ఊబినుంచి బైటపడే మార్గాలన్నీ మీకే సులువుగా లభిస్తాయి”.29
తత్వశాస్త్ర అధ్యయనమంతా ప్రధానంగా ఎవరికివారుగా చేసుకోవలసిందే; ఇందుకు సక్రమమైన శిక్షణకూడా తోడ్పడవచ్చు. దీన్ని నేర్పేవారుకూడా శాఖాపరమైన వేర్పాటు వైఖరి పాటించరాదు. “మేధావివర్గం నుంచి కొంతమంది నాయకులను తయారుచేసే బాధ్యత తీరిపోయిన దశలో ఇటువంటిది అనవసరమే అవుతుంది”.30 సోషలిజం వచ్చేసిన పరిస్థితిలో కొంతవరకూ మేధావులు కానటువంటి కార్మికులూ, కొంతవరకూ కార్మికులు కానటువంటి మేధావులూ ఉండనే ఉండరు.
కొందరు కార్మికులు తత్వశాస్త్రం తమకు చదివినా అర్థం కాదనుకుంటారు; ఇంకొందరేమో తమకున్న విస్తృతఅనుభవాల దృష్య్టా ఏమీ చదవకపోయినా తమకు తత్వశాస్త్రం తెలుసు ననుకుంటారు. కానీ అటువంటి అనుభవాల్లో ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ, తత్వశాస్త్రానికి ఆధారమైన విస్తృతజ్ఞానంలో వారికి తెలిసేది చాలా తక్కువే. కార్మికుల అనుభవంవల్ల తత్వశాస్త్ర అధ్యయనం తేలికవుతుంది కాని అనవసరం కాదు. ఇందులో మేధస్సుకు బ్రహ్మాండమైన అడ్డుగోడల్లా నిలిచే అవరోధాలను నిరంతరపరిశ్రమతోనూ, చైతన్యవంతమైన అధ్యయనంతోనూ అధిగమించవచ్చు.
“మొదట్లో అవగాహనకు లొంగవనిపించే విశ్వరహస్యాలన్నీ సాహసవంతమైన జ్ఞానతృష్ణకు లొంగితీరుతాయి; విలువైన, గాఢమైన జ్ఞానసంపద యావత్తూ అటువంటి సాహసానికి లోబడి, దృగ్గోచరమై ఆనందాన్నిస్తుంది”.31 (ఇందులోని సామాన్య సూత్రాలను Play, Dreams and Imitation in Childhood అనే తన పుస్తకంలో పుట 172 పియాఝే ఇలా ప్రతిపాదించాడు “మానసికశ్రమ యొక్క ఫలితమమేమిటో తెలుస్తుంది కాని అది ఎలా పనిచేస్తుందో మాత్రం తెలియదు”. ఫ్రాన్స్‌కు చెందిన బాలల మనోవిజ్ఞాని క్లాపారేడ్ మానసిక చర్యలు ఇలా త్వరగా అవగతం కాకపోవడాన్ని “చైతన్యవంతమైన సంజ్ఞాన సూత్రం” అంటాడు).
References:
21. Engels, Anti-Duehring, p.19
22. Hegel, Logic, p.165
23. Engels, Anti-Duehring, p.161
24. Marx, Preface to the first edition of Capital, Vol.1, p.11
25. Marx, Preface to the first edition of Capital, Vol.1, p.21
26. Bunge, Intuition and Science, p.26
27. Piaget, The Essential Piaget, p.731
28. Lenin, Selected Works, Vol.11, p.640
29. Engels, in Marx and Engels, Selected Correspondence, p.496
30. Lenin, Selected Works, Vol.11, p.326
31. Kaufmann, Hegel, p.281