ఆ చరిత్ర పీడకలే!
- ఎన్. వేణుగోపాల్
జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకిత్తిం చారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, ‘చారానా దావత్‌కు బారానా టాంగా’ అన్నట్టు పావలా విందుకోసం ముప్పావలా ప్రయాణపు చర్చ జరుగుతున్నది. ఒక అనుచితపు మాటతో తెరాస నాయకులు మళ్లీ తెలంగాణను నలుగురునోళ్లలో నానేట్లు చేశారు. ఒక రాజకీయ వాదికి చరిత్ర పరిజ్ఞా నం ఉండాలని అశించడం అత్యాశ కావచ్చుగాని, ఒక రాజకీయ వాది అనాలోచిత ప్రసంగం వల్లనైనా కొంత చర్చ జరిగి కొన్ని నిజాలు బయటపడడం మంచిది. అసత్యాలు, అర్థసత్యాలు, అతిశయోక్తులు, వక్రీకరణలు, అవతలివాళ్లు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రెండు మాటలు ఎక్కువ వేయాలనే ఔద్ధత్యాలు జరగవలసిన చర్చను పక్కదారి పట్టిస్తున్నాయి.
తోటివాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకున్నాడట అని చంద్రశేఖర్‌రావు తరచు ఉటంకించే సామెత ఆయన విషయంలోనే నిజమవుతున్నట్టుంది. ఈ సందర్భంలో చర్చ కోసం నాలుగు అంశాలు చెప్పవలసి ఉంది. ఒకటి, రాజకీయాలు మాట్లాడాదలచుకున్న వాళ్ళు, నడపదలచుకున్న వాళ్ళు మొట్ట మొదట గుర్తించవలసిన విషయమేమంటే, రాజ్యవిధానం గురించిన చర్చలో రాజ్యనిర్వాహకుల వ్యక్తిగత మంచి చెడులకు ఎక్కువ స్థానం ఇవ్వడం సరయినది కాదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి సకల సద్గుణ సంపన్నుడయి ఉన్నప్పటికి ఆయన అంచనా ఆయన నాయకత్వం వహించిన రాజ్య విధానాలకూ ఆయన మంచితనానికి ఉండే సంబం ధం చాల తక్కువ. ఎప్పుడైనా రాజ్యవిధానాన్ని ఆ రాజ్యంలోని బలవత్తరమైన సామాజిక ఆర్థిక శక్తులే నిర్ణయిస్తాయి. రెండు, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనను సమర్థించడం ముస్లింలను సమర్థించడమో, వ్యతిరేకించడమో కాదు.
నిజానికి ఆయన పాలనాకాలంలో అనల్ మలిక్ (ముస్లిమైన వాడు ప్రతివాడు రాజే) అనే నినాదం వచ్చినా, ఆయన పాలనకూ సాధరాణ ముస్లిం జీవితానికి ఏమి సంబంధం లేదు. ఆయన క్రైస్తవులయిన బ్రిటిష్ వారికి నమ్మిన బంటుగా ఉన్నాడు. ఇటు ప్రధానంగా హిందువులయిన భూస్వాములను నమ్మిన బంట్లుగా పెట్టుకున్నాడు. ఆయన రాజ్యంలో అసంఖ్యాకులైన నిరుపేద ముస్లిముల జీవితాలలో ప్రసరించిన వెలుగేమి లేదు. అది అన్ని సంపన్న వర్గాల పాలనల లాంటిదే. అది ప్రధానం గా మతరాజ్యం కాదు. మూడు, ఉస్మాన్ అలీఖాన్ అందరు పాలకులలాంటి వాడే అయితే ఆయన మీద ప్రత్యేకమైన ద్వేషప్రచారం ఎందుకు జరిగింది అన్నది మరొక ప్రశ్న. ఆ ద్వేష ప్రచారాన్ని సమర్థించడం ద్వారా సంఘపరివారానికో, 1956 తర్వాతి పాలకులకో మద్దతు ఇస్తున్నట్టు కాదా అని ముక్తాయింపు. సంఘపరివారం ఆయనను ముస్లిం అయినందుకు వ్యతిరేకిస్తుంది. ప్రజల వైపు నుంచి చూసేవారు ఆయన ముస్లిం అయినందుకు కాదు-ప్రజాకంటక ప్రభువు అయినందుకు-వ్యతిరేకిస్తారు. నిజానికి సంఘపరివారానికి హైదరాబాద్ రాజ్యం గురించీ, ఉస్మాన్ అలీఖాన్ పాలన గురించీ మాట్లాడే అర్హత లేదు.
ఇక 1956 తర్వాతి పాలకులలో మౌలికంగా ఉస్మాన్ అలీఖాన్‌ను వ్యతిరేకి ంచిన వారెవరూ లేరు. కాంగ్రెస్ 1947 నవంబర్ 29న ఆయనతో యథాతథ ఒడంబడిక చేసుకుంది. పోలీసు చర్య పేరుతో సైనికచర్య జరిపి అటు కమ్యూనిస్టులనూ, ఇటు ముస్లిం ప్రజానీకాన్నీ ఊచకోత కోసిన నెహ్రూ, పటేల్ సైన్యాలు ఉస్మాన్ అలీఖాన్‌ను ఏమీ అనలేదు సరికదా, ప్రజల గోళ్లూడగొట్టి ఆయనసంపాదించిన ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనం చేసుకున్న సర్ఫ్ ఎ ఖాస్ కు భారీ నష్టపరిహారం చెల్లించారు. 1956 దాకా ఆయనను రాజప్రముఖ్‌గా కొనసాగించారు. చచ్చిపోయేదాకా ఏటేటా భారీగా ప్రజాధనం నుంచి భరణాన్ని చెల్లిస్తూనే వచ్చారు. ఇక తెలుగుదేశానికి చరిత్ర అవసరమే లేదు గనుక ఉస్మాన్ అలీఖాన్ మీద వైఖరే లేదు గాని ఆ పాలనా కాలంలో సరిగ్గా ఉస్మాన్ అలీఖాన్ కాలంలో లాగనే రాష్ట్రాన్ని దోచి హైదరాబాద్ లో తమ ప్రయోజనాల మీద ఖర్చు పెట్టడం జరిగింది. బహుళజాతి సంస్థలు తెలుగుదేశం ఏలికను విశ్వాసపాత్రుడైన స్నేహితుడుగా పిలిచాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉస్మాన్ అలీఖాన్ పాలన ఇత ర రూపాలలో ఇవాళ్టికీ కొనసాగుతున్నది.
నాలుగు, అన్ని పాపాలనూ ఏడవ నిజాం మీదకే తోయడం భావ్యమా మరొక ప్రశ్న. ఇంతకీ చరిత్ర ను ఎట్లా చదవాలి ? మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్య ప్రజలకు మిథ్యనా, పీడకలనా? జనరంజక ప్రభువా ? ఏ రాజయినా ప్రజాకంటకుడే అని గుర్తించినందువల్లనే ప్రజలు రాజరికాలను కూలదోశారు. తమ ప్రతినిధులుగా పాలన సాగించడానికి ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఆ ప్రజాస్వామిక నేతలు కూడా రాజులకన్నా ప్రజాకంటకంగా పాలిస్తున్నప్పుడు పాత రాజుల రోజులు బాగుండెనేమో, అప్పుడు కనీసం భూస్వామ్యసమాజంలోని దాతృత్వమైనా ఉండేదేమో అని అనిపిం చడం సహజమే. కానీ అది కేవలం పోలిక మాత్రమే. ఉస్మాన్ అలీఖాన్ పాలనలో తెలంగాణకు 1956 తర్వాత కన్నా ఎక్కువ మేలు జరిగింది అని ఎవరయినా అనుకోవచ్చు, ఆ వాదనను బలపరిచే గణాం కాలు, జీవన స్థితిగతులు కూడా చూపించవచ్చు. కాని ఆ పోలికలో చాల సమస్యలు ఉన్నాయి.
‘గొర్లను తినేటోడు పోయి బర్లను తినేటోడు వచ్చిండు ‘అన్నంత వరకే పోలిక. అంటే కనీసం పాతపాల కుడు గొర్లను తినేవాడని అయనా అంగీకరించాలి. కాని ఆ పోలిక స్థాయిని కూడా దాటిపోయి పాత పాలకుడు సాపేక్షికంగానే కాదు, నిరపేక్షంగా కూడా ప్రజారంజకుడు, అభివృద్ధి కాముకుడు అని పరవశంగా కీర్తించడం, ఒక్కసారి కాదు వెయ్యిసార్లు కీర్తిస్తానని అనడం, ఊరూరా విగ్రహాలు పెట్టిస్తామని అనడం చరిత్రలో తాము ఎవరి పక్షాన ఉండదలచుకున్నరో చెప్పడమే. ‘ప్రాంతీయవాదం అంటేనే ఎన్నెన్నో అస్తిత్వాల సమూహారం. ప్రాంతీయ అస్తిత్వంలో మిళితమైపోయిన ఈ భిన్న అస్తిత్వాలు దేనికది ప్రాంతీయ ఉద్యమం తమ ఒక్కరిదే అనుకుంటాయి. ఆ నినాదా లు తమ ఒక్కరివే అనుకుంటాయి. ఆ ఉద్యమ ఫలితాలు తమ ఒక్కరికే అనుకుంటాయి. ఆ అన్ని కోర్కెలను, తోపులాటలను, ఆక్రమణలను సమన్వయించగలిగిన నాయకత్వం వచ్చినప్పుడే ప్రాంతీయ ఉద్యమం ముందుకుపోతుంది, లేకపోతే ప్రాంతీయ ఉద్యమం అనేది రణగొణ«ధ్వనుల వేదిక అవుతుంది’ అన్నారు అర్థిశాస్త్రవేత్త నిర్మల్‌గుప్తా. నిజానికి ప్రాంతీయ వాదపు బలమూ బలహీనతా అదే.
ఈ ప్రాంతంలో పుట్టినవాళ్లందరూ గొప్పవాళ్లే, మంచివాళ్లే అని అది విశాలత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ విశాలత్వం కృత్రిమమైనది. ప్రజాబాహుళ్యానికి పునాది బహుళ్యమే. అందువల్ల ప్రాంతీయ అస్తిత్వం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను గుర్తిస్తూనే, వాటి పరిష్కారానికి పోరాడుతూనే, ఆ అస్తిత్వంలో ఇమిడి ఉన్న బాహుళ్యాన్ని గుర్తించి గౌరవించవలసి ఉంటుంది. ప్రాంతీయ అస్తిత్వం లోపల వర్గ, కుల, మత, స్త్రీ, పురుష, అదివాసీ అస్తిత్వాలు ఉన్నాయి. నిజాంను గౌరవించాలనే చర్చ ఈ అస్తిత్వాలన్నిటినీ గౌరవించాలనే దగ్గర మొదలై ఉంటే అది ప్రజల తెలంగాణ వైపు సాగేది. నిజాంను కీర్తించడం ద్వారా తెలిసో తెలియకో తెరాస నాయకులు తమ ప్రయోజనాలు పాలకుల ప్రయోజనాలతో ముడిబడి ఉన్నాయని ప్రకటించుకున్నారు. అంటే ప్రజల తెలంగాణకూ పాలకుల తెలంగాణకు పోటీ వస్తే పాలకుల తెలంగాణనే ఎంచుకుంటామని చూపుకున్నారు.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
డిసెంబరు 5, 2007