నందిగ్రామ్ వెనక…
- పాణి
నందిగ్రామ్ పరిణామాలే ఎంతో ఆందోళనకరమైనవైతే అంతకంటే కలవరం కల్గిస్తోంది భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వైఖరి. సిపిఎం అభిమానులైన బుద్ధిజీవులే నందిగ్రామ్ ఘటనలపట్ల నిరసన తెలిపారు. ఇంకా తెలుపుతున్నారు. అయినా బెంగాల్ మార్క్సిస్టుపార్టీ అధినాయకత్వం మాట్లాడుతున్న తీరు వారి వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశ కల్పించడం లేదు.
పైగా ఇంకా చాలా చేస్తాం అనే బరితెగింపు కన్పిస్తోంది! నందిగ్రామ్ దురంతాలకన్నా దిగ్భ్రాంతికరమైన విషయమిది. గుజరాత్ నరమేధం తరువాత నరేంద్ర మోడీ ఎలా మాట్లాడిందీ, బిజెపి అగ్ర నాయకత్వం ఎలా తమ పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించుకున్నదీ గుర్తుచేసుకొని బెంగాల్ మార్క్సి స్టునేతలు ప్రదర్శిస్తున్న వైఖరితో పోల్చుకోవల్సివస్తోంది. గుజరాత్, నందిగ్రామ్ దురాగతాల వల్ల కలిగే కలత కంటే వాటికి కారకులైనవారు తమ చర్యలను బరితెగింపుతో సమర్థించుకోవడం పౌర సమాజానికి ఆందోళన కల్గిస్తోంది. అది మూర్ఖమైన సమర్థన కాదు.
ఒక అబద్ధం నుంచి పుట్టే అనేక అబద్ధాలను నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నం కాదు. పైకి కన్పిస్తున్న ఘటనలను, వాటిలోని ప్రకటిత ప్రయోజనాలను మాత్రమే చూచి సరిపెట్టుకోలేం. ఇంకా కరడు గట్టినవేవో ఆ సమర్థనలో నిబిడీకృతమై ఉండాలి. నందిగ్రామ్ ప్రజలు నెత్తురు చిందించాకే బుద్ధదేవ్ ప్రభుత్వం ఆ ప్రాంతం లో ఏర్పాటు చేయతలపెట్టిన సెజ్‌కు భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గింది. కానీ హింస తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది. సహజంగానే ప్రజల ప్రతి ఘటన కూడా పెరిగింది. బెంగాల్ లో మూడు దశాబ్దాల మార్క్సి స్టు పార్టీ పాలనకు నందిగ్రామ్ పెద్ద ఎదురుదెబ్బ. సెజ్ విషయం లో పునరాలోచన చేస్తామని ప్రక టించినా నందిగ్రామ్ ప్రజల విషయంలో సిపిఎం నేతలు ఉదారంగా ఉండదలుచుకోలేదని ఇటీవలి పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
తప్పో ఒప్పో తమ నిర్ణయానికి ప్రజల నుంచి ఎదురయిన వ్యతిరేకతను ఎదుర్కోవడానికి హేయమైన అణచి వేత పద్ధతి తప్ప మరో మార్గాన్ని బెంగాల్ వామపక్ష ప్రభుత్వం ఎందుకు ఎంచుకోలేకపోయింది? కమ్యూనిస్టులు అధికారంలో కొనసాగడం అంటే ప్రజలతో వ్యవహరించడంలో ఎప్పటికప్పుడు మెరుగైన ప్రజాస్వామిక పద్ధతుల ను అలవరచుకోవడమే కదా. మరి అలాంటి విజ్ఞత, నైపు ణ్యం, ప్రమాణాలను, అధికారంలో మూడు దశాబ్దాల నుంచి ఉంటూ కూడా, అలవరచుకోకపోవడాన్ని ఏమనుకోవాలి? పైగా ‘దెబ్బకు దెబ్బ తీర్చుకుంటా’ మని వీధిరౌడీల సంస్కృతిని ప్రదర్శించడం ఆశ్చర్యం. నిజానికి ఈ బరి తెగింపు వైఖరిని అర్థం చేసుకుంటే గాని నందిగ్రామ్ దారుణాల వెనుక పనిచేసిం దేమిటో స్పష్టంకాదు. మామాలూగానైతే నందిగ్రామ్‌వంటిఘటన జరగడం వల్ల, సర్వత్రా నిరసన రావడం వల్ల మార్క్సిస్టు పాలకులు పునరాలోచనలో పడాలి.
సెజ్‌ల మీద ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్టు నోటిమాటగా ప్రకటించడమైతే ప్రకటించింది కానీ ప్రజలతో వ్యవహరించాల్సిన సంస్కృతి గురించి కనీస స్పృహ లేకపోవడంతో హింస మీద ఆధారపడక తప్పలేదు. అధికారం లో ఉన్నవాళ్ళు ప్రతిఘటనను సహించలేకపోవడం, అసమ్మతిని తుడిచేయాలనుకోవడం సహజమే. కాని మార్క్సిస్టు పార్టీ వ్యవహారాన్ని కేవలం సెజ్‌ల మీద ప్రేమగా, అధికారాన్ని పదిలపరచుకోవాలనే తాపత్రయంగా చూచి వదిలివేయలేము. అవీ ఉండవచ్చు. అంతకు మించి ఆ పార్టీ రాజకీయ సంస్కృతి లో, స్వభావంలో మూలాలు ఉన్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పక తప్పడం లేదు గాని, రివిజనిజం అధికారం లో ఉంటే ఇలాంటి సన్నివేశాలను తప్ప భిన్నమైనవాటిని చూడలేం. నంది గ్రామ్ గురించి మాట్లాడుతున్న వాళ్లంతా ‘ఘనత వహించిన వామపక్ష ప్రభు త్వం’ అంటున్నారు. ఆ మాట అనవలసిందే. ఏమంటే తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మిగతా ప్రభుత్వాలకన్నా వామపక్ష ప్రభు త్వం భిన్నంగా ఉండాలనే ఆకాంక్షను అర్థంచేసుకోగలం. కాని అదొక్కటే సరి పోదు. ఒక వామపక్ష ప్రభుత్వం రాత్రికిరాత్రి యింత పాశవికంగా మారి పోయిందా? సింగూరుతోనో, నందిగ్రామ్‌తోనో అది బైటికి వచ్చిందా? పైగా బెంగాల్‌లో జనరంజక పాలన గురించి జరిగిన ప్రచారం తక్కువేమీ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని, విద్యా వైద్యరంగా లకు గొప్ప ప్రాధాన్యం ఉందని ఎన్ని వినలేదు? మరి ఈ వామపక్ష పాలకులు కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వంకంటే ముందుగా సెజ్‌లకు చట్టాన్ని తీసుకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాట అడిగితే అర్థం పర్థం లేని ఆర్థిక చర్చ చేస్తారు. అయితే ప్రజల అసమ్మతిని అర్థం చేసుకోలేని, దానితో సవ్యంగా వ్యవహరించలేని రాజకీయసంస్కృతి మాటేమిటి? నందిగ్రామ్‌లో మారణ కాండకు మారణకాండకు పాల్పడ్డ ‘హర్మత్ వాహిని’ వంటి సేన ఎలా ఎదిగి వచ్చింది? కమ్యూనిస్టుపార్టీల అనుబంధ సంస్థలు ప్రజల మధ్య వైరుధ్యాల్లో ఎలా వ్యవహరిస్తాయో, ప్రజలకు-పాలకులకు మధ్య భిన్న ప్రయోజనాల కోసం ఘర్షణ తలెత్తినప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తాయో చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఇప్పుడు హర్మత్ వాహిని నిర్వాకం చూచాకైనా మార్క్సిస్టుపార్టీకి ఇలాంటి సేనలు ఉండటం ఏమిటని ప్రశ్నించాలి. కింది స్థాయిలో మారణహోమం జరపడం, పై స్థాయి నాయకత్వం నిస్సిగ్గుగా సమ ర్థించుకోవడం ఆ పార్టీలో కిందినుంచి పైదాకా తొణకిసలాడుతున్న సంస్క¬ృతి ని తెలియజేస్తుంది. చెడిపోయిన కమ్యూనిస్టులకు అధికారం వచ్చినా, అధికా రంలోకి వచ్చాక చెడిపోయినా మిగిలేది ఫాసిజమే. ఇక చిన్నపాటి అసమ్మతిని భరించే సుగుణం మిగలదు. సమస్త ఆధిపత్య స్వభావాలను పుణికి పుచ్చు కోవడమేగాక లుంపెన్ శక్తులన్ని టికీ నిలయం అవుతుంది. అధికా రంలో జోగుతున్న పార్టీలన్నిటికి ఇది వర్తించేదే అయినా మార్క్సి స్టు పెద్దలకున్న నిర్మాణ కౌశలం వల్ల అది వ్యవస్థీకృతం అయింది. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమా కలిగింది. ఏదై నా దురాగతం జరిగినప్పుడు దానిమీద తీవ్ర ఖండనలు వచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు కనీసం వెనక్కి తగ్గినట్టు నటిస్తాయేమోగాని మార్క్సిస్టు పార్టీకి ఆ అవసరం లేకుండాపోయింది. అధికార రాజకీయాలలో ఆచితూచి అడుగేసే మార్క్సిస్టు పార్టీ నందిగ్రామ్ విషయంలో ఇట్లా వ్యవహ రించడం చూస్తే-పశ్చిమబెంగాల్ సమాజాన్ని ఎట్లాగైనా మేనేజ్ చేయగలననే భరోసా కన్పిస్తోంది.
అది మొండి ధైర్యం అనుకుంటే పొరపాటే. నందిగ్రామ్ వల్ల ఆ పార్టీకి తాత్కాలికంగా కొంచెం నష్టం జరగవచ్చుగాని, తన పునాదికి హాని జరగదనే నమ్మకమైతే ఉంది. అదే లేకుంటే ఇట్టా ప్రవర్తించే వారు కాదు. దశాబ్దాల పాల నలో నిర్దిష్టమైన వ్యూహం ప్రకారం బెంగాల్‌లో ‘సామాజిక పరివర్తన’ కు చేసి న కృషి ఫలితమే ఈ నమ్మకం. ఇంతకాలం వారి జనరంజక పాలనను కొని యాడిన వాళ్ళంతా నందిగ్రామ్‌కు వెనుక ఇంతకాలం ఏ రాజకీయ సంస్క¬ తి, భావజాలం పునాది మీద మర్క్సిస్టులు అధికారం కొనసాగిందో ఆలోచిం చక తప్పనిస్థితి ఏర్పడింది. అత్యంత విషాదకరమైన ఈ మేలుకొలుపులో నందిగ్రామ్ వెనుక సుదీర్ఘం గా సాగిన సంస్కరణలను మాత్రమే కాక ‘మార్క్సిస్టులు’ లోపలా బైటా విస్త రింపచేసిన సంస్కృతీ భావజాలాలను కూడా విడమర్చిచూడక తప్పదు. నందిగ్రామ్‌లోకి సెజ్ ప్రతిపాదన రావడానికి ముందే-పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తిష్ట వేసినప్పటి నుంచే ఆ పార్టీలో చొరబడిన భావజాలం సకల వికృత లక్షణాలకు కారణం అయింది.
ప్రజా పోరాటాల భావజాలం నుంచి అధికార భావజాలంలోకి మళ్ళినప్పుడే ఆ పార్టీకి ప్రజలతో వ్యవహరించాల్సిన విజ్ఞత కరువయిపోయింది. అధికారం నిలపుకోవడమంటే కేవలం ఎన్నికల్లో అంకెలను అనుకూలంగా మార్చుకోవడం అనేకాక సమాజాన్నీ అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచన మిగతా పార్టీలకంటే మార్క్సిస్టు పార్టీకి ఎక్కువగా ఉండే అవకాశముంది. దీనితో తన యంత్రాంగాన్నంతా ప్రయోగించి సమాజాన్ని అణచి పెట్టాలనుకుంది. ఈ భావజాలాన్ని ఆ పార్టీ ఎన్నడూ దాచుకో లేదు. అందరికీ తెలిసేలా నందిగ్రామ్‌లో బట్ట బయలయింది. అంతే తేడా. అందువల్ల నందిగ్రామ్ హింస సెజ్ వల్ల లేదా ప్రపంచీకరణ అనుకూల విధా నాల వల్ల చెలరేగిన మాట నిజమేకాని ఇంకావెనక్కి వెళ్ళిచూడగలిగితే ఏవైనా కొత్త అంచనాలకు రావచ్చు. ఇంతకూ నందిగ్రామ్ దురంతాల గురించి బెంగాల్ అట్టడుగు సమాజం ఏమనుకుంటోంది? మీడియాలో వెలువడే వార్తలను బట్టే సాధారణ ప్రజల న్యాయవ్యక్తీకరణలను అంచనా వేయలేంగాని ఇన్నేళ్ళ వామపక్ష పాలన ప్రజా శ్రేణుల జీవితాల్ని ఏం చేసిందో తెలుసుకోవడానికి అది ఒక అవసరమైన సూచిక.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి నవంబరు 29, 2007
________________________________________
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.