
చిత్రకారిణి: యాష్లీ సిసిల్
- తుమ్మల దేవరావ్, నిర్మల్, అదిలాబాదు జిల్లా
నిద్రలోంచి స్వప్నం జారుకున్నట్టుగా
నమ్ముకున్న నేల
కాళ్ళకిందనుంచి అమాంతంగా ఎగిరిపోయింది
మట్తితో నింపుకున్న తెగని బతుకుదారం
పుటుక్కున తెంపి పారేస్తున్నట్లుంది
నాల్గుమూరల పాకలో పెనవేసుకున్న బంధం
నిస్సారమైందని తెలుస్తున్నకొద్ది
గుండెను గడ్డపారతో పెకిలిస్తున్నట్లుంది
ఈ మట్టిలో ఎన్ని జ్ఞాపకాలను పాతుకున్నాం
జీవితంలోని సుఖదుఃఖాల మజిలిలను
ఇక్కడే పండించుకున్నం
నాగలి కాడిని మోసిన భుజాన్ని
తరుముకుంటూ వస్తున్న రాబందులు
ఎదురు నిలబడి ప్రశ్నించలేని దీనస్థితి
పుట్టిన బిడ్డలకు సైతం ఈ మట్టిమీద మమకారం
కన్నీళ్ళు పెట్తుకొని చీకటి జీవితాన్ని వెలిగించుకున్న జాడ
చెలుకలసారాన్ని చెట్లనీడల్ని బతుకులో వొంపుకున్న నేల
పసుల పానాదుల్ని, వంకల కాలిబాటల్ని
బోడగుట్టల నడుమ రాళ్ళ బావుల్ని తవ్వుకున్నాం
మోటబావుల్లో నీళ్ళను రాటుతో తోడి
పగలురాత్రి శ్రమ శ్రామిక వేధం
తడితడిగా చదువుతున్న నేల
పోలవరం, పోతిరెడ్డిపాడు బతుకును సంగడిచేసాయి
నీటి వాటాను అడగని మాకు
నీటముంచి వదిలేశారు
ప్రాజక్టు పేరుమీదుగా వేలాది భూమిపుత్రుల వేర్లను తెంచారు
ఇపుడు గూడుచెదిరిన గువ్వలై రోధిస్తున్నారు
ఆకలికోరలు సాచి కాటేయనున్నప్పుడు
భూమినిచూసి కడుపు నింపుకున్న కుతి
పండీ పండని పరిగనుచూసి
కంటిచెమ్మను తుడుచుకుంటూ
సాగదీసిన బతుకుల్ని
ప్రాజెక్టులు కొట్టిన కాంక్రీటు దెబ్బలకు
వామన పాదాలు చాస్తున్న ఖద్దరు ఖబ్జా బడాయికి
మట్టిని నమ్ముకున్న జనం మందిడిసిన పశువుల్లా
చెల్లాచెదరై రోదిస్తున్నారు.
Moving piece. The imagery is very apt.