- ఐరా గొలోబిన్
మొదటి అధ్యాయం
కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం
వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి కార్మికులెందుకు తెలుసుకోవాలి?
(ప్రారంభంలోనే కార్మికులను ప్రస్తావించడంలోని ఉద్దేశం కార్మికులు కానివారెవరికీ వైజ్ఞానిక తత్వశాస్త్రంతో ప్రమేయం ఉండరాదని కాదు. ఇలాంటి సందర్భాల్లో కార్మికుల ప్రస్తావన సామాన్యంగా అంతగా ఉండదు కనకనే వారి ప్రాముఖ్యతనూ, ప్రమేయాన్నీ గుర్తించడం అవసరం)
ఆలోచనాశక్తి ఎంత పరిమితమైనప్పటికీ, ఆలోచించగలిగిన ప్రతివారికీ ఒక ప్రాపంచికదృక్పథం ఉంటుంది. కొంత కుతూహలమూ, సకల విషయాలనూ గురించిన కొంతపాటి జ్ఞానమూ ఉంటాయి. యోచించగలిగిన ప్రతివారికీ అంతోఇంతో తత్వధోరణి ఉండకపోదు. కాని, వారి ప్రాపంచికదృక్పథం విజ్ఞానవంతం కావాలంటే మాత్రం వారికి గతితార్కిక భౌతికవాదాన్ని అవగాహన చేసుకోవడం తప్పనిసరి.
వైజ్ఞానిక తత్వశాస్త్రం (లేదా గతితార్కిక భౌతికవాదం, లేదా మార్క్సిస్ట్ తత్వశాస్త్రం) జ్ఞానంలోని ఒక విభాగమే. ఇందులో విశ్వాంతరాళం గురించిన సమగ్రమైన సామాన్యసత్యాలూ, అన్నిటిలోనూ, అన్ని ప్రక్రియల్లోనూ, ఎల్లవేళలా కనబడే ఏకరూప లక్షణాలూ, ఎల్లెడలా ఉండే సార్వత్రికతా మొదలైనవన్నీ ఉంటాయి. సంఘటితమైన ఈ సత్యాలే ప్రకృతి, సమాజం, ఆలోచనా విధానం మొదలైనవాటి గురించిన వైజ్ఞానిక ప్రాపంచిక దృక్పథాన్నిస్తాయి.
పెట్టుబడిదారీ దేశాల్లోనూ, నయావలస, అస్వతంత్ర దేశాల్లోనూ ఉన్న కార్మికులకు వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి తెలుసుకోవలసిన అవసరమేమిటి? మొదటిది అదెంతో ఉపయోగకర, పరమ ప్రగాఢమైన సత్యం; నిత్యజీవితంలోనూ, దీర్ఘకాలికంగానూ కూడా కొనసాగే పోరాటాల్లో విజయాలకది అవసరం. అన్ని విషయాలూ పరస్పర సంబంధం కలిగి, నిరంతరం మారుతూ ఉండేవేననీ, దేనికదిగా, మారకుండా ఏదీ ఉండదనీ గతితార్కిక భౌతికవాదంవల్లనే మనకు తెలుస్తుంది. వైజ్ఞానిక తత్వశాస్త్రం వైజ్ఞానిక పరిశీలనకు పనికొచ్చే సాధనం. వివిధ విషయాలను వేటికవిగా, రూపాంతరం చెందనివిగా భావించేవారు సహజంగా పొరబడుతున్నట్టే అనుకోవాలి; దీనికి పరిష్కారమల్లా వారి ఆలోచనలోని తప్పుడు అవగాహన తొలగిపోవడమే. జియొర్దానో బ్రూనో చెప్పినట్టు “వేసుకున్న చొక్కా గుండీల్లో మొదటిది తప్పుగా పెట్టుకున్నట్టయితే వరస మొత్తంగా తప్పిపోతుంది”.1
అలాగే విజ్ఞానరహితమైన తత్వశాస్త్రం బూర్జువావర్గాలకు ముఖ్యమైనది.గా అనిపిస్తుంది
(విజ్ఞానరహితమైన తత్వశాస్త్రం అంటే పూర్వవైజ్ఞానిక, లేదా విజ్ఞానవిరోధక తత్వశాస్త్రం అనుకోవచ్చు వైజ్ఞానిక తత్వశాస్త్రం అనే రెండు మాటల్లో రసాయనశాస్త్రం, పరుసవేది అని కలిపి అన్నట్టుగా వైరుధ్యం ఉందనిపిస్తుంది. గతంలో కొంత పెనగులాట జరిగాకనే రసాయనశాస్త్రం పరుసవేది అనేదాన్ని ఒక మూఢనమ్మకంగా వెనక్కు నెట్టగలిగింది; అలాగే వైజ్ఞానిక తత్వశాస్త్రం కాలక్రమేణా విజ్ఞానరహితమైన తత్వశాస్త్రాన్ని కాలదన్ని, దాని స్థానే ప్రాపంచిక దృక్పథంగా కొనసాగుతుంది. అప్పుడు అందరూ దాన్నే తత్వశాస్త్రం అంటారు)
పెట్టుబడిదారీ వర్గాలకు భౌతికమూ, ఆధ్యాత్మికమూ అనే రెండు రకాల సొత్తులుంటాయి. రాజ్యమూ, ఉత్పత్తి సాధనాలూ, కార్మికుల పనితనమూ, ఆలోచనలూ అన్నీ వారి సొత్తే. “గతించిన తరాల సంప్రదాయమంతా ఆధునికుల భావాల్లో గుదిబండలాగా కొనసాగుతూ ఉంటుంది”.2 గతకాలపు దోపిడీ పాలనవల్ల కొనసాగుతున్న పీడక మానసిక ప్రవృత్తిని నేలరాచి నాశనం చెయ్యడానికి వైజ్ఞానికతత్వశాస్త్రం పనికొస్తుంది. కార్మికులకు వైజ్ఞానిక తత్వశాస్త్రం అవగతమైతే వారి బుద్ధినీ, సామర్య్థాన్నీ అదుపుచేస్తున్న పెట్టుబడిదారీ శక్తులు బాగా బలహీనపడతాయి. అప్పుడు పెట్టుబడిదారీ విధానం కొనసాగడం కష్టమవుతుంది. వర్గసమాజంలో చేతలకూ, బుద్ధికీ మధ్య తలెత్తే వైరుధ్యం పాలకులకూ, పాలితులకూ మధ్య ఉన్నలాంటి వైరుధ్యమే. చైనా సిద్ధాంతకర్తలు ఏనాడో చెప్పినట్టుగా “బుద్ధి నుపయోగించేవారు పాలకులు; కండలు కరిగించి పనిచేసేవారు పాలితులు. పాలితులు అందరికీ అన్నదాతలు; పాలకులు ఇతరుల కష్టార్జితాన్ని స్వాహా చేస్తారు”.3
బానిసల యజమానులైనా, భూస్వామ్య ప్రభువులైనా, పెట్టుబడిదారులైనా దోపిడీవర్గాలెప్పుడూ జనసామాన్యానికి తత్వవివేచన కలగకుండా చూస్తాయి. రెండువేల ఏళ్ళ క్రితమే ప్లేటో అనే తత్వవేత్త అప్పట్లో బలహీనపడుతున్న బానిసవ్యవస్థకు మద్దతునివ్వటానికి ప్రయత్నిస్తూ “తత్వవేత్తలే రాజులు కావాలనీ, రాజులు తత్వవేత్తలుగా మారాలనీ” ఉద్బోధించాడు.4 “సామాన్యప్రజలకు తత్వశాస్త్రం తగదనీ”,5 నీచజన్మనెత్తిన బానిసలూ, చేతిపనివారూ, బానిస సమాజపు ఉత్పాదనకై పాటుపడేవారూ, వ్యాపారస్థులూ మొదలైనవారెవరూ తత్వశాస్త్రం నేర్వరాదనీ అతను అన్నాడు.
క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో అరిస్టాట్‌ల్ తన తాత్వికరచనలు ప్రచురించాడు; అందువల్ల ఉన్నత వర్గాలకు చెందనివారందరూ కూడా వాటిని చదివెయ్యగలుగుతున్నారని అతని శిష్యుడైన అలెగ్జాండర్ స్వయంగా అరిస్టాట్‌ల్‌ను మందలించవలసివచ్చింది. క్రీ.పూ. అయిదో శతాబ్దపు చైనా తత్వవేత్త లావో త్జూ ప్రజలకు విజ్ఞానం పంచినవారిని కోప్పడ్డాడు. “ప్రజలకు జ్ఞానం పెరిగేకొద్దీ వారిని పరిపాలించడం కష్టమవుతుంది. అందుచేత జ్ఞానం పంపిణీ చేస్తూ పాలించదలుచుకున్నవారు రాజ్య వ్యవస్థను బలహీనపరుస్తారు. అలా చెయ్యని పాలకులను రాజ్యం పాలిట వరప్రసాదంగా భావించాలి”.6
తన కాలంలో కొన్ని నగరాలకు అధినేతలైన అల్పజన పరిపాలకులు (oligarchy) చేసే ఒక రహస్య ప్రతిజ్ఞను అరిస్టాట్‌ల్ బైటపెట్టాడు “నేను ప్రజలకు శత్రువునై, (ప్రజలంటే స్వతంత్రులైన నగరవాసులు; బానిసలు లెక్కలోకి రారు) వారికి నా చేతనైనంతవరకూ హాని తలపెడతాను…”7 అరిస్టాట్‌ల్ దీనికి మరొక నాజూకు అంశాన్ని చేర్చడం మంచిదని భావించి, ఇలా అన్నాడు. “అల్పజన పరిపాలకులు తాము ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉన్నట్టుగానే పైకి ప్రకటించాలి; ప్రస్తుతం చేస్తున్న రహస్యప్రతిజ్ఞలకు పూర్తిగా వ్యతిరేకమైనవాటిని ప్రజలకు బాహాటంగా తెలియజెయ్యాలి… అందులో తాము ప్రజలకెన్నడూ హాని తలపెట్టబోమనే వాగ్దానం ఒకటి స్పష్టంగా ఉండాలి”.8
ప్రజలకు వ్యతిరేకి అయిన తత్వవేత్త కాంట్ కూడా “జనసందోహానికి నచ్చడమూ, వారి ప్రశంసలు పొందడమూ తత్వవేత్త అయినవాడికి అవమానకరం” అని భావించాడు.9 “పొట్టకూటికై పాటుపడేవారికి తత్వశాస్త్ర ధోరణి సరిపడ”దని అతను నొక్కి వక్కాణించాడు.10
రాజీ ధోరణి లేని తత్వవేత్తలంటే పాలకవర్గాలకు ద్వేషం ఉంటుంది. తమను ఎదురు ప్రశ్నించిన కులీనుడు సోక్రటీస్ వైఖరిని చూసి బెదిరిన ఏథెన్స్ నగరపాలకులు అతనికి మరణశిక్ష విధించారు. తత్వవేత్తా, ప్రకృతి శాస్త్రజ్ఞుడూ అయిన జియొర్దానో బ్రూనోపట్ల భయంకొద్దీ మతన్యాయస్థానపు భూస్వామ్య పాలకవర్గం అతన్ని సజీవదహనం చెయ్యమని ఉత్తరువిచ్చింది. (హెగెల్ బ్రూనోను గొప్ప మేధావిగా అభివర్ణించాడు Lectures on the History of Philosophy, సంపుటి 3, పుట 123. బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించాడు. మత న్యాయస్థానం విచారణలో అధికారులు “చివరగా చెప్పుకునేదేమైనా ఉందా?” అని అడిగినప్పుడు బ్రూనో “శిక్ష విధించటానికి మీరే నాకన్నా ఎక్కువ భయపడుతున్నారు” అన్నాడట. మత న్యాయస్థానంలో పేరుపొందిన సెయింట్ ఇగ్నేషియస్ Spiritual Exercises అనే తన పుస్తకంలో మతవిశ్వాసాలను ఇలా నిర్వచించాడు “చర్చ్ యొక్క మతవిశ్వాసాలను అనుసరిస్తున్నప్పుడు అవసరమైతే నల్లనివన్నీ తెల్లనివని నమ్మడానికి మనమెప్పుడూ సిద్ధంగా ఉండాలి; అలా చేస్తే ఎటువంటి పొరబాట్లూ జరగవు” Camus రాసిన The Rebel నుండి, పుట 242). ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ ఉద్దండులైన ఈనాటి కార్మికనాయకులను అణగదొక్కడంలోనూ, కార్మికుల ఆలోచనావిధానాన్ని బూర్జువా వైఖరికి పరిమితం చెయ్యడంలోనూ వర్గసమాజానికి కొమ్ముకాచే సామ్రాజ్యవాదుల క్రౌర్యం పాతకాలంవారిని తలదన్నే స్థాయిలో ఉంటుంది. హిట్లర్ స్థాపించిన లేబర్ ఫ్రంట్‌కు అధినేత రాబర్ట్ లే (Robert Ley) కార్మికుల ప్రాథమిక భావనల్లో తత్వధోరణి యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నాడు. “నాజీ కార్యక్రమంలోని శాస్త్రాలూ, కళలూ అన్నీ కార్మికుల ఆత్మలను లొంగదీసుకునేందుకే; నిజానికి పౌర, సైనిక, జాతీయ, విదేశీ నాజీ వ్యవహారా లన్నిటి లక్ష్యమూ ఇదే”.11
కార్మికులెవరికైనా “మీరు మీ యజమానులతో సఖ్యంగా ఉండండి” అని చెపితే వారు దాన్ని హాస్యాస్పదమని కొట్టిపారేస్తారు. తమకూ, యజమానులకూ వ్యతిరేక ప్రయోజనాలుంటాయని వారికి బాగా తెలుసు. అయినప్పటికీ వారు అప్రయత్నంగా మొత్తంమీద పెట్టుబడిదారీ విధానం శాసించే ఆలోచనాపద్ధతినే అనుసరిస్తారు. అందులో జరిగేదల్లా కార్మికుల శ్రమనుంచి యజమాని లాభాలను గుంజుకోవడమే. కార్మికులకు కనక ఇందులోని తాత్విక “జాలం” అవగతం కాకపోతే వారు అందులో చిక్కుకుంటూనే ఉంటారు. తామున్నది కారాగారంలోనని బందీలకే తెలియకపోతే అంతకన్నా పదిలమైన జైలును ఊహించలేం. “నాకేదో కాస్తంతే తెలుసునని నేను గ్రహించగలిగితే మరింత తెలుసుకోవటానికి గట్టిగా ప్రయత్నిస్తాను…”12 బూర్జువా ఆలోచనావిధానం ఫలితాలెటువంటివంటే మానసిక ఎదుగుదలకు అవసరమయే పోషకాల లోపం, అసలు అటువంటి పోషకాలే లేకపోవడం వంటివన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. అందులోని నిగూఢమైన, అంతర్గతంగా పరిపూర్ణమైన అంశాలను పట్టించుకోకుండా పైపైనే తడిమే ధోరణి ఉంటుంది. “చిల్లి చెంచాతో తింటూ, నోటికందే లోపలే ఎక్కువగా కారిపోతూంటే కడుపెలా నిండుతుంది?”13 ఈ ప్రశ్నలోనే జవాబుంది. కార్మికుల్లో చాలామందికీ, వారి పక్షాన నిలిచే శాస్త్రవేత్తలూ, రచయితలూ, కళాకారులూ, తదితరులకూ కొన్ని గంభీరమైన విషయాలు అవగాహన చేసుకోవడం చాలా అవసరం. కార్మికుల ఆలోచనలు స్వతంత్రం కానంతవరకూ వారి బంధాలను పూర్తిగానూ, శాశ్వతంగానూ విడిపించడం సాధ్యం కాదు.
కార్మికులు బూర్జువా తత్వధోరణిని చాలావరకూ చెత్తదిగా భావిస్తారు. ఇంకాస్త దుందుడుకుగా, వైజ్ఞానిక తత్వశాస్త్రంతోసహా మొత్తం తత్వశాస్త్రాన్నే తృణీకరించేవారిది మాత్రం తప్పుడు ధోరణి; అలాటివారు “పనికిమాలిన తత్వవేత్తల చవకబారు ధోరణులవల్ల ప్రభావితులౌతారు”.14 వైజ్ఞానిక తత్వశాస్త్రమంటే ఏమిటో తెలియకపోవడంతో వారి అవగాహనా, చర్యలూ అన్నీకూడా రోజువారీ జీవితాల పైపై విషయాలకూ, తత్సంబంధిత దృక్పథానికీ పరిమితమైపోతాయి. ఆ కారణంగా జీవితపు విశాలతరమైన సందర్భాలు అకస్మాత్తుగా ఎదురైనప్పుడల్లా వీరు తడబడుతూ ఉంటారు. “వ్యవహార దక్షులెప్పుడూ కాలుజారే పరిస్థితికి లోనవక గమనికగా ఉంటారు. చిన్నచిన్న విషయాల్లో వారు బోల్తాపడరు కాని…జీవితగమ్యం ఎటువంటిదో గుర్తించకపోతే అదుపుతప్పిపోతూ ఉంటారు”.15
రోజువారీ జీవితంలోని మామూలు వ్యవహారాలకయితే వాస్తవిక వైఖరీ, ప్రపంచజ్ఞానమూ పనికొస్తాయి; కాని, ఒక తత్వధోరణీ, ప్రపంచస్థాయికి తగిన సమగ్రమైన దృక్పథమూ అవసరమైన పరిస్థితిలో మాత్రం వాటి పరిమితులన్నీ బైటపడతాయి. ఒకలా చెప్పాలంటే ఈ సందర్భంలో “లోకజ్ఞానమంటే నిన్నామొన్నటి విజ్ఞానం, తత్వశాస్త్రాలూ, కళలూ, మతాలూ వగైరాలనుంచి మనకు కేవలం అపోహల స్థాయిలో సంక్రమించే పరిజ్ఞానమే”.16
1886లో చికాగోలో జరిగిన హే మార్కెట్ సమ్మెలో అమరులయినవారి తరఫున వాదించిన జోసెఫ్ డియెట్జెన్‌ను (Joseph Dietzgen) కార్ల్ మార్క్స్ “మన కార్మిక తత్వవేత్త” అని పేర్కొన్నాడు. అమెరికాలో వైజ్ఞానిక తత్వశాస్త్రానికి ప్రాచుర్యం కల్పించిన డియెట్జెన్ ఏనాడో చెప్పాడు. “శరీరశ్రమ చేసే కార్మికులు మానసికశ్రమయొక్క విలువను తగినంతగా గుర్తించరు. బూర్జువా సమాజంలో రాతకోతలు చేసేవారిపట్ల వారికుండే ఆరోగ్యకరమైన అపనమ్మకం ఒక్కొక్కప్పుడు మితిమీరుతుంది. మేధావుల కార్యకలాపాల ముసుగులో ఎన్నెన్ని తప్పుడుపనులు జరుగుతూ ఉంటాయో వారికి తెలుస్తూ ఉండటంతో వారు శరీరశ్రమను ఎక్కువగానూ, మానసికశ్రమను తక్కువగానూ అంచనా వేస్తారు. ఈ మొరటయిన భౌతికవాదాన్ని సరిదిద్దాలి. శరీరశక్తీ, కండబలమూ కార్మికవర్గాలకు విశిష్టాధికారాల వంటివి. అయితే మానసికశిక్షణ విషయంలో మాత్రం వారిది ప్రస్తుతం వెనకడుగే. కార్మికవర్గాలు స్వేచ్ఛను సాధించాలంటే వారికి ఈ శతాబ్దపు విజ్ఞానంమీద పట్టు ఉండటం అవసరం”.17
మానసికశ్రమను సరిగ్గా అంచనా వేస్తున్నప్పుడు మేధావివర్గం గురించిన విచక్షణారహితమైన అపనమ్మకం ఉంటే మటుకు అది నిజాన్ని వక్రీకరించడమే అవుతుంది; అది కార్మికవర్గానికి శ్రేయస్కరం కాదుకూడా. ఇందులో సంపూర్ణమైన అవగాహన ఉండదు; వ్యక్తుల, లేదా సముదాయాల ప్రత్యేక లక్షణాలను పరిశీలించకుండా అందరినీ ఒకే గాట కట్టేసి, ఉన్న పరిస్థితులకి కొమ్ముకాచే బూర్జువాలుగా భావించడమే కనబడుతుంది. బూర్జువా ధోరణులున్నప్పటికీ మేధావుల్లో చాలామంది సమాజపు సాంస్కృతిక వారసత్వంలోని గొప్ప అంశాలను అందిపుచ్చుకుని, వాటికి సృజనాత్మకంగా మెరుగుపెట్టినవారే. వారందరినీ ఒకే పద్ధతిలో కట్టగట్టి, కార్మికవర్గానికి అన్ని విషయాల్లోనూ, ఎల్లవేళలా శత్రువులుగానే ఉంటారని అనుకోవడం భావ్యం కాదు.
భావాత్మకబంధాలను సవాలు చేసి నిర్మూలించకుండా ఆర్థిక, రాజకీయబంధాలను తెంచుకోవడం వీలవదు. కార్మికుల రాజకీయప్రణాళిక ఎంత బాగున్నప్పటికీ, బూర్జువా ఆలోచనాధోరణి ఉన్నంత కాలమూ అది భ్రష్టుపట్టిపోతుంది. శాస్త్రబద్ధమైన రాజకీయాలకు వైజ్ఞానిక తత్వశాస్త్రం అవసరం.
ఎంగెల్స్ వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి చెపుతూ “అది మాకున్న (మార్క్స్, ఎంగెల్స్) శ్రేష్ఠతమమైన పరికరం, పదునైన కత్తి…” అన్నాడు.18 మార్క్స్ ప్రసిద్ధ రచన కాపిటల్ ఈ పరికరంవల్ల తయారైనదే. “తత్వశాస్త్రాన్ని తత్వవేత్తల ఉపన్యాసాలనుంచీ, పాఠ్యపుస్తకాలనుంచీ విడుదల చేసి, సామాన్యప్రజల చేతుల్లో పదునైన శస్త్రంగా మార్చండి” అన్నాడు మావో జెడాంగ్.19 వైజ్ఞానిక తత్వశాస్త్రం లేకుండా కార్మికవర్గం ముందడుగు వెయ్యలేదు. “ఇది (తత్వశాస్త్రం) అర్థం కాకపోతే మనందరికీ (మార్క్సిస్టులకు) పనికొచ్చే భాషగాని, పద్ధతిగాని ఏర్పడదు”.20 విప్లవంలో విజయం సాధించాలంటే వైజ్ఞానిక తత్వశాస్త్రాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి; దానివల్ల పని త్వరగా జరుగుతుందికూడా.
References:
1. Quoted in Siu, The Tao of Science, p.44
2. Marx, The 18th Brumaire of Louis Bonaparte, p.13
3. Lu Hsun, Selected Works, Vol.4, p.64
4. Plato, The Republic, Part 7, sec. 473d
5. Ibid., sec. 494a
6. Fung, A History of Chinese Philosophy, Vol.1, p.189
7. Aristotle, Politics, p.236
8. Ibid.
9. Kant, Prolegomena to Any Future Metaphysics, p.7
10. Quoted in Nizan, The Watchdogs, p.99
11. Quoted in Robert A. Brady, The Spirit and Structure of German Fascism, 1937, p.119 cited in Harap, Social Roots of the Arts, p.156
12. Lenin, On Socialist Ideology and Culture, p.56
13. Bellamy, Looking Backward, p.314
14. Engels, Dialectics of Nature, p.184
15. Pisarev, “Thinking Proletariat”, in Selected Philosophical, Social and Political Essays, p.642
16. Kaufmann, Critique of Religion and Philosophy, p.95
17. Dietzgen, Some of the Philosophical Essays, pp.131-32
18. Engels, Ludwig Feuerbach, p.44
19. “Turing Chairman Mao’s Philosophical Thinking into Sharp Weapon in the Hands of Workers”, Peking Review, Nov. 14, 1969, p.10
20. Mao, “Speeches at the National Conference of the Communist Party of China”, Selected Works, Vol.5, p.160
తత్వసాస్త్రమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను.మీరు రాసిన విషయాలు చాలా ఉపయొగకరంగా ఉన్నాయి.
very interesting indeed!!