వాకపల్లి అప్‌డేట్: సభ్యసమాజం తీర్పు
వాకపల్లిలో లైంగిక అత్యాచారానికి గురయిన ఆదివాసీ మహిళలకు ఆశించిన న్యాయం లభించలేదు. సభ్యసమాజం నుంచి ఊహించిన న్యాయం మాత్రం లభించింది. ఈ సభ్యసమాజానికి శాసనసభ, రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలనుకుంటే నిన్నటితో వాటి తీర్పు కూడా వచ్చేసింది.
రాజధర్మాన్ని రాముడు నిర్వహించడానికి, ఆ నిర్వహణలో లక్ష్మణుడు అండగా నిలవడానికి అడవిజీవులు, లంకజీవులే కాదు- సీత ఊర్మిళలు కూడా ఎన్ని కష్టాలు సహించవలసి వచ్చిందో, ఎన్ని పరీక్షలకు నిలవవలసి వచ్చిందో-ఇవాళ వాకపల్లి ఆదివాసీ స్త్రీలు కూడా అన్ని అత్యాచారాలు అనుభవించి అన్ని పరీక్షలకు నిలవాల్సివస్తున్నది. ఆ పరీక్షకూడా ఫార్సుగానే కాదు, విషాదంగా కూడా పునరావృతమవుతున్నది. గ్రేహౌండ్స్ ఇరవైమంది వాకపల్లి గూడేలపై బీభత్సం సృష్టించి, అత్యాచారం జరిపిన తరువాత న్యాయస్థానం అడవికి వెళ్ళకుండా వాళ్ళనే రాజధానికి రప్పించుకుంది.
అట్లని ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశించకున్నా ఆ రెండింటి మెప్పు అవసరమైన సంఘాలు వాళ్ళను మానవహక్కుల అధ్యక్షుని దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువచ్చినవి. అప్పటికే వాకపల్లి సంఘటనపై హైకోర్టులో పిటిషన్ ఉన్నది కనుక ప్రధానన్యాయమూర్తి పలుకరించలేదుగాని రిజిస్ట్రార్‌ను కలవగలిగారు. తిరిగివెళ్ళగానే దొరికిన న్యాయం ఏమిటంటే వాళ్ళ పురుషులు వాళ్ళను వెలివేసారు. కుల తప్పుపెట్టారు. పాలకోసం ఆకలితో ఏడుస్తున్న పిల్ల లను తల్లుల దగ్గరికి చేరనివ్వలేదు. ఆదివాసుల జీవితాల్లోకి కాఫీ తోట లు, సిల్వర్ ఓక్ తోటలు, బాక్సయిట్ తవ్వకాలు రావడానికన్న చాల ముందుగానే కుల,మతాలు వచ్చినయి. ఆదివాసులు ఆదివాసులే- వాళ్ళకు ఏ కులమూ, మతమూ లేదంటే ఆదివాసులే ఒప్పుకోలేని స్థితి వచ్చింది. లైంగిక అత్యాచారం అబద్ధం అని వైర్‌లెస్ సందేశం అందినట్లు చెప్పిన డిజిపి మాటను శాసనంగా స్వీకరించిన హోంమంత్రి ఆ నిర్ధారణ మీదనే ఉన్నారు.
కాని ఒకవైపు సిఐడి ఎస్పీస్థాయి అధికారి దర్యాప్తు పూర్తి నివేదికను హైకోర్టుకు పంపినట్లు రాతపూర్వకంగా శాసనసభకు చెప్తూనే బాధితులకు నిత్యావసరాలు, దుస్తులతోపాటు కుల ఆచారాలను (శుద్ధి) పాటించేందుకు ఇరవైవేల రూపాయలు సబ్‌కలెక్టర్‌తోపాటు ఐటిడిఎ అందించినట్లు చెప్పారు. అంటే, శాసనసభలో హోంమంత్రి వాకపల్లి మహిళలను బాధితులను అంగీకరించారు. కులాచారం ప్రకారం వాళ్ళ శుద్ధి కార్యక్రమానికి నిధులు విడుదల చేశారు. హోంమంత్రి కనుక ఆయన అంగీకరించనిదల్లా ఆ బాధ గ్రేహౌండ్స్ పోలీసుల వల్ల కలిగిందని. ఇంక హైకోర్టుకు సమర్పించిన సిఐడి సమగ్ర నివేదిక అసలు లైంగిక అత్యాచారం జరగనే లేదని చెబుతూ ‘అత్యాచార సమయం లో మహిళల ప్రవర్తన అసహజంగా ఉంది. వారినుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనట్లు లేదు. అన్నింటినీ పరిశీలించి వైద్యనివేదికలతో పోల్చిచూస్తే అత్యాచారం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు’ అని సిఐడి ఎస్పీ తన నివేదికలో తెలిపారు.
ఈ నివేదిక ఆధారంగా తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమనీ, అత్యాచారం జరిగిందని కానీ, లేదని కానీ చెప్ప లేమని హైకోర్టు పిటిషన్‌పై విచారణ ముగించింది. సిఐడి నివేదికను అధ్యయనం చేసి పిటిషనర్ (ఎస్. రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది)ని ప్రత్యామ్నాయాలు వెతుక్కోమన్నారు. అంతేగాని లైంగిక అత్యాచారం నిజమేనని నిజనిర్ధారణ చేసిన నాగిరెడ్డిగారి నివేదికను మాత్రం పరిగణనలోకి తీసుకోనేలేదు -ప్రభుత్వమైనా, న్యాయస్థాన మైనా. చుండూరు సినిమాహాల్‌లో అగ్రవర్ణ యువతి వెనుక కుర్చీలో కూర్చున్న దళిత విద్యావంతుని ‘ప్రవర్తన’ గురించి హంతకులు మొదలు జియ్యరుస్వామి వరకు అగ్రవర్ణసమాజం స్పందనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ శాసనసభ, హైకోర్టు తీర్పులు వెలువడుతున్న సమయానికి విశాఖపట్నంలో పోలీసులు ఆదివాసులతో ఒక నక్సలైట్ వ్యతిరేక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. నక్సలైట్ల హింసనుంచి, దాడులనుంచి, అడవులనూ ఆదివాసులనూ కాపాడవలసిందిగా ఒక ప్రదర్శన నిర్వహించారు.
గాలింపు, దాడి, అత్యాచారం, ప్రదర్శన-రూపం ఏదయినా ఆది వాసేతర సభ్యసమాజం ఆశిస్తున్నది ఆదివాసులను అడవినుంచి ఖాళీ చేయించడం. ఇది ఏ రూపంలో సాధ్యమైతే ఆ రూపంలో, అది నల్లమల చెంచుపెంటలనన్నింటినీ ఖాళీ చేయించే రూపంలో జరుగుతున్నది. కళింగనగర్‌లో, చత్తీస్‌గఢ్‌లలో ఏం జరుగుతు న్నదో ఇవ్వాళ దేశానికంతా తెలుసు. ఆరంభంలో చెప్పినట్లుగా ఇది రాజధర్మానికీ ఆడజన్మకు అనండి, ఆదివాసీ జీవితానికి అనం డి- రాజ్యాలు మొదలయినప్పటినుంచీ సాగు తున్న ఒక అనంత సంగ్రామం. ఇందులో సహ జంగానే నాగరికత అబ్బిన సభ్యసమాజం శాసనం మొదలు న్యాయం వరకూ రాజధర్మపక్షమే వహిస్తుంది. మరీ గతంలోకి వెళ్ళకుండా ఇరవయ్యొకటవ శతాబ్దంలో ప్రవేశించి విశాఖ అడవులను దుబాయి బాక్సయిట్ కంపెనీకి ఇవ్వాలని ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు హయాంలో, నేడు వైఎస్ఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలోనే చూద్దాం.
మన రాష్ట్రం లో మరే మైదానప్రాంతంలోనూ లేనంత ప్రతిఘటన గత ఏడేళ్ళుగా ఈ ఆదివాసీ ప్రాంతంలో మనం చూస్తున్నాం. అది పాడేరు కావచ్చు, చింతపల్లి కావచ్చు, చింతూరు కావచ్చు, అరకులోయకావచ్చు. వాక పల్లిలో పదకొండుమంది మహిళలపై అత్యాచారం జరగడానికన్న ముందూ, ఆ తర్వాత కూడా ఆ స్త్రీలకు న్యాయం జరగాలనే డిమాండుతోనే కాకుండా సంబంధిత అన్ని అంశాలపై కూడా స్థానికంగానూ, ఇతరత్రా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి వీలులేదని అరకులో, పాడేరులో ఇప్పటికి ఎన్ని సభలు, ప్రదర్శనలు జరిగాయో లెక్కలేదు. అయితే అవన్నీ ఆదివాసులకు, ప్రజాస్వామ్యవాదులకు మాత్రమే కడుపునొప్పి సమస్యగా తక్కిన ప్రపంచం చూస్తున్నది. మిగతా ప్రపంచాన్ని ఈ ఆదివాసీ ప్రపంచం నుంచి వేరు చేయడానికి మావోయిస్టు బూచిని కూడా చూపుతున్నది.
వాకపల్లి ఉదంతం ఆగస్టులో జరిగిన తర్వాత ఒక నెల రోజుల్లో ఈ ప్రాంతంలో మద్దెగరువు, వెలంగరువు, చదురుమామిడిలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి నిరసనగా, బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా, సారా అమ్మకానికి వ్వతిరేకంగా, ఇతర స్థానిక సమస్యలపై పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి వ్యతిరేకంగా పాడేరు మొదలు విశాఖపట్నం వరకు జరిగిన ప్రదర్శనలు, సభలు, నిరాహారదీక్షలు, ధర్నాలు సంగతి చెప్పనే అక్కర్లేదు. దారకొండ మొదలు కోరుకొండ వరకు ఉన్న బాక్సైట్ ప్రాంతాల్లో నాలుగైదు పంచాయితీలను కలిపి ఈ తక్షణ సమస్యలన్నింటిపై ప్రజా పంచాయితీలు నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా ఈ ప్రాంతంలో ఉన్న కదలికలను అణచివేసే క్రమంలో ప్రభుత్వం ఎన్ని పద్ధతులు అనుసరించాలో అన్ని పద్ధతులను అనుసరిస్తున్నది. ఆ పద్ధతుల అత్యంత హేయమైన వ్యక్తీకరణ వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ లైంగిక అత్యాచారం.
ఆ తర్వాత కూడా పశ్చాత్తాపం గానీ, దిద్దుబాటు గానీ లేదనడానికి నిదర్శనంగా కూడా ప్రభుత్వం ఎన్నో సామ, భేద, దండోపాయాలు అక్కడి ఆదివాసులపై ప్రయోగించింది. పాడేరులో బాక్సైట్ వ్యతిరేక సదస్సు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా నిరోధించడానికి చల్లండిలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం విశాఖజిల్లా సంయుక్త కార్యదర్శి సుగునాథాన్ని అరెస్టు చేసింది. ఆయన గిరిజన కార్పోరేషన్‌లో సేల్స్‌మన్‌గా ఉద్యోగి. ఆయనపై విశాఖ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ హత్యకేసు మోపి అరెస్టు చేయాలని చూసినప్పుడు ఎపిసిఎల్‌సి కోర్టులో బెయిలు తీసుకొని తోవలోనే విడిపించుకున్నది. వాకపల్లిలో మావోయిస్టులు తలదాచుకున్నారని తెలిసి గాలింపు కోసం వెళ్లామని సమర్థించుకోజూసిన గ్రేహౌండ్స్ మహిళలపై అత్యాచా రంనుంచి దృష్టి మళ్లించడానికి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిడేలులో సెప్టంబర్ 26న ఎన్‌కౌంటర్ పేరుతో నలుగురిని చంపారు.
అమిడేలు పెదబయలు మండలంలోని ఆదివాసీ గ్రామం. మద్దిగరువు, వెలంగరువు, చదురుమామిడి గ్రామాల్లో సభలు, ప్రదర్శనలు, ప్రజాపంచాయితీలు మావోయిస్టు దళమే నిర్వహిస్తున్నదనే అనుమానంతో సెప్టెంబర్ 25 రాత్రికే అమిడేలు గ్రామంలోకి నలభై ఏభై మంది గ్రేహౌండ్స్ ప్రవేశించారు. సెప్టెంబర్ 26 ఉదయం ఒక గుడిసె ముందు పళ్లు తోముకుంటున్న షకీలా ను నుదిటికి గురిచూసి కాలిస్తే ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె కొత్త వీథి మండ లం ముల్లిగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ బాలరాజు కూతురు. పాతికేళ్ళుంటాయి. ఆమె, మిగతా ముగ్గురు దళసభ్యులు బూడిద సత్యనారాయణ ఇంట్లో అంతకు ముందు రాత్రే ఉన్నారు. ఇంటి వాళ్లతోనే అక్కడ చిందిన నెత్తురు కడిగించి, అక్కడ నర్సరీలోని కాఫీ, సిల్వర్ ఓక్ తోటల్లో పని చేసే కూలీలతో ఆమె శవాన్ని మోయిస్తూ మిగిలిన ముగ్గురు దళ సభ్యులను చేతులు విరిచికట్టి తీసుకపోయి ఎన్‌కౌంటర్ చేశారు.
ఆ ముగ్గురిలో పెదబయలు మండలం ఇంజరి పంచాయితీ కూలం గ్రామానికి చెందిన ఇరవై ఒక్క సంవత్సరాల కొండ్రంగి చంటిబాబు కాక మిగతా ఇద్దరు కూడా మహిళలు. ఇరవై అయిదు సంవత్సరాలలోపు ఆదివాసి స్త్రీలు. ఒకామె రాజులమ్మ అలియాస్ శ్వేత - జీడిబంద గ్రామం, గూడెం కొత్తవీథి మండలం. మరొకామె విజయ. దద్దురవాడ గ్రామం, వై రాజవరం మండలం. ఎన్‌కౌంటర్ చేసి ఈ శవాలను అక్కడి వెదురు కర్రలతో తోట పనులకు వచ్చిన కూలీలతో పాడెలు కట్టించి మోసుకు పోయారు. హక్కుల సంఘాలను గానీ, అమరుల బంధుమిత్రుల సంఘాన్ని గానీ దరిదాపులకు రానివ్వలేదు. పైగా ఎన్‌కౌంటర్ పేరిట తాము చేసిన హత్యలకు ప్రత్యక్షసాక్షులవుతారని పోలీసులు భయపడి- శవాలను మోసిన కూలీలపై కేసులు బనాయించారు. లంబసింగిలో తవ్వితీసిన మందుపాతర్లు పెట్టిన వాళ్లుగా, పెదబయలు మండలాఫీసును పేల్చిన నిందితులుగా చూపుతూ విశాఖపట్నం జెయిలుకు తరలించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన సెప్టెంబర్ 26వ తేదీ రోజే అమిడేలుకు చెందిన తెరాయి నాగేశ్వరరావు, ఇంగితం శ్రీనులను, చదురుమామిడికి చెందిన కిల్లో నర్సింగరావు, వెలంగరువుకు చెందిన కిల్లో నర్సింగరావును అమిడేలులోనే అరెస్టు చేసి తీసుకుపోయారు. వీళ్లు బయటికి వస్తే అమిడేలు ఎన్‌కౌంటర్‌కు ప్రత్యక్ష సాక్షులవుతారని బెయిలుకు అడ్డపడుతున్నారు. దాదాపు రెండు నెలలుగా వీళ్లు విశాఖపట్నం జైల్లో మగ్గుతున్నారు. పేర్లు, ఊర్లు, వయసు వివరాలు కూడా ఎందుకిస్తున్నానంటే దుబాయి కంపెనీకి బాక్సైటు తవ్వకాల కోసం అడవిని ధారాదత్తం చేస్తున్న రాజ్యానికి అడవిలో చెట్లు, జంతువులు, జలాలు, ఖనిజాలు మాత్రమే కాదు మనుషులు కూడా ఉంటారనే సోయి ఉండదు గనుక. ఉన్న వాళ్ల ఉన్మూలనం కూడా ఒక సమస్యే అనిపించదు గనుక. నిమ్మకు నీరెత్తినట్లున్న సభ్య సమాజం ముందు జానపద శైలిలో సోది చెప్తేనైనా చీమకుట్టినట్లయినా ఉండక పోతుందా అనే అత్యాశతో, భ్రమతో….
సౌజన్యం:
ఆంధ్రజ్యోతి
నవంబరు 16, 2007
విప్లవ కవి వరవరరావు గారికి నమస్కారలు.వాకాపల్లి సంఘటన సభ్యసమాజంతల దించుకునేలా వుంది.నిజంగా ఇలంటి దురద్రుష్టకర సంఘటనలు జరగడం చాలా సిగ్గుచేటు. దీనినిఖండిస్తూ మీరు ప్రచురించినటువంటి వ్యాసం బాగుంది.ఈ సంఘటన వలన సామాన్యులకు చట్టాలు యెటువంటి సహాయం చెయలేక పొతున్నయన్న అవేదన కలుగుతుంది.ప్రజలను కాపాడవలసిన రక్షక భటులే ఇటువంటి చర్యలకు పాల్పడటం అహేతుకం.దీనికి కారణమైన వాళ్ళను కటినంగా శిక్షించాలి.అప్పుడే
భాదితులకు న్యాయంజరుగుతుంది.