ప్రస్తుతయుగంలో బుద్ధిజీవులుగా జీవిస్తున్న మనకు రకరకాల జీవరాశితో నిండిన ప్రకృతి అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మనుషులే లేనటువంటి యుగం ఒకటి ఉండేదనీ, ఇంకా వెనక్కెళితే ఎటువంటి ప్రాణీ లేని పరిస్థితికూడా ఉండేదనీ గుర్తుంచుకోవాలి. భూగ్రహం “మనకోసం” ఏర్పడిందనేది అర్థంలేని భావన.

కొన్ని యాదృచ్ఛిక సంఘటనల ఫలితంగా తలెత్తిన జీవపరిణామంలో మనుషుల ఆవిర్భావం ఇటీవల జరిగిన ఒక పరిణామం మాత్రమే. ఇది అనంతంగా కొనసాగుతుం దన్న నమ్మకం కూడా ఏమీలేదు. భూమిమీది జీవరాశికి ఆరంభం అనేది ఒకటుంది. ఎటొచ్చీ డార్విన్ పరిణామవాదం తెలిసినవారికి కూడా “మొట్టమొదటి” ప్రాణి ఎవరో తయారుచెయ్యకుండా ఎలా తయారయి ఉంటుందో కదా అని అనుమానం కలుగుతుంది.

ఇందులో మొదటి సందేహం “జీవశక్తి”ని గురించినది. జీవపదార్థం అంటే ఏమిటో మనకు తెలిసినట్టే ఉంటుంది కాని దీనికి సరైన నిర్వచనం చెప్పడానికి అరిస్టాట్‌ల్‌ కాలంనుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునికకాలంలో దాని లక్షణాలను జాబితా వేశారు. ప్రాణి అనబడేది తన ఉనికిని కాపాడుకుని, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అది పునరుత్పత్తివల్ల పుట్టి మళ్ళీ తన సంతతిని పునరుత్పత్తి చేసుకుంటుంది. ప్రతి ప్రాణిలోనూ జీవకణాల్లో జన్యుసమాచారం డిఎన్‌ఏ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది; ప్రోటీన్లద్వారా దాని ప్రభావం శరీర లక్షణాలుగా ప్రకటితమౌతుంది. ప్రాణుల్లో మెటాబొలిజమ్‌ అనే జీవనవ్యాపారం కొనసాగించే ఏర్పాటు ఉంటుంది. అందులో వాతావరణంనుంచి పదార్థాలను స్వీకరించడం, తద్వారా పొందిన శక్తిని శరీరానికి అందించడం అనే ప్రక్రియలు జరుగుతాయి. బాహ్యప్రపంచం నుంచి ఎటువంటి ఒత్తిడి ఎదురైనా ప్రాణి తొణకకుండా తన శరీరపు అంతర్భాగాలని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. తనవంటి ఇతర ప్రాణుల మనుగడకు దోహదపడుతూ వాటన్నిటికీ గుర్తింపు కలిగేలా చూస్తుంది. దాని జన్యు పదార్థంలో సహజంగా జరిగే మార్పు (మ్యుటేషన్‌)ల ద్వారా ప్రకృతిలోని పరిస్థితులకు అనుగుణంగా మనుగడ కొనసాగిస్తుంది. జన్యువుల మార్పులూ, బైటి ప్రేరణలూ ప్రాణి చావును నిర్ణయిస్తాయి.

జీవాలు అతి ప్రాచీనమైనవి. భూమిమీద సుమారు 380 కోట్ల సంవత్సరాల కిందట జరిగిన జీవపదార్థపు ఆవిర్భావం గురించి ఈనాటికీ అనేక సిద్ధాంతాల ప్రతిపాదన జరుగుతోంది. జీవపదార్థ మంటే సేంద్రియపదార్థాల సముదాయమే. తలవనితలంపుగా ఒక పద్ధతిలో అవి కలిసినప్పుడు పునరుత్పత్తి సాధించిన కణాలు రూపొంది ఉంటాయి. ఇదెలా జరిగింది? ఆదిమ సముద్రాల నీటిపైన తేలిన బుడగల్లో కార్బన్‌తో కూడిన అణువులూ, అగ్నిపర్వతాలు వెదజల్లిన బంకమట్టి, లోహాల కణాలూ వచ్చి చేరాయని ఊహిస్తున్నారు. ఈ బుడగలు పేలినప్పుడు చిన్న చిన్న నీటిచుక్కలు చెల్లాదెదురై ఇగిరిపోయాయనీ, వీటితోబాటు సేంద్రియ పదార్థం చిన్న మోతాదుల్లో వెదజల్లబడి ఉంటుందనీ ఊహిస్తున్నారు. నీటిమీద నూనె బిందువుల వంటి లిపిడ్‌ పదార్థాలు కలిసి ఒక పొరలాగా ఏర్పడి సేంద్రియ కణాలను పోగుచేసి ఉంటుంది. ఈ చిన్న సంచుల్లో ఇతర సేంద్రియపదార్థాలు ఒక చోట చేరి ఉంటాయి. వాటి మీద సూర్యరశ్మీ, పిడుగుల విద్యుత్తూ పనిచెయ్యడంతో అమినో ఆసిడ్లూ, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల ముక్కలూ తయారయే పరిస్థితులు కలిగాయి. వర్షపునీరూ, హిమపాతమూ కూడా ఇందుకు తోడ్పడ్డాయి. యాదృచ్ఛికంగా రసాయనాల కలయికతో ఎన్నిరకాల సేంద్రియకణాలు ఏర్పడినప్పటికీ తమను తాము పునరుత్పత్తి చేసుకోగలిగిన తొలి జీవకణాలు త్వరలోనే తక్కినవాటిని పోటీలో ఓడించి ఉంటాయి. వీటి పరిణామంవల్ల తొలి ప్రోకేరియోట్‌ కణాలు రూపొంది ఉంటాయి. ఈనాటి బాక్టీరియా కొన్ని ఈ జాతివే. మనవంటి ప్రాణుల్లో ఉండే యూకేరియోట్ కణాలు మరికాస్త పెద్దవిగా, జటిల నిర్మాణం కలిగి ఉంటాయి.

eukaryote.jpg

భూమి మీద అతి ప్రాచీనమైన తొలి జీవకణాలకు సాక్ష్యాలు స్ట్రోమాటొలైట్‌ జాతి శిలలలో దొరికాయి. ఈ రాళ్ళు కార్బొనేట్‌, లేదా సిలికేట్‌ పదార్థాలతో పొరలుగా సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. సూక్ష్మరూపంలో ఉన్న సయనోబాక్టీరియావంటి జీవకణాలు వీటి బురదలో దిగబడి, బందీలలాగా ఇరుక్కుపోయాయి. ఇవి సూర్యకాంతిని కిరణసంయోగానికి వాడుకున్నాయి. సముద్రతీరాల వెంబడి మైళ్ళకొద్దీ రాళ్ళమీద దిబ్బలలాగా పెరిగిన ఈ సూక్ష్మకణాలు సముద్రపు ఆటు పోటులతో నీటికి తడుస్తూ, ఎండను పీల్చుకుంటూ లక్షల ఏళ్ళపాటు అభివృద్ధి చెందాయి. (నీరూ, సూర్యకాంతీ, గాలిలో ఆక్సిజన్‌ ఉన్న చోట్ల ఇటువంటి జీవకణాలే పెరుగుతాయని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకనే కుజగ్రహంమీది ఈనాటి పరిశోధనలన్నీ ఇలాటి సంఘటనల దాఖలాల కోసమే జరుగుతున్నాయి).

100, 200 కోట్ల సంవత్సరాల కిందట యూకేరియోట్‌ జాతి కణాలు ఉత్పత్తి అయాయి. “ఉన్నత” ప్రాణుల పుట్టుకకు ఇది తొలిమెట్టు అనుకోవచ్చు. ఈ కణాల న్యూక్లియస్‌ (కేంద్రం) చుట్టూతా ఒక మెమ్‌బ్రేన్‌ పొర ఉంటుంది. అందులో సంతానోత్పత్తి కలిగించే కణవిభజనకు ఏర్పాటు సాధ్యమౌతుంది. అప్పటికి జీవకణాల అంతర్‌నిర్మాణంలో ఇంత సంక్లిష్టత ఏర్పడలేదు. త్వరలోనే ఏకకణజీవులు కొన్ని బహుకణజీవులుగా రూపొందాయి. తుట్టెలాగా కదిలే ఈ కణసముదాయం క్రమంగా “సహజీవనానికి” అలవాటు పడి ఉంటుంది. మన శరీరాల్లో కూడా విడివిడిగా కొంత స్వతంత్రంగా పనిచేసే రకరకాల వ్యవస్థలున్నాయి. వాటి మధ్య సమన్వయానికి భంగం కలిగితే ప్రాణానికే అపాయం.

తొలి జీవకణాలు పుట్టినప్పటినించీ 100 కోట్ల సంవత్సరాల క్రితంవరకూ జరిగిన జీవ పరిణామంలో భౌగోళిక మార్పుల పాత్ర చాలా ఉంది. వంద కోట్ల సంవత్సరాలంటే ఎంతటి సుదీర్ఘమైన కాలమో ఆలోచించినా వెంటనే అర్థంకాదు. జీవపరిణామానికి కీలకాంశం కాలమే. అగ్నిపర్వత ప్రాంతాలూ, వాటి పక్కనే తొలినాటి భూఖండాలూ నెమ్మదిగా చేరువౌతూ, వేరుపడుతూ జీవ పరిణామాన్ని ప్రభావితం చేశాయి. ఈ మార్పులకు తట్టుకుంటూ కొత్త లక్షణాలు సంతరించుకున్న జీవకణాలు కొన్నాళ్ళకు నీటిలోని ఆక్సిజన్‌ను సంగ్రహించడం “నేర్చాయి”. తీరప్రాంతాల్లో లోతులేని నీళ్ళలో రాళ్ళమీద తీగలలాగా, చిన్న చిన్న గోలీలలాగా రకరకాల ఆకారాల్లో ఇవి విపరీతంగా పెరిగాయి. ప్రకృతి వైపరీత్యాలవల్ల నాశనమవకుండా నిలిచిన ఈ పాచివంటి పదార్థమే తొలి జీవరాశి. మనమంతా దానికే వారసులం. కనబడనంత నెమ్మదిగా, ఎంతోకాలంపాటు సాగిన జీవరాశి చరిత్ర వివరాలు స్థూలంగానైనా మనం తెలుసుకోవాలి. ఇందులో ఎన్నెన్నో మహాయుగాలూ, యుగాలూ, దశలూ, శకాలూ గడిచాయి.

సుమారు లక్షన్నర ఏళ్ళ క్రితం అతిగొప్ప నాడీవ్యవస్థతోనూ, అద్భుతమైన మెదడుతోనూ ఆధునిక మానవులు ఆవిర్భవించకముందు భూమిమీద చాలా పెద్ద జీవపరిణామమే జరిగింది. అందుకు రంగం సిద్ధంకావడానికి వందల కోట్ల ఏళ్ళు పట్టింది. మనిషికి ముందు దశలవారీగా జీవ పరిణామం సాగి, ఒకదానివెంట ఒకటిగా, ఒక్కొక్కప్పుడు ఒకదానివల్ల మరొకటిగా కూడా రకరకాల జంతువులు పుట్టాయి.

మహాయుగం దశ కోట్ల సం.
మెజోజోయిక్ క్రెటేషస్ 14.6 – 6.6
జురాసిక్ 20.0 -14.5
ట్రైయాసిక్ 25.1 – 20.0
పేలియోజోయిక్ పెర్మియన్ 29.9 – 25.1
కార్బోనిఫెరస్ 35.9 – 29.9
డీవోనియన్ 41.6 – 35.9
సిలూరియన్ 44.4 – 41.6
ఆర్డోవీషియన్ 48.8 – 44.4
కేంబ్రియన్ 54.2 – 48.8
భూమి పుట్టుక లగాయతు కేంబ్రియన్ దాకా 460 – 54.2

జీవరాశివల్లనూ, ఇతరత్రా కూడా భూగోళంలోనూ, స్థానికంగా వివిధ స్థలాల్లోనూ భౌతిక మార్పులు జరిగాయి. ఇవి జీవపరిణామంపై తీవ్రప్రభావాలు కలిగించాయి. నీరూ, నేలా, వాతావరణమూ మారుతున్నకొద్దీ కొత్త జీవరాశి ఆవిర్భవించడం సాధ్యమైంది. అంచె లంచెలుగా జరిగిన ఈ మార్పుల క్రమం ఇది. సుమారు 50 కోట్ల సంవత్సరాలక్రితం సముద్రాల్లో ఒక్కపెట్టున బహుకణనిర్మాణం కలిగిన జీవరాశి ఆవిర్భవించింది. ఆ కేంబ్రియన్‌ దశలో నేలమీద ప్రాణులుండేవి కావు. భూఖండాల రూపురేఖలు వేరుగా ఉండేవి. 46 కోట్ల సంవత్సరాల నాటి ఆర్డోవిషియన్‌ దశలో నేటి అట్లాంటిక్‌ మహాసముద్ర ప్రాంతానికి ఇరువైపులా ఉన్న ఖండాలు దగ్గరయాయి. ఆ కాలంలో వెన్నెముకగలిగిన అతి ప్రాచీనమైన దవడలేని చేపలు మొదటగా ఆవిర్భవించాయని తెలుస్తోంది. సముద్రాల్లో పగడపు మొక్కలవంటివి ప్రత్యక్షం అయాయి. రమారమి 43 కోట్ల సంవత్సరాలనాటి సిలూరియన్‌ దశలో నేలమీద మొదటి మొక్కలూ, తేళ్ళవంటి ప్రాణులూ, నీటిలో కొన్నిరకాల చేపలూ దర్శనమిచ్చాయి.

దాదాపు 39 కోట్ల సంవత్సరాల క్రితం డీవోనియన్‌ దశలో ఎన్నోరకాల సముద్రపు చేపలు పుట్టుకొచ్చాయి. మరికొన్ని మంచినీటిలో పెరిగాయి. నేలమీద పెద్దపెద్ద ఫెర్న్‌ మొక్కలు పెరగసాగాయి. సొరచేపలు రూపొందాయి. సుమారు 33 కోట్ల సంవత్సరాలనాటి కార్బోనిఫెరస్‌ దశలో ఊబినేలలూ, వేడిమీ, తేమా కలిగిన వాతావరణమూ ఏర్పడ్డాయి. అక్కడ ఏపుగా పెరిగిన అడవులు తరవాతి కాలంలో బొగ్గు నిలవలుగా మారాయి. ఉభయచరాల సంఖ్య పెరిగి, బల్లులూ, పూర్తిగా పొడి నేలమీదనే బతకగలిగే వెన్నెముకగల ప్రాణులూ ఆవిర్భవించాయి. తూనీగలవంటి ఎగిరే పురుగులు మొదటి సారిగా పుట్టుకొచ్చాయి. రమారమి 27 కోట్ల సంవత్సరాల క్రితం పెర్మియన్‌ దశలో భూఖండాలన్నీ ఒకటై పేంజియాగా రూపొందాయి. ఉత్తరార్ధగోళంలో పైన్‌వంటి వృక్షాలు మొదటగా పుట్టాయి. నేలా, సముద్రాలూ పెద్దపెట్టున రూపాంతరం చెందడంతో జీవరాశి చెప్పుకోదగిన స్థాయిలో అంతరించడం తొలిసారిగా జరిగింది. అతి ప్రాచీనమైన పేలియోజోయిక్‌ మహాయుగం ముగిసింది.

కాలం గడుస్తూనే ఉంది. జీవపరిణామం కొనసాగ్తూనే ఉంది. దాదాపు 22.5 కోట్ల సంవత్సరాలనాటి మెసోజోయిక్‌ మహాయుగంలో ట్రైయాసిక్‌ దశ మొదటిది. ఇందులో పేంజియా రెండుగా చీలి, ఉత్తరాన లారేషియా, దక్షిణాన మళ్ళీ గోండ్వానా లాండ్‌ అనే భూభాగాలు ఏర్పడ్డాయి. ఇది రాక్షసిబల్లుల కాలం. తొలిగా తాబేళ్ళూ, క్షీరదాలూ పుట్టుకొచ్చాయి. ఏ 17 కోట్ల సంవత్సరాల క్రితమో మొదలైన జురాసిక్‌ దశలో ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రం వెడల్పు అయింది. దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రం ఏర్పడింది. నేలమీద రాక్షసిబల్లులదే రాజ్యం. ఆదిమజాతి పక్షులు పుట్టుకొచ్చాయి. పీతలూ, రొయ్యలవంటి ప్రాణులు పెరగసాగాయి. సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం క్రెటేషస్‌ దశలో ఉత్తరఅమెరికాలో రాకీ పర్వతాలు లేచాయి. ఇది అంతమయే నాటికి రాక్షసిబల్లులూ, అనేక ఇతర ప్రాణులూ అకస్మాత్తుగా అంతరించిపోయాయి. పూలమొక్కల ఆవిర్భావం జరిగింది.

6.5 కోట్ల సంవత్సరాల క్రితంనుంచి 25 లక్షల సంవత్సరాలక్రితపు మధ్యకాలంలో ఉత్తర అమెరికా ఖండానికీ, యూరప్‌కూ ఉండిన లంకె తెగిపోయింది. ఉత్తర, దక్షిణ అమెరికాలకు సంబంధం ఏర్పడింది. ఈ సీనోజోయిక్‌ మహాయుగంలో నేలమీదా, సముద్రాల్లోనూ నేడు మనకు తెలిసిన ప్రాణికోటి ఆవిర్భావం జరిగింది. ఇది క్షీరదాల యుగం. గత 25 లక్షల సంవత్సరాల పరిణామాలను గమనిస్తే అనేక హిమయుగాలు వచ్చి పోయిన రుజువులు కనిపిస్తాయి. మధ్య, దక్షిణ ఆఫ్రికా, చైనా, జావా మొదలైన ప్రాంతాల్లో మనిషి పుట్టుకకు దారితీసిన జీవాలు ఆవిర్భవించాయి. ఈ సంఘటనల్లో మనిషి పుట్టడం అనేది కాకతాళీయంగా, అనేక యాదృచ్ఛిక విషయాల ఫలితంగా జరిగిందనడంలో సందేహం లేదు.

మహాయుగం దశ శకం లక్షల సం.
సీనోజోయిక్ నియోజీన్ హోలొసీన్ 0.1 – 0
ప్లయిస్టొసీన్ 18 - 0.1
ప్లయొసీన్ 53 – 18
మయొసీన్ 230 – 53
పేలియోజీన్ ఓలిగోసీన్ 340 – 230
ఈయొసీన్ 560 – 340
పేలియొసీన్ 660 – 560

జీవపరిణామం ఆగిపోలేదు. నీటిలో పుట్టిన జీవరాశి క్రమంగా రకరకాల పీతలూ, చేపలుగా పెరుగుతూపోయింది. ఇప్పటికీ నీటిలో పెరిగే వృక్షజాతుల్లో శాస్త్రవేత్తలు ప్రాచీనమైనవేవో, ఆధునికమైనవి ఏవో గుర్తిస్తూనే ఉన్నారు. ఇంతకాలంగా పెరుగుతూ వస్తున్న ప్రాణుల్లో సూక్ష్మమైన బాక్టీరియా నుంచి బ్రహ్మాండమైన తిమింగలందాకా అన్నిటిలోనూ ఒకే రకమైన జీవకణాలుంటాయి. జీవరాశి ఏకత్వానికి రుజువు ఇదే. జీవ ప్రక్రియలకు దారి తీసిన పదార్థం రైబో న్యూక్లియిక్‌ ఆసిడ్‌ అనబడే ఆర్‌ఎన్‌ఏ అయిఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆర్‌ఎన్‌ఏ మన జన్యువుల్లో ముఖ్యపాత్రను నిర్వహిస్తుంది. అనువైన వాతావరణంలో, ఉన్న రసాయనిక పదార్థాల నుంచి తనకు కాపీలను తయారు చేసుకోగలిగిన సామర్య్థం దీనికి ఉంది. ఒక రకమైన ఆర్‌ఎన్‌ఏ ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది. 20 రకాల అమినోఆసిడ్ల నుంచే ప్రోటీన్లు తయారౌతాయి గనక ఆదిమ జీవరాశిలో ఆర్‌ఎన్‌ఏ ప్రముఖమైనదిగా ఉండి ఉండాలి. ఇటువంటి పరిణామాలు విశ్వంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది.
జీవపరిణామ సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే ఒక జాతిప్రాణుల జనాభాను ఒక ప్రత్యేక సముదాయంగా గుర్తించాలి. వీటిలో ప్రతి ప్రాణికీ తమతమ ప్రత్యేక లక్షణాలుంటాయి. అందుకు కారణమైన జన్యువుల నిర్మాణం వాటి శరీరాల్లో ఉంటుంది. ప్రాణి జీవితకాలంలో దాని శరీర నిర్మాణంలో మార్పేమీ జరగదు. ఎటొచ్చీ ప్రాణుల జనాభా మొత్తంగా పరిణామం చెందుతున్నప్పుడు రకరకాల జన్యువులున్న ప్రాణుల నిష్పత్తిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవకాలంలో ఆవిరియంత్రాలు విపరీతంగా వాడడం వల్ల చెట్లన్నీ మసిబారిపోయాయి. నల్లబడ్డ చెట్ల బోదెలమీద వాలిన తెల్లని సీతాకోకచిలకలన్నీ పక్షుల కంటబడి వాటికి ఆహారం అయిపోయాయి. దాంతో అప్పటివరకూ 2 శాతం మాత్రమే ఉండిన నల్లని సీతాకోకచిలకలన్నీ చావకుండా మిగిలాయి. త్వరలోనే తెల్లనివన్నీ చచ్చిపోయి నల్లనివాటి జనాభా పెరిగింది. అంతమాత్రాన తెల్లనివి పుట్టడం పూర్తిగా ఆగిపోయిందని కాదు. బాహ్య పరిస్థితులనుబట్టి జీవపరిణామం ఇలాగే జరుగుతుంది. నిజం చెప్పాలంటే దీన్ని జీవపరిణామం అనకుండా నాచురల్‌ సెలెక్షన్‌, లేదా ప్రకృతి నిర్వహించే ఏరివేతగా గుర్తించాలి.

శారీరక మార్పులన్నీ జీవపరిణామానికి ప్రతీకలు కావాలనిలేదు. ఉదాహరణకు మనిషి సగటు పరిమాణం మునుపటికన్నా పెరిగింది. అందుకు కారణం ఈనాడు చాలా మందికి పౌష్టిక ఆహారం లభించడమూ, దాని ప్రాముఖ్యతని ఆధునికులు గుర్తించడమూను. ఇది జీవపరిణామం వల్ల కలిగిన మార్పు కాదు. ఇలాంటి లక్షణాలన్నీ వంశానుగతంగా సంతతికి అందుతాయని చెప్పలేం. అలాగే జీవపరిణామం ప్రతిసారీ శారీరిక మార్పులు కలిగించాలనికూడా లేదు. కొన్ని పరిస్థితుల్లో దానివల్ల ఒక రకం ప్రాణులు తక్కినవాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావచ్చు. పరిణామం అంటే అభివృద్ధి అని కూడాకాదు. ఒక పరిస్థితిలో అనుకూలం అయిన శారీరక మార్పులే ఆ పరిస్థితులు మారిపోగానే ప్రతిబంధకాలు కావచ్చు. జంతువులు “మారిపోవు”, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి.

ప్రాణులు పరిసరాలవల్ల ప్రభావితం కావడంతో అయిపోదు. వాటివల్ల పరిసరాలు కూడా ప్రభావితం అవుతాయి. అవి తమ చుట్టూ ఉన్న పదార్థాల్లోంచి ఆహారం పీల్చుకుంటాయి. వ్యర్థాల్ని విసర్జిస్తాయి. ఉదాహరణకు మొక్కలు వదిలే ఆక్సిజన్‌ వాయువే జంతువులకు ప్రాణాధారం. జంతువులు విసర్జించినది మొక్కలకు ఎరువు అవుతుంది. తొలినాటి సముద్రచరాలు చచ్చి నీటి అడుగుకు చేరుకున్నాక వాటి పెంకుల్లోని కాల్షియం, కార్బొనేట్లూ సముద్రజలాల లక్షణాలని మార్చాయి. ఇవన్నీ ప్రకృతిలో యాంత్రికంగా, నిరంతరం జరిగే భౌతికప్రక్రియలు. మనిషిజాతి కూడా వీటి ఫలితంగా పుట్టుకొచ్చినదే. భూమిని “ఏలడానికి” మనిషిని ఎవరూ “తయారు” చెయ్యలేదని మనం గుర్తించాలి. భౌతికవాదం వివరణనిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు అయోమయాన్ని పెంచుతాయి.

ఒక్క అభిప్రాయం

  1. Rakesh 19 నవంబర్ 2007 , 1:12 am

    మీ వ్యాసాలు చాలా బాగుంటాయి.
    మన:పూర్వక ధన్యవాదాలు!!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)