- కన్నెగంటి చంద్ర

అడ్డంగా విరిచినా
నిలువుగా కోసినా తడన్నదే కనపడదు
ఏ మాట ఏరుకున్నా!
అట్లాగని అంటించినా
రాజుకోవు ఎంతకూ!
ఏం చేద్దామీవేళ?

ఏ దృశ్యం గీద్దామన్నా
మాసిన అక్షరాలు అతకవు!
ఈ అరిగి చిల్లులు పడ్డ పదాల్లో
ఏ భావం నింప చూసినా నిలవదు!
అర్థమేమిటని అదేపనిగా ఆలోచిస్తే
పుల్లిపొరలన్నీ ఆవిరవుతాయి!

ఇన్ని మాటలు వేసి
ఎంత గిలకొట్టినా అదే గిలక్కాయ చప్పుడు
చిన్నప్పటి నుండీ వింటున్నదే-
రింగుమని చెవుల్లో ఇంకా గింగురుమంటున్నదే!
ఇప్పుడు కొత్తగా బతికేదేం లేదు
గుండ్రటి మొహాలతో మాటలతో!
అన్నీ అటు విసిరేసి
మౌనాన్ని మన్నిద్దామీవేళ!

3 అభిప్రాయాలు

  1. Akkiraju Bhattiprolu 11 నవంబర్ 2007 , 6:41 am

    చంద్రా,

    చాలా బాగుంది! అవును చాలా అక్షరాలు, పదాలు మాసి పోయి, అరిగి పోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అలాగని అస్త్ర(క్షర)సన్యాసం చేసేస్తే ఎలా?

    ఎందుకో నాకోసం నేను రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి…

    “ప్రతిరోజూ చచ్చి గోల చేస్తా, గెలుస్తా
    ఎప్పుడో ఓసారి ప్రాణంలేచొస్తుంది, గొంతుపెగల్దు”

    అక్కిరాజు భట్టిప్రోలు

  2. Phani 17 నవంబర్ 2007 , 12:54 am

    చాలా బాగుంది. మీ కవిత చదువుతుంటే శామ్యుయెల్ బెకెట్ కోట్ ఒకటి గుర్తుకు వస్తుంది: Every word is like an unnecessary stain on silence and nothingness. ఒక్కోసారి నిజంగానే చాలా నిస్పృహ కలుగుతుంది; నాలిక తెగ్గోసుకుంటే పోదా–అనిపిస్తుంది.

  3. హెచ్చార్కె 17 ఏప్రిల్ 2008 , 9:59 pm

    చాల బాగా చెప్పారు కవుల/రచయితల బాధని. భాష మీద ఈ కోపం ఏ కవికైనా ఉంటుందనుకుంటా. “వాణి నా రాణి” అని గొప్పలు పోయిన పిల్లలమర్రి పినవీరభద్రునికి కూడాక్ వుండే వుంటుంది. అది వుండాల్సిన కోపమే.
    ఎదో సినిమా గ్యాపకం వస్తోంది. ‘ఎ డే అండ్ ఎటర్నిటీ ‘ అనుకుంటా. ఒక ఆల్బేనియన్ కవి అ దేశం పోరాటంలో పాల్గొనాలని (కవిగా)వెళ్లి ఆ భాష తెలియనందుకు చాల బాధ పడి, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పదం కొనుక్కుంటాడు. అతడు అలా కష్టపడి పదాలను/భాషను సేకరించడాన్ని చాల బాగా చెప్పాడు దర్శకుడు. మనం ఏమీ ఖర్చు పెట్టకుండా (డబ్బు కాదు)భాష ఎలా వస్తుంది? ముఖ్యంగా మానసిక శక్తులను ఖర్చు పెట్టకుండా ‘వీజీ’గా ఎలా వస్తుంది? వేదన పడకుండా ఎలా వస్తుంది? ఆ వేదనను చంద్ర గారి పొయెమ్ చాలా బాగా ప్రదర్శించింది. బాధ పెట్టే దాని మీద సహజంగా ఉండే కోపాన్నీ చాల హృద్యంగా చెప్పింది. అభినందనలు.
    -హెచ్చార్కె

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)