- రామానుజ రావు

ఉరుకుల పరుగుల సైబరాబాదు నుండి
ప్రకృతి వరాల జల్లు ఓరుగల్లుకు
ఓ చిరుజల్లుల సూర్యోదయాన
అలా ఇండికా కాబులో…


మబ్బుల అశోక వనంలో
మధ్య మధ్య ఫౌంటెన్లలా కొండలు
చిర్నవ్వుల వెలుగు నిస్తున్న మెరుపుల్ని
ఆగి ఆగి మోగే బాజా ఉరుముల్ని
తల్చుకుంటూ పులకరించే
తుషార బిందువుల్ని
ఆస్వాదిస్తూ
మబ్బుల బృందావనంలో పయనిస్తుంటాను
ఎక్కడో పిల్లంగ్రోవి గానామృతం
గాలి పై తేలుతూ
నా మనసు పొరల్ని తాకుతూ
వసంత రాగాల్ని వినిపిస్తోంది
అంతలో…
ఇంద్రధనస్సు రంగుల్లో స్నానించిన
పాలపిట్టొకటి
కారు బాన్నెటు పై వాలి
ముక్కుతో పొడుస్తూ
మధ్య మధ్య తలెత్తి చూస్తూ
మోగిన హారను శబ్దాల్ని
రెక్కలతో విదిలించి ఎగిరిపోతుంది
చక్రవాకంలా ఎదురు చూసి చూసి
వాన చినుకుల్ని తాగి మత్తెక్కినట్టున్న రోడ్దు
మట్టి వాసన మోసుకొస్తున్న గాలితో పోటీ పడ్తూ…
సైకిలు పై గడ్డి మొపుతొ
కారు పక్కగా దూసుకు వెడుతున్న వొ యువకుడు
రోడ్డు గతుకుల్లా అతుకులు పడిన
నిక్కరు తొదుక్కున్న కుర్రాడొకడు
భుజాన ఒక పిల్ల నెత్తుకుని
ప్రపంచాన్ని మోస్తున్న అట్లాసు లా
అడ్డంగా మేకల్ని తోలుతు వస్తాడు.
రంగుటద్దాల వెనక నా పట్న వాసపు మిత్రుడు
అసహనంగా చూస్తూ వుంటాడు.

అంతలో
అకస్త్మాత్తుగా
గొర్రె కాపరి గా నా మిత్రుడు పిల్లం గ్రోవి వూదుతూ
తన్మయత్వపు జడివానలొ తడిసిపొతూ నేను
యాంత్రిక యుగాల్ని నిముషాలుగా మర్చెస్తూ
నా కంటి ముందొ రంగుల కాన్వాసు
జీవిత పటాన్ని ఆవిష్కరిస్తుంది

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)