సముద్రం ఘోష నన్నుతాకి
కన్నీటితో కడిగింది
నా ముందు తాను నురుగై కరిగిపోయింది
కెరటమై విరిగిపోయింది
కెరలి కెరలి తిరిగిపోయింది
అలలు అలలుగా తిరిగివచ్చి
నా మనసులో ప్రవహించి
సముద్రం నన్ను స్నేహంలో ముంచెత్తింది.
నా శరీరానికి
జర జర పాకుతూ
మెత్తగా జారే స్పర్శయి
నా కళ్ళకు వెలుగుచీక ట్ల ఆకాశమై
అగాధమై
అనంతకోటి నక్షత్ర స్థగిత క్షతగాత్రమై
భయమ గొలిపే సౌందర్యమై
ఆకాశం తెరచాపగా
గాలి చుక్కానిగా
లావణ్యం లైట్‌హౌజ్‌గా
తానే ప్రకృతి ఎల్లవేళలా తెరచివుంచిన
ఆర్ద్రనయనమై
నిద్రలేని నిరంతర పయనమై
నిర్దేశిస్తున్నది నన్ను సముద్రం
నేను అలనంటి పరుగెత్తుతున్నానో
నా రక్తంలో తరంగాలు
అగ్ని స్వప్నాలై రూపుకడుతున్నాయో
అనుభూతి సముద్రమవుతున్నది
అనుశ్రుతి సముద్రమవుతున్నది
సముద్రం నా హసనమయింది
రసన అయింది
సముద్రం నా వ్యసనమయింది
అయినా సముద్రం సముద్రంలోనే వుంది
సముద్రం సముద్రంగానే వుంది
సముద్రం సంక్షోభంలో వున్నది
నేను తీరాన వున్నాను
పరసీమనై వున్నాను
పరవశమై వున్నాను
నా కాళ్ళకింద నుంచి సముద్రం
తనచేతుల్ని సాచినపుడు
నా గుండె పొరల్నుంచి సముద్రం
నన్ను తొలచుకొని తనలోకి తీసుకుంటున్నట్లు
తలచుకొని తనలోకి తీసుకుంటున్నట్లు
పిలుచుకొని తనలోకి తీసుకుంటున్నటు
ఆనందమూ చెలరేగింది
పట్టుదప్పి భయవిహ్వలమూ కలిగింది
సముద్రం నా పైకి
నురుగుల దరహాసాలు విసిరినపుడు
కెరటాల కత్తిసాము నేర్పినట్లు
గగుర్పాటూ కలిగింది
ఉలికిపాటూ కలిగింది.
సముద్రానికి తుఫాను భయం లేదు
తీరానికే తుఫాను భయం
సముద్రం నా భయం
సముద్రం నా అభయం
సముద్రం నా గాయం
సముద్రం నా అవ్యక్త గేయం
సముద్రం హయమై నన్నెత్తుకొని
ఏ సముద్ర తీరాలకు దౌడుతీస్తున్నదో
ఎక్కడ ఔడు కరుస్తున్నదో
ఏ నడక పరుగై మోడు చిగిరిస్తున్నదో
ఏ పరుగు ఎదురుదెబ్బయి ఒగిరిస్తున్నదో
ఏ దెబ్బ తేరుకొని ఎలుగై ఎగసివస్తున్నదో
వెలుగై ఎగిరి వస్తున్నదో
కళ్ళు తెరచిచూస్తే
నేను తీరాన తీరమై
తాను నన్ను కరిగిస్తూ సముద్రమై
కళ్ళు మూసిచూస్తే
నేను దూరానదూరమై
నా కంటిపాపలో సాంద్రమై సముద్రం
నా తెల్లగుడ్డులో కంటిపాపగా సముద్రం
నా కనురెప్పల కవిచిప్పలో సముద్రం
నా నేత్ర సూర్యకిరణాల
పరిష్వంగంలో సముద్రం
నా కనురెప్పల కాపలాలో సముద్రం
నా కనుసన్నల్లో సముద్రం
నా మనసు తిన్నెల్లో సముద్రం
కలంలోకి సిరాగా రావడానికి
గుండెలో ఉబికి
కంఠంలో ఉప్పొంగి
నాలుకపై అలలు అలలుగా సముద్రం
పెదవులపై ఎదపెట్టిన సముద్రం
నాలో ఎడతెగని సముద్రం రొద
మనసు పుట్టలోంచి
భగ్గున పడగవిప్పి బుసగొడుతూ
మంచు కుబుసం విడిచిన సముద్రం
అవని గుండెల లోతుల్నిపాకి
ఆకాశం అంచుల్ని తాకి
అంతటా తానైన సముద్రం
అంతగా మధన పడుతుందెందుకో
అందుకే మధనపడు మనసున్నందుకే
తుఫాను సముద్రం
ఉప్పెన సముద్రం
సంక్షోభ సముద్రం
సముద్రానికి సరిహద్దు లేదు
తీరానికి సముద్రం సరిహద్దు
దూరానికి సరిహద్దు సముద్రం
భావానికి సరిహద్దు సముద్రం
***
4
మండుతూ అగ్నిగోళం నుంచి నేను విరిగిపడ్డపుడు
వెలుగుతూ సూర్యబింబం నుంచి నేను కరిగిపడ్డపుడు
సముద్రంలో రంగరించింది నా రక్తమే
మట్టినై చల్లారకుండా
మనిషినై చల్లారకుండా
నాలో ప్రవహిస్తున్నది సముద్రమే
సముద్రంలో మట్టిలో నాలో
చెయి పెట్టి కెలుకు
ధాతువులు ధాతువులు జీవధాతువులు
రుతువులు అవస్థలు వ్యవస్థలు
జలరాశుల్లో రాశి పోసిన సంపదలు
మట్టి పాతరలో త్రవ్వితీసిన ద్రవ్యరాశులు
నా శ్రమ ఊహలు సృష్టించిన ఉత్పత్తులు.
సముద్రాన్ని మధించింది నేను
భూమిని తలకిందులు చేసింది నేను
నన్ను నేను బంధించుకున్నది నేను
అలమీద గాలి మీటితే
ఆకుమీద వెన్నెల పాకితే
సెలయేటి గలగల అంచున వెలుగు మెరిస్తే
నేల పులకించి పుష్పిస్తే
స్వంతం చేసుకున్నది నేను
స్వతంత్రం కోల్పోయింది నేను
కాలికింద మట్టిని అణచిపెట్టి
సముద్రాన్ని శాసించాలనుకున్నాను
దేశాలనూ ద్వీపాలనూ జయించాను
ద్వేషాలనూ పాపాలనూ పోషించాను
సముద్రం దొంగనో స్మగ్లర్నో
వర్గసామాజికుణ్ణయి
నా సముద్రానికి నేను పరాయివాణ్ణయ్యాను
నా సముద్రంలోని ఉప్పునూ నిప్పునూ దాచుకున్నాను
జాలరి నెత్తుటిలోని వేడినీ
చెమటలోని రుచినీ దోచుకున్నాను
సముద్రాలకు సరిహద్దులు గీసింది నేను
సముద్రాలకు ముద్రలు వేసింది నేను
పేర్లు పెట్టింది నేను
దారులు మళ్ళించింది నేను
అఖాతాలను సముద్రంలో సృజించి
శాంతి మహాసముద్రాలను ఆన్వేషించింది నేను
బంగారం కోసం ద్వీపాలనూ, ఎడారులనూ శోధించి
యుద్ధ స్థావరాల కోసం
సముద్రాలను బాధించింది నేను
నీరు విరిగి విద్యుత్తు పుట్టిన చోట
చీకటి సముద్రం వెలుగు అలలైన చోట
నక్షత్ర కాంతి సముద్ర దర్పణంలో ప్రతిఫలించినచోట
వెన్నెలలు కాసిన చోట
ఆకాశమంత సూర్యుడు
ఆర్ణవమంతా ఒళ్ళు విరుచుకున్న చోట
అణువును పగులగొట్టి చూపించింది నేను
సముద్రానికి గర్భస్రావం మందు తాగించింది నేను
తరాలుగా అంగవైకల్యంతో పుట్టింది నేను
సముద్రానికి తినిపించిన విషాన్ని
గాలిలో కలుపుకొని తింటున్నది నేను
సామ్రాజ్యవాద యుద్ధ పరిష్వంగంలో
శాంతి సముద్రాన్నై సంక్షోభపడుతున్నది నేను
నా రక్తం నాకిప్పుడు సరుకు
నా సముద్రం నాకిప్పుడు సరుకు
నా నేల తల్లిని ఎన్నిసార్లు ఆమ్ముకున్నానో
మళ్ళీ మళ్ళీ యుద్ధాలతో
మార్కె ట్‌కు ఎగదోస్తున్నాను
నా లోహితాస్యుణ్ణి చంపుకున్నాను
నా చంద్రమతిని అమ్ముకున్నాను
రాజ్యం కోసం రహస్తంత్రుల్ని
రక్తసంబంధాలను తెంచుకున్నాను
నాలో పులకించిన నేలను
పోటెత్తిన సముద్రాలను
వంచించాను
నీరాన్ని పంచుకున్నాను
తీరాన్ని పెంచుకున్నాను
అలలమీద నిఘావేసే పనికి
అంతటా తలల్ని కిరాయకి పెట్టుకున్నాను
సముద్రాన్ని అర్థం చేసుకున్నది నేను
సముద్రాన్ని ఆవాహన చేసుకున్నది నేను
తుఫానులకు ఎదురీది
వాయుగుండాల నుంచి ప్రాణవాయువుల్ని
కాపాడింది నేను
తిమింగలాలను లొంగదీసి
మొసలికన్నీళ్ళను పసిగట్ట
మిల మిల మెరిసే చిరుచేపల క ళ్ళనూ
సముద్రం నీళ్ళనూ సంరక్షించింది నేను
సముద్రం దగ్గరికి తీరాన్ని వేసి
ప్రకృతికీ నాకూ
దూరాన్ని తగ్గించింది నేను
మా మధ్య పరుచుకున్న పొగమంచును ఛేదించి
పగ సెగలను భేధించి
సముద్రాన్ని సముద్రంగా చూసింది నేను
సముద్రం
బానిసల్ని మింగేసే బడబాగ్ని కాదు
బడబాగ్నిని మింగేసే బానిసల తిరుగుబాటు
సముద్రం
నా భూమి నడుముకు చుట్టిన వడ్డాణం కాదు
రాచరికాన్ని రద్దు చేసిన రక్తపాత విప్లవం
సముద్రం
ఈస్టిండియా కంపెనీల్ని మోసే వలస కాదు
వలసలను ఆంతంచేసే దేశాల స్వాతంత్య్రాకాంక్ష
బాంబుల్ని మింగి ఆత్మహత్య చేసుకునే
పెట్టుబడిదారీ స్వేచ్ఛకాదు సముద్రం
పెట్టుబడిదారిని మట్టుబెట్టే బోల్షివిక్ విప్లవం
తనకూ చంద్రునికీ అనుబంధం
శరజ్జ్యోత్స్న కాదు, యుద్ధ స్థావరాలనీ
తననూ గ్రహాలనూ
గామా కిరణాలో, లేజర్ కిరణాలో
కలుపుతున్నాయనీ
పిల్లొచ్చి గుడ్డునెక్కిరించినట్లు
సామ్రాజ్యవాదం ఇవ్వాళ ప్రకటిస్తే
సముద్రం పెదవుల చాటున నవ్వుకున్నది.
ఇవ్వాళ సముద్రం
సామ్రాజ్యవాద మరణశయ్య లాగున్నది
ఇవ్వాళ సముద్రం
కల్లోల నక్సల్బరీ లాగున్నది
సముద్రం పొంగుతున్నది
సముద్రం ఉప్పొంగుతున్నది
చంద్రుణ్ణీ గ్రహాలనూ చేరదీసి
భూమి చెక్కిలిపై నా చెమట చుక్కను
తన నె త్తుటి చుక్కగా ద్ర(ధ్రు)వీకరించి
సముద్రం నాదిగాకుండానే నాదవుతుంది
సముద్రం అందరిదవుతుంది
భూమి నాదిగాకుండానే నాదవుతుంది
భూమి అందరిదవుతుంది
ప్రకృతి నాదవుతుంది
ప్రకృతి నాకర్థమవుతుంది
సముద్రం అలపైన తేలిపోతూ నేను
నా కలల్లో వెలిగిపోతూ సముద్రం
సముద్రంలో నేనొక నీటి చుక్కను
నాలో సముద్రం ఒక చెమటచుక్క
చెమటంతా నెత్తురు ఆని తెలిసిపోయింది
నెత్తురంతా చలనమని తెలిసిపోయింది
చలనమంతా ఘర్షణని తెలిసిపోయింది
ఘర్షణంతా మార్పుకని తెలిసిపోయింది
సముద్ర తీరాన తూర్పు ప్రసవించి
అలల పొత్తిళ్ళలో రేపు నాకర్థమయింది
అలల కేసరాల్లో పరాగమై నేను
నా కళల పరిమళమై సముద్రం
సముద్రం నా భావనా విద్యుత్తు
సముద్రం నా భవిష్యత్తు
***
5
మహా సంక్షోభం గొప్ప శాంతికి దారితీస్తుందని
సముద్రాన్ని స్వేచ్ఛకోసం
తుఫానులను సృష్టించుకొమ్మన్నాను.
నేనన్నానని కాదు
సుళ్ళుతిరిగి సుళ్ళుతిరిగి
సముద్రం కన్నీళ్ళు నిప్పయినవి గాలైనవి
ఉప్పెన అయినవి
నేను తీరాన లేను
సముద్రంలోనూ లేను
నేను సముద్రంలో ఎందుకులేను!
నేను సముద్రంలోనే వున్నాను
నేను సముద్రంతోనే వున్నాను
నేనింకా సముద్రాన్ని కాలేకపోతున్నాను
సముద్ర కెరటాలలో ఎగసిన నీటిచుక్కలు
ఆకాశంలో ఇంధ్రధనస్సు జెండాలు విసురుతూ
వెలుగులయి నన్ను కలుపుకున్నపుడు
నేను తీరాన్ని కాను
నేను ఒంటరిని కాను
సముద్ర మే లేకపోతే నేను ఇసుకరేణువును
ఇప్పుడో సముద్ర ఖడ్గ దరహాసాన్ని
మెరుస్తున్న సముద్రం కత్తిఅంచును
సముద్రం స్వేచ్ఛాపోరాటంలో పాల్గొందామని
ఛైతన్యం పొందిన మట్టిని,
నా కెదురుగా సముద్రం వున్నపుడు
సముద్రంలాగానే పొంగిపోయాను.
సముద్రం ఆదరించి ముంచెత్తి పైకెత్తి
జైకొట్టి తీరాన వదిలినపుడు
ఉప్పొంగి పోయాను
సముద్రం స్వేచ్ఛ కోసం
నన్నొరుసుకొని నను పిలుచుకొని
మధనపడుతున్నపుడు
సముద్రానికి స్వేచ్ఛకావాలని
తీరాన స్వేచ్ఛగా తిరుగుతూ
య«ధేచ్ఛగా సముద్రానికే చెప్పాను
సముద్రంమీద స్వారీచేస్తున్న
సముద్రం దొంగలంతా విన్నారు
సముద్రం రహస్యం కాదు
సముద్రం కుట్ర కాదు
సముద్ర సంక్షోభ రహస్యం కాదు
తుఫాను కుట్ర కాదు
సముద్రం స్వేచ్ఛను దోచుకుంటున్న
స్వామ్యభావంపై
సముద్రంతో కలిసి సంఘర్షణకు దిగాను
భూమి హారులు నన్ను
సముద్రంలో పోల్చుకున్నారు
యుద్ధం నేను ఏ పక్షమో తేల్చుకుంది
బండికింది కుక్కలా ఈ ప్రపంచాన్ని నడుపుతున్న వాళ్ళకు
బండిని లాగుతున్నదెవరో నేను వేలెత్తి చూపినపుడు
వాళ్ళ పంటికింద రాయిలా కనిపించాను నేను
వాళ్ళ కంట్లో ఎగసిపడిన ధూళిలాగనిపించాను నేను
మనసులేని కన్నీళ్ళులేవలీ
మనసులేని చిరునవ్వులేదనీ
సముద్రంలేని తీరంలేదనీ
సముద్రమే తీరమనీ
గిరిగీసుకొని కూర్చొని సముద్రం గురించి
తీరాన ఆలోచిస్తే
సరిహద్దుమీద జెండాపాతి
సముద్రంతో సంబంధం పెట్టుకుంటే
పరసీమ అనుకున్న పదార్థాన్ని కూడా
ప్రభంజనంలో ముంచెత్తింది సముద్రం
తీరాలు కరిగిపోయాయి
చిరునామాలు చెరిగిపోయాయి
శత్రువుకు
నేను సముద్ర సంభాషణనని తెలిసిపోయింది
నాది సముద్ర సంస్కృతి అని తెలిసిపోయింది
నేను హోరెత్తిన సముద్రాన్ని కాకపోవచ్చు
నేను సముద్రం హోరును
నేను పోటెత్తిన సముద్రం నోరును
నేను తూర్పు పడమరలను తుడిచిపెట్టే
ఉత్తర దక్షిణాలను ఊడ్చిపెట్టే
ఉప్పెనను కాకపోవచ్చు
ఉప్పెనతో పెనవేసుకున్న గీతాన్ని నేను
ఉప్పెనకు సంకేతాన్ని నేను
ఎగసినపుడు కెరటమై
విరిగినపుడు నీళ్ళైన సముద్రం
బానిసగా చెమటయి
ఎదురుతిరిగితే నెత్తురవుతుంది
మట్టిలా పడుండి తట్టిలేపితే
వ్యవసాయ విప్లవమవుతుంది
తానే సరుకై, దారై, తెన్నయి
ఓడయి, చుక్కా నై
ఓడిపోయి పరాయిదై
తుఫానయి తాను తెలుసుకుంటుంది సముద్రం
తుఫాను నన్ను ముంచెత్తినపుడు
అది పిలుపు కాదు
సముద్రం నన్ను తనలో కలుపుకోవడం
నేనూ సముద్రాన్ని అని తెలుసుకోవడం
సముద్రానికి స్వేచ్ఛలేదు
నాకూ స్వేచ్ఛలేదు
సముద్రం మహా సంక్షోభంలో వుంది
ఆ సంక్షోభంలో నేనున్నాను
సముద్రం ఆటుపోటుల్లోని
అలను నేను కలను నేను కలతను నేను
గొప్ప శాంతి కోసం మహాసంక్షోభంలో
స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను
సముద్రం స్వేచ్ఛలో
సత్యమైన స్వేచ్ఛలో
స్వేచ్ఛను వెతుక్కొంటున్న నీటిచుక్క ను నేను.