నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్ కన్నుల్లో విను
నా మనసు మీద చెవి పెట్టి చూడు
నేనే క్యాసెట్‌నై రికార్డ్ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను

నా రక్తం ప్రతిధ్వనిస్తున్న
సముద్ర నిశ్వాసాన్నీ
నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న
సముద్ర విశ్వాసాన్నీ విను


నా పాటయే మనిషయి ప్రతిఫలిస్తున్న
సముద్రం నిన్నూ నన్నూ ఆవహించనీ
ఎంత దూరం నుంచి నడచి వచ్చానో
సముద్రాన్ని చూడాలని.
అడవినై
ఆకుపచ్చ సముద్రం కోసం ఆక్రోశించాను.
గుహనై సముద్రం చీకటి లోతులలో
వెతకడానికి
నెత్తుటిలోని వెలుగునంతా
కళ్ళల్లోకి తెచ్చుకున్నాను.
కొండనై తల ఎత్తిచూసి
నదినై పరుగెత్తికొచ్చాను.

ఎన్ని యుగాలనుంచి ఎన్ని తరాలనుంచి
ఎన్ని దశలు ఎన్ని అవస్థలు, ఎన్ని వ్యవస్థలు
పడిలేస్తూ నడకలు, పరుగులుగా
సముద్రం నన్ను చూడాలని
సీమాంతాలనుంచో
చీకటి చెల్లిన చోటునుంచో
సముద్రం మొదలైన చోటునుంచో
నడచివచ్చిందో
అలలు అలలుగా
తెరలు తెరలుగా
తరగలు తరగలుగా
ఎగసిపడి కెరటమై వచ్చిందో
చీకటి సముద్రం, నల్లటి సముద్రం
నీలం సముద్రం, ఆకుపచ్చని సముద్రం
మెత్తని తెల్లని
నురుగులాంటి చిరునవ్వుతో నన్ను తాకి ంది
అన్ని సముద్రాలలో తానై
తనలో ఆన్ని సముద్రాలై
నా కాలివేళ్ళలో మునివేళ్ళు పోనిచ్చి పిలిచింది.
వేళ్ళ సందులలో నీళ్ళు నింపుతూ సముద్రం
విభజించబడ్డ భూభాగాన్ని
కలుపుతూ సముద్రం
నిలచిన గులకరాళ్ళను అరగదీస్తూ
నా నిలచిన పాదాలకింద
నీళ్ళ చక్రాలు తిప్పుతూ
సముద్రం రైలు,
సముద్రం బయలు, సముద్రం మెయిలు
సముద్రం జీవితం స్టయిలు

ఏమున్నది సముద్రం
నీళ్ళూ, ఉప్పెనా తప్ప
ఏమున్నది జీవితం మాత్రం
కన్నీళ్ళూ, తిప్పలూ తప్ప

సముద్రం నెత్తురు
నీళ్ళైన మాట నిజమే
సముద్రం కన్నీరు పెట్టిన మాట నిజమే
సముద్రం కన్నీళ్ళు
విరహకవి దుఃఖంలా మధురవేదన కాదు
నీ, నా కన్నీళ్ళవలె
ఉప్పుగానే వున్నాయి

కాని సముద్రం కన్నీళ్ళై కరగలేదు.
సముద్రం కన్నీళ్ళలో మురగలేదు
సముద్రం ముంచెత్తింది గాని
తాను మునగలేదు

సముద్రం ఉన్నది
సముద్రం తానన్నది
నడచి, నడచి, నడచి
గడచి, గడచి, గడచి
పడిలేస్తూ అలలు అలలుగా
తానొస్తున్నానని అన్నది

రక్తంలో ప్రతిధ్వనిస్తూ సముద్రం
నా పాటలో ప్రతిఫలిస్తున్న సముద్రం

బతుకు పోరును
సముద్రం హోరులో విన్నాను
బతుకు లోతును
సముద్ర కెరటంలో
బతుకురీతిని
పరుచుకున్న సముద్ర వైవిధ్యంలో
చదువుకున్నాను.

ఏమున్నది సముద్రం
నీళ్ళూ, ఉప్పూ
ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం
చీమూ నెత్తురూ
పోరాటం తప్ప.

2

సముద్రం మళ్ళీ నా దగ్గరికి ఏదో చెప్పాలని వచ్చింది
సముద్రం దగ్గరికి మళ్ళీ వినాలని నేనే వెళ్ళాను
సముద్రాన్ని వెతుకుతూ వెళ్ళాను

తలాపున సముద్రం పెట్టుకొని
నీళ్ళకొరకు వెతికినట్లు
చుట్టూ పరుచుకున్న సముద్రాన్ని
కనుచూపు మేర సముద్రాన్ని
చూపు ఆగినచోటకూడా ఆగని సముద్రాన్ని
చూస్తే తప్ప పోల్చుకోలేవు

పై నురుగుల్నీ చూడాలి
నురుగుల మరుగునదాగిన లోతుల్నీ చూడాలి
నేల అంచులకు పయనించగా
నీలాల సముద్రాన్ని చూడాలి

ఏ పేరూ లేని నీరును
ఏ గడ్డన నిలబడితే ఆ పేరుతో పిలిచే మనిషికి
ఘోష తప్ప భాష లేని సముద్రం
ఏ రహస్యాలు వినిపిస్తుందో

ఒక్క క్షణం నిలవనీని నిరంతర ఘోష
ఒక్క క్షణం ఆగని నిరంతర చలనం
చీకటి ఆడుగుపై వెలుగు కెరటం
విరిగిన కెరటం అంచున దాగిన సముద్రగర్భం

సముద్రం గురించి ఎంతో చెప్పాలనుకొని
చెదరిపడిన నా అక్షరాల్లాగ-
వాటి అడుగున దాగిన నా మనస్సులాగ

సముద్రం తప్ప సముద్రాన్ని
కవిత్వం ఏం కళ్ళకు కట్టగలదు
పోరాటం తప్ప జీవితాన్ని
ఏ చీకటి- వెలుగులు వివరించగలవు

తనను చూడమని చెప్పింది సముద్రం
జీవించి పోరమని చెప్పింది సముద్రం
హోరుమని చెప్పింది సముద్రం

కెరటాలపై ఈదినవానితో
చెర లాడి
సముద్రగర్భం తాకిన వానికి
సవాళ్ళు విసిరి
ఊరక ఉప్పునీళ్ళ రుచి చెప్పినవాణ్ణి
ఒడ్డుకు విసిరికొట్టింది సముద్రం

ఇసుక పునాదుల్ని
ఒళ్ళు జలదరించేలా తొలిచేసి
నీటిలో నిప్పులను సృష్టించి
చూపుకు వెలుగు భూమికలను
అమర్చింది సముద్రం

సముద్రం సమాధానంలోని సమస్య
ప్రశ్నలోని జవాబు.
సముద్రం వైరుధ్యాలపుట్ట
సముద్రం వైరుధ్యాల పరిష్కారం
సముద్రం వైవిధ్యాల గుట్టు
ఐక్యతకు గుట్ట.
సరిహద్దుల్ని చెరిపేసే
పరసీమ సముద్రం

సముద్రం ముందు నిలబడితే
సముద్రం నా ముందు కెరటమై నిలబడితే
సముద్రం తప్ప క ళ్ళముందు మరేమీ వుండదు
మనసు సందులో
సముద్రం తప్ప మరేదీ దూరదు

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే
కాళ్ళకింద నీళ్ళు
సముద్రపు మంటలాగ
కళ్ళలో నీళ్ళు
ప్రజాసముద్రపు బాధల్లాగ.
గుండెలో సముద్రధ్వని
శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగ

కలంలోంచి సముద్రం
నా బతుకు పొరల్లో, స్మృతి తెరల్లో
కలల్లో దాచుకున్న విలువైన ఊహవలె
ఉరికి వస్తుంది గానీ
దాన్ని నిలపడం ఎట్లా
దానికి అక్షరాల అంగీలు తొడగడం
ఎట్లా?

చప్పన్నారు దేశాలను చప్పరించి
ఉప్పనగా ఉన్నాయని తేల్చేసిన సముద్రాన్ని
భూమినంతా ఒక చుట్టుచుట్టి
భూగోళం తిరుగుతోందని తేల్చేసిన
సముద్రాన్ని కాగితంపై నిలబెట్టడమెట్లా!

ప్రవాహాన్ని మనసుకు ఆవాహన చేసుకోవాల్సిందే తప్ప
ఏ బిందువుదగ్గర ఆపి దాని స్వరూపాన్ని వివరించగలం!

చూపుకు ఎత్తైన కెరటం
పాదాల అడుగున నీ పాదమెంతో అంతే
రూపుకు రవ్వల జడి
ఆచి విసిరిన విద్యుద్ఖడ్గం
అనంత రోచిర్నివహం
నాలుక చివరన నిలువని ఉప్పన.
ఎక్క డ మొదలయిందో
ఎంత ఉద్వేగంతో ఉధృతంతో
ఉరకలు వేసి వచ్చిందో
భయం గొలిపే మహదాకారం
ఆకాశాన్నీ భూమినీ ఆవరించిన సముద్రం
ఇసుక రేణువులముందు తలవొంచి
నీ పాదాలదగ్గర
నువు సాదుకున్న గుర్రంలా
నిన్ను స్పృషిస్తూ నిలిచిపోతుంది.
నీ పాదాలదగ్గర జారిపోతుంది

ఏదో చెప్పాలనివచ్చి చెప్పకుండానే
నీ చూపులలోనూ స్మృతిలోనూ
నిలచిపోతుంది
అగాధ సముద్రం.

***
3

సముద్రం సంక్షోభపడుతున్నదని తెలిసి
సముదాయిద్దామని దగ్గరికి వెళ్ళాను

ద్రవం ఉన్నచోట ఉపద్రవం వుంటుంది
ఉప్పున్నచోట ఉప్పెన తప్పదు
నెత్తురు ప్రవహించే నరాలు చిట్లినపుడు
గాయమూ చీమూ తప్పవు
నీళ్ళున్నచోట కన్నీళ్ళేకాదు
కాంతిపుంజాలు వెతుక్కోవాలని
చెప్పడానికి వెళ్ళాను.

ఏం చెప్పడానికి వెళ్ళానో గాని
సముద్రతీరాన నిలబడ్డాను
సముద్రతీరమై నిలబడ్డాను
సముద్రం చెలియలి
కట్టపై కట్టుబడిపోయాను.

సముద్రం ఘోష నన్నుతాకి
కన్నీటితో కడిగింది
నా ముందు తాను నురుగై కరిగిపోయింది
కెరటమై విరిగిపోయింది
కెరలి కెరలి తిరిగిపోయింది
అలలు అలలుగా తిరిగివచ్చి
నా మనసులో ప్రవహించి
సముద్రం నన్ను స్నేహంలో ముంచెత్తింది.

సౌజన్యం:
http://www.varavararao.org
స్వామీ

Youtube

3 అభిప్రాయాలు

  1. chandrasekhar 05 అక్టోబర్ 2007 , 5:01 pm

    ఈ కవిత http://www.varavararao.org/te/poetry/samudram.html

    లో ఉన్నది. మళ్ళీ ఇక్కడ వేయడం మంచిదే కానీ అక్కడ ఉన్నదనే విషయం కూడా చెప్పి ఉంటే బాగుండేది, అట్లే యు ట్యూబ్ నుండి విడియో తీసికున్నప్పుడు అది ఎవరి నుండి తీసుకున్నామో ఎవరక్కడ పెట్టారో తెలిపి ఉంటే మర్యాద గా ఉండేది.
    విప్లవ సాహిత్యాన్ని, ప్రజా సాహిత్యాన్ని ఎవరు బడితే వాళ్ళు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు కానీ అటువంటి కృషి వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు దానిని గుర్తించడం నిజమైన విప్లవ స్ఫూర్తి అవుతుంది - లేక పోతే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్షణమైన గుంజుకోవడం, కాపీ కొట్టడం, పేటెంటు నాదే అనడం, వగైరాలన్నీ అవుతాయి.

  2. ప్రజాకళ 06 అక్టోబర్ 2007 , 2:00 am

    చంద్రశేఖర్,

    ప్రజాకళలో మీరు వేసిన ప్రశ్నలు ఆహ్వానిస్తున్నాం. “కొయ్యగుర్రం” కవిత వేయడానికి వెనక ఉద్దేశాలు ఏమీలేవు. రచనలు సేకరించడం క్లిష్టంగా వుంది కాబట్టి, కొన్ని పాత మరియు క్లాసికల్ రచనలు వేయవలసివస్తోంది. సామాజిక వాస్తవాలను ప్రతిఫలించే ఆనీ రచనలను ప్రజాకళ వేస్తుంది. అదే క్రమంలో “సముద్రం” కవిత కూడా వేయడం జరిగింది. సౌజన్యం మరియు వైబ్ సైటు పేరుకూడా పేర్కొనడం జరిగింది. మీరు చేసిన సూచనను కూడా పరిగణలోకి తీసుకొన్నాం. మీ మనస్సు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాం,

    “పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్షణమైన గుంజుకోవడం …..” అని మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
    ప్రజాకళ మొత్తం చదివి మీ వైఖరిని పునరాలోచన చేయండి. సామాజిక ప్రయోజనానికి పత్రిక నడపటం ఒక ‘పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్ష’ణంగా మీకు అనిపించటం చాలా విచారకరమైన అంశం. ప్రత్యామ్నాయం ఏమిటో మీరు ఆచరణాత్మకంగా తెలియజేయండి.

    - ప్రజాకళ మిత్రులు

  3. lalitha 10 నవంబర్ 2007 , 2:31 pm

    వి.వి గారి మీద వెబ్ సైట్ వుందని ఇప్పుడే తెలిసింది. ఈ హీరో వర్సిప్ యే విప్లవ స్పూర్థిని తెలియ జేస్తుంది? ఆయన గొప్ప సామాజిక కార్యకర్త అన్న విశయం లో నాకు బేదాభిప్రాయం లేదు.మళ్ళీ ఇందులో రైట్స గొడవలు, కాపీలు చిరాగ్గా ఉన్నాయి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)