
మనుష్యులు తక్కిన జంతువులతో పోలిస్తే అసాధారణ జీవులే. మనుష్యుల ప్రత్యేక లక్షణాలకు వారి మెదడూ, బాగా పరిణతి చెందిన నాడీ వ్యవస్థా ముఖ్యకారణాలు. ఈ ప్రత్యేక లక్షణాల్లోనే కొన్ని తప్పుడు నమ్మకాలకూ, భ్రమలకూ కూడా దారితీస్తున్నాయి.
ప్రకృతిలో ఒక భాగంగా కాక, తనను ప్రత్యేక సృష్టిగా, మొత్తం ప్రాణికోటికి పరాకాష్ఠగా భావించే మనిషి అసలు ఎలా పరిణామం చెందాడో తెలిస్తే జీవరాశిని గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక వివరణలను పట్టించుకోకుండా, సహజవిషయాల గురించి సైతం ఉన్నవీ లేనివీ కల్పించుకుని గందరగోళపడకుండా జీవించడం చాలామందికి అసాధ్యం అనిపిస్తుంది.
‘జీవసృష్టి’ని అర్థంచేసుకోవడం కష్టమేమీ కాదు. మొదట ఏకకణజీవుల రూపంలో భూమిమీద ఉద్భవించిన జీవరాశి క్రమంగా బహుకణ సముదాయాలతో కూడిన ప్రాణుల ఆవిర్భావానికి దారి తీసింది. ఇదంతా సముద్రజలాల్లో వందల కోట్ల సంవత్సరాల తరబడి జరిగిన పరిణామం. రకరకాల వింత జంతువులతో లుకలుకలాడిన ఆనాటి సముద్రాలనుంచీ, బురదతో నిండిన జలాశయాలనుంచీ, జలచరాలూ, ఉభయచరాలూ పుట్టుకొచ్చాయి. మారుతున్న భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో అంతకంతకూ పోటీ పెరిగి, బైటి మార్పులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు కలిగిన ప్రాణులు మాత్రమే బతకగలిగాయి. వీటిలో కొన్ని చిత్రవిచిత్రమైన రూపాలను సంతరించుకున్నాయి. భౌతిక కారణాలూ, ప్రేరణలూ లేకుండా ఏ మార్పూ జరగలేదు. “దైవశాసనాలు” అమలైనట్టు దాఖలాలు ఏవీ లేవు. చిన్నచిన్న విషయాల్లో కూడా ఇది స్పష్టమౌతుంది. పైనున్న వీపు భాగం ముదురు రంగుతోనూ, కింది పొట్ట తేలిక రంగుతోనూ అనేక రకాల చేపలు కనబడతాయి. ఇలా జరగడం వల్ల పైన ఎగిరే పక్షులకు వాటిని గుర్తించడం కష్టం. అలాగే వాటికి ఎర అయే చిన్నచేపలకూ కింద ఈదుతున్నప్పుడు వాటిని గుర్తించడం కష్టమే. తమను అపాయంనుంచి కాపాడుకుంటూ, తమకు అవసరమైన ఆహారాన్ని తేలికగా సంపాదించుకుంటూ బతకడానికి అవసరమైన రంగులు ఆ చేపలకు దక్కాయి. ఇలాంటి మార్పులు చెందలేని చేపలు అంతరించిపోయాయి.
ఎవరో ఎంపిక చేసినట్టుగా అనిపించే ప్రాణుల లక్షణాలన్నీ యాంత్రికంగా, జీవపరిణామపు పోటీలో ఏరివేత ద్వారా మిగిలినవేనని చాలామంది గుర్తించరు. దీనికి తోడుగా మనుషులకు ‘మహిమ’ ల గురించి సహజంగా కలిగే భ్రమలు కొన్ని ఉంటాయి. ఏ వంకాయనో అడ్డంగా కోసినప్పుడు అందులోని గింజలు ఓం అనే ఆకారంలో కనబడగానే కొందరు పరవశించిపోతారు. దాని వివరాలూ, ఫోటోలూ పత్రికల కెక్కుతాయి. అదే కాయను మరొక దిశలో కోసి ఉంటే గింజల ఏర్పాటులో ఇటువంటి ‘మహత్తు’ కనబడి ఉండేది కాదని వారికి తట్టదు.
పూలమొక్క రెమ్మల్లో ‘ఓం’

ఒక పూలమొక్క రెమ్మల్లో ఒక ఫోటోగ్రాఫర్ ఓం స్వరూపాన్ని గుర్తించాడు. మన దేశపు ఒక పక్షి కృష్ణా అని అరుస్తుందట.
తేనెపట్టులో అల్లా పేరు

సిలువ ఆకారంలో వెలుగు

ఇటువంటి అపోహలు అన్ని మతాల్లోనూ కనిపిస్తాయి. కొన్ని చెట్ల గుంపులనో, తేనెపట్టు స్వరూపాన్నో చూసినప్పుడు అందులో అల్లా అనే అరబిక్ అక్షరాలు కనబడిన దాఖలాలతో ఫొటోలున్నాయి. కొందరికి దీపాల కాంతుల్లో సిలువ వెలుగుతున్నట్టుగా కనిపించి, ఆశ్చర్యానందాలు కలుగుతాయి. మానవ సమాజాలు శైశవదశలో ఉన్నప్పుడు వారి మనస్తత్వం చిన్నపిల్లలను పోలి ఉండేదని చారిత్రక విజ్ఞాన పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆ స్థితి ఈనాటికీ కొనసాగుతోందనడానికి ఈ ఉదాహరణలు చాలు.
వంగ గింజలైనా, తేనెపట్లయినా తలవనితలంపుగా వాటిలో కనబడుతున్న సహజరేఖలు ఏవో కొన్ని లిపుల్లో అర్థవంతమైన మాటలుగా కనబడినంత మాత్రాన వాటికి ఎటువంటి ప్రాముఖ్యతా కలగదు. ఈమధ్య తలెత్తిన ‘రామ సేతువు ‘ రభసలో సముద్రాల్లో సహజంగా జరిగే పరిణామాలను గురించిన ప్రస్తావన వచ్చింది. కొందరు ప్రబుద్ధులు ‘చూడగలిగినవాళ్ళకి భగవంతుడి మహిమలు ఎల్లెడలా కనిపించగలవు’ అన్ని ప్రవచిస్తూ ఉంటారు. కొన్నేళ్ళ క్రితం ఒక ప్రముఖ వారపత్రిక ‘తిరుపతి నిదర్శనాలు’ అనే శీర్షికను ప్రతి వారం ప్రచురించేది. బుద్ధిపూర్వకంగా భ్రమలను ప్రోత్సహించడమే అందులోని ఉద్దేశం.
‘రాముడి’ సేతువు

కశ్మీర్ ప్రాంతపు అమర్‌నాథ్ శివలింగం సహజంగా మంచువల్ల రూపొందిన ఆకారం. స్టాలగ్మైట్ అనబడే ఇటువంటి సున్నపురాతి ఆకారాలు ప్రకృతిసిద్ధంగా గుహల్లో ఏర్పడతాయి. ఎన్నో శతాబ్దాల కిందట ప్రజల మనస్సును చలింపజేసిన ఇటువంటి ‘వింతలు’ ఈనాటికీ తమ ‘ఆధ్యాత్మిక’ శక్తితో యాత్రాస్థలాలుగా కొనసాగుతున్నాయి.
అమర్‌నాథ్ శివలింగం

కొన్ని సంఘటనల్లో ఇలాంటి మార్పులకు మనిషి ప్రమేయం కూడా ఉంటుందని చెపుతూ కార్ల్ సేగన్ మరొక విషయం ప్రస్తావించాడు. జపాన్ దీవుల్లో ఒక చోట వీపు మీద సామురాయ్ యోధుల మొహాల డిజైన్ కలిగిన ఎండ్రకాయలు విరివిగా దొరుకుతాయట.
సామురాయ్ పీత, సామురాయ్ సంప్రదాయక చిత్రం

సామురాయ్ యోధులంటే అక్కడివారికి ఎంతో గౌరవం కనక అలాంటివి దొరికినప్పుడు జాలర్లు వాటిని చంపకుండా మళ్ళీ సముద్రంలో వదులుతారట. ఎండ్రకాయల వీపు మీద ఉండే మచ్చలు జన్యువుల నిర్మాణాన్ని బట్టి రకరకాలుగా రూపుదిద్దుకుంటాయి. వాటిలో కొన్నిటికి యాదృచ్ఛికంగా సామురాయ్ యోధుల మొహాల డిజైన్ ఏర్పడడంతో వాటి ప్రాణాలు దక్కాయి. ఇతర డిజైన్లున్న పీతలన్నీ ఆహారం అయిపోయాయి. ఆ విధంగా శతాబ్దాలుగా ఈ మార్కు పీతల జనాభా ఎక్కువగా పెరిగి ఆ లక్షణాలు బలపడే అవకాశం కలిగింది. ప్రకృతిలో ఈ మచ్చల రూపం అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. మనిషి తన స్థానిక సంస్కృతిని బట్టి మంచీ, చెడూ అనుకుంటూ ఆ మార్పుల్లో జోక్యం కలిగించుకున్నా డన్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి అదేదో పవిత్రస్థలం, అవన్నీ పవిత్రమైన పీతలు అనే అపోహ మాత్రం తప్పక కలుగుతుంది.
ఇంగ్లండ్‌లో పారిశ్రామిక యుగం మొదలు కానప్పుడు తెల్లని బెరడున్న చెట్లమీద తెల్లని సీతాకోకచిలకలు వాలుతూ ఉండేవట. వాటిని తినే పక్షులకు వాటిని గుర్తించడం కష్టం అయేది. బొగ్గు, ఆవిరియంత్రాలు రావడంతో త్వరలోనే ఇంగ్లండ్ పరిసరాలన్నీ మసిబారడం, చెట్లన్నీ నల్లబడడం జరిగిందట. ఈ విప్లవంవల్ల ఎవరికి మేలు జరిగినా తెల్లని సీతాకోకచిలకలన్నీ పక్షులకు బలైపోయాయి. ఇక మిగిలినవి నల్లనివి మాత్రమే. తెల్లనివాటి స్థానంలో నల్లనివి ప్రత్యక్షం కావడం ఆనాటి శాస్త్రవేత్తలు కళ్ళారా చూసి పరిణామవాదాన్ని అర్థం చేసుకోగలిగారు. ఎటొచ్చీ ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఉండవచ్చని ఆధునిక పరిశీలకులంటున్నారుగాని డార్విన్ ప్రతిపాదనకు ఢోకా లేదు.
చెట్లమీద సీతాకోకచిలకలు

ఈనాటి అపోహలకు ఎన్నో రూపాలున్నాయి; వీటిలో కొన్ని జెనెటిక్ పరిశోధనలకు సంబంధించినవి. ఇందులో వ్యాపారదృష్టి లేకపోలేదుగాని సైన్సు విషయాలను కూడా గుర్తించాలి. మనిషి జంతువులని మచ్చిక చేసుకోవడమూ, వ్యవసాయమూ మొదలుపెట్టాక ప్రకృతిలో జోక్యం చేసుకోవడం మొదలయింది. ప్రకృతిలో పెరిగే ధాన్యాలూ, కాయగూరల్లో యాదృచ్ఛికంగా జన్యువుల్లో తలెత్తే మ్యుటేషన్లవల్ల చేదువీ, పనికిరానివీ, గిడసబారినవీ కూడా ఉంటాయి. అలా కాకుండా మనుషులు ప్రకృతికి విరుద్ధమైన పనులు ఏనాడో మొదలుపెట్టారు. ఈనాడు క్లోనింగ్, జన్యుపరంగా ఆహార పదార్థాల్లో మార్పులు వగైరాల గురించి ఆందోళన పడి హడావిడి చేస్తున్నవారు ఈ విషయాలు మరవరాదు. మొదట కుక్కలనూ, తరవాత మేకలూ, పశువులనూ మచ్చిక చేసుకున్న ఆది మానవులు వాటిలో మంచివీ, సౌమ్యంగా ఉండే జాతులను ఎంచుకున్నారు. పొగరుబోతులనూ, “తిరుగుబాటు” లక్షణాలనూ కలిగినవాటినీ చంపేస్తూ వచ్చారు. మిగిలినవాటి సంతతికి అవే లక్షణాలు వచ్చాయి. ఈ విధంగా మనుష్యులకు అనువైనవీ, పనికివచ్చేవీ మాత్రమే పెంపుడు జంతువు లయాయి. వ్యవసాయానికి ముందు ఏరుకుతినే దశలో మైదానాల్లో మొలిచే గింజలనే మనుష్యులు తిన్నారు. వ్యవసాయం మొదలయాక వాటిలో మంచివాటిని ఎంపికచేసి “నారు” పొయ్యడం ప్రారంభమైంది. ధాన్యాలేకాదు, కూరగాయలూ, తినడానికి పనికొచ్చే జంతువులూ అన్నీ ఎంపిక చెయ్యబడ్డాయి. దీనికీ, క్లోనింగ్‌కూ పెద్దగా తేడా లేదనుకోవాలి. ఈ ఉదాహరణలన్నీ ప్రకృతిలో జరిగే పోటీలకు మనుష్యులు అడ్డుపడిన సంఘటనలే.
ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమైనా ప్రాణుల శారీరక లక్షణాలు ఇటువంటి పోటీ తత్వం వల్లనే మార్పులు చెందుతూ వచ్చాయి. వీటికి మూలకారణాలు బాహ్యపరిస్థితులే. కొన్ని వేల సంవత్సరాల కొకసారి వచ్చే హిమయుగాలూ, అకస్మాత్తుగా ఎగిసిపడే అగ్నిపర్వతాలూ స్థానికంగా ఎంతో ఉత్పాతాన్ని కలిగించాయి. ఉష్ణోగ్రతలోనూ, తేమలోనూ కొద్దిపాటి మార్పులు జరిగినా తట్టుకోలేని చిన్న జీవాలూ, క్రిమికీటకాలూ ఎన్నో. వాటిని తింటూనో, వాటిమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధారపడే పెద్ద జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఎల్లప్పుడూ ఉండేది. ప్రకృతితోనూ, ఇతర ప్రాణులతోనూ ఎప్పటికప్పుడు పోటీ పడుతూ తట్టుకోవడానికి అనుగుణమైన లక్షణాలున్న జీవాలు బతికాయి. ఇది చెట్ల విషయంలోనూ కనబడుతుంది. పెద్ద చెట్టు ఏ తుఫానువల్లనో పడిపోయాక దాని నీడలో ఇంతకాలమూ ఎదగలేని గడ్డీ, పిచ్చి మొక్కలూ ఎండ తగిలి ఏపుగా పెరుగుతాయి. మొక్కలు మనిషితోనూ పోటీపడగలవు. వాడకుండా పాడుపెట్టేసిన ఇళ్ళలోకి మొక్కలూ, తీగలూ పెరిగి అల్లుకోవడం మనకు తెలిసినదే.
ప్రాచీనయుగంలో భూమిమీద ప్రాణులు ఎలాంటి పరిణామాలకు లోనయాయి? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. ఉన్నదల్లా శిలాజాల సాక్ష్యమే. ఉదాహరణకు మొప్పలున్న చేపల గురించి బోలెడు సమాచారముంది. అలాగే కాళ్ళున్న తొండలవంటి ఉభయచరాల గురించీ తెలిసింది. మరి బురద నీరు ఎండిపోవడంతో తప్పనిసరి అయి నేలమీద అడుగు పెట్టిన మొదటి కాళ్ళున్న చేప మాట ఏమిటి? అరుదైన దాని శిలాజం ఈ మధ్యనే దొరికిందట. ఈ దశ త్వరలోనే పూర్తయి ఉండాలి. అందుకనే అలాంటి జీవాల సాక్ష్యాలు దొరకటంలేదు. జలప్రపంచంలో చాలా కాలం “రాజ్యం” చేసిన జీవరాశి ఒకసారి నేల మీద కాలు మోపగానే మొప్పల స్థానంలో గాలిని పీల్చగలిగిన ఊపిరితిత్తులు సంపాదించుకుని వృద్ధి చెంది ఉంటుంది. ఆ ప్రస్థానానికి ఇక తిరుగులేదు. నీటి ఎద్దడి లేని ప్రాంతాల్లో జలచరాలు కొనసాగాయి, అభివృద్ధి కూడా చెందాయి.
రకరకాల ప్రాంతాల్లో జరిగిన మార్పుల కారణంగా జంతుప్రపంచంలో వైవిధ్యం పెరిగింది; అంతే. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎన్ని వింత ఆకారాలతో, ఎన్ని రంగులతో ఎటువంటి ప్రాణి (లేదా దాని అవశేషాలు) కనిపించినా శాస్త్రవేత్తలు దాని పుట్టు పూర్వోత్తరాలనూ, జన్యుస్థాయి దగ్గర్నుంచీ దాని శరీరనిర్మాణాన్నీ వివరించగలిగిన పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఎక్కువమంది ‘ఏ పుట్టలో ఏ పాముందో’ అనే పద్ధతిలో అలోచిస్తూ, మహిమల కోసం వెతుకుతూ ఉంటారు. వింత ప్రాణులనో, తలవని తలంపుగా ప్రకృతిలో తలెత్తి, మనకు పరిచితమైన సంకేతాలుగా అనిపించే విశేషాలనో చూసి ఉలిక్కిపడడం, నోరు వెళ్ళబెట్టి భగవంతుడి లీలలను గురించి అలోచించడం ఆధునికులు చెయ్యదగిన పనులు కావు.
మహిమలకు కొదవ లేదు. తాజా వార్తలో “గుడ్డు” గణేశుడు!
http://eenadu.net/story.asp?qry1=15&reccount=28
రోహిణీ ప్రసాదు గారి నిర్విరామ కలానికి అభినందనలు. మీ వ్యాసం ప్రాణహితలో
http://www.pranahita.org/2007/10/sukhsma_jeevulu_2/ కూడా చూసి ఆనందం కలిగింది.
అన్నీ ఛాందసభావాలుగా కొట్టి పడేసినా తెలిసిన వారు ఆ భావాలకు పునాది చేసి,ఆ భావ జాల మనే చెట్టుని అందులో పాతి కనులను నమ్మేలా చేయుటకు ఒక కారణము వుంది. ఆ విధముగా నైనా జనం ఒక చోటి నించి మరో చోటుకు పయనించి శారీరిక ధృఢత్వాన్ని పొందుతారు. ఎక్కడో అమర్ నాధ్ లో నున్న శివలింగం చూచేటందుకు ప్రయాస పడి ప్ర యాణం చేసి వెడితే,కొంత కాలం వాతావరణ మార్పూ,గృహంలో వుండే లక లుకలకు దూరంగా ఉండుట వల్ల మానసిక ప్రశాంతత చిక్కుతుంది.పైగా,తిండి,నీరు , గాలి మార్పుల వల్ల ఏవేని అనారోగ్యాలూ రుగ్మతలూ వుంటే అవి నయం అవుతాయి.అందువలననే పాపాలు పోయేటందుకు,తీర్థ క్షేత్రాలు దర్శించుకు రమ్మంటారు. ఇన్ని మంచి చేసే ఆ మూఢ నమ్మిక వల్ల కలిగే నష్టము
ఏమీ వుండదు.పైగా ఆవ్యక్తికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది.దానివల్ల ఒకే చోట డబ్బు నిలువ ఉండదు. అందరి దగ్గరా తిరుగుతుంది.ఈ ఉద్దేశ్యం తోనే దేవుని నమ్మించి మనవారు కొలవమంటారు. అందులో భాగమే,కోడి గుడ్డులో నూ,పాల గిన్నెలోనూ దేవుని చూపించడము.నిజానికి అవి అసత్యాలే అవుగాక-కొన్ని అవసర అసత్యాలు చెప్పి మనుష్యులని ఋజు వర్తనులను చేయ వలసిన బాధ్యత చదువుకున్న వారి మీద ఉంది.ఇటువంటి వాటి పై మరికొందరు విద్యాథికులు మరికొంత సైన్సు జోడించి వారు చెప్పే దేవుడు ఉన్నట్టు చూపుతారు.ఇది నిజానికి జనులలో భయం భక్తీ,పెంపోదించేటందుకే నని నా అభిప్రాయం.ఒకే సత్యాన్ని విద్యాథికులకు ఒక రకంగానూ,చదువు తక్కువున్న వారికి మరో విధంగానూ చెప్పక తప్పదనుకుంటాను.మూర్ఖులకైతే వారి మనసులకు రంజిల్లే విధంగా,తీయగా చెప్పటం లౌక్యం,దీనిలో దిట్టలైతే,నిష్ఠురమైన నిజాలని కూడా తప్పనీ-ఒప్పనీ వాదించి గెలువ వచ్చు.భవంతిలో కూచుని ఆలోచనా ప్రపంచంలో నున్న వానికి అదే గొప్ప.లేమిలో వున్న వానికి పూరిగుడిసెలో కూచుని ఆకాశం కేసి చూస్తూ నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ కాలంగడపడం ఆనందం. ఎవరి ఆలోచనలు వారివి.ఎవరి ఆనందం వారిది.ఒకరి ఆనందాలనీ నమ్మికలనీ మనం తప్పు పట్టకూడదు.దేవుడు లేకపోవుగాక! కాని ఉన్నాడని ఊరట చెందేవాని ఊరటని మనం భగ్నం చెయ్యకూడదు.మీ వ్యాసం చాలా బాగుంది.అన్నీ సత్యాలే అయివుండ వచ్చు(కాకపోవచ్చు కూడా) వైజ్ఞానికుల కీ విద్యార్థులకీ మీ ఈ రచన తప్పక అవసరం.
రాంరళి. READ my article my opinion on Hinduism in my blog uk.
ఇక్కడ పెద్దగా చర్చకు దిగదలుచుకోలేదు. మరొక సందర్భంలో నేను రాసిన ఈ వ్యాఖ్య నా అభిప్రాయాన్ని వివరిస్తుంది.
చదువుకున్నవారు పెద్ద ఎత్తున పబ్లిక్ గా జరిపే పూజల్లో, “ఆధ్యాత్మిక” తంతుల్లో పాల్గొంటున్నప్పుడు చదువురానివారికీ, వెనకబడినవారికీ ఎటువంటి మెసేజ్ వెళుతోందో ఎవరూ గమనించరు. అంధవిశ్వాసాలు పెద్దపెట్టున నిలదొక్కుకోవటానికి ఇలాంటివి దోహదపడతాయి. వాటి వికృతరూపం చేతబడి, బాణామతి పేర్లతో కుగ్రామాల్లో ఏ ముసలమ్మనో చంపినప్పుడు బైట పడుతుంది. “విద్యాధికులు” ఆ వార్తలను చదివి, ముఖం చిట్లించి, పేజీ తిప్పేస్తారు. అందులో తమ బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచించరు.