కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,రచయిత్రి. 1980 దశకంలో తెలుగు సాహిత్యంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చి చేరిన స్త్రీవాదం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి,స్త్రీవాద స్పృహ తో, స్త్రీల దృష్టి కోణంతో కవిత్వం రాసిన వారిలో కొండేపూడి నిర్మలను ప్రముఖంగా పేర్కొనాలి. ముఖ్యంగా నిర్మల రాసిన “లేబర్రూం” కవిత పురుష విమర్శకులకు దిమ్మ తిరిగేలా చేసింది. ప్రసవసమయంలో స్త్రీ పడే వేదనని “రైలు పట్టాలమీద నాణెం విస్తరించిననంత బాధ” అంటుంది. నిర్మల తెలుగు సాహిత్యంలో స్త్రీవాద గొంతును బలంగా,తీవ్రంగా,సూటిగా వినిపించడంలో అగ్రభాగాన ఉన్నదనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.

నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక కవయిత్రిగా స్పందించి, స్పష్టమైన భావాలతో, సరళమైన భాషలో, భావోద్వేగం తో కవిత్వం రాస్తారు, కొండేపూడి నిర్మల. జనం మాటలలో, స్వచ్ఛమైన తెలంగాణ పల్లె మాండలికం లో కవిత్వాన్ని అల్లుతారు. “ఎన్ని మందుల సల్లినా సేను కొరికే పురుగు బతుకుతాంది, ఎన్ని ఎలచ్చన్లు మారినా దేశం కొరికే సర్కారు బతుకుతాంది” అని ధిక్కారంగా, ధైర్యంగా కఠిన వాస్తవాలను చెబుతారు.ఇప్పటిదాకా సంధిగ్ధ సంధ్య (1988), నడిచే గాయాలు (1989), బాధ సెప్త నాది (1994) , మల్టీనేషనల్ ముద్దు (2001) అనే కవితా సంకలనాలు మరియి శతృ స్పర్శ (1998) అనే కధా సంకలనం రాసారు.
కుటుంబ జీవనం-
మూడూ సాదా సీదా విషయాలే. సాధారణ మధ్యతరగతిలో పుట్టాను. అమ్మానాన్నా, అయిదుగురు పిల్లలం, మేనత్తలు, బాబాయిలు, బామ్మ, తాత లాంటి ఒక ఉమ్మడి కుటుంబంలో నా బాల్యం గడిచింది. డిగ్రీ వరకూ విజయవాడలో చదువుకుని జర్నలిజం అంటే వున్న ఆసక్తి వల్ల ఆంధ్రజ్యోతి లో చేరాను. చేరిన ఏడాది గడిచే లోగా పెళ్ళీ పిల్లలూ లాంటి కుటుంబ బంధాలలో చిక్కుకున్నాను. దాదాపు కరీంనగర్ లోని ప్రతి గ్రామాన్ని చూశాను. పది సంవత్సరాల పాటు ఒక స్పందించే మనిషిగా అక్కడి గ్రామీణ పేదరికం, వెట్టి చాకిరి, మూఢాచారాల మధ్య నలుగుతున్న స్త్రీలను చూశాను.
ప్రభావితం చేసిన విషయాలు, ఇంతవరకూ చేసిన రచనలు;
బాగా చిన్నప్పటినుంచీ కధలంటే ఇష్టం.చేతికి దొరికిన ప్రతి పత్రికా చదివేదాన్ని. ఆ పాత్రల్లాంటి మనుషులు నా చుట్టూ ఎవరెవరు వున్నారో కనిపెట్టడం చాలా సరదాగా వుండేది. రచయిత/రచయిత్రి రాసిన ముగింపు మార్చి నేను ఇంకోలా రాయడం, ఎత్తుగడ ఇంకోలా వుంటే ఎలా వుంటుందా అని ఆలోచించడం నాలో జరుగుతూ వుండేవి. అశోకుడు కళింగ యుద్ధానికి బయలు దేరి దారి మధ్యలో గాఢమైన ప్రేమలో పడితే ఎంత బావుంటుందో ఊహిస్తూ పరీక్షల్లో జవాబు రాస్తే మార్కులు సున్నాలు వచ్చినా గాని తోటి వాళ్ళ ముందు చాలా గొప్పగా వుండేది. అందరికంటే భిన్నంగా నా పైత్యం, తాపత్రయం తరవాత రచనలకు కొంచెం పనికొచ్చి వుండచ్చు. ఇప్పటివరకూ నాలుగు కవితా సంకలనాలు, ( సంధిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధ సెప్త నాది, మల్టీ నేషనల్ ముద్దు), ఒక కధా సంకలనం ( శత్రు స్పర్శ ) ప్రచురించాను. ఉద్యోగరీత్యా అనేక వ్యాసాలు, కాలమ్స్ అచ్చయ్యాయి.
రచనలు చేయడం అభిరుచా? జీవన విధానమా? భావోద్వేగమా?
ఈ మూడూ ఒకదానికొకటి కొనసాగింపు అవుతుంది. రచన చేయకుండా వుండలేను. ఎందుకంటే అది జీవితం గా మారిపోయింది. అప్పుడప్పుడు నా అంతట నేనే నిశ్శబ్దం గానో, భావ రహితంగానో వుండచ్చు. ఆ దశలో చాలా హింస పడతాను. ఎందుకంటే రచన చేయడం సామాజిక బాధ్యత అని నమ్ముతాను. ప్రారంభంలో అందరిలానే ఇది మాట్లాడటం కంటే ఎక్కువగా దూరానికి తీసుకెళ్ళ గల వ్యక్తీకరణ కు మార్గం అనుకున్నాను. రాస్తున్న సమస్యను బట్టీ దాంతో మనం మమేకం అయిన తీరుని బట్టీ కొన్నిసార్లు ఉద్వేగపడటం, కొన్ని సార్లు గంభీరంగా వుండటం జరుగుతుంది. ఉద్వేగం వుంది కాబట్టీ రచన చెయ్యలేం.
కవితా వస్తువు,శిల్పాల వెనక వుండే ఆలోచనా స్రవంతి;
ఎక్కువగా స్త్రీల సమస్యల మీద స్పందించి రాసిన మాట నిజమే. అది నా అస్తిత్వం. పురుషుల వైపునుంచి రాసినవి లేకపోలేదు. ఇల్లు మారినప్పుడు, వచ్చీరాని వయసు. ద్రౌపది నవ్వు (కధ) లాంటి కవితలు వున్నాయి. అప్పుడది సహానుభూతి మాత్రమే అయిందేమో తెలీదు. అందులో నిర్మల కనిపించలేక పోయింది.
అయినా ప్రపంచం నిండా కిటకిట లాడే పురుషుల ఆలోచనలు ,కోరికలు, ఆశలు, నోములు నోచి మరీ దక్కించుకోవాల్సిన సుఖశాంతులు, విలువలు, నమ్మకాలు, సామాజిక అంశాలు, వీరచరిత్రలు,సాంకేతిక అంశాలే వున్నాయి. చివరకు దేశభక్తి గీతంలోనూ అవే అవే వుంటాయి. మరి అతడు కాని ప్రాణి ఒకరున్నారు. ఆమె స్త్రీ ఒకరి నీడ గానో ,గోడా గానో , సగము గానో పావు గానో బతుకుతున్న స్త్రీ. సహజం గానే నేనయినా ఇంకొకరయినా ఆ వస్తువును తీసుకోవాలి. ఆమె ప్రమేయం లేని సమసమాజ స్థాపన లోనూ నాగరికతలోనూ మనం అంతా వున్నాం. ఇందుకు భిన్నంగా రాయాలను కున్నాను.రాస్తున్నాను.
ప్రపంచీకరణ, అస్థిత్వ ఉద్యమాల నేపధ్యం లో కవిత్వ పరిణామం ,వస్తువు, శిల్పం లో మార్పులు;
ప్రపంచీకరణ ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినది. వాణిజ్యరంగంలో చాలా మార్పులు వచ్చాయి. మనది కాని, అవసరం లేని వస్తువు,సంస్కృతి,విలువలు,రాజకీయాలలో చోటు చేసుకున్నాయి. ఇవాళ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కంపెనీలు ప్రజల్ని నడిపిస్తున్నాయి. కొన్ని వ్యాపారసంస్థలు, గూండా మనుషులు కవిత్వాన్ని పోషిస్తునాయి. ‘సింకింగు’ అనే కవితలో నేను రాసినట్టు జానపద కళలన్నీ వస్తువుల్ని అమ్మి పెట్టే సాధనాలయ్యాయి. మనిషి, అతని స్పర్శ,చెమట,సంతోషం, చివరికి శృంగారానికి కూడా వస్తు ప్రేరకాలు కావ్య శృంగారం వస్తువు కింద పడి నలిగి పోతున్నాయి.
అస్థిత్వ ఉద్యమాలు వేరు. అవి సహజ పరిణామంలో వచ్చాయి. స్త్రీలు,దళితులు,మైనారిటీలు,బహు జనులయినా వారి సమస్యల మీద మాట్లాడతారు. చరిత్ర లో జరిగిన జరుగుతున్న అన్యాయానికి బదులు అడుగుతారు. ఇవాళ వాకపల్లి గిరిజన మహిళల గురించి వేదిక మీదికి వచ్చిందంటే అది అస్థిత్వ ఉద్యమాల ఫలితమే. ఉద్యమం ఏదయినా కొత్త వెలుగుకి చోటిస్తుంది. ప్రపంచీకరణ మూలంగానే అస్థిత్వ ఉద్యమాలు దెబ్బ తింటున్నాయి. వస్తువులోనూ శిల్పం లోనూ ఎన్నదగిన మార్పు వచ్చింది. అది సాహిత్యంలోనూ ,కళా రూపాల్లో నూ కనిపిస్తోంది. అయితే అమ్మబలుకు సాహిత్యం బాగా పుట్టింది. సాధారణ పత్రికలలో అచ్చవడానికి కూడా పనికి రాని కవిత్వం, కధ తెలుగు సాహిత్యం పేరుతో దేశ దేశాలకు పోతోంది.
భావ కవిత్వం గురించి సరిగా అంచనా వెయ్యలేదని అంటున్నారు….;
నా దృస్టిలో భావ కవిత్వానికి వచ్చినంత ప్రచారం మరి దేనికీ రాలేదు.
విప్లవ కవిత్వ పరిణామం;
విప్లవ కవిత్వం తనవంతు పాత్ర అది పోషిస్తోంది. అభ్యంతరకర పరిణామం ఏదీ కనిపించలేదు. మిగిలిన అన్నింటా వున్నటువంటి ఆధిపత్య సంగ్రహణలు, చీలికలూ వుంటే వుండచ్చు. వ్యక్తులు స్వతంత్రమవుతున్నకొద్దీ, కార్యాచరణ లో మార్పు కనిపిస్తుంది. మార్పు సహజమే కూడా కదా.
కవిత్వం లో శిల్పం బలహీనంగా వుందనే వెల్చేరు గారి అభిప్రాయంపై….వ్యాఖ్య;
ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని నా లాంటి కవిత్వాభిమానులే పూర్తి స్థాయిలో సేకరించి చదవలేక పోతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చి, వెళ్ళే వెల్చేరు నారాయణ గారికి ఏది దొరుకుతుంది. తను చదివిన,ఎవరైనా చదివించిన కవిత్వమే సమగ్ర రూపం కాకపోవచ్చు. వ్యక్తి అభిప్రాయాల్ని బట్టి చరిత్రని నిర్ణయించడం మానుకుంటే మంచిది.
రాజకీయ కవి కాని వాడు లేడు అంటున్నారు, దీన్ని ప్రాచీన కవుల దృక్పధం నుండి వివరిస్తారా?
ప్రాచీన కవులు రాజ పోషకులు. అంటే ఇప్పటి ప్రభుత్వ కవులు లాంటి వారు. మనం రేడియో లోనూ, టి.వీ.లోనూ ప్రభుత్వాల గురించి లోపాల్ని గురించి రాయలేనట్టే ,వాల్ల బాధలు వాళ్ల కుండేవి. అయినా పరోక్షంగా రాసినవి వుండేవి. పోతన,వేమనలాంటి వాళ్ళ పద్యాలు చదివితే అప్పటి రాజకీయమే కాదు. అన్ని కాలాలనీ ప్రతిబింబించే వాక్యాలు, విమర్శలు కనిపిస్తాయి.
కవులు ఒక పంధాను అనుసరించి కవిత్వం రాస్తున్నారు. స్త్రీవాద కవులు స్త్రీవాద కవిత్వాన్ని,దళిత కవులు దళితవాద కవిత్వాన్ని రాస్తున్నారు, మంచిదే. కాని మరి విసృత దృక్పధంతో ఇతర కోణాల్లో కవిత్వం రాయడం అవసరమ కాదంటారా?
ఏ వాదమూ లేనిది, ఏ గొంతుకూ ప్రాతినిధ్యము లేనిది ప్రధాన స్రవంతి కవిత్వమని మనం నమ్ముకున్నాం. స్త్రీలు,దళితులు,మైనారిటీలు గొంతు విప్పాక అనేక కొత్త వెలుగులు మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తున్నాయి. అస్థిత్వవాద ఉద్యమాలు కవిత్వానికి ఒక మంచి కూర్పు అవుతాయే తప్ప, చీలిక కాదు, పక్కదారి అంత కంటే కాదు. ఇంకా చాలా రావాల్సి వుంది. భవిష్యత్తు మీద నాకు చాలా ఆశలున్నాయి. ఇతర సామాజిక కోణాల్లో వాళ్ళే రాయగలరు. రాస్తున్నారు కూడా.
తెలుగు కవిత్వంలో విప్లవ రచయితల సంఘం పాత్రను ఎలా అంచనా వేస్తారు? ఇంకా ఎలాంటి మార్పులు ఆశిస్తున్నారు?
తెలుగు కవిత్వంలో విరసం పాత్ర చాలా వుంది. సాహిత్యం కార్యాచరణ సంబంధాలకి దారి చూపింది. అక్షరం కార్యకర్త అయింది. పాట ప్రభుత్వంతో మాట్లాడింది. సాహిత్యం సామాజిక ప్రయోజనానికే అన్న మాట అక్షరాలా నిరూపితమయింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మార్పు ఏదయినా వుంటే దాన్ని గురించి మాట్లాడే బాధ్యత అందులో వున్న వారే చెబితే బావుంటుంది. గట్టున కూర్చుని వ్యాఖ్యానించడం పట్ల నాకు సదాభిప్రాయం లేదు.
సాహిత్య రంగంలో ఏర్పడిన సంస్కృతీకరణనూ,బ్రాహ్మణ భావ జాలాన్నీకవిత్వం ఎలా ఎదుర్కొంది?ఉత్పత్తిలో భాగమైన శ్రమ జీవుల జీవన గాధలను సరిగ్గా చిత్రించగలిగిందా?
కవిత్వం చేసిన మొదటి పని అదే. ప్రధాన స్రవంతి కవిత్వం లో కనిపించే అలక్షణాలని అస్థిత్వవాద కవిత్వం బాగానే తిప్పి కొట్టింది. రాయలసీమ, తెలంగాణా కధ, కవిత్వం శ్రమజీవుల్ని గురించి మాట్లాడింది.
అమెరికాలోని బీట పొయిట్రీలో గాని,ఇతర ఇంగ్లీషు పొయెట్రీలో గాని బజారుభాష (స్ట్రీటు పొయెట్రీ) పదాలు బాగావాడారు,. ఆసంస్కృతిలో అదో భాగమై పోయింది? తెలుగు లో అలాంటి ప్రయోగాలు చెయ్యాలన్నా భయపడతారు….
తెలుగు లో దళితులు గాని అంతకు ముందు, దిగంబరులు ఆ ప్రయోగం బాగానే చేశారు కదా. సహజంగా ప్రయోగాలకు వుండే మిశ్రమ స్పందన దానికీ వుంది.
యువ ప్రాయంలో రక్తం మరిగిన కాలానికీ ,ఇప్పటి కవిత్వానికి తేడా ఏమిటి?
కవిత్వంలో అయినా జీవితంలో అయినా ప్రవాహ వేగం యువ ప్రాయంలో ఎక్కువగా వుంటుంది. తరవాత బాలన్సు మొదలవుతుంది. ఆలోచన, వివేచన మొదలవుతుంది. అప్పుడు మరింత సమర్ధవంతమయిన కవిత్వం వస్తుంది.
రైతుల ఆత్మహత్యలతో పల్లెలు వల్లకాడవుతున్నాయి. ఒక కవిగా మీరు ఎలా స్పందిస్తారు.
రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడమే కాదు. అలా చేసుకోవడం కూడా నష్ట పరిహారాల కోసమని స్వయంగా మన ముఖ్యమంత్రే అనడం హేయం. అప్పుడు నేను ఒక పత్రికలో జర్నలిస్టుగా కొందర్ని ఇంటర్వూ చేసి రాసిన కవిత “కాటిసుంకం”…
సంపేటోడికి సచ్చేటోడు లోకువ గద అన్నా!
వాడట్టనే గొనుగుతడు
నేతలంటే గొడలెనక కుర్సీలెనక దాగేటోడని మాకానాడే తలవ వట్టె
సత్తాలేని సర్కారోడికి మాలాంటి సన్నాసోడే లోకువ గద అన్నా!
మా అడవులల్ల కట్టె మాది కాకపొయ్యె
మా వాగులల్ల ఇసక మాది కాక పొయ్యె
మా మార్కెట్టుల సరుకు మాది కాక పొయ్యె
సేనుల్ల పురుగు పాకి బతుకులల్ల పురుగు మందు పాకి, మడిసి మడిసెక్కా ఒక్క తీరున సచ్చిపోతే ,
కన్నోల్లకీ కట్టుకున్న దానికీ కడుపు సెరువైన గోస గా దళారొడు ఎంగిలి సేసిన కాటిసుంకంతో తీరుద్దా?
ఎన్ని మందుల సల్లినా సేను కొరికే పురుగు బతుకుతాంది,
ఎన్ని ఎలచ్చన్లు మారినా దేశం కొరికే సర్కారు బతుకుతాంది.”
ఈ కవిత హిందీలోకి కూడా అనువదించారు.
తస్లీమా, హుస్సేను మీద జరిగిన దాడులు..
మనిషైన ప్రతివాడు ఖండించాల్సిన దాడులు అవి. భావ వ్యక్తీకరణను హింసించడమంటే మనది ప్రజాస్వామిక ప్రభుత్వమేనా అనే అనుమానం రావాలి. నాకు అక్షరాల్లో ఇమడనంత కోపం వచ్చింది.
తెలుగు నేల మీద మాట్లాడుతున్న మాండలీకాలు కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
మాండలీకాలకు సాహిత్యంలో పాత్ర వుండాలని పెద్ద ఉద్యమాలే జరుగుతున్నాయి.ఇంకా జరగాలి.అందరిదీ తెలుగు భాషే అయితే అందరి భౌగోళిక వాస్తవాలను, ప్రాంతీయతలో ఇమిడిన సంపదని అందరు చదవాలి. కవిత్వం మీద మాండలీకాల ప్రభావం చాలా వుంది.
తెలుగు కవయిత్రుల కవిత్వాన్ని చారిత్రాత్మకంగా ఎలా అంచనా వేస్తారు?
కవయిత్రుల కవిత్వం కొత్తగా ప్రారంభం కాలేదు. ప్రధాన స్రవంతిలోనూ వుంది. అయితే 1770 ల నుంచీ సూచన పరంగాను 1985 నుంచీ సంఖ్యా పరంగానూ బాగా పెరిగింది. స్త్రీల సమస్యలను వేరుగా చూడటం వల్లను, కవిత్వం అంచనా వేసే పడికట్టు రాళ్ళు మారక పోవడం వల్ల ఈ ఆలస్యం జరిగింది.
తెలుగు లో వచ్చిన స్త్రీవాద సాహిత్యం సగటు మహిళ పైన పెద్దగా ప్రభావం చూపించలేదు. సమాచార సాంకేతికరంగం అభివృద్ధి వల్ల మధ్యతరగతి మహిళలు ఆర్ధిక స్వతంత్రం పొందినట్టు కనిపిస్తోంది. అంతిమంగా మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్నది ఆర్ధిక పరిస్థితి యే కానీ సాహిత్యం కాదు. ఇలాంటి అంచనా సమంజసమంటారా?
సాంస్కృతిక ఉద్యమాల్లో ఫలితాలు వెంటనే కంటికి కనిపించవు. సబ్బులాగా,టీ పౌడరు ప్రకటన లాగా తక్షణం ముందడుగు వేయించడం ఎంత కష్టమో మీకు చెప్పనక్కరలేదు. అయినా మిగిలిన ఉద్యమాలతో పోల్చితే ఫెమినిస్టు/ స్త్రీవాద ఉద్యమం చూపిన విజయాలు చాలా వున్నాయి. సాహిత్యంలో భాష శుభ్ర పడింది. భాష కొక దృక్పధం వుంటుందని తెలిసింది. కొత్త వస్తువులతో, సమస్యల వ్యక్తీకరణతో సాహిత్యానికి కొత్త చూపు వచ్చింది.
మధ్యతరగతి మహిళకి / గ్రామీణ మహిళకి ఇవాళ జెండరు ఒక సిలబసుగా చదువుకుంటోంది. ఇంటికి దీపం ఇల్లాలు లాంటి వాక్యాలు ఇవాళ ఎవరూ నమ్మరు. అయితే నేరాలు పెరగలేదా, బాధితులు లేరా? బాల్య వివాహాలు లేవా? అంటే వున్నాయి. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ సేవలు ఉపయోగించుకునేలా చెయ్యడానికి కూడా స్త్రీవాదం అవసరమవుతుంది. సమానత్వ భావన స్త్రీవాదమ వల్లనే బలపడింది. స్త్రీవాద కవితలు కధలు ఇవాళ గ్రామీణ మహిళలు కేసుస్టడీలు గా చదువుకుంటున్నారు. పాటలుగా పాడుకుంటున్నారు.
స్త్రీవాదం అనే పేరుతో కాకపోయినా మహిళకు వ్యతిరేకంగా పైకి మాట్లాడ్డం నేరమనే స్పృహ ఒకటి వచ్చింది. దళితుల్ని ఆ పేరుతో తిట్టినందుకు కేసు పెట్టడమే ఒక ఉదాహరణ. తెలుగు లో స్త్రీవాదం వేసిన పునాది తర్వాత ఉద్యమాలకు పనికొచ్చింది.
పై ఇంటర్వ్యూలో రచయిత్రిని అడిగిన ప్రశ్నలను బోల్డ్ ఫాంట్లోకి మార్చండి. ప్రశ్న ఏమిటో, జవాబేమిటో తెలియక తికమకగా అనిపిస్తోంది. ప్రశ్న, జవాబు విడివిడిగా, స్పష్టంగా కనబడితే చదవడానికి వీలుగా ఉంటుంది.
[…] స్త్రీలు,దళితులు,మైనారిటీలు,బహుజనులు చరిత్రలో జరిగిన జరుగుతున్న అన్యాయానికి బదులు అడుగుతారు. - కొండేపూడి నిర్మల ఇంటర్వూ […]