జీవితం మిధ్య అనడం అబద్ధం
ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళ కప్పుల మీదా జంతు కళేబరాల మీదా
‘అలగాజనం’ పుళ్ళ మీదా పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిధ్య గూర్చి కావుకావుమంటూ ప్రవచించగలవు
మానవత్వం బతికి వుందనడం అబద్ధం
కప్పుకోవడానికి మేక చర్మాల కోసం తిరిగే
మెకాలు మాత్రమే నీతి వాక్యాలు వేదికల నుంచి
ఉపన్యసించగలవు
విశ్వశ్రేయం కావ్యం అని అరుస్తూ
ప్రబంధ నాయకి తొడల బంధనాల్లో
పాదాలకు పూసుకుని ఎగిరే లేపనాల్లో
అంటుకున్న కవిత్వం అబద్ధం
తపస్సు చెయ్యడానికి వెళ్ళవలసింది
హిమాలయాల్లోకి కాదు
జనం లోకి
పరిత్యజించవలసింది సంసారబంధం కాదు
స్వార్దాన్ని
ఓంకారం కాదు
ఆర్తనాదమే జీవికి అన్ని భాషల్లోనూ మిగిలే
అనివార్య అంతిమ శబ్దం
జీవితం సాంకేతికమై జ్ఞాననేత్రం తెరుస్తుందనడం
అబద్ధం
మనిషి శతాబ్దాలు గడిచేకొద్దీ నాగరీకుడవుతాడనడం
అబద్ధం
ఈ భూమిపై నిరంతరం జీవన ఘోషతో
రోడ్ల పక్కన పడి మూలుగుతూ దొర్లుతున్న
కొన వూపిరి నిజం
మృత్యువు నిజం.
మౌనాన్ని మిగిల్చి వెలిపోయిన శవం నిజం
దరిద్రం నిజం
దరిద్రం చిమ్మే చీకటి నిజం
సమస్త లోకాన్నీ బతికించే సంపద సృష్టించే వాడి రక్తం
విలువలేని ఖనిజం
జీవితం నాగలై
చర్మాన్ని దున్ని ముడతల చాళ్ళతో నింపుతుంది
అనుభవాల పంట బంగారం పండుతుంది
పండించిన వాడి నోటిలో మొలిచేది మాత్రం జిల్లేడు
కళ్ళలో కదిలేవి వెలుగు కిరణాలు కారు
కన్నీళ్ళు
అంతరిక్ష నౌక
చంద్రమండలం వేపు దూసుకు వెడుతుంది
దానిలోనే పొంచున్న ఓ దోమ శాస్త్రవిజ్ఞాన ప్రగతిని
పరిహసిస్తూ వ్యోమగానం చేస్తుంది.
2
కవిత్వం కాగితాలపై అక్షరాల్ని ఖననం చేసే
కాటికాపరి
కవి నుండి బయటపడ్డ ప్రతి అక్షరం
భావాన్ని భ్రూణహత్యచేసిమరీ
బయట పడుతుంది
కవిని హంతకుడిగా చిత్రిస్తుంది
అక్షరాల్ని నిత్యం శంకించి ఉపయోగించేవాడే
నిజమైన కవి
మనిషిలోని అన్ని అంగాలూ
జంతువులుగా మారడానికే
జీవితాంతం ప్రయత్నిస్తాయి
ప్రకృతిలోని అన్ని గ్రహాలూ
భూమిని ప్రభావితం చెయ్యడానికే
గిరగిరా తిరుగుతాయి
చివరకు మిగిలేది
గాయంగాని రక్తం మరకగాని కనబడని
హత్య మాత్రమే
………………
రచనా కాలం: నవంబరు 1977
ఇంతకీ ఇప్పుడీ కవిత వేయాల్సిన అవసరమేమిటో? అది కూడా పూర్తిగా వేయలేదు. అసలిది ఇంకా ఉందనే విషయం తెలుసా మీకు?