సంప్రదాయసిద్ధంగా వస్తున్న నాటకరంగ సూత్రాలకు విరుద్ధంగా తెలుగు నాటికలలో తిరుగుబాటు ధోరణులను ప్రవేశపెట్టిన తొలి తెలుగు రచయితలపై నార్వే దేశీయుడైన హెన్రిక్ ఇబ్సన్ (1828-1906) ప్రభావం చాలా ఉంది. నాటక సూత్రాలను ఎదిరించిన ప్రథముడుగా స్థానం సంపాదించుకొన్నాడు ఇబ్సన్. అతడు సృష్టించిన నాటకరంగాన్ని ‘థియేటర్ ఆఫ్ రివోల్ట్,’ అన్నారు విమర్శకులు.
రివోల్టు మూడు రకాలు అన్నాడు రాబర్ట్ బ్రాస్టన్- 1) మెస్సియానిక్, 2) సోషల్, 3) ఎగ్జిస్టెన్షియల్.
మెస్సియానిక్ రివోల్ట్: దేవుని మీద, మతం మీద తిరుగుబాటు. ఆధునిక రూపకాల ప్రారంభదశ ఇది.
సోషల్ రివోల్ట్: సంఘం మీద తిరుగుబాటుకు చెందిన రూపకాలు. ముఖ్యంగా సాంఘిక రూపకాలన్నమాట. ఎక్కువ ప్రసిద్ధి కెక్కినవి. సమకాలీన సంఘాన్ని చిత్రించటం, మధ్యతరగతికి చెందిన ప్రజలను పాత్రలుగా చేయటం వీటిలోని ప్రత్యేకత.
ఎగ్జిస్టెన్షియల్ రివోల్ట్: మొత్తం జీవితం మీదనే తిరుగుబాటు ఇది. మానవుని దర్భర జీవితాన్ని గురించిన ఆవేదన ఇందులో వ్యక్తమవుతుంది.
మొత్తం మీద మెస్సియానిక్ తిరుగుబాటు పాత్రలను మానవతీతులుగా చిత్రిస్తే, ఎగ్జిస్టెన్షియల్ తిరుగుబాటు పాత్రలను అథములుగా చిత్రిస్తుంది. అంటే మొదటిది మానవుని స్వేచ్ఛను అతిశయోక్తిగా చిత్రిస్తే, రెండవది మానవుని బానిస జీవితాన్ని స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు. ఈ రెండింటి మధ్యేమార్గం సోషియల్ తిరుగుబాటు. ఇందులో పాత్రల స్వభావాదులను యథాతథంగా చిత్రించటానికి ప్రయత్నం జరుగుతుంది.
ఇబ్సన్ ప్రసిద్ధికి రూపక నిర్మాణ శిల్పంలో అతడు సాధించిన విశిష్టత కంటే అతడు చేపట్టిన సాంఘిక సమస్యల విశిష్టత ప్రధాన హేతువు. అతనికి నీతి నియమాల మీద చాలా ఆసక్తి ఉంది. సమకాలీన సంఘాన్ని ప్రభావితం చేస్తున్న దుష్ట / శిష్ట సంప్రదాయాలను, ఆచారాలను నిశితంగా పరిశీలించాడు. వాటిని తన రూపకాలకు చైతన్యవంతమైన ఇతివృత్తాలుగా మలచుకొన్నాడు. ప్రేక్షఖులలో మార్పు తీసుకొని రావాలన్న ప్రయత్నం కంటే, వారిలో ఆలోచనలను రేకెత్తించాలన్నదే అతని లక్ష్యంగా కనిపిస్తుంది. డాంబికత్వం మీది జుగుప్స, వీటన్నిటితోపాటు కవిత్వప్రాయమైన శైలి- ఇవి ఇబ్సన్‌లోని విశిష్ట గుణాలు. దేశ బహిష్కరణ పొంది రోమ్‌లోను, జర్మనీలోను ప్రవాసం కూడా చేశాడు.
1850లో రచించిన తొలి రూపకం కాటలీనా నుంచి వరుసగా అనేక రూపకాలు రచించాడు. 1) లేడీ ఇంగెర్ ఆఫ్ ఆస్ట్రెట్, 2) ది ప్రిటెండర్స్, 3) లవ్స్ కామెడీ, 4) బ్రాండ్, 5) ది లీగ్ ఆఫ్ యూత్, 6) పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, 7) ఎ డాల్స్ హౌస్, 8) ఘోస్ట్స్, 9) ది వైల్డ్ డక్, 10) హెడ్డాగేబ్లర్, 11) వెన్ వియ్ డెడ్ అవేకెన్.
వీటిలో- క్రమక్రమంగా రచనలో జిగి, విరుద్ధ స్వభావాలు గల పాత్రల శీలచిత్రణ, వ్యక్తికి సంఘ వ్యవస్థకు మధ్య పోరాటం, రాజకీయ విమర్శ, వ్యక్తుల సంక్లిష్ట స్వభావాలు- మనోవిశ్లేషణ, వాటి పర్యవసానాలు- నిశితంగా రూపొందాయి. (అయినప్పటికీ, ఇబ్సన్ తన చివరిదశలో జీవిత పరమావధి ఏమిటి అన్న మీమాంసలో పడినట్లు విమర్శకులు భావించారు.)
ప్రపంచ సాహిత్యాన్న పరిశీలించిన కొందరు తెలుగు యువ రచయితలపై ఇబ్సన్ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఇబ్సన్,బ ఎర్నార్డ్ షా, ఆస్కార్‌వైల్డ్ మొదలైన నాటకకర్తల ప్రభావం గురించి చెబుతూ గోపీచంద్‌గారు, “ఆ నాటకకర్తలతో ఏదో ఒక విధంగా సన్నిహితత్వం ప్రదర్శించుకోవటం ఆనాడు ఫ్యాషన్‌గా ఉండేది… ఆ రోజుల్లో మాకు వ్యాస వాల్మీకి, కాళిదాసాదుల వంటి సంస్కృత కవులుగానీ, రవీంద్రుని వంటి ఆధునికులుగానీ ఏమాత్రం నచ్చేవారుకాదు. ఎవ్వరైనా షేక్స్‌పియర్‌తోపాటు కాళిదాసుని చేర్చినా, బెర్నార్డ్‌షాతో పాటు రవీంద్రుని కలిపినా మాకు హాస్యాస్పదంగా ఉండేది… పాత సంప్రదాయాల మీద నమ్మకాలు చెడిన రోజులవి. అప్పుడు ఆ నమ్మకాలను అపహాస్యం చేసి, కవ్వించి నవ్వించే రచయితలు మనస్సులను వశం చేసుకోగలగటం సహజం. పైగా బొమ్మకు ఒకవైపే ఉంటుందనుకొనే రోజుల్లో, అకస్మాత్తుగా దాని రెండవవైపుని చూపినపుడు, ఆ చూపినవారి ప్రజ్ఞను కొనియాడబుద్ధి అవటం కూడా సహజమే. వారి ప్రతిభను చూచి ఆ విధంగానే చకితులం అయ్యాం, భ్రమించాం అని ఇటీవల అనిపిస్తూ ఉంది, ‘’ అన్నారు, తత్త్వమసి నాటికల సంపుటి పరిచయంలో.
1927లో పొణకా పిచ్చిరెడ్డిగారు, ది బ్రాండ్ అనే ఇబ్సన్ రూపకాన్ని భీష్ముడు అను పేర ఇంచుమించుగా వచనంలోకి అనువదించి ప్రకటించారు. బహుశా ఇదే మొదటి ఇబ్సన్ రూపకానువాదం కావచ్చు.
1928లో ఇబ్సన్ శతసంవత్సర జన్మదినోత్సవం ప్రపంచమంతటా జరుగగా- మద్రాసులో కూడా ఇబ్సన్ సొసైటీ ఒకటి వెలిసింది. ఆరోజులలో ఇబ్సన్ ప్రభావానికి గురైన మిత్రబృందం కూర్మ వేణుగోపాలస్వామిగారు, పి.వి. రాజమన్నారుగారు, పి.వి.రంగారామ్‌గారు, బళ్ళారి రాఘవాచార్యులుగారు- నాటకరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు.
1930లో వెలువడిన పి.వి. రాజమన్నారుగారి (1901) మూడంకెల సాంఘిక వచన రూపకం తప్పెవరిదితో తెలుగు నాటకరంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మొదటి భార్య చనిపోయిన ఒక వృద్ధుడు ఒక యువతిని వివాహం చేసుకొంటాడు. ఆమె అతని ప్రథమ భార్య కొడుకుని ప్రేమిస్తుంది. వృద్ధుడు పశ్చాత్తప్తుడై ఆత్మహత్య చేసుకొంటాడు. చిత్రాంగీ సారంగధరుల కథతో తీనికి పోలిక ఉన్నప్పటికీ శిల్పంలోనూ, పర్యవసానంలోనూ ఇబ్సన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బళ్ళారి రాఘవాచార్యులుగారు దీనిని విజయవంతంగా ప్రదర్శించారు. దీనితో వచన రూపక రచయితలకు, కొత్త పోకడల నటులకు కొత్త దాజురులు చూపించారు పాకాల వెంకట రాజమన్నారుగారు.
తరువాత రాజమన్నారుగారు అధికంగా ఏకాంకికలనే రచించారు. వీటిలో పదిహేను రచనలను రాజమన్నారు నాటికలు పేర 1958లో దేశి కవితామండలివారు ప్రచురించారు. మరో ఆరింటిని సర్దారు పాపడు అనే పేర ఎమ్. శేషాచలం కంపెనీవారు 1972లో ప్రచురించారు. రాజమన్నారు నాటికలు పదిహేనింటిలోనూ విముక్తి చాలా పెద్దది. ఐదు రంగాలున్నాయి. తరువాతిది దెయ్యాల లంక. రెండు రంగాలున్నాయి.
ఏదో ఒక సమస్యను గ్రహించి, ఆ సమస్యను ఒక సన్నివేశంగా ఊహించి, దానికి రూపకల్పన చేసి, సృష్టించిన పాత్రలను దాని చుట్టూ చిత్రించటం రాజమన్నారుగారి రచనా విధానమని చెప్పవచ్చు. కేవలం ఏదో ఒక సందేశం ఇవ్వటంలో కంటే, సమస్యను ప్రతిపాదించటంలో, రచనా వైశిష్ట్యం సాధించటంలో వారికి దృష్టి ఎక్కువ. పఠితులను, ప్రేక్షకులను సన్మార్గవర్తులను చేయాలన్న ఆకాంక్ష కంటే సంఘంలోని సత్యాసత్యాలను, అందులోని సంప్రదాయాదుల వల్ల జీవన వికాసం సంకుచితమైపోతూ ఉండటాన్ని చిత్రించటమే వారి ధ్యేయం. ఎక్కడికక్కడ కొత్త మలుపులు తిప్పుతూ, చివరి వరకూ ప్రేక్షకులను ఆకట్టుకొనే శక్తి వారి కథా నిర్మాణానికి ఉంది. కొన్నింటిని చూద్దాం వివరంగా.
ఏమి మగవాళ్ళు
ఇది వీరి మొదటి రచన. సుందరం పంతులుగారికి 50 సంవత్సరాల వయస్సు. 25 ఏళ్ళున్న సుందరమ్మ వారి ద్వితీయ కళత్రం. కృష్ణమూర్తి పంతులుగారి తమ్ముడు- సుందరమ్మ సమవయస్కుడు, బ్రహ్మచారి. వేణుగోపాల్ పంతులుగారి అన్న కొడుకు- వయస్సు 30 సంవత్సరాలు. కనకాంగి వేశ్యకులంలో పుట్టి, ఆ వృత్తిలో కొంతకాలం ఉండి, నటి అయింది. వేణు ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె వేణుకు సమవయస్కురాలు. పదేండ్ల నిర్మల పంతులుగారి మొదటి భార్య కూతురు. శంకరశాస్త్రి పంతులుగారి ఆప్తవర్గంలోని వాడు, రసికుడు. కనకాంగిని చిన్నప్పటి నుంచి ఎరిగినవాడు. వీరు ఈ ఏకాంకికలోని పాత్రలు. కనకాంగి మాటల్లో చెప్పాలంటే- ముసలివాణ్ణి కట్టుకొన్న సుందరమ్మకు మరిది కృష్ణమూర్తి మీద మరులు. ఆ పిచ్చి బ్రహ్మచారి అందమైన పిల్ల (కనకాంగి) కనబడగానే అవకతవకగా ప్రవర్తించాడు. అందుకు సుందరమ్మ కోపగించుకొంది. 50 ఏళ్ళ ముసలివాడు, ధర్మశాస్త్రాలు తలకిందులుగా చదవగలిగినవాడు సుందరం పంతులుగారు ఒంటరిగా ఉన్న కనకాంగిని చూసి, దగ్గర చేరి, వావీవరస లేకుండా ఆమె తొడ మీద చెయ్యి వేస్తాడు. ఎప్పుడో కాకినాడలో తమ ఇంటిపక్క ఉన్న శంకరశాస్త్రితో ఈ విషయాలన్నీ చెప్పి కనకాంగి నవ్వుతుంది. ఒక్కొక్క మెట్టుగా అనుమానం పెరుగుతూ వచ్చిన వేణు అసహనంతో, ‘వెనుకటి బుద్ధి ఎక్కడికి పోతుంది…’ అని కనకాంగిని నిందిస్తాడు. ‘వెర్రికుక్కల్లాగ వాళ్ళు పైనబడినారు,’ అని ఆమె మొత్తుకొంటే, ‘ఛస్, నోరుముయ్యి,’ అన్నాడు. కనకాంగి కళ్ళనీళ్ళు తుడుచుకొని, నిరసనభావంతో పెదవి విరచి, మంగళసూత్రం చేతితో తెంపి పారవేసి, ‘ఛీ ఛీ! ఏమి మగవాళ్ళు,’ అనుకొంటూ వీథిగుమ్మం వైపు వెడుతుంది.
ఇందులో సందేశం కంటే అందమైన ఆడది ఒంటరిగా తటస్తపడితే పైకి శ్రీరంగనీతులు చెప్పే మగవాళ్ళు వెర్రికుక్కల్లాగ అయిపోతారన్న చిత్రణయే ముఖ్యం. ఇబ్సన్ రచించిన డాల్స్‌హౌస్‌లోని నోరా వలె కనకాంగి కూడా భగ్నప్రణయిని. నోరా వలెనే అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోయింది. రెండింటిలోను భర్తల అనుమానమే విషాదానికి దారితీసింది. తెలుగు సాహిత్యంలో ఇదొక విషయం. అయితే నోరా సహజంగా కులస్త్రీ కాగా, కనకాంగి కులస్త్రీగా మారిన వేశ్య. కాగా, నోరా విషయంలో కంటే కనకాంగి విషయంలో అనుమానానికి కొంత అవకాశం ఉంది. సహజంగా కులస్త్రీ అయిన భార్య చేత మంగళసూత్రం తెంపి పార వేయించటానికి రాజమన్నారుగారు మరి సాహసించలేదేమో!
నిష్ఫలం
ఇందులో కూడా ప్రధాన పాత్ర అయిన చిత్రరేఖ వేశ్యయే- పెళ్ళి చేసుకొన్నది మాత్రం కాదు. అయితే తన సర్వస్వాన్ని- ధన, మనః ప్రాణాలను తాను నమ్మిన జమీందారురంగారావుకు అర్పించుకొన్న నిర్మలమూర్తి. తనను ఎప్పుడూ విడిచిపోడని ఆమె నమ్మకం. జమీందారు భార్య సీతయ్యమ్మ అభిజాత్యం కరుడుగట్టిన మూర్తి. రంగారావు మాటల్లో చెప్పాలంటే, దేవాలయానికి తప్ప ఇంకొకచోటికి వెళ్ళదు. అటువంటి సీతయ్యమ్మ చిత్రరేఖ ఇంటికి స్వయంగా వస్తున్నట్లు కబురంది, వచ్చింది. అప్పుడు చిత్రరేఖ వద్దనే ఉన్న రంగారావు పక్కగదిలో దాగుంటాడు. రంగారావు చేసిన అప్పులు తీర్చటానికి చిత్రరేఖ నగలు అడిగి తీసుకొని వెడదామని వచ్చింది సీతయ్యమ్మ. కాని చిత్రరేఖ నగలు అదివరకే రంగారావు అప్పులు తీర్చడానికి చెల్లుబడి అయిపోయాయనీ, ఆమె వంటి మీద ఉన్నవి నకిలీవనీ, సంవత్సరాలుగా రంగారావు ఆమెకు ఏమీ ఇవ్వలేదనీ తెలుసుకొన్న సీతయ్యమ్మ పరాభవం పొందింది. అయినా పై చెయ్యిగా, ‘మీ సౌందర్యానికి వెలలేదూ? అమ్మితే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నవారు లేరూ?’ అంటుంది. చిత్రరేఖ తోక తొక్కిన తాచు అయింది. రంగారావు చటుక్కున ముందుకు వచ్చి, ‘నేను ఈ ఊరికి మళ్ళీ రాను,’ అంటూ సీతయ్యమ్మతో నిష్క్రమిస్తాడు, తానే సర్వస్వంగా ప్రేమిస్తున్న చిత్రరేఖను వదిలి. జీవచ్ఛమే అయింది చిత్రరేఖ.
జమీందారుగారిని వదిలేయమని తన్ను అడగడానికి జమీందారిణి వస్తోందనుకొన్న చిత్రరేఖని జమీందారే విడిచి వెళ్ళిపోవడం- ముగింపు ఎంత చిత్రంగా మలిచారు రాజమన్నారుగారు! ఇందులోని ప్రతి వాక్యం కథ ముందుకు సాగటానికో, పాత్ర శీలం వ్యక్తం కావటానికో తోడ్పడిందనే చెప్పాలి. సంవాదం అంత శిల్ప సమ్మతంగా నిర్వహించారు. అందుచేతనే దీనిని ఉత్తమ రచనగా విమర్శకులు పేర్కొంటున్నారు. అత్యాధునికమైన ఈ రచన ప్రాచీన సంస్కృత నాటికా లక్షణాలకు కూడా బాగా సరిపోతున్నదని ఆచార్య సాళ్వ కృష్ణమూర్తిగారు చక్కగా నిరూపించారు.
వృథాయాసం
వీరభద్రరావు కళాశాలలో ఉపన్యాసకుడు. ఇందిర అనే విద్యార్థిని అతని ప్రియురాలు. విషయం తెలుసుకొన్న భార్య పార్వతి, భర్త నిద్ర నుంచి లేచిన తరువాత పీకి పాకం పట్టడానికి తయారు అవుతూ ఉంటే, భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి నిద్రపోయినట్లుగా సూచిస్తారు రాజమన్నారుగారు. ఆమె ప్రయత్నమంతా వృథాయాసమన్నది సూచన. అయితే ఇందిర ఉత్తరం ఆమెకు తిరిగి ఇచ్చివేయటంలో పార్వతిలో కొంత ఔన్నత్యం కనబడుతుంది.
సంకల్పం - పర్యవసానం
43, 44 సంవత్సరాలున్న సోమసుందరంగారు విధురుడు. 23 ఏళ్ళున్న ధనవంతురాలు, అందగత్తె అయిన గిరిజను పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. సాహసించి, ఆమెతో మాట్లాడాలనుకొని, తన ఇంటికి ఆమెను ఆహ్వానించిన రోజు ఆ ఇంట్లోనే ఆయన తమ్ముడు విశ్వనాథం, గిరిజను అంతకుముందే ప్రేమించిన వాడు, సోమసుందరంగారి ఆశీస్సులతో ఆమె ప్రాణిగ్రహణం చేస్తాడు. సంకల్పం ఒకటీ, పర్యవసానం ఇంకోటీ అయిన సోమసుందరంగారు తొట్రుపడలేదు. ‘… ఎంత పొరబాటు చేయబోయాను… జరిగిందేయుక్తం,’ అంటూ లోపల జేబులోంచి గిరిజ బొమ్మ తీసి చూసి, నిట్టూర్చి ముక్కలు ముక్కలుగా చింపివేస్తారు సోమసుందరంగారు. ఆదిలో సోమసుందరంగారు మానవ సహజమైన దౌర్బల్యానికి లోనైనా నిగ్రహించుకోవటంతో వారి పాత్రకు ఉదాత్తత చేకూరింది.
మాతృప్రేమ
వేణుగోపాలరావు, సత్యనారాయణ రామలక్ష్మమ్మ కొడుకులు. శారద వేణు భార్య. వేణు దీర్ఘరోగ పీడితుడైనాడు. అహర్నిశలు తనకు సేవచేసి కృశిస్తున్న శారదకు కొంత ఆనందాన్ని చూర్చాలన్న దృష్టితో సెలవులకు ఇంటికి వచ్చిన తమ్ముడితో సినిమాలు వగైరాలకు బలవంతపెట్టి పంపిస్తాడు. కాని చివరికి వారి పరిచయం ముదిరి, శారద గర్భవతి కావటం, ఆమె వేణుగోపాల్‌ను పట్టించుకోకపోవటం వరకు వచ్చింది. దుఃఖిస్తున్న వేణుగోపాల్‌కు నిద్రమందు పొరపాటున ఎక్కువగా ఇచ్చి తల్లి వాని బాధను మాన్పుతుంది. ఏది ఏమైనా తల్లి ఇట్లా చేయటం భారతీయ సంస్కృతికి విరుద్ధం. కాని ఘోస్ట్స్ అన్న రూపకంలో ఇబ్సన్ ఇటువంటి సన్నివేశాన్నే కల్పించాడు. కొడుకుకు తల్లి విషమిచ్చినట్లుగా అందులో సూచన ఉంది. రాజమన్నారుగారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఇద్దరు కొడుకులు విధవరాలైన ఆ తల్లికి రెండు కళ్ళు. మాతృప్రేమ మూర్తీభవించిన తల్లి ఆ విషమ పరిస్థితులలో ఇంకేం చేస్తుంది?
విముక్తి
దీనిలో రెండు మలుపులున్నాయి. చిన్నతనంలోనే భర్తృహీనయై, కాలుజారి గర్భవతి అయిన రాధను రక్షించడానికి మనసారా ముందుకువచ్చాడు సత్యనారాయణ. అతని తల్లి కనికరం కలదే, కాని ఆ ఇంటి వాతావరణంలో ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. అందుచేత గర్భవతి అయిన రాధను తీసుకొని వేరే వెళ్ళిపోతాడు సత్యనారాయణ. ఇది మొదటి మలుపు- అయ్యో అనుకొటాము. తిండికి గడవక చాలా అవస్థ పడుతుంటారు వాళ్ళు. తన వల్ల సత్యనారాయణకు ఇంత అవస్థ వచ్చిందని రాధ కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో తండ్రికి సుస్తీగా ఉన్నదనీ, తన్ను చూడగోరుతున్నాడని తెలిసి సత్యనారాయణ ఇంటికి వస్తాడు. పశ్చాత్తప్తుడైన తండ్రి రాధను కోడలుగా స్వీకరించటానికి అంగీకరించాడు. సత్యనారాయణతో పాటు మనం కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఇది రెండో మలుపు. అయితే సత్యనారాయణ పడుతున్న కష్టాలు చూడలేని, ఈ కొత్త మార్పు తెలియని రాధ సత్యనారాయణ తిరిగి వచ్చేటప్పటికి నూతిలో పడి ప్రాణం తీసుకొంటుంది. ఇది సత్యనారాయణకే కాక మనకు కూడా అనుకోని విషాద పరిణామం. ‘అమ్మా! కోడల్ని తీసుకొని వచ్చానమ్మా. అయితే తానే స్వయంగా వచ్చి నీకు నమస్కారం చేయగల స్థితిలో లేదమ్మా!’ అంటూ సత్యనారాయణ తల్లి ఒడిలో తల దాచుకొని ఏడుస్తాడు. ‘ఈ లోకం ఒక బోను వంటిది. మనకు మిగిలేది బాధే…’ అంటూ కొడుకు తల నిమురుతూ ఉన్న తల్లి కన్నీళ్ళు ధారలుగా కారిపోతూ ఉంటాయి. భర్తృహీన అయి, కాలుజారి గర్భవతిగా ఉన్న స్త్రీని భార్యగా సత్యనారాయణ గ్రహించటమే గొప్ప విషయం. ఆ బాంధవ్యాన్ని ఆలస్యంగా అయినా తండ్రి హర్షించటం ఇంకా గొప్ప విషయం. అయినా పర్యవసానం విషాదమే. మరి మానవజాతి ఇంకా అజ్ఞానదశలోనే ఉంది!
దెయ్యాల లంక
ఇది తనకు బాగా నచ్చిన నాటిక అని రాజమన్నారుగారన్నారు. ఇందులోని రెండు రంగాలలోనూ ఒక రంగం ఊరిలోని ఇంటిగదిలో, రెండవది దెయ్యాల లంకలోని ఇసకతిప్ప మీద జరిగాయి. నిష్పలంలోలానే ఇందులో కూడా సంవాదం చాలా జిగిగా సాగింది. ‘కావ్యత్వం బాగా పొదువుకొన్న కళాఖండమే నాటిక,’ అని ఆచార్య యస్వీ జోగారావుగారు దీనిని పొగిడారు. రాధ వలెనే ఇందులోని సుధ కూడా బాల వితంతువు. సంస్కృతం కూడా చదువుకొంది. ఛలోక్తులు విసరటంలో జాణ. పెదతండ్రి ఇంట్లో ఉంటున్నది. పెదతండ్రి కూతురు లక్ష్మీకాంతమ్మ, ఆమె భర్త చలపతిరావు. లక్ష్మీకాంతమ్మకు ఉడుకుబోతుతనం ఎక్కువ. సుధ పువ్వులు పెట్టుకొన్నా భరించలేదు. చలపతికి సుధ అంటే సరదా. కాని సుధకు చలపతి అంటే ప్రేమ. వీళ్లు ముగ్గురూ, లక్ష్మీకాంతమ్మ తండ్రి అచ్యుతరామయ్య, మేనమామ రంగయ్యమామ గోదారిలో బోటు షికారుకు వెళతారు. అది తలకిందులు కాగా అంతా దెయ్యాలలంక చేరతారు. ‘ఊరులో అందరూ దెయ్యాలు… ఈ దెయ్యాల్లంకే నాకు ఆనందంగా ఉంది,’ అన్న సుధ, ఆ వెన్నెల రాత్రి చలపతితో ఆడుతూ, పాడుతూ తిరిగి చివరికి గోదావరిలో కలిసిపోతుంది. లక్ష్మీకాంతమ్మ, ‘… ఈ పాడులంక బలి తీసుకొంది. దెయ్యాలు హతం చేసేశాయి,’ అని గుండెలు బాదుకొంటూ ఉంటే చలపతి కఠినంగా, ‘ఛీ, నోరుముయ్యి! దెయ్యాలా? ఎవరు దెయ్యాలు?’ అంటాడు. తెలివైన బాల వితంతువుకు తోటి స్త్రీయే దెయ్యమన్నమాట.
వైకుంఠాచార్యులు
విముక్తిలో వలెనే కొత్త మలుపులు గలది ఇది. వైకుంఠం నుంచి తాళపత్ర లేఖలు తెప్పిస్తున్నానని చెప్పి అమాయక ప్రజలను దోచుకొంటున్న వైకుంఠాచార్యుల్ని, అదే ఉపాయంతో ఇరుకున పెట్టారు పట్టణం నుంచి వచ్చిన ఇద్దరు యువకులు. వైకుంఠాచార్యులు ఆట కట్టిందని మనం సంతోషించే సమయంలో వైకుంఠాచార్యుల శిష్యుడు మళ్ళీ అదే పన్నుగడ పన్ని, అమాయకులైన ఆ ఊరి ప్రజల చేత ఆ ఇద్దరిని తరిమి వేయిస్తాడు. ఇది అనుకోని ముగింపు. వీటినే పతాక, ప్రతి పతాక దశలు అన్నారు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు.
పరకీయలో ప్రేమ, కామం మధ్యగల భేదాన్ని గూర్చిన చర్చ, విచిత్రమైన కల్పన, మనోవిశ్లేషణ ఉన్నాయి.
నందినిలో మతోన్మాదులైన సోదరులు చెల్లెలి భర్తను హత్యచేసి, ఆమె ఆత్మహత్యకు కారకులౌతారు. చారిత్రక వాతావరణంలో చిత్రితమైన ఈ రచనలో, ‘ప్రేమరాజ్య స్థాపనకు ఈ మానవ ప్రపంచం ఇంకా సిద్ధం కాలేదు, అన్ననందిని ఆర్తనాదం ఎన్ని శతాబ్దాలు గడిచినా ఇంకా వినిపిస్తూనే ఉంది లోకంలో,’ అంటూ వ్యాఖ్యానించారు రాజమన్నారుగారు.
బంధాలులో వరుసకు అన్నాచెల్లెళ్ళయినా, నిజం తెలియక ప్రేమకు, పెళ్ళికి సిద్ధపడి, చివరికి తల్లి మాటకు కట్టుబడటం చిత్రితమైంది. భార్యభర్తలు అన్న రచనలో చంచల మనస్కులైన ఇద్దరు పురుషులకు వారి భార్యలు మెత్తగా బుద్ధి చెప్పటం చిత్రితమైంది.
నాగుబాము బౌద్ధమత వాతావరణంలో చిత్రితమైంది. నాగసుందరుడనే బౌద్ధ శిల్పిని ప్రేమించిన ఆంధ్ర రాజకుమారి జయశ్రీ భగ్నప్రేమిక అయినప్పటికీ, తెల్ల నాగుబాము కాటుకు గురి అయిన నాగసుందరుని ప్రాణం రక్షించి, తన ప్రాణం కోల్పోయి, నిజమైన ప్రేమకు ఆత్మత్యాగమే ఫలమని చాటి చెప్పింది.
కఠినమార్గంలో భగవంతుని దయకు పాత్రం కావాలంటే స్వార్థం ఏమీ పనికిరాదన్న విషయం స్పష్టం చేయబడింది. బైబిల్ కథ ఆధారమైనదిది.
శ్రీరామనవమి ఒక విచిత్రమైన కల్పన. ప్రత్యక్షం కాని భగవంతుని కోసం అర్రులు చాచటం, నిజంగా ప్రత్యక్షమైతే గుర్తించలేకపోవటం, భగవద్దర్శనం పొందటానికి నిర్మలమైన మనస్సు కావాలన్న సత్యం నిశితంగా నిర్వచించారు.
మీనాక్షి సుందరంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళ దాంపత్య జీవితాలు, అక్క చనిపోవటం, మరదలు బావ సాన్నిహిత్యం కోరటం, బావ మృదువుగా బుద్ధి చెప్పటం- చిత్రమైన ముగింపు దీనిలో ఓ ప్రత్యేకత.
లవంగి చారిత్రాత్మక రచన. మనసారా ప్రేమించుకొన్న జంట క్రూరమైన మరణానికి గురయ్యారు. ఇందులోని నాయకుడికి ఆవేశమే కాని ఆలోచన తక్కువ.
వంకాయకూరలో ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయి ఇప్పుడు పెద్ద అంతస్తులో ఉన్న జి. పాల్ (గోపాల్) తన కింది ఉద్యోగస్తుని ఇంటిలో అవస్థలు పడుతున్న తల్లిని గుర్తించి తన వెంట తీసుకొనిపోతాడు. మాతృదేవోభవ సందేశం ఇది.
పడుపువృత్తిలో నిరుపమను ఉద్ధరించి ఆదర్శకార్యం చేసిన తృప్తి పొందాడు శ్రీపతి. కానీ ఆమెను భార్యగా చూడలేకపోయాడు. విసిగిపోయిన ఆమె మంగళసూత్రం తీసేసి మళ్ళీ పడుపువృత్తిలోకి వెళ్ళిపోతుంది.
సింహగిరి చారిత్రాత్మకమైన రచన. తానే వైశ్వానరావతారమని విర్రవీగిన కాశ్యపుని పతనం నిరూపిస్తుంది.
మొత్తం మీద స్త్రీ పాత్రచిత్రణలో, మానవ మనోవిశ్లేషణలో, సన్నివేశ ప్రకల్పనంలో, లైంగిక సంబంధ స్ఫోరకములైన ఇతివృత్తాలలో సంప్రదాయ ధోరణులకు ప్రతితీర్పులనిస్తూ రసవత్తరమైన నాటికలను సృష్టించి ఆంధ్ర నాటకరంగంలో ప్రత్యేక స్థానానిన సంపాదించుకొన్నారు రాజమన్నారుగారు. వృత్తిపరంగా న్యాయశాస్త్ర ప్రవీణులు (మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రిటైరైనారు), ప్రవృత్తి పరంగా నాటక కళాపోషకులు.
సౌజన్యం: తెలుగు పలుకు