- వరవరరావు

ముదిగొండలో ఇళ్ళ స్థలాల కోసం పోరాడుతున్నవారిని మాజీ నక్సలైటు రెచ్చగొడుతున్నాడనే నెపంతో గ్రేహౌండ్స్ ప్రవేశించి కాల్పులు జరిపారు. వాకపల్లిలో మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నారనే నెపంతో గ్రేహౌండ్స్ గాలింపు చర్యలు జరిపి పదకొండుమంది ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారం చేసారు.

రాజ్యం చేసిన ఈ అత్యాచార బాధితులను కులకట్టుబాట్ల హిందూ వ్యవస్థ ప్రభావం వల్ల భర్తలు దూరం ఉంచి పాలచేపుల తల్లుల దగ్గరికి ఆకలితో ఏడుస్తున్న పిల్లలని చేరనివ్వడంలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆచరిస్తున్న వాళ్ళకు ప్రకృతిసిద్ధమైన న్యాయసూత్రా లను వర్తింప చేయనక్కర్లేదని పార్లమెంటరీ పార్టీలు, సభ్య సమాజము పురుషస్వామ్యము భావించినంతకాలం ఇటువంటి దారుణాలుజరుగుతునే ఉంటాయి. తనదాక వస్తే గాని తెలియదన్నట్లుగా, ఇవ్వాళ బలం గల వారి దాష్టీకం, దౌర్జ న్యం-వ్యక్తుల, బృందాల, కులాల, జాతుల, ప్రాంతాల మతాల , జెండర్ బలశాలుల నే కాదు ఈ అన్ని స్వభావాల సమాహారమైన సామాజ్య్రవాద గుత్త అధికారం కావడంవల్ల పాలకవర్గాలద్వారా విశాల ప్రజానీకం అనుభవించి ఎదుర్కొనే స్థితి వచ్చింది. కాసేపు ఆ సైద్ధాంతిక చర్చను అలా ఉంచుతాం. పోలీసు వ్యవస్థనే చూద్దాం.

ఎం.వి. భాస్కరరావు డిజిపిగా ఉన్నప్పుడు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వేసిన నగర టాస్క్‌ఫోర్స్‌ను - ఇది చట్ట విరుద్ధమయింది అని రద్దు చేసారు. అప్పటిదాకా ఆయా నగరాల్లో పోలీసు అధారిటీ ఏర్పాటు చేసుకుంటున్నా టాస్క్‌ఫోర్స్‌లకు ఎక్కడా చట్టంలో ఆమోదంలేదని చాల మందికి తెలియదు. అపుడయినా రాష్ట్ర ఉన్నతా ధికారికీ నగర ఉన్నతాధికారికీ ఉన్న వైరుధ్యాల వల్ల ఆ విషయం బయటికి వచ్చింది. అప్పటికే హైదరాబాదునగరంలో చిక్కడపల్లి వంటిచోట వేకువ జామున నే నిలువెత్తు లావుపాటి కర్రలతో ఖాకీ ఫ్యాంటులపై తెల్ల స్లాకులు వేసుకుని స్వైర విహారం చేసే టాస్క్‌ఫోర్సు వాళ్ళను చూసి జనం జడిసి పక్కకు జరిగే వాళ్లు. వీళ్లంతా నగరం లో అసాంఘిక శక్తులను అదుపు చేయడానికి వచ్చినవాళ్లని ముఖ్యంగా నారాయణ గూడా మురికవాడల్లో గుడుంబా తయారీని అడ్డుకోవడానికి తిరుగుతున్నారనీ, ధూల్‌పేటలోనయితే వీళ్లు మహత్తర మద్యపాన వ్యతిరేక దాడిలో పాల్గొంటున్న రక్ష కులని నా బోటి నీతిమంతులు, సభ్యసమాజము ఆశపెట్టుకునేవి. సంతోషించేది. బహుశా భద్రత ననుభవించేదేమో. నక్సలైట్ ఉద్యమం ఎనభైలలో తెలంగాణ ప్రాంతంలో సాయుధమార్గాన్ని మళ్ళీ చేపట్టేనాటికి యాంటీనక్సలైట్ దళాలు ఏర్పడ్డాయి.

1969నుంచే అడవుల్లో, గ్రామాల్లో పోలీసు క్యాంపులు, ‘కల్లోలిత ప్రాంతాలు’, ఎన్‌కౌంటర్లు ఉన్నా పట్టణాల్లో, నగరాల్లో వీళ్ళ విన్యాసాలు భయం గొలిపేవిగా ఉండేవి. హనుమకొండ చౌరస్తాలో, ముఖ్యంగా కోహినూరు హోటల్‌ముందు నలుగురు విద్యార్థులు, యువకులు సాయంకాలం పిచ్చాపాటికి చేరడానికి వీల్లేదు. ఒకే ఒక్క సేదదీరే స్థలం పబ్లిక్ గార్డెన్స్‌లో పొదలమాటున కూర్చోవడానికి వీలులేదు. ఇంక కుమార్‌పల్లి, కొత్తవాడ, మచిలీబజార్, కొత్తూరు, గోపాలస్వామిగుడి వంటి సందుల్లో సాయంకాలాల్లో యాంటీనక్సల్ దళాలు ఓపెన్‌టాప్ జీపుల్లో దూరి నిలువెత్తు దుడ్డుకర్రలు విసురు తుంటే వీధులు విలవిలలాడుతూండేవి. అరుగులమీద కూర్చున్నవాళ్ళు ఇళ్ళల్లోకి దూరి తలుపులు వేసుకోవాలి. కిటికీలు మూసుకోవాలి. క్షణం ఆలస్యం జరిగినా జీపు లో వేసుకుని పోతారు. జీపులో ఇనుపబూట్ల కింద నలిగిపోవడంతో ప్రారంభమై పోలీసుస్టేషన్‌లో కోదండం, హైదరాబాద్ గోలీ, ముడ్డికింద మంటలు, వేళ్ళల్లో సూదులు- అనుభవించిన వాళ్ళు వివరించవలసినవే.

ఇంట్లో దూరడం ఆలస్యం చేయడాన్ని మించిన ప్రత్యామ్నాయ నేరమేదీ లేదిందులో. 84, 85 కాలంవరకైతే కులాంతర వివాహం చేసుకోవడం, సిగరెట్ తాగకపోవడం, చౌరస్తాలో జులాయిగా తిరగకపోవడం, కుమార్‌పల్లి నుంచి వస్తూ కనిపించడం కూడా నక్సలైట్ చర్యలుగా కనిపించాయి. ఆత్మకూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఒక దళితయువకుణ్ణి ఒక బిసి అమ్మాయి ప్రేమవివాహం చేసుకుంటే ఇద్దరినీ అర్థనగ్నంగా కొడుతూ ఊరేగించాడు ఆత్మకూరు ఎస్ ఐ. వారి మెడలో ‘ఇటువంటి కులాంతర వివాహాలు చేసుకుంటే ఇదే శిక్ష అనుభవిస్తారు’ అనే హెచ్చరిక అట్ట వేళ్ళాడదీసారు. ఇవన్నీ నక్సలైట్ల విషయంలో, మాజీల విషయంలో, వాళ్ళ సానుభూతిపరుల విషయంలో చట్టబద్ధంగానే అమలవుతున్న చర్యలని సభ్యసమాజం, ఎన్నికల పార్టీలు కూడా ఉపేక్షిస్తూ వచ్చాయి. ఇవి ప్రశ్నించడం ఎవరో కొందరి హక్కుల సంఘాల పని లేదా చాదస్తం అని భావించిన మేథావులు కూడా ఉన్నారు. అటువంటి చాదస్తానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో 1985 సెప్టెంబరు 3న డాక్టర్ రామనాథం హత్యతో గుర్తుచేశారు పోలీసులు. ఇంక ఆట,పాట,మాట బంద్ అన్నారు.

ప్రజాసంఘాలు పనిచేయలేని స్థితిని కల్పించారు.జననాట్యమండలి ప్రదర్శనలివ్వలేని స్థితిమాత్రమే కాదు, సాంస్క­ృతిక కళాకారులందరూ అజ్ఞాత జీవితానికి వెళ్లాల్సిన స్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన టాడాను వ్యతిరేకించిన టీడీపీ తానుగా రాష్ట్రంలో టాడా ప్రయోగించి పదహారు వేలమందిపై కేసులు పెట్టింది. జైళ్లలో పెట్టింది. అందులో రచయితలు, రైతు కూలీలు, కార్మికులు, హక్కుల సంఘాల వాళ్లే కాదు, పత్రికా రచయితలూ ఉన్నారు. అందరికన్నా నోరులేని అమాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇదంతా రాజ్యాంగంపై విశ్వాసంలేని నక్సలైటు ఉద్యమాన్ని అదుపు చేయడానికే అనుకున్నది సభ్య సమాజం. ఎన్నికల రాజకీయం. అప్పుడు కె.ఎస్.వ్యాస్ గ్రేహౌండ్స్ (బూడిద రంగు తోడేళ్ల) పోలీసుఫోర్స్‌ను అన్ని పోలీసు శాఖల్లోని దృఢకాయులతో, శిక్షితులతో, మోటు మనుషులతో రూపొందించారు. ఇరవయ్యేళ్లు దాటిపోయాయి.

పోలీసుశాఖలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైం, ఇంటెలిజెన్స్ అనే నాలుగు విభాగాలకు తప్ప ఆయా కాలాల్లో ఇట్లా రూపకల్పన చేస్తున్న పోలీసువిభాగాలకు జవాబుదారీతనం లేదు గనుక చట్టబద్ధత లేదని పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వా మ్యవాదులు ఇరవయ్యేళ్లకు పైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వీళ్లు నేరుగా గ్రేహౌండ్స్ రాష్ట్ర అధికారి ద్వారా (ఏర్పడినప్పుడయితే డీఐజీ కె.ఎస్.వ్యాస్ ద్వారానే) ముఖ్యమంత్రికే జవాబుదారీగా ఉంటారు. వీళ్లు గాలింపు చర్యల కోసం, ఎన్‌కౌంటర్ల కోసం, ఇన్‌ఫార్మర్ల కోసం పెట్టే ఖర్చు లెక్కలు శాసనసభకూ సమర్పించనక్కర్లేదు. దానిని ‘అనెకౌంటెడ్ మనీ’ పద్దు కింద రాస్తారు. వీళ్లకు యూనిఫారాలు ఉండవు. కనుక నేమ్ ప్లేట్స్ కూడా ఉండవు. వీళ్లు పోలీసుశాఖ వాహనాలు ఉపయోగించరు.

ప్రైవేటు వాహనాల్లో తిరుగుతారు. ఆ వాహనాలకు నెంబరు బోర్డులు ఉండవు. (ఇటీవల భిలాయ్‌లో పబ్లిక్ బూత్ నుంచి తనను పోలీసులు చుట్టుముట్టారని ఫోన్ చేసినపుడు పద్మ అనే యువతి నాతోను, ఈటీవీతోనూ, రాజేంద్ర సయాల్ (పీయూసీఎల్ జాతీయ అధ్యక్షుడు, రాయ్‌పూర్)తోను తాను బయట సీజి (ఛత్తీస్‌గడ్) నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలు, ఏ నంబరూ లేని వాహనాలు చూస్తున్నానని, నెంబరు లేని వాహనాల్లోని ఆంధ్రా పోలీసులను తాను పోల్చుకోగలనని చెప్పింది.) గ్రేహౌండ్స్‌కు కార్యక్షేత్రం ‘కిల్లింగ్ ఫీల్డ్స్ ఇన్ ఆంధ్రా’ (తెలుగు నేల మీది హత్యా క్షేత్రాలు) మాత్ర మే కానక్కర్లేదు. ఒరిస్సాకు వెళ్లి కోపర్‌డంగ్‌లో గ్రెనేడ్స్ విసిరి చంపగలరు. గొట్టలో ఎన్‌కౌంటర్ చేయగలరు. మల్కన్‌గిరిలో శ్రీరాములు శ్రీనివాస్ కాళ్లు, చేతులు, మెడ ఎముకలు విరగ్గొట్టి తెచ్చి సిద్దిపేట కోర్టులో హాజరుపరచగలరు.

బెంగళూరు నుంచి పులి అంజయ్య, భాగ్యలను తెచ్చి వరంగల్ జిల్లా పీచరలో, బెంగుళూరు నుంచే ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, శీలం నరేశ్‌లను తెచ్చి కొయ్యూరులో, బెంగళూరు నుంచి సుదర్శన్ ను తెచ్చి అనంతపురంలో, కొల్లాం నుంచి రాజమౌళిని తెచ్చి అనంతపురంలో, బెంగళూరు నుంచి సోమన్నను తెచ్చి తాడ్వాయిలో, బెంగళూరు నుంచే అప్పారావును తెచ్చి పల్నాడులో ఎన్‌కౌంటర్ చేయగలరు. జెంషెడ్‌పూర్ నుంచి వడ్కాపూర్ చంద్రమౌళి, విజయలక్ష్మిలను తెచ్చి విశాఖ అడవుల్లో ఎన్‌కౌంటర్ చూపగలరు. ఈ విషయంలో పాటించే ఒక్క నియమం మాత్రం ఆయా విప్లవకారులు పుట్టిన ఊరో, ఉద్య మ నిర్మాణం చేసిన ప్రాంతమో ‘ఎన్‌కౌంటర్’ జరిగిన ప్రాంతమై ఉంటుంది. ముఖ్యం గా అది ఇంకా ఉద్యమ ప్రభావం ఉన్న ఊరయి ఉంటుంది. కనుక అక్కడి ప్రజలను భయభీతావహులను చేయడానికి, అక్కడ జరిగినట్లు ‘ఎన్‌కౌంటర్’ కథలల్లుతారు.

శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ ‘90లో రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఆ తర్వాత కాలంలో ఆయన అజ్ఞాత జీవితానికి వెళ్లి ఆ ప్రాంతంలోనే ఉద్యమ నిర్మాణం చేస్తూ తన దళ సభ్యులతో పాటు అరెస్టయ్యాడు. చంపేసి హైదరాబాదు తిరిగి వస్తూ చిత్తూరు ఎస్పీకి ఈ ‘ఎన్‌కౌంటర్’ ఆయన ఖాతాలో రాసుకొమ్మని చెప్పి వచ్చారు. అప్పటిదాకా ఆ ఎస్పీకి ఆ జిల్లాలో ఎన్‌కౌంటర్ సోయ లేదు. ఇది పెద్ద చర్చనీయాంశమై ఇకనుంచి జిల్లా ఎస్పీలతో గ్రేహౌండ్స్ సమన్వయ పరచుకోవాలని సూచించారు. కొయ్యూరు ఎన్‌కౌంటర్ విషయంలో కర్ణాటక పోలీసులకు, ఆంధ్రా పోలీసులకు సమన్వయం లేక జరిగిన ప్రచారం మూడు నెలలు అధికారులను చికాకు పరచింది. హైకోర్టు కూడా తప్పుపట్టిన ఒక ఉదంతం రాస్తాను. 27 జూలై 1997 వేకువ జామున వరంగల్ నుంచి వచ్చిన గ్రేహౌండ్స్ మధుసూదన్‌రాజ్‌ను చంపి ఆ ‘ఎన్‌కౌంటర్’ చిక్కడపెల్లి పోలీసు స్టేషన్ ఖాతాలో రాసుకొమ్మని చెప్పిపోయారు.

పోలీసులకు పరిధి (జూరిస్‌డిక్షన్) లేదా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చివాట్లు పెట్టవలసి వచ్చింది. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటు జాడ చెప్తుంది. బూడిదరంగు తోడేళ్లు వెళ్లి దాడిచేసి చంపాలి. ఇది ఇరవయ్యేళ్లుగా ఈ రాష్ట్రంలో అమలవుతున్న నక్సలైట్ అణచివేత విధానం. తమ నిర్మాణం, ఉద్యోగమే అనుమానితులను చంపడం గనుక గ్రేహౌండ్స్ రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి పోయిన వాళ్లను, బహిర్భూమికి వెళ్లిన వాళ్లను, గంగిరెద్దుల వాళ్లను, చివరకు హోటల్ లాడ్జిలో మరో పోలీసు అధికారిని చంపిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక నియమం ఏమిటంటే, అనుమానితులు నక్సలైట్లు. కనుక గ్రేహౌండ్స్ చర్య ఆత్మరక్షణలో ‘ఎన్‌కౌంటర్’. అందుకే ముదిగొండలో వందల మందిపై పోలీసు కాల్పులు జరపడానికి అనుమానిత ప్రేరేపక శక్తి మాజీ నక్సలైటు. వాకపల్లిలో గాలింపుకయినా, స్త్రీలపై లైంగిక అత్యాచారానికయినా సాకు- ఆశ్రయం తీసుకుంటున్నారనే అనుమానితులు మావోయిస్టులు.

ఎన్‌కౌంటర్ల విషయంలో 38 ఏళ్లుగా, గ్రేహౌండ్స్ విషయంలో 21 ఏళ్లుగా మనం సభ్య సమాజంగా అనండి, ఎన్నికల పార్టీలుగా అనండి ఇస్తున్న ఆమోదమే ఇవ్వాళ ఊళ్ల మీద తోడేళ్లు పడి మేక పిల్లలను చంపడానికయినా, ఆడపిల్లలను చెరచడానికైనా రాచబాట వేసింది. ఇవ్వాళ ఈ ఎన్నికల పార్టీలకు ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాను అమలు చేయడానికి ఇంతకన్నా వేరే మార్గం మిగలలేదు. జలయజ్ఞమే అనండి, ప్రత్యేక ఆర్థిక మండలులే అనండి. మరే పేరయినా పెట్టి ప్రజల్ని నిర్వాసితుల్ని చేయడం కన్నా మించిన ‘ఇందిరా ఆవాస పథకాలు’ లేని ప్రభుత్వాన్ని ఇళ్ల స్థలాలు అడిగితే ఎక్కడి నుంచి ఇస్తుంది. కొందర్ని చంపి, కొందర్ని భయపెట్టి ప్రజల్ని నిర్వాసితుల్ని చేయాలి. అట్లే అరకులో దుబాయి బాక్సైటు కంపెనీ కోసం, ఎస్.కోటలో జిందాల్ కంపెనీ కోసం ఉత్తరాంధ్ర అడవినంతా ఖాళీ చేయాలి. వాకపల్లి గాలింపు అక్కడితో ఆగేది కాదు. ఎందుకంటే మావోయిస్టులు వాకపల్లిలో మాత్రమే లేరు. అడవి పొడుగునా ఉన్నారు.

ఖాట్మండు నుంచి కన్యాకుమారి దాకా వాళ్లు ఎర్రకారిడార్ నిర్మాణం చేసుకుంటున్నారనే సాకుతో గాలింపులు జరుగుతాయి, గ్రేహౌండ్స్ పేరుతోనో, సాల్వాజు డుం పేరుతోనో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు, హత్యలు, దమనకాండ జరుగుతున్నది. నిజానికి పాలక ప్రభుత్వాలు నిర్మించదలుచుకున్నది మాత్రం బహుళ జాతి కంపెనీల రాజ్యం. మనం చాలా నిజాయితీగా ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న - నక్సలైట్ల సాకుతో దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న ఈ అప్రజాస్వామికి, చట్ట వ్యతిరేక- ముఖ్యంగా నైసర్గిక న్యాయసూత్రాలను ఉల్లంఘించే చర్యలను కొనసాగనిద్దామా- రాజ్యాంగంలో, చట్టంలో విశ్వాసం లేని మావోయిస్టులకు ఈ ప్రశ్న వేసే అధికారం లేదని ఉపేక్షిద్దామా? అపుడు మనది ప్రజాస్వామ్యం కాదు. ద్రౌపది ప్రశ్నకు జవాబులేని కౌరవ సభ మాత్రమే అవుతుంది.

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)