- శిఖామణి

రోజూ అవే అంకెల మీద
తిరిగిన అంకెల మీదే
తిరుగుతున్న
గడియారంలోని ముల్లులా

ఈ రోడ్ల మీద
నా కొయ్యకాలు
టక్… టక్… టక్…
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.
అడవి అడవంతా
వసంతోత్సవంతో
నృత్యం చేస్తుంటే
కుష్ఠురోగపు భర్తను
నెత్తిన మోస్తున్న
పతివ్రతలా
నా కొయ్యకాలు
నన్ను కావలించుకునే వుంది.
చెవిటిదీ, మూగదీ, అవిటిదీ
అని తెలియక
రోడ్లు ఏవేవో చెప్తుంటాయి.
పత్రికల్లో
అందమైన కవిత్వం మధ్య
తెల్ల మచ్చల గురించి
నల్ల వెంట్రుకల గ్యారంటీ
గురించి
నరాల బలహీనతల గురించి
అసహ్యమైన ప్రకటనల్లా
అందమైన రోడ్ల మీద
నా కొయ్యకాలు వికృతంగా
కొందరిని భయపెడుతూ
కొందరి జాలినీ
సానుభూతినీ పొందుతూ…
అర్ధరాత్రి
కోర్కెలతో బరువెక్కిన
నా దేహాన్ని
‘ఆ కాసేపూ’ భరించి
నన్ను తేలికపరచే నా భర్య కంటే
పగలంతా
విసుగూ విరామం లేకుండా
నన్ను మోసే కొయ్యకాలే
గొప్పదనిపిస్తుంది ఒక్కోప్పుడు
నేను చచ్చేలోగా
నా కొయ్యకాలు చిగురిస్తే
నన్ను నేను
తలకిందులుగా పాతుకుంటాను.
అడవుల్లో కలపంతా
జైళ్ళ కోసం, తుపాకీల కోసం
ఖర్చయిపోతున్న
నా దేశంలో
కనీసం నువ్వయినా
నాలాంటి కాళ్ళు లేని వాళ్ళ కోసం
కొయ్యను ఉత్పత్తిని చెయ్యమని
నా కొయ్యకాలును ప్రార్థిస్తాను.
లేకపోతే
స్మశానంలో
చితిమంటల మీద
నా దేహాన్ని
కట్టెలు పూర్తిగా
కాల్చలేకపోయినప్పుడు
నా కొయ్యకాలే
కృతజ్ఞతతో
మిగిలిన నా దేహాన్ని
గుప్పెడు బూడిద చేసి
రుణం తీర్చుకుంటుంది.

12 అభిప్రాయాలు

  1. venkatesh 07 సెప్టెంబర్ 2007 , 12:46 pm

    శిఖామణి గారు,
    మీ కవిత చాలా బాగుంది.కొయ్యకాలు గురించి ఇంత బాగా రాసినందుకు మీకు
    అభినందనలు.

  2. Dr.P.Murali Mohana Rao. 12 సెప్టెంబర్ 2007 , 11:00 am

    అద్భుతం భావ ప్రకటన! మనసును హత్తుకుంది కవిత!

  3. wilson sudhakar 18 సెప్టెంబర్ 2007 , 1:10 pm

    కొయ్యకాలేమిటి-దేన్నయినా కవిత్వం చెయ్యగల గొప్పకవి శిఖామణి. తనకవిత్వంతో ఈ ప్రపంచాన్నే నాటి మొక్కలు మొలిపించగల ప్రతిభాశాలి మన శిఖామణి.తెలుగు కవిత్వానికే శిరోమణి.తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,బెంగలూరు

  4. జాన్ హైడ్ కనుమూరి 20 సెప్టెంబర్ 2007 , 2:18 am

    నేను కొయ్యకాలు పై రాసిన వ్యాఖ్య చదవండి

    http://johnhaidekanumuri.blogspot.com/search/label/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

  5. జాన్ హైడ్ కనుమూరి 20 సెప్టెంబర్ 2007 , 2:21 am

    ఒక్కసారి చదివాను అంతే, కొయ్యకాలును బిగించిన అక్షరాల మద్య నా మనసు బిగుసుకుపోయింది. చదివిన ప్రతీసారీ ఎదో కొత్తరూపంతోనో, ఆలోచనతోనో కనిపించింది. 1987 జూలైలో వచ్చిన సంకలనం 2007 ఇప్పుడు చదవటం యాదృశ్చికమే. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కొత్త పరిమళం, కొత్త చూపు దానిలో నన్ను తాకాయి. కొయ్యకాలు కలిగిన వ్యక్తిలోకి కవి పరకాయ ప్రవేశంచేసి కెమేరా కళ్ళతో తీసిన వర్ణ చిత్రమిది

  6. Suresh. K. Digumarthi 21 సెప్టెంబర్ 2007 , 3:33 am

    శిఖామణి గారికి నమస్కారము. మీ కవిత చాలా బాగుంది. అప్పటినుండి ఇప్పటికి కాలమూ మారింది. ఇప్పుడు కొయ్యకాలు లేదు, మౌనంగా వుండే రోడ్లు లేవు, జాలి కోరుకోనే వికలంగులు లేరు, కట్టెల చితి లేదు…బూడిద తప్ప.

  7. Mallikarjuna Rao D 23 సెప్టెంబర్ 2007 , 4:49 am

    చాలా బావుంది.

  8. K Viswa 23 సెప్టెంబర్ 2007 , 9:48 am

    అద్భుతమైన కవిత.

  9. Alok 24 సెప్టెంబర్ 2007 , 12:28 am

    మంచి కవిత

  10. pasunoori ravinder 26 సెప్టెంబర్ 2007 , 10:39 am

    ఫిలాసాఫికల్ పోయెం ఇది.
    అందగా ఉంది.
    చక్కని రూపం,
    చిక్కని భావం.

  11. nagaraju m.phil 13 ఫిబ్రవరి 2008 , 2:33 pm

    శిఖామణి గారు మీ కవిత భాగుంది.

  12. ramya jyothi 07 మార్చ్ 2008 , 12:50 am

    శిఖామణి గారు మీ కవిత చాలా బాగుంది.మీరు ఎంచుకున్న కవితా వస్తువు విభిన్నంగా
    వుంది.ఒక కొయ్య కూడా మనిశి జీవితానికి ఎవిధంగా పనికి వస్తుందో అద్భుతంగా చెప్పారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)