- ధూళిపాళ అన్నపూర్ణ

“టాల్‌స్టాయ్ ‘సంసార సుఖం’ చదవాలని ఉంది సుజా! ఒక్కసారివ్వవా?'’ అంది జ్యోతి.
నా టేబుల్ మీద ఎదురుగా ఉన్న ఫోటోస్టాట్ కాపీ తీసి ఇచ్చాను.
“అబ్బ! ఏమిటే ఇంత చిన్న ప్రింట్. ఇంత దగ్గరగా ఉన్న అక్షరాలు! ఎలా చదువుతున్నావ్. మొత్తం నలభై పేజీల కథ మూడు పేజీల్లోకి వచ్చేసింది.

నేనిలా చదవలేను. మామూలు పుస్తకం లేదా?'’ అంది. లోపలికి వెళ్ళి రేక్ లోంచి ‘ఆర్వీఆర్’ ట్రాన్స్‌లేషన్ ‘విషాద సంగీతం’ తెచ్చి ఇచ్చాను. రవి ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఉండం కోసం ఇలా కాపీ తీయించి ఉంచాడు. మేమిద్దరం ఎక్కడకు వెళ్ళినా ఇది మా కూడా ఉండేది. చివరి చాప్టర్ తీసి ఎప్పుడూ చదివి వినిపిస్తూ ఉండేవాడు.
జ్యోతి ఇంటికి వెడతానని లేచింది. ప్రతీనెలా రెండో శనివారం వాళ్ళాయన కేంప్‌కి వెళ్ళినప్పుడు నన్ను చూడ్డానికి వస్తుంది. ఆయనకి తరచూ కేంపులు ఉంటాయి. ‘గ్లాక్సో’లో ఏరియా మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇంటి విషయం పట్టించుకొనే తీరిక ఉండదుట అతనికి. అన్నీ జ్యోతే చూసుకుంటుంది. మంచి ఎడ్మినిస్ట్రేటరు జ్యోతి. మేముచదువుకొనే రోజుల్లో కాలేజీ సెక్రటరీగా ఉండేది. అందర్నీ బాగా కూడగట్టుకొని అనేక కార్యక్రమాలు చేసేది. అది చదివిన మూడు సంవత్సరాలు కాలేజీకి మంచి పేరు వచ్చిందని అనుకొంటారు. ఆ శక్తినంతనూ ఇప్పుడు ఇంటిని ఒక ఫర్మ్‌గా నడపడానికి ఉపయోగిస్తోంది. తన ఇల్లు చూస్తే అంకితభావం కలిగిన వివేకవంతుడైన అధికారి చేతిలో ఉన్న సంస్థ గుర్తుకు వస్తుంది.
టైము చూసుకొని మళ్ళీ వెడతానంటూ లేచింది. ఇంక నిలబడేలా లేదు. జాజులు, కనకాంబరం కలిపి మాలకట్టి, దానికోసం ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాను. తీసి, చేతిలో పెట్టి జోళ్ళు వేసుకుంటున్నాను. అప్పటికే అది మెట్లు దిగిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది వాళ్ళాయన వచ్చే నిముషానికి ఎదురుగా ఉంటుంది. డిసిప్లిన్ అంటే డిసిప్లినే! ఒక్క నిముషం కూడా ఇటూ అటూ కానివ్వదు. డోర్ లాక్ చేసి పరుగున వెళబ్ళుూను. గేటు దగ్గర నుంచుని ఆటో కోసం చూస్తోంది. నా చెయ్యి పట్టుకొని, “ఆలోచించు సుజా! నేను చెప్పిన విషయం. రాజు మళ్ళీ రేపు రాత్రి ఫోన్ చేస్తానన్నాడు. నేను ఏదో టైములో నీకు రింగ్ చేస్తాను,'’ అంటూనే వెడుతున్న ఆటోని ఆపి అందులో కూచుంది.
నేను ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వస్తుంటే ఎక్కడికో వెనక్కి వెడుతున్నట్టు ఉంది జ్యోతి మాటతో. రాజు ఈ ఆరునెలల లోనూ ఇది మూడోసారి కబురు చెయ్యడం. నేనూ, జ్యోతీ చదువుకొనే రోజుల్లో మాకు సీనియర్ రాజు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో చాలా హుషారుగా ఉండేవాడు. ఆడపిల్లలంతా అతని పలకరింపుకై ఎదురుచేసేవారు. నాకు అతని చూపులో, మాటలో ఏదో తేడా కనిపించేది. నన్ను పలకరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. నేను వీలున్నంత దూరంగా ఉండడానికి చూసేదాన్ని.
ఒక్కసారి వాళ్ళ ఫేర్‌వెల్ రోజున మొదటి బి.ఎ. క్లాసు రూములో అన్నీ సర్దుతూ నుంచున్నాను. అంతా మీటింగ్‌హాలులో హడావుడిగా ఉన్నారు. బి.ఎ. క్లాసురూముని ఆనుకొని ఒక నైట్‌క్వీన్ మొక్క ఉంటుంది. ఆ పరిమళం ఆ రూమంతా అల్లుకొని ఉంది. ఆ చోటు వదిలి వెళ్ళాలని అనిపించలేదు.
ఇంతలో వెనుక నుంచి ఎవరో నా భుజం మీద చెయ్యేశారు. వెనక్కి తిరిగితే రాజు. కళ్ళు అదోరకంగా ఉన్నాయి.
“ఈ గోధుమరంగు చోళీలో వెన్నెలలా ఉన్నావు సుజీ! ఈరోజు తరువాత ఇంక కాలేజీకి రాను. గుర్తుగా నాకేదైనా ఇవ్వవా? ఈ రెండు సంవత్సరాలుగా ఎంతమంది అమ్మాయిలు నా చుట్టూ ఉన్నా- నా కళ్ళంతా నీవే నిండి ఉన్నావు,'’ అంటుంటే నెమ్మదిగా, కళ్ళు దించుకొని అక్కడ నుండి పార్టీ మధ్యలోకి వెళ్ళిపోయాను.
జరిగిన సంగతి ఎవరికైనా చెప్పడానికి కూడా భయపడి- మళ్ళా తలచుకోలేదు. ఆ తరువాత పరీక్షలు అయ్యేవరకు రాజు నాకు కనిపించలేదు. పరీక్షలయ్యాక ఒకరోజు మేరేజ్ ప్రపోజల్ పట్టుకొని మా నాన్న దగ్గరకు వచ్చాడు. నేనింకా చదువుకొంటానని, పెళ్ళి గురించి నాకింకా ఒక అవగాహన లేదనీ నాన్నతో చెప్పేశాను.
యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పి.జి. చేసి రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఎంతోమందితో పరిచయాలు, అనేక రకాలైన మనస్తత్వాలున్న మనుష్యులతో కలిసి హాస్టల్‌లో లుండడం ఒక వింతైన అనుభవం. అంతకంటే కూడా ధ్యానముద్రలోని సరస్వతీదేవిలా ఉన్న ఆ లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటుంటే సమయమే తెలిసేది కాదు. జూన్ నెలలో యుపిఎస్‌సి టెస్ట్ వ్రాసి ఇంటికి వెళ్ళాను. అమ్మమ్ని చూడాలనిపించి తాతగారూరు వెళ్ళాను. వెళ్ళిన మరుసటిరోజే అమ్మమ్మ పెళ్ళిచూపులంటూ హడావుడి మొదలుపెట్టింది. ఏం చెప్పినా వినిపించుకోలేదు. తనకు తెలిసినవాళ్ళబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడంటూ నన్ను చంపుకు తినేసింది.
అమ్మమ్మ ఎంత హడావుడి చేసినా వచ్చినవాళ్ళు ఇద్దరే! ఆరోజు రవి వాళ్ళమ్మతో వచ్చాడు. ఏ ఫార్మాలిటీ అతను పాటించలేదు. తలదించుకొని, లజ్జాభినయం చేస్తూ ఇప్పుడు నేను వెళ్ళాలి,’ అని ఆలోచించుకుంటూ ఉండగానే, వాళ్ళిద్దరూ, అమ్మమ్మ కూడా నేనున్న గదిలోకి వచ్చేశారు. కొంచెంసేపు మాట్లాడి వాళ్ళమ్మగారు, అమ్మమ్మ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామంటూ బయటికి వెళ్ళారు. అప్పుడు రవి-
“ఒక చిన్నమాట,'’ అంటూ, “మీరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అనుకొటున్నారు?'’ అని అడిగాడు.
కొంచెం బిత్తరపోయాను.
“మీ పేరేమిటి? ఏం చదువుకొన్నారు?'’ అన్న ప్రశ్నలకి కొంచెం తిక్కగా ఎలా సమాధానం చెప్పాలో మాత్రమ రిహార్సల్స్ వేసుకొన్నాను. అసలు చేసుకోవాలని అనుకొంటే కదా! అని మనసులో అనుకొన్నాను. కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. సిగ్గు అభినయించాలని అనుకొన్నాను. కానీ, నిజంగానే అతని ముఖం చూస్తుంటే మాట రావడం లేదు. గమ్మున, “నా సుఖదుఃఖానుభవాల్ని ఇంకో వ్యక్తితో పంచుకోవడానికి,'’ అని అన్నాను. ఈ మాట నా నోటి నుండి ఎందుకు వచ్చిందీ, ఏ సంస్కారం లోంచి వచ్చిందీ నాకు తెలియదు. అంతే! అతను వెడతానని లేచి బయల్దేరాడు.
పెళ్ళి అయిన తరువాత పదిహేను రోజులు ఇద్దరం అన్ని ఊళ్ళు తిరుగుదామని బయల్దేరాము. మొదటిరోజు రైల్లో చెప్పాడు, “పెద్దవాళ్ళు చేసుకోమన్నారని, అని అంటావనుకొన్నాను. ఇంకొంచెం పైకి వెడితే ‘సెక్యూరిటీ కోసం। అంటావనుకొన్నాను.కానీ నువ్వు చెప్పిన సమాధానం నన్ను నీ సహచరుణ్ణి చేసేసిందనుకో!'’ అన్నాడు. ఉన్నట్టుండి సంస్కృత పదాలు మాట్లాడేస్తూ ఉండేవాడు.
స్త్రీ, పురుష సంబంధం పట్ల కొంత అవగాహన ఉన్నా- సిగ్గు, భయం కూడా నా మనసంతా నిండిపోయి ఉన్నాయి. ఒంటరిగా అతనితో ఉంటున్నానంటే ఉద్వేగంతోపాటు భయం కూడా ఉండేది. మేము బయల్దేరిన మూడురోజులకు అతని మాటలు, ఆలోచనలు, ఆశయాలు, సరదాలు విచిత్రంగా అతనికి నన్ను దగ్గర చేశాయి. అంతవరకు అతను నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు. తిరుపతిలో దిగిన్నాడు దైవదర్శనానికి వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు బయటికి వచ్చాము.
“కాటేజ్‌కి వెడదామా? ఇక్కడ కూచుందామా?'’ అని అడిగాడు. ఆ ఎదురుగా గడ్డిలో కూర్చున్నాం. ఆ చలిలో వెచ్చటి శాలువలా మధ్యలో, కబుర్లతో తెల్లారిపోయింది. రూమ్‌కెళ్ళి గంట పడుక్కొని మళ్ళీ లేచాం. మళ్ళీ దైవదర్శనం. అలా మూడు రోజులు అక్కడే ఉండిపోయాం. ఆ టీస్టాళ్ళ దగ్గర, క్యూ కాంప్లెక్స్‌ల్లోనూ గంటల తరబడి మా గడిచిన జీవితానుభవాలను తల్చుకొంటూ గడిపేశాం.
“సుజీ! ఏ ఊరైనా వెళ్ళినా మనం మనిద్దరి పరిచయాల్లోనే ఉంటాంగానీ, ఆ ఊళ్ళను ఏం పరిచయం చేసుకొంటాం? ఇక్కడే ఉండిపోదామా?'’ అన్నాడు రవి.
ఎక్కడకూ వద్దనుకొని అక్కడే రూమ్స్ మారుతూ, బయట దొరికినవి తింటూ, వేరు వేరు సమయాలలో దేవుణ్ణి చూస్తూ గడిపేశాం.
ఇంటికి వచ్చేటప్పటికి విపరీతంగా రొంప పట్టేసింది. ‘ఇదేమిటే!’ అని అమ్మ కంగారుపడుతోంది.
“ఏం లేదమ్మా! రాత్రి సమయాలలో తెల్లవార్లూ మంచులో ఉండిపోవడం వల్ల తేడా చేసింది. అంతకంటే ఏం లేదు. ఊరికే కంగారుపడకు,'’ అన్నాను. ఆ మాట విన్న అక్కా, వదినా, “ఎక్కడైనా నాలుగురోజులు తలుపులు తెరవలేదు. లోపలే ఉండిపోయాము అని చెప్పిన మాటలు విన్నాం కాని, తెల్లవార్లూ బయటే కూర్చుని కాలం గడిపాం అన్న వాళ్ళను చూడలే'’దంటూ ఒకటే నవ్వు.
నాకూ ఉద్యోగం వచ్చింది. కానీ అతను ఉండే ఊరికి సుమారు అరవైమైళ్ళ వరకు ఉంది. వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇద్దరూ చెరో ఊళ్ళోనూ ఉండేవాళ్ళం. మూడు నెల్లో సగం రోజులు ఎవరో ఒకరు సెలవుల్లోనే ఉన్నాము. తర్వాత అతను ఇక్కడకు ట్రాన్స్‌ఫర్ చేయించుకొన్నాడు. ఎన్నో పుస్తకాలు తెచ్చేవాడు. చదువుతూ ఉండేవాడు. ఇలా అనడం కంటే చదివి వినిపిస్తూ ఉండేవాడు. నేను మాట్లాడే ఏ మాటయినా చాలా సీరియస్‌గా తీసుకొని ఆలోచించేవాడు. అలా కాకపోతే అర్థమయ్యేటట్టు చెయ్యటానికి ప్రయత్నించేవాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నేను ప్రద్దుట ఎప్పుడు మంచం మీద నుంచి లేస్తే, ఆ వెంటనే అతనికి మెళకువ వచ్చేసేది. ‘ఎందుకు, పడుక్కో రవీ,’ అంటే, ‘నువ్వు చలిలో వంటింట్లో ఉంటే నాకు నిద్దర ఎలా పడుతుంది?’ అనేవాడు. ‘ఇద్దరం కలిసే అన్ని పనులూ చేద్దా’మని అనేవాడు. ‘తొందరగా పని అయిపోతే ఏదైనా చదువుకోవచ్చు. ఎటైనా వెళ్ళవచ్చు,’ అంటూ పనిలో చొరబడిపోయేవాడు. గంట కంటె వంటింట్లో ఉండే పనే ఉండేది కాదు. అన్నిటా కలిసే ఉండాలని అతని ఊహ.
“ఎప్పుడూ ఒక్క చీర కూడా ఎంచి తేవేమిటి రవీ? నాకు సరదా,'’ అంటే, ‘ఇద్దరం కలిసి తెచ్చుకొందాం. కలిసి చేసుకొన్న పనే పరిపూర్ణంగా ఉంటుంద,’ని అనేవాడు. నేను ఎప్పుడైనా తనకి ఏదైనా తెస్తే మాత్రం నా టేస్ట్‌ని చాలా మెచ్చుకొనేవాడు. ఏడాది వరకు ఒక్క రోజు కూడా మేము ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ తరువాత నుండీ ప్రతి సంవత్సరం పదిహేను రోజుల చొప్పున ఎన్నో ఊళ్ళు తిరిగి చూశాము. ఎక్కడికి వెళ్ళినా, సంసార సుఖం, ఉత్తర రామచరితమ్ మా కూడా ఉండాల్సిందే. భవభూతి సీతకథలో మొదటి అంకం అంటే నాకూ, తనకూ చాలా ఇష్టం. అలా చదువుకొంటూ ఉండేవాళ్ళం. ఎన్నో ఫోటోలు ఎంతో జీవితం ఐదు సంవత్సరాలు. అతనితో శారీరకమైన ఆనందాన్ని అనుభవించిన క్షణంలోని మత్తు, ఆనందం, నాకు అతను జీవితంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఉండేది. అతను కూడా అలాగే కనిపించేవాడు. సాహచర్యం అంటే ఏమిటో అతను నాకు చూపించాడు.
నా జీవితం ఎలా ఉంటుందో అనిగానీ, ఎలా ఉండాలో అనిగానీ నేను ఆలోచించుకోలేదు. కానీ, నాకు లభించిన, పట్టిన ఈ యోగం దైవసంకల్పితం. నేను దేవుణ్ణి చాలా విశ్వసిస్తాను. ‘ఇంకా దేముడేమిటి? నీ మొహం,’ అంటుంది అమ్మ నా ఈ యోగం చూసి నిరాశతో. నిజానికి ఇప్పుడే ఇంకా నమ్ముతున్నాను నేను.
అమ్మ పిల్లల కోసం ఎంత కంగారుపెట్టినా మేమిద్దరం రకరకాల కారణాల చేత వాయిదా వేస్తూ వచ్చాం. ముఖ్యంగా పిల్లల మీద కాన్సస్ట్రేట్ చేసేంత అవకాశం మనకింకా కుదరలేదు అనేవాడు రవి. నాక్కూడా నిజమే అనిపించేది. క్షణం కూడా రవి మీద నుంచి నా ఆలోచన మళ్ళి వేరే వాళ్ళ మీద ప్రసరించడం దేవుడికి ఇష్టం లేదేమో అని అనుకొంటూ ఉంటాను.
ఒకరోజు తెల్లవారేటప్పటికి నేను లేచినా అతను లేవలేదు. ‘మాసివ్ హార్ట్ ఎటాక్,’ అన్నారు. పచ్చని బలిష్టమయిన అతని శరీరాన్ని ఆరోజు తప్ప అంత పరీక్షగా చూడవలసిన అవసరం నాకు రాలేదు. ఒకరోజు రోజంతా మాటా చలనం లేని అతని శరీరాన్ని రెప్ప వెయ్యకుండా చూశాను. తరువాత ఆరునెలలు నాకు ప్రపంచంతో సంబంధం లేదు. అమ్మ పెట్టిన అన్నం తినడం, మంచమెక్కి పడుక్కోవడం. ఎవరితోనూ మాటా లేదు. మంతీ లేదు. అమ్మ పలకరించడానిక్కూడా భయపడినట్టుండేది. నా కళ్ళలోకి చూస్తే ఆవిడ కళ్ళు ఎప్పుడూ తడిగా ఉండేవి. ఉన్నట్టుండి మా ఇంటికి వెళ్ళాలనిపించి ఒకరోజు ప్రొద్దుటే బయల్దేరిపోయాను. అసలు నన్ను ఆపే ధైర్యం అమ్మకు లేదు. ‘వద్దు ఉండు,’ అని అన్న ఒకే ఒక్క మాటతో నా కూడా బయల్దేరిన అమ్మ ఆగిపోయింది.
వెళ్ళి తలుపు తీసుకొని ఇల్లంతా తిరిగాను. ఆ ఇంట్లో ఆ క్షణంలో నా ప్రాణం పోతుందేమో అని అనిపించింది. హఠాత్తుగా టేబుల్ మీద నా దృష్టి పడింది. రవి పోవడానికి ముందురోజు మేము వెళ్ళి తెచ్చుకొన్న చీర- దానిపై ఒక లెటర్‌పాడ్- ఒక ఎండిన గులాబీ అక్కడ ఉన్నాయి. ఔను ఆరోజు నా పుట్టినరోజు. ముందురోజు బజారంతా రెండుగంటలసేపు తిరిగాం. ఇద్దరికీ నచ్చిన చీర దొరకలేదు. తిరిగి తిరిగి తెచ్చుకొని, జాకట్టు కుట్టినది సరిగ్గా దొరికించుకుని ఇంటికి వచ్చాము. నాకు సంబంధించిన ఏ సరదానైనా వేళాకోళం చేసేవాడు కాదు. ఇంటికి వచ్చేటప్పటికి నాకు తలనొప్పి వచ్చేసింది. పంచదార కలిపి మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. నేను వెంటనే నిద్రపోయాను. ఆ జ్ఞాపకం నన్ను వణికిస్తోంది.
చాలా ఎమోషనల్‌గా వెళ్ళి ఆ పేకట్ తీసి పట్టుకొన్నను. ఆ లెటర్‌పాడ్‌లోంచి కాగితం క్రింద పడింది. తళకు అద్దిన ఎర్రని అక్షరాలు మెరుస్తున్నాయి. నెమ్మదిగా టేబుల్‌కి చేరబడి కూర్చుండిపోయాను. ఊరుకోమనే వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడం వల్ల కరువుతీరా ఏడ్చాను. కాగితం విప్పి చూశాను.
శాశ్వత సహచరుణ్ణి నేను
పట్టుబట్టలాంటి నీ మనసుపై పూసిన పువ్వుని
పట్టు నునుపు మెరుపు నీ మనసు సహజాతాలు
వాటిపై ఒదిగి విరిసే నవ్వు నేను
నేను నీవు పీల్చే గాలిగా
నీవు మాట్లాడే మాటగా
నీ అణువు అణువులో నుంచి పొంగిపొరలే అనుభూతిగా
నీ కూడా నే ఎప్పుడూ ఉన్నాను
నువ్వు నా కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలని
ఈ పుట్టినరోజు నాడు నిన్ను అభ్యర్థిస్తున్నాను
అన్న రవి మాటలు నా హృదయానికి అక్షరం అక్షరంగా ప్రవేశిస్తున్నాయి. అలా చాలాసేపు కూర్చుండిపోయాను. ఆ తరువాత ఎప్పుడూ నేను ఒంటరినని అన్పించలేదు.
మళ్ళీ ఆఫీసులో జాయినయ్యాను. అమ్మకు ఉత్తరం రాశాను. తోడు వస్తానంది. నేను ఆఫీసుకు వెడితే ఈ కొత్త ఊళ్ళో ఒక్కర్తీ ఉండాలి. వద్దమ్మా! నేను బాగానే ఉన్నానని ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు వచ్చి వెడుతుంది అమ్మ. అత్తయ్య మంచం పట్టి కూతురు దగ్గరే ఉన్నారు. ఆవిడకు నా ముఖం చూడటమంటే బాధ. నన్ను కనిపించవద్దని వ్రాశారు. ఆవిడ బాధ నేను అర్థం చేసుకోగలను. రవిని ఒక్కక్షణం వదలకుండా పీల్చి పిప్పి చేశానని ఆవిడ ఉద్దేశం. నేను ఏమనగలను?
రాత్రి జ్యోతి ఫోను చేసింది. ఫోనులో నా మాట విని సెంటిమెంటల్ ఫూల్‌వి నువ్వు అని కోపంగా ఫోను పెట్టేసింది. నిజమా? నేను సెంటిమెంటల్‌కి గౌరవమిచ్చి, సంప్రదాయానికి భయపడి రాజుని కాదనుకొంటున్నానా? నా మనసు- నా అనుభవం జ్యోతి అనుభంగా ఎలా మారుతుంది? రవి నా ఆర్తిని- నా దాహాన్ని అమృతబిందువులా ఎలా సంతృప్తిపరిచాడో ఎలా చెప్పను?
అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచాను. ఎదురుగా జ్యోతి. దాని డిసిప్లిన్‌కి భిన్నంగా- ఈ సమయంలో ఇల్లు వదిలి- నా దగ్గరకు వచ్చింది. ఎంత కన్‌సర్న్ దానికి నా పట్ల. తన మనస్సు నొప్పించకుండా ఉండగలిగితే ఎంత బాగుండును! వచ్చి నా ప్రక్కనే నేల మీద కూర్చుంది.
“నిండు నూరేళ్ళ జీవితం సుజా! వినీలాకాశంలో ఒంటరి నక్షత్రంలా ఈ ఇంట్లో ఒక్కతివే ఎన్నాళ్ళు? అవకాశం నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆలోచించవా మరోమారు?'’ రిక్వెస్టింగ్‌గా అడుగుతోంది జ్యోతి.
“నేను ఒంటరిదాన్నని నీకు అనిపిస్తోంది. పైకి అలా కనిపిస్తున్నాను. నేను నిండుగా ఉన్నాను. తనకంటే నేను వేరు అన్న అనుభూతిని రవి ఎప్పుడూ నాకు మిగల్చలేదు. అలా అని ఎప్పుడూ నన్ను తన డిపెండెంట్‌గా మారనివ్వలేదు. రెండు పాయలుగా ప్రవాహవేగంతో ఉధృతంగా పయనించే రెండు నదులు ఒక పాయింట్ దగ్గర ఏకమైన అనుభవం. వెళ్ళిపోయిన రవి కంటే నేను వేరుగా మిగలలేదు. ఉన్న నా కంటే రవి వేరుగా ఎక్కడో లేడు అన్న అద్వైతస్ఫురణ నాలో జాగృతమయి ఉంది. ఈ స్ఫురణ- రవి, నన్ను తనతో సమానమైన ఒక పరిపూర్ణ వ్యక్తిగా గుర్తించి, గౌరవించడం వల్ల ఏర్పడి ఉండవచ్చు. తన సుఖదుఃఖానుభవాల్ని నావిగా అనుకొనేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరిచాడు. నా అనుభవాలన్నీ తన హృదయపులోతులలోకి తీసుకొన్నాడు. అతని సమీపంలో నన్ను నేను ‘అబల’గా కాక, ఒక స్త్రీగా మాత్రమే గుర్తుంచుకొనేలా చేశాడు. అందుకే అతని స్థానమంటూ బయట ఎక్కడా ప్రత్యేకంగా లేదు. ఎవరైనా పూరించడానికి,'’ అని నేను చెబుతుండగానే జ్యోతి అడ్డు వచ్చింది.
“నిజమే సుజా! కానీ ఈ ముప్ఫై రెండేళ్ళ వయసులో- ఎన్నాళ్ళు నీ అనుభూతుల్ని భూస్థాపితం చేసి మోడులా ఉంటావు? అంత అవసరం కూడా లేదు కదా!'’
“అవును కానీ, సాహచర్యానికి సంబంధించిన ఏ దాహమయితే రవి చేత మేల్కొల్పబడిందో- ఆ దాహానికి అతను చన్నీటిచెలమగా మారాడు. ఆ విషయంలో నా హృదయం సంతృప్తమయి ఉంది. శరీరం హృదయాధీనం కాదంటావా? అనుభవానికి అంతేముంది జ్యోతీ! అనుభవానికైన ఈ తహతహ ఎక్కడో ఒకచోట ఆగాలని అనిపిస్తుంది నాకు. ఇంకా ఇంకా దాహం పెరిగేకొద్దీ- ఎడారులు పెరుగుతాయి. మన మనస్సులో జీవితకాలమంతా డైల్యూట్ అయిపోయిన అనేక అనుభవాలు పొందే జీవన విధానం కూడా ఒక పద్ధతే కావచ్చు. కానీ, రవి ఏభై సంవత్సరాల దాంపత్య జీవన సారాన్ని, అది ఋషులు ఏర్పరిచిన సాహచర్య జీవన ఫలాన్ని అతి తక్కువ కాలంలో నా అనుభవంలోకి తీసుకువచ్చాడు. జ్యోతీ! అతని ఆర్ద్రమైన, సుకుమారమైన చేతన, నన్ను ఆ జీవనఫలాన్ని అందుకొనే స్థాయికి చేర్చింది,'’ అంటూ ధారాపాతంగా ఉన్న కన్నీటిని వత్తుకొనే ప్రయత్నం చేస్తున్నాను.
జ్యోతి పరిస్థితి కూడా అలాగే ఉంది.
“సుజా! నువ్వు చెప్పినట్లు అనుభవానికి ఒక ఫుల్‌స్టాఫ్ కావాలి అన్న పాయింట్‌ని నేను ఒప్పుకోవడం లేదు. బహుశబుూ నాకు అర్థమయీ ఉండకపోవచ్చు. అనుభవంలోకి కూడా రాలేదేమో కానీ, ఒక సంగతి అర్థమయింది. మనిషి, ఇంకో మనిషిని తనకే మిగుల్చుకొన్నందుకు- అధికారం, డబ్బు, హోదా, సాధనాలని అనుకొంటూ తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఇవేమీ అఖ్కర్లేదని అర్థమయిం,'’ అని అంటూ నా రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకొంది. నేను కూడా ఉన్నానన్న స్నేహస్పర్శను అందిస్తూ…

3 అభిప్రాయాలు

  1. umamaheswara rao c 16 సెప్టెంబర్ 2007 , 1:31 am

    Well, life can also be seen and experienced through the coloured glasses of romance.

  2. Usha 29 సెప్టెంబర్ 2007 , 1:20 pm

    అన్నపూర్ణ గారికి, మీ కథ “సహచరుడు” చాలా నచ్చింది. చక్కటి అనుభూతి మిగిల్చింది. నాయిక పాత్ర అలౌకికంగా ఉంది. ఆమె భావాలు లోతైనవి. మనస్సుని కదిలించాయి. రవి ఐతె చెప్పనక్కర్లేదు. మీ కథ చదివాక ఆ రాత్రి నిద్ర లేదంటే నమ్మండి. ఆమె ఏ స్థాయిలో ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించి ఉంటే ఆ నిర్ణయానికి రాగలిగి ఉంటుందో ఊహించటానికి అందమైన అనుభూతి.

    టాల్ స్టాయ్ “సంసార సుఖం” అనే పుస్తకానికి ఇంగ్లీష్ టైటిల్ ఏంటి? నాకు ఆ పుస్తకం చదవాలని కోరికగా ఉంది. “విషాద సంగీతం” ఆర్వీయస్ ఆ పుస్తకానికి చేసిన అనువాదం అని రాసారు. ఆ ఆర్వీయస్ పూర్తి పేరేంటి? నాకు తెలియ చేయకలరని ఆశిస్తున్నాను.

    మంచి కథ అందించి అలరించినందుకు మరోసారి ధన్య వాదాలు.
    ఉష

  3. Rakesh 19 నవంబర్ 2007 , 7:30 am

    మళ్ళీ మళ్ళీ చదివింపజేసే అద్భుతమైన రచన.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)